నా సరికొత్త వాహనానికి నెంబర్ ప్లేట్ బిగించుకుందామని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళా. అక్కడ నా వంతు రావడానికి సమయం పట్టింది కొంత. ఈ లోపల అక్కడ చిన్న చితకా పిల్లకాయలు గాలి పటాలు ఎగరేస్తుంటే వాళ్ళని గమనించటం మొదలెట్టా. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అది చరవాణుల్లో కదలక మెదలక ఆటలాడే మన పిల్లలకు బహుదూరం. వాళ్ళలో ఒక పిల్లవాడు బహు నేర్పరి అనుకుంటా, చిన్న పిల్ల లు వాడిని బతిమాలుతున్నారు, అన్నా మా పటానికి డీల్ వేయకన్నా అనో, నా మాంజా బాగా రాలేదన్నా చూడు అనో. వాడు కూడా చాలా కలుపుగోలుగా, సరే లేరా! నేను తెంచనులే నీ పటాన్ని అంటూనో, లేక రారా నా మాంజా ఇస్తాననో అందర్నీ కలిపేసుకుంటున్నారు. నాకనిపించింది ఆహా ఇది కదా పిల్లలు నేర్చుకోవటమంటే అని. అదే పిల్లలు రేపు గొడవ పడొచ్చు ఎల్లుండి ఒకటొవ్వొచ్చు. కానీ ఎంత మంచి బతుకు కళలు నేర్చుకుంటున్నారు.
బతుకు కళలు నేర్వటం అంటే నా చిన్న తనానికి వెళ్ళాలి అలాగే మీ చిన్న తనానికి.
మా వెంకట్స్పర్లన్న చేతిలో పడిందంటే ఏ గాలి పటమైన రిపేరై సర్రుమనాల్సిందే. అన్నా! నా పటం ఎగరటం లేదు అని మా పిల్లకాయలం వెళ్తే, అబ్బాయిలూ సూత్రం సరిగ్గా లేదురా అంటూ, రెండు-నాలుగు కాకపోతే రెండు-ఐదు పెట్టాలిరా అంటూ సరి చేసిచ్చే వాడు. రెండు-నాలుగు అంటే రెండు బెత్తెల దారం పైన, నాలుగు బెత్తెలు దారం కింద కలిపి కట్టడం. అలాగే మా శీనన్న బొంగరాలు తిప్పటం లో నేర్పరి. ఆయన దగ్గర రకరకాల పరిమాణంలో బొంగరాలుండేవి. వాటికి జాలీలు పేనటం (ఇక్కడ జాలీ అంటే ఏంటి పేనటం అంటే ఏంటి అని మీరే తెలుసు కోవాలి), గుమ్మా కొట్టటం నేర్వటం, ఆయన దగ్గరే మేమంతా. బొంగరంతో గుమ్మా కొడితే పెద్ద ఘాతాలు పడాల్సిందే అవతల వాళ్ళ బొంగరాలకి. గిరి లోంచి బొంగరం బయటకి రావాలంటే దానికి పెద్ద పడగ ఉండాలని నేర్చుకోవటం లాటి చిన్న చిన్న విషయాలు గ్రహించాము.
అలాగే సిగరెట్ ప్యాకెట్ లని చించి, వాటితో యూనో లాగ ఆడటం. ఒక్కో సిగరెట్ బ్రాండ్ కి ఒక్కో వేల్యూ. చార్మినార్ బ్రాండ్ లోయెస్ట్ వేల్యూ ఆపైన సిసర్స్ తర్వాత విల్స్. ఈ సిగరెట్ కార్డ్స్ మాకు యూనో ముక్కలు. మళ్ళీ వీటిల్ని ఎక్స్చేంజి చేసుకునే వాళ్ళం, రెండు ఛార్మినార్స్ కి ఒక సిసర్స్, రెండు సిసర్లుకి ఒక విల్స్, అలా అన్నమాట. ఇవి మా ఖజానాలు. మా మల్లికార్జున అన్న వీటికోసం ఒక పెద్ద ఎక్స్చేంజి నే నడిపేవాడు. అలాగే గోళీలు ఆట. రక రకాలు గా ఆడే వాళ్ళం. ఒడి పోయిన వాళ్ళు మోచేతులతో నేలమీద డోకాలి. గోళీలాటలో నేను నేర్పరిని మా వూరికే. అలాగే కర్ర బిళ్ళ లేక గిల్లి దందా, ఉప్పు ఆట, కుందుడు గుమ్మా, పల్లంచి లాటి ఆటల్లో ఒక్కొక్కళ్ళు నేర్పరులు మా ఊర్లో.
అలాగే మా పిల్లకాయలం యానాది రెడ్డి చేలో, నేలబాయిలో ఈతకొట్టే వాళ్ళని తొంగి చూస్తావుంటే, మాకన్నా పెద్దోళ్ళు మమ్మల్ని ఎత్తి ఆ బాయిలో తోసేస్తే భయంతో కేకలు పెడుతూనే ఈతకొట్టేసే వాళ్ళం. నాకు అప్పుడే తెలిసింది అందరూ అన్నిట్లో మేటి కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కొ ఆట లో మేటి అని. వాళ్ళ దగ్గర ఎలా నేర్చుకోవాలి అని చూసే వాళ్ళం, లేకపోతే వాళ్ళని మా జట్లలో చేర్చుకొని వాళ్ళం. అన్నీ నేర్పింది మాకు వయసులో పెద్దయిన మా సీనియర్స్, అలాగే మేము మా జూనియర్స్ కి. అది ఒక పరంపర . సీజన్ మారే సరికి తెలియకుండానే ఆటలు మారిపోయేవి . అప్పటికి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఎలా తెలియకుండానే ఆటలు అలా మారిపోతాయబ్బ అని. అది నిజం గా పెద్ద సైన్స్.
అలాగే ఆరో తరగతి చదవాలంటే మా ఊరి నుండి మూడు కిలోమీటర్ల దూరం లో వుండే పెదపుత్తేడుకి వెళ్ళాలి. మాకు అలవాటు అయ్యేవరకూ మా సీనియర్స్ మమ్మల్ని గమనిస్తూ తీసుకెళ్లేవారు. మా హైస్కూల్ లో చదువుల్లో ఫస్ట్ అంటే మా వూరే ఉండాలి. అది మా సీనియర్స్ నుండి వచ్చిన పరంపర. మన ఊరి పేరు నిలబెట్టాలిరా అంటూ, మాకు మార్కులు తగ్గితే వాళ్ళే ఉక్రోష పడే వాళ్ళు, మాకన్నా. ముందే అన్నా అన్నా అంటూ వాళ్ళ పుస్తకాలు రిజర్వు చేసుకొనే వాళ్ళం. కాస్త పెద్దయ్యాక కొన్ని రోజులు మా సీనియర్ అన్నలు అక్కల మధ్య ఉత్తరాలు చేరవేత కూడా. అన్నా! చెప్పన్నా, ఆ అక్క నీ ప్రేమని ఒప్పుకుందా లేదా అని మేము అడిగితే, రే! ఓపికుండాలి రా, అంత త్వరగా కుదరవురా, అంటూ ఓపిక కూడా నేర్పారు మా అన్నలు. ఇవన్నీ పుస్తకాలు పాఠశాలల ఆవల మేము నేర్చుకున్న బతుకు కళలు.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp