Artwork for podcast Harshaneeyam
సి.రామచంద్ర రావు గారి 'ఏనుగుల రాయి'!
Episode 14814th February 2023 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:37:47

Share Episode

Shownotes

సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ ‘వేలుపిళ్లై’ అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్ర రావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు.

అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా , మార్చి రెండో వారంలో ‘వేలు పిళ్ళై కథలు ‘ కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతోంది.

కథలోకి వెళ్లబోయ్యే ముందు ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి –

‘పొగడ పూలు’:

గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు.

రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి.

యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే!

నల్లతోలు, వేలుపిళ్లై, ఏనుగులరాయి, టెన్నిస్ టూర్నమెంటు, గాళిదేవరు, కంపెనీలీజ్… మైగాడ్! వేటికవే! ఇన్నేళ్ళయినా వాడిపోని పొగడపూలు, అపురూపాలు, ఆరనిదీపాలు.

ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చాసోగారు.

రోజూ ఎన్నో కథలు చదువుతున్నా, కథలలో మునిగితేలుతున్నా మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటంతటి అపురూప శిల్పాలు అన్నారు నండూరి రామమోహనరావు గారు.

ఆంధ్ర సచిత్ర వారపత్రికలో – ఆ గోల్డెన్ పీరియడ్‌లో నండూరివారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేనూ, రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపూ ఈ కథలు చదివి త్రిల్లయిపోయేవాళ్ళం. చెప్పుకుని తల్చుకుని మురిసిపోయే వాళ్ళం…

కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.

అంతర్జాతీయ స్థాయిగల కథలు అన్నారు ఆదివిష్ణుగారు.

ఎన్నోయేళ్ళు – ఉహూ, ‘హూ – టీ’ ఎస్టేట్స్‌లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ – మానేజర్- తెల్లదొరల – నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. వెలుగునీడలు చూశారు. మనకు చూపించారు. టెన్నిస్ ఛాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్ళే. ఒక సోదరుడి కొకొడుకు – వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి.

రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది తెలుగే అయినా టెలుగులా వినపడుతుంది. స్టయిలు హొయలు అంతా ఇంగ్లీషే. మాటా ఇంగ్లీషే. కాని మనసంతా తెలుగు. రామచక్కని తెలుగు. స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు.

ఈ తెలుగు కథలకు పుట్టినిల్లు రావు గారి కలం అయినా చాలా కథలకు మెట్టినిల్లు తమిళనాడు! తమిళతంబీలు చాలమంది కనిపిస్తారు. అయినా వాళ్ళంతా మనవాళ్ళయిపోయి మనలో ఒకళ్ళయిపోతారు. అదీ రావుగారి శిల్పం – ప్రజ్ఞ!

ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలు – ఏ దేశంలోనయినా రాణించే కథలు…. మాటల వెనక మనసులను ఎక్స్‌రే తీసి చూపించగల కథలు. అన్‌హెర్డ్ మెలోడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు – ఆకుచాటుపిందెలా, మబ్బుచాటు వెన్నెలలా, నీడచాటు నీడలా – ఆయన కథలలో మాటచాటు మాటల అంతరంగ తరంగాలు – అపురూప శిల్పాలు.

గంగిగోవుపాలు గంటెడైనను చాలు అని వేమన్న అన్నా – ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకొందాం.

అంతవరకూ ఆయన రాసిన ఆ కాసినీ మేసిమేసి నెమరేసి ఆనందించుదాం…

-ముళ్ళపూడి వెంకటరమణ.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Chapters

Video

More from YouTube