'తరలి రాద తనే వసంతం' అనే నా పాట తోనే ఆ రోజు ఇళయరాజా లైవ్ కన్సెర్ట్ మొదలయ్యింది.
నేను పాడుతుంటే ఇళయరాజా చేతులూపడం మానేసి నా వైపే తన్మయత్వంతో చూస్తున్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ముందు వరసలో కూర్చుని తల తెగ ఊపేస్తున్నారు.
ఇంతలో ఎక్కడో కోరస్ మధ్య లోంచి, మా ఆవిడ గొంతు, ఇంక పాడింది చాలు నిద్ర లోంచి లెమ్మని.
కళ్ళు తెరిచి చూస్తే, అప్పుడే పూజ గదిలోంచి వచ్చిన మా ఆవిడ , ఆ పక్కనే ఆ రింగ్ టోన్ తో మొబైల్ లోంచి నన్ను దీనం గా చూస్తున్న మా వెంకటరమణ మొహం కనపడ్డాయి.
ఇంత పొద్దున్నే వీడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడో అని అనుకుంటూ ఫోన్ ఎత్తాను.
చిరాగ్గా మా వాడి గొంతు ఫోన్ లో, ఎన్ని సార్లు రింగ్ చెయ్యాలి రా. ఫోన్ ఎత్తి చావొచ్చు గా అని.
ఎత్తాను గా! విషయం చెప్పండి రవణ గారు, అన్నాను, తెచ్చిపెట్టుకున్న వినయంతో.
ఇప్పుడు దుబాయ్ లో ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కుతున్నాను పది గంటలకల్లా హైదరాబాద్ లో వుంటాను. ఎయిర్ పోర్ట్ కొచ్చి, పిక్ అప్ చేసుకో. అట్టానే రెండు జతల బట్టలు సర్దు కొని, ట్యాంక్ ఫిల్ చేస్కొని తగలడు, అన్నాడు వాడు, వాడి యూజువల్ స్టైల్ లో.
విషయం ఏందీ అడిగాను నేను.
ఏం! చెప్తేగానీ రావా అన్నాడు వాడు.
వెంటనే 'వస్తున్నా లే' అని చెప్పి ఫోన్ పెట్టేసాను. మొగుడి తిట్ల కంటే, పెళ్ళాం గోల తో రోజు మొదలు పెడతామని డిసైడ్ అయిపొయ్యి.
స్నానం చేస్తూ వాడి గురించే ఆలోచిస్తున్నా!,
నాది వాడిది చిన్నప్పటి స్నేహం. హైదరాబాద్ లోనే కల్సి చదువుకున్నాం, ఇంటర్ దాకా.
ఇది కాక వాళ్ళ తాత గారి వూరు, మా తాత గారి ఊరి పక్క పక్క నే ఉండడంతో, స్కూల్ సమ్మర్ హాలిడేస్ గూడా, మేము ఇద్దరం, ఒకే వూళ్ళో గడిపేవాళ్ళం . ఇది గాక మా నాన్న, వాళ్ళ నాన్న కొలీగ్స్.
ఇప్పుడు వాడి సంసారం అమెరికా లో. వాళ్ళ నాన్న గార్ని, అమ్మగార్ని కూడా అక్కడికే తీసుకెళ్ళిపొయ్యాడు పదేళ్ల క్రితం .
చిన్నప్పట్నుంచి. వాడు అదో టైపు. మా వూరు మా ముసునూరు అని తెగ ఫీల్ అయ్యేవాడు.
మేము కాలేజీలో వున్నప్పుడు, వాళ్ళ తాత గారు పోతే, రవణ వాళ్ళ నాన్న గారు వూళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తుంటే చాలా ఇబ్బంది పడ్డాడు మా వాడు.
ముసునూరులో ఏవన్నా సెటిల్ అవుతావా నువ్వు! అని వెటకారంగా అడిగితే, అది కాదు మావా! ఎదో ఒక కనెక్షన్ అంటూ ఉండాలి గదా మన ఊరితో, అంటూ బాధ పడి పొయ్యాడు.
మా ఆవిడ బాత్రూం తలుపు బాదుతుంటే ఈ లోకంలోకి వచ్చాను.
బ్రేక్ ఫాస్ట్ చేసి బయట పడ్డా.
ఫ్లైట్ ఒక గంట లేటు. మా వాడు కార్లో కూర్చుని, వాడే వీల్ తీస్కొని చెప్పాడు, ముసునూరు వెళుతున్నాం మనం అని.
ORR దిగంగానే , వాడి ఫోన్ రింగ్ అవ్వడం మొదలయ్యింది. స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే , వాళ్ళ అమ్మగారు.
స్పీకర్ లో వున్నావే నువ్వు! చెప్పాడు మా వాడు.
సుబ్బు గానీ వచ్చాడా ఎయిర్ పోర్ట్ కి అడిగింది ఆవిడ నన్ను గురించి, ఉభయ కుశలోపర్లు అయ్యాక చెప్పింది ఆవిడ నాతో, ఊరి రామాలయం లో ఇవ్వడానికి కొత్త బట్టలు తీసుకెళ్లడం మర్చి పోవద్దని.
పెట్టేసే ముందర రమణ తో చెప్పింది, వూర్లో జాగర్త! గొడవలకెళ్లొద్దు! అని.
గొడవలేంది! అడిగాన్నేను రమణని .
చెప్పడం మొదలు పెట్టాడు వాడు ,
వూళ్ళో పొలాలన్నీ అమ్మేసాం గానీ, ఈ మధ్యే తెల్సింది, ఒక రెండు ఎకరాలు మిగిలి పొయ్యాయి అని.
ఈ మధ్య, పక్కూరి రంగా రావు గారు, కొత్త గా ఫ్యాక్టరీ పెడదామని, మన వూర్లో పొలాలు సర్వే చేయిస్తూంటే, ఈ రెండెకరాలు మన పేరు మీద ఉన్నాయని బయట పడింది.
కానీ పేపర్లు మా పాలేరు 'దేవయ్య' గుర్తున్నాడు కదా. అతని దగ్గరే ఉన్నాయని తెల్సింది. అమ్మడానికి వీల్లేదు అని దేవయ్య గొడవ చేస్తున్నాడట.
అతను ఇప్పుడు వూర్లో కొత్తగా కట్టిన చర్చి కి పాస్టర్ గూడ అయ్యాడట.
ఒక్కో ఎకరం ఇప్పుడు యాభై లక్షలు ఉందట రేటు.
This podcast uses the following third-party services for analysis: