Artwork for podcast Harshaneeyam
పార్ట్ 2 - 'చిట్టి తల్లి' - పాలగుమ్మి పద్మరాజు గారి రచన
Episode 17610th April 2021 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:19:39

Share Episode

Shownotes

అతనికి మెలకువ వచ్చేసరికి పెట్టి తలుపు తెరిచుంది. అవతల పొద్దుటి కనుచీకటిలో కంటి కలవాటుపడ్డ పట్నం దృశ్యాలు మసగ్గా కనబడ్డాయి. గుమ్మంలో సందేహిస్తూ నిలబడ్డాడు ఇంటి నౌకరు, దొర. ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు దక్షిణామూర్తి. దొర పక్క చుట్టేస్తూ అన్నాడు. 

“చిన్న శెట్టియా రొచ్చారు సార్.”

 “ఎక్కడికీ?” 

“ప్లాట్ఫారం మీదున్నారు సార్.”

ఒకసారి బాత్ రూములోకి వెళ్ళి ముఖం చన్నీళ్ళతో కడిగి తుడుచుకున్నాడు. తల దువ్వుకున్నాడు. దొర తెచ్చిన కాఫీ తాగాడు. 

ఈలోగా దొర, సామానంతా కూలీచేత మోయించుకుపోయాడు. 

ఆ తరువాత అతను పెట్టెలోంచి దిగాడు. దిగగానే చిన్న శెట్టి కాళ్ళమీద పడ్డాడు. ఇంత జన సమూహంలో ఈ దృశ్యం జరిగినందుకు దక్షిణామూర్తికి కోపం చిరాకు పుట్టుకొచ్చాయి.

చెట్టియార్, పదిమందిలో ఈ పని చేశావంటే నిన్ను దుంపనాశనం చేస్తాను. లే ముందు.” 

చెట్టియార్ లేచాడు. దక్షిణామూర్తి అతి తొందరగా బయటికి నడుస్తుంటే చెట్టియార్ కూడా పడ్డాడు.

“పొరబాటయింది సామీ! మీ సొమ్ము నయా పైసాతో ఇస్తును. ఏదో మా తమ్ముడుండాడే, వాడి బుద్ధి మంచిది కాదు. నాక్కూడా తెలియదు, సిమెంటని సెప్పి వట్టి బూడిద బస్తాల్లో నింపి మీకిచ్చినాడని. మీ తోడు. మీరు ఊరిలో లేరు. మీ వకీల్ నా మీద అరస్టు వారంటు తీసినాడు. పదిమంది బిడ్డలవాండ్లము. ఈ తూరి దయ చూపించారంటే…”

“పదకొండు గంటలకు పోయి మా వకీలును చూడండి.” 

“నిన్నసూస్తిని. అతను నిండా కోపంగా…” 

“ఈవేళ పదకొండు గంటలకు వెళ్లి చూడండి.”

 “తమరుదా దయ తలిస్తే….”

“చెపుతుంటే మీక్కాదూ, పదకొండు గంటలకి వెళ్ళి చూడమని. ఇంకొక్కడుగు నా వెనకాల వేశారంటే, ఈ రైల్వే పోలీసులచేతే మిమ్మల్ని అరస్టు చేయిస్తాను…. ఇక వెళ్ళండి.”

తన్నులు తిన్న కుక్కలాగా వెళ్ళిపోయాడు చెట్టియార్. తన్ను మోసగించిన వాళ్ళమీద తన కెల్లాంటి అధికార మొస్తుందో దక్షిణామూర్తికి బాగా తెలుసు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నాశనం చెయ్యగలడతను. వాళ్లు తన చేతి కీలుబొమ్మలు. వాళ్లని శిక్షించడంలో అతని కేమి పెద్ద సంతృప్తి ఉండి కాదు. వాళ్ళు సంపూర్ణంగా తన దయమీద ఆధారపడి ఉండేటంతవరకూ తీసుకొస్తే, అతని కొక సంతృప్తి. దానివల్ల అతని సమర్థత అతనికే రుజువవుతుంది. వాళ్ళు వచ్చి తన కాళ్ళు పట్టుకోవడం అతనికి చాలా ఇష్టం. అయితే పదిమందిలో కాదు.

చెట్టియార్ ఆడిన నాటకం, అతని తమ్ముణ్ణి విడదీసి, లంచం ఇచ్చి, అతనిచేత కోర్టులో అన్నగారికి వ్యతిరేకంగా సాక్ష్యమిప్పించడం, చెట్టియార్ దగాకోరని కోర్టువారికి రుజువు కావడం, అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ అతను కారుదగ్గరకు వచ్చాడు. వెనక తలుపు డ్రైవరు తెరిచాడు. అతను ఎక్కి కూచున్నాడు. డ్రైవరు తలుపు ముయ్యబోతుంటే అడ్డొచ్చింది చిట్టితల్లి . 

నిద్రలేవగానే ఏదో మరిచిపోయినట్టనిపించిందతనికి. ఇంతలో చెట్టియార్ సంఘటనవల్ల అది పూర్తిగా మరిచిపోయాడు. కాని చిట్టితల్లి కనబడగానే తను మరిచిపోయింది ఆమేనని గుర్తుకొచ్చింది…

అయితే, రాత్రి రైలు పెట్టిలో ఏకాంతంగా ఆమెతో ఎంత ఆంతర్యం ఏర్పడ్డా, తన పగటి జీవితంలో ఆమె ప్రవేశించడం మాత్రం అతని కిష్టం లేదు. కొంచెం చిరాగ్గానే అడిగాడు.

“ఏం చిట్టీ?”

“మా అమ్మ దగ్గరకి తీసుకెళ్లవా!” అంది దీనంగా చిట్టితల్లి. 

“ఫో,ఫో” అంటూ లాగెయ్యబోయాడు దొర.. 

“ఉండు దొరా!” అన్నాడు దక్షిణామూర్తి. “మీ అమ్మెక్కడుంది?”

 “ఏమో!”

 “ఎప్పుడొచ్చింది పట్నానికి?”

 “నిన్న పొద్దున్న.”

“ఏ రైలుమీద?”

 “రైలుమీద కాదు. రెండు గడలు పోడుగ్గా ఏసి, మద్దినేమో సిన్న సిన్న ముక్కలేసి, ఓ మంచం కింద కట్టి దానిమీద మోసుకొచ్చారు. మా నాన్నని పోలీసులు పట్టుకుపోయారుగా! అందుకని సీతయ్యబాబు ముంతలో నిప్పు పట్టుకుని ముందెళ్ళాడు.” 

దక్షిణామూర్తి గుండె గతుక్కుమంది..

 “పట్నం వొచ్చిందని ఎందు కనుకున్నావు.”

“రంగత్త సెప్పిందిగా. నేను మా యమ్మతో కూడా పోతానని ఏడితే సెప్పింది. పట్నం ఆస్పత్రికి తీసుకుపోతున్నారు. బాగవగానే తిరిగొత్తాదిలే అంది. తనింటికి తీసుకుపోయి కూడెట్టింది. తినేసి నేను జారుకున్నాను. పట్టం పోడ మెట్టా గంటే సోడా సాయిబ్బన్నాడు – ఆ రైలెక్కితే సీదా పట్టం పోతాదని. ఎక్కేశా.”

ఒక క్షణంపాటు దక్షిణామూర్తికి నోటమాట రాలేదు. కళ్ళలో చెమ్మ కనబడకుండా తుడుచుకుని అన్నాడు.

“ఎక్కు కారెక్కు” ఆమె కారెక్కింది. కారు కదిలింది.

షినాయి నగర్‌లో పెద్ద బంగళా అతనిది. దారిపొడుగునా చిట్టితల్లి ఏదో అడుగుతూనే ఉంది. దక్షిణామూర్తి పరధ్యానంగా సమాధానాలు చెపుతున్నాడు. ఆఖరుకి కారు పెద్ద ఇనుప తలుపులను దాటి గుండ్రటి రోడ్డు వెంట తన ఇంటి ముందు పోర్టికోలో అగేవరకూ అతనొక నిశ్చయానికి రాలేకపోయాడు.

చిట్టితల్లి నేం చేయాలి?

ఆమె కెలాగో సహాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. తెరచిన కారు తలుపు పక్క నిలబడి, అమాయకంగా ఆమె చెప్పిన కథ విన్నప్పుడు అతని వ్యక్తిత్వం ఆపాద మస్తకమూ నీరయిపోయింది. ఆ ముహూర్తంలో ఆమెను కారెక్కమనడం తప్ప మరో ఆలోచన అతని మనస్సులోకి రాలేదు. కాని జరిగినకథ వింటే అనసూయ అతడు చేసినపని హర్షించదు. అనసూయే కాదు, అతని స్నేహితులూ, ఆప్తులూ ఎవరూ హర్షించరు. ఆమెను చూసి జాలిపడ్డం, పదో పదిహేనో చేతిలో పెట్టడం – అంతవరకూ మాత్రం అతని కర్తవ్యమూ, విధీ అని అంతా ఒప్పుకుంటారు. కాని ముక్కూ మెగం ఎరగని ఒక అనాధ బాలికను కార్లో ఎక్కించి ఇంటికి తీసుకురావడం – అదిమట్టుకు అందరికీ వింతగా తోస్తుంది. అందులో తనలాంటి ఆరితేరిన వ్యాపారస్తుడు చెయ్యవలసిన పనికాదు. ఇది వింటే సాటివాళ్ళు అతని అతని మతి భ్రమించిదనుకుంటారు. అతని వ్యాపారానికే కాదు, అతని పేరు ప్రతిష్ఠలకే దెబ్బ. అయితే ఆ పసిపాపను వీధిపాలు చెయ్యడానికి అతనికి మనసొప్పలేదు. పోర్టికోలో ఆగిన కారులోంచి అతను దిగకుండానే తోటమాలి గుడిసె దగ్గరకు నడపమన్నాడు డ్రైవరుని. తీరా తను దిగాక తనకోసం ఎవరన్నా డ్రాయింగు రూములో వేచి ఉంటే వాళ్ళకీ పిల్లను గురించిన సముజాయిసీ అంతా చెప్పుకోవాలి.

తన ఇంట్లో తనే ఏదో దొంగతనం చేస్తున్నట్టనిపించిం దతనికి. ఒక వంక అనసూయనీ, మరోవంక చిట్టితల్లినీ కూడా ఏదో మోసగిస్తున్నట్టు అతని మనస్సు పీకింది. కాని గుండె నిబ్బర పరుచుకుని, తోటమాలిని పిలిచాడు.

“ఆర్ముగం! ఈ పిల్లని నీ ఇంట్లో పెట్టుకుని, పెట్టూ పోతా చూస్తుండు.” 

“ఎత్తనినాళ్ళు సార్” అని అడిగాడు ఆర్ముగం.

“నేను చెప్పేదాకా, తెలిసిందా. దొరగారికి అన్ని వివరాలతో చెప్పాలగావునేం? నీ పిల్లలతో సమంగా చూస్తుండు.. ఆమెకేమన్నా లోటొచ్చిందా! జాగ్రత్త.” 

తోటమాలిమీద కోప్పడి, ఆమె విషయం అంత కచ్చితంగా అతనితో ఏర్పాటు చేశాక, అతని మనసులో ఇంతవరకూ అలజడి పెడుతున్న ఆందోళన కొంత తగ్గింది. ఆమె ఎడల తన కర్తవ్యాన్ని నెరవేర్చానని సంతృప్తిపడ్డాడు.

“ఆఫీసులో అడిగి డబ్బు తీసుకుని ఆ పిల్లకి గుడ్డలు కుట్టించు” అని చెప్పి డ్రైవరుని కారు షెడ్డులో పెట్టమని, ఇంటివేపు నడిచి వెళ్ళాడు. సావకాశంగా ఆ పిల్లని ఒక అనాధ శరణాలయంలో జేర్పించేస్తే, సమస్య అన్నివిధాలా పరిష్కారమై పోతుందని నిర్ణయించుకున్నాడు.

ఆ తరువాత పని తొందరలో ఆ పిల్ల విషయం పూర్తిగా మరిచిపోయాడు. అన్నిటికన్నా ముఖ్యమయిన పని అతని పెళ్ళి..

అతను సరదాగా గడిపొద్దామని విశాఖపట్టణానికి బయలుదేరిన రోజునే, అనసూయ తండ్రికి గుండె జబ్బు సూచనలు కనిపించాయట. అనసూయ పట్టుబట్టి ఆ వార్త అతని కందకుండా ఆపించింది. 

ఒకటి – ఏదో విశ్రాంతికోసం వెళ్ళినతన్ని వెంటనే తగినంత కారణం లేనిదే రప్పించడం న్యాయం కాదనీ; రెండు – తన తండ్రి గుండెజబ్బు అంత ప్రమాదమైనది కాదనీ. 

అయితే అనసూయ తండ్రి మాత్రం ఒక వాగ్దానం పుచ్చుకున్నాడు. దక్షిణామూర్తి తిరిగొచ్చిన వెంటనే అతనికీ అనసూయకీ పెళ్లి జరిగిపోవాలని. నర్సింగ్ హోమ్ లో తమ ఆస్థాన జ్యోతిష్యుల్ని రప్పించడం, ఇద్దరి జాతకాలూ చూసి, ముహూర్తం నిర్ణయించడం. అన్నీ దక్షిణామూర్తి ఊరికి చేరుకోకుండానే జరిగిపోయాయి. మొదట అతనికి కొంత చిరాకు కలిగింది. తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగినందుకు.

“సరే, నీ కిష్టం లేకపోతే వొద్దని నాన్నతో చెప్పేస్తానులే, ఇందులో బలవంత మేముంది?” అంది అనసూయ.

“ఆ! అదేమన్నమాట, ఇప్పుడు. పెళ్ళి వాయిదా వేస్తానంటే మాత్రం నే నొప్పుకుంటానా?” అన్నాడు ఛలోక్తిగా దక్షిణామూర్తి – 

తను చిరాకు పడ్డందుకు అనసూయకి కోపం వచ్చిందని గ్రహించి, ఆమెను దగ్గరగా తీసుకుని పెదవులమీద ముద్దు పెట్టుకున్నాడు కూడా. అంత చనువు ఆమె ఇవ్వడం – తను తీసుకోవడం అదే

మొదటిసారి. ఆమె ఎంత నవయువతి అయినా కొన్నింటి విషయంలో మాత్రం మహాపాతకాలపు మనిషి.

ముహూర్తం సరిగ్గా వారం రోజులైనా లేకపోవడం మూలాన అతనికీ ఆమెకూ కూడా నిద్రా విశ్రాంతి లేదు. వ్యాపార విషయాలన్నీ వాయిదావేసి రోజుకి ఇరవై నాలుగు గంటలూ పనిచేసినా పెళ్ళి ఏర్పాట్లు పూర్తయ్యేట్లు కనబడలేదు. బంగారు నగలు బహిరంగంగా చేయించడానికి వీల్లేదు గనుక, అతని ఇంట్లో సరుకు గదిలో ఆ కార్ఖానా ఏర్పాటు చెయ్యాల్సి వచ్చింది. రెండువేపులా పిలుపులు, ఆహ్వాన పత్రాలు వగైరా 

మామగారు నర్సింగ్ హోమ్ లో ఉన్నారు; ఆయన వంక మగదక్షత లేదుఒక్కగా నొక్క కూతురు. తమ్ముళ్ళన్నీ , వాళ్ళ పిల్లల్ని ఆయన నమ్మలేదు – ముఖ్యంగా డబ్బు విషయంలో..

అన్నిటికన్నా ఎక్కువకాలం తినేసింది – పెళ్ళిబట్టల ఎన్నిక. 

ఆమెకు కొనవలసిన చీరలు ఆమెనే ఎంచుకోమన్నాడు దక్షిణామూర్తి,

“బాగుంది. కట్టుకునేదాన్ని నే నయినా, అనుక్షణం చూసేవాడివి నువ్వు, నీకు నచ్చి తీరాలి.”

బట్టల దుకాణంలో అడుగు పెడితే, ఒకపూట గడిచిపోయింది, ఒక్క చీరయినా ఎంచకుండానే. పెళ్ళిలోగా ఈ చీరలు కొనడం ఎల్లాగా పూర్తికాదని నిరాశ చేసుకున్నాడు దక్షిణామూర్తి. 

కాని రేపు పెళ్ళనగా సేలం వెళ్ళి ఆఖరి చీరలు కొనేసి, రాత్రి పదిన్నరకి ఇంటికి తిరిగొచ్చేసరికి, ఫరవాలేదు రేపు పెళ్ళి జరుగుతుందన్న నమ్మకం కలిగిందతనికి. 

వచ్చిరావడంతోటే సోఫాలో కూలబడి కన్ను మూశాడు. పెద్దగాలివానకి అలసి విశ్రమిస్తున్న ప్రకృతిలాగుంది అతని స్థితి. అప్పుడొచ్చి చెప్పాడు దొర.

“ఆ పొన్ను కనబడలేదు సార్.” – 

“ఏ పొన్ను”

“తోటకారన్ కి మీరిచ్చిన పొన్ను సార్. ఆ దినం మీతో కార్లో ….” 

“ఏమయింది?” “పొద్దున్న తొమ్మిది గంటలకి చూసినాడంట, ఆ తరువాత చూణ్ణే లేదంట.” 

దక్షిణామూర్తికి తనేదో తప్పు చేసినట్టనిపించింది. “ఆర్ముగాన్నిలా పిలు.”

ఆర్ముగం వచ్చాడు. అతన పెళ్ళాం వొచ్చింది. ఇంటిముందు పందిరి వెయ్యడానికి కుదిర్చిన కూలీలందరూ వచ్చారు. అన్ని పోలీస్ స్టేషన్లకీ ఫోన్ మోగింది. ప్రతి అయిదు నిమిషాలకీ వాకబులు. ఎదురుగా కనిపించిన వాణ్ణి తిరిగి తిరిగి అదే ప్రశ్న అడగడం. దక్షిణామూర్తి అందర్నీ తిట్టాడు – తన కప్పగించిన పిల్ల మాయమైనందుకు ఆర్ముగాన్నీ, ఆమె ఎక్కడికి పోయిందో జాగ్రత్తగా చూడనందుకు దొరనీ, ఆమెను పట్టుకోలేకపోయినందుకు పోలీసుల్నీ. పై అధికారులందరూ నిద్ర మేలుకున్నారు – హోమ్ శాఖ మంత్రిగారిద్వారా. అందరూ టెలిఫోన్ల వద్ద కూచున్నారు, చిట్టితల్లి కబురుకోసం. 

ఒక్క అనసూయకి మాత్రం అతడు ఫోన్ చెయ్యలేదు. ఆ క్షణంలో అతడు అనసూయ సంగతే మరిచిపోయాడు.

రాత్రి పన్నెండు దాటినా చిట్టితల్లి కబురు తెలియలేదు. దక్షిణామూర్తికి ఆందోళన ఎక్కువైంది. ఈ మహాపట్నం ఆ పసిపాపను మింగేసిందా?

ఆర్ముగం తన పిల్లలు ఆరుగుర్నీ నిద్రలేపి తీసుకొచ్చాడు. అందర్నీ తిరిగి తిరిగి విచారించాడు దక్షిణామూర్తి. కొన్ని అతనికి మరీ బాధ కలిగించిన వివరాలు దాటేశేవాడు.

 ఉదాహరణకి: మూడు రోజుల క్రితం అతడూ అనసూయా బయటికి పోడానికి కార్లో బయలుదేరినప్పుడు దారి కడ్డంగా నిలబడిందట చిట్టితల్లి, ఆర్ముగం ఆమె నోరుమూసి ఒక గుబురు పక్కకి లాగేశాట్ట – అయ్యగారికి ఆమె ఏడుపు వింటే కోపమొస్తుందని.

అతన్ని చూడ్డానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసిందట. గుమ్మం లోపల అడుగు పెట్టకుండానే అవతలికి ఈడ్చి పారేశాడట దొర. 

“మా అమ్మ దగ్గరికి తీసికెల్తానన్నాడు. నన్నొదులు.” అని గింజుకునేదట వీళ్ళు పట్టుకుంటే.

వాళ్ళతో ఎంత గట్టిగా మాట్లాడినా, ఎవర్నీ నిజంగా తిట్టలేకపోయాడు దక్షిణామూర్తి. ఎందుకో వాళ్ళలా చేసినందుకు నిజంగా బాధ్యత తనదే ననిపించి దతనికి.

మరో రోజున ఆర్ముగం చేతిలోంచి విడిపించుకుని అరుస్తూ తన కారు వెనకాలు పరిగెత్తుకుంటూ వచ్చిందట. పందిరేస్తున్న ఆసామీ ఒకడు వెనకాల వెళ్లి ఆమెను పట్టుకుని తీసుకొచ్చి తిరిగి ఆర్ముగానికి అప్పగించాడట.

ఇంక చిట్టితల్లి దొరకదన్న నిస్పృహ అతని మనస్సులో ఆవరిస్తున్న సమయంలో ఆర్ముగం మూడో కొడుకు చెప్పిన ఒక సంగతి గుర్తుకొచ్చింది.

అక్కడే పడుకుని నిద్రపోతున్న బాబుని బలవంతంగా ఊపి లేపాడు దక్షిణామూర్తి, ఈ దిక్కులేని పిల్లకోసం తన యజమాని పడుతున్న ఆందోళన నౌకర్ల కెవరికీ అర్థం కాలేదు.

“ఏంరా బాలూ! పొద్దున్న ఏమిటి చూశానన్నావు? నువ్వూ చిట్టీ కలసి ఎక్కడికి పోయారు? ఇందాక ఏమిటన్నావు? చెప్పు.” అని ఆత్రంగా అడిగాడు.

“పాడకట్టసార్. పొణం సార్ పొణం” అన్నాడు బాలు సగం మగతలో. 

“ఎక్కడ? శవాన్ని ఎటు తీసుకుపోయారు?” “అమింజికలై పక్కమా సార్.”

 “డ్రైవర్! కారు తియ్యి – తొందరగా….”

డ్రైవర్ షెడ్ తలుపు తెరిచి కారు ఇవతలికి తీసేదాకా అతనికి తొందర ఆగలేదు. తనే షెడ్ దగ్గరకు పరుగెత్తాడు. తనే కారు స్టార్టు చేసి బుర్రుమని శరవేగంతో వీధిలోకి తిప్పాడు. 

ఎవరో మోసుకుపోతున్న శవం చూసింది. తన తల్లి నలాగే తీసుకుపోయారు. ఆ శవంతో పోతే తన తల్లి తప్పకుండా కనబడుతుందని గంపెడాశతో బయలుదేరింది. చిట్టిపాప. పూనమల్లి హైరోడ్డులోకి కారు తిప్పుతుంటే టైర్లు కిర్రుమన్నాయి. ఒక లారీనీ, ఒక రిక్షానీ భయపెట్టి కారు పూనమల్లి వేపు స్థిరపడింది. వంతెన దాటిం తరవాత వేగం తగ్గించాడు. కుడిచేతి పక్కనున్న సర్చిలైటు వెలిగించి ఆ స్మశానం అంతా వెతుకుతూ మెల్లగా కారు నడుపుతున్నాడు. 

నిర్మానుష్కమైన ఆ స్మశానంలో, ఆ కటికి చీకట్లో – ఏకాకిగా నిస్సహాయంగా దూరంగా కూర్చుని వుంది – ఒక చిన్న ప్రాణి. ఆమె చిట్టితల్లి అని గుర్తు పట్టాడు దక్షిణామూర్తి. 

తన తల్లిని వెతుక్కుంటూ మద్రాసు వచ్చింది. తన తల్లిని వెతుక్కుంటూ స్మశానంలోకి వచ్చింది. తల్లి లేదనీ, ఎక్కడా లేదనీ, తనకింక కనబడదనీ తెలుసుకుంది. తల్లి లేని లోకం స్మశానం. ఆ స్మశానంలో ఒంటరిగా కూర్చుంది. ఆ దృశ్యం కనబడగానే దక్షిణామూర్తికి లోపల ఎక్కడో విపరీతమైన బాధ పుట్టింది. అల్లాగే స్టీరింగు చక్రంమీద కళ్ళు మూసి వాలాడు. మెల్లగా కారు తలుపు తెరిచాడు. స్మశాన నిశ్శబ్దాన్ని భంగపరచకుండా జోళ్ళు విదిలించి పారేసి వట్టి పాదాలతో నడిచాడు – కారు దీపాలయినా ఆర్పకుండా. 

వీటి వెనక ఒక క్షణం నిలబడ్డాడు; మెల్లగా వంగాడు. కూర్చున్నాడు. చేతులు చుటూ వేశాడు. 

ఆమె ఒక్కసారి ఉవ్వెత్తుగా లేచింది. “నన్నొదిలేసెయ్. మీరంతా దొంగలు. నన్ను ముట్టుకోకు – నన్నొదిలేసెయ్.”

 “చిట్టీ” అన్నాడు! మెల్లగా, మృదువుగా… 

అబద్దాలాడారు నాతో – రంగత్తా, నువ్వూ అంతా. మా అమ్మని అల్లాగే కాల్చేత్తే – ఆస్పత్రిలో ఉందన్నారు, పట్నంలో ఉందన్నారు. ఎందుకన్నారు? మా అమ్మ ఇంకా లేదంటగా. ఇంకసలు రాదంటగా. ఉందని ఎందుకన్నారు నాతో – నాతో అబద్దాలేదుకాడారు మీ రంతా? రంగత్తా, నువ్వూ – అంతా?” 

మాటమాటకీ మధ్య ఎగుపుల్లో, ఆకస్మికంగా తగిలిన గాయం రక్తం చిందుతోంది. ఆమెలో, ఆకస్మికంగా కలిగిన జ్ఞానం కత్తిలా ఇంకా కోస్తోంది. దక్షిణామూర్తికి తెలుసు, ఆ గాయాన్ని ఓదార్పులు మాన్పలేవని.

చిట్టి తల్లిని భుజంమీద వేసుకున్నాడు. కాలుతున్న చితుల మధ్య కాలిబాటవెంట రోడ్డు వేపు నడిచాడు. చిట్టితల్లి ఎగుపులు క్రమంగా సన్నగిల్లాయి. ఆమె ఎడంచెయ్యి అతని కంఠాన్ని చుట్టుకుంది – ఇంక జీవితాంతం వదలని బంధంలాగా..

కారు తలుపు తెరిచి చిట్టిని లోపల సీటు మీదికి దింపాడు. అప్పుడు చూశాడు చిట్టి తల్లి నిద్ర పోయిందని. ఆమె శరీరం వశం తప్పి సీటు మీద పడిపోయింది. ఉదయం తొమ్మిది గంటల నించి ఈ నాలుగోఝూము రాత్రి వరకు ఆ లేత మనస్సులో ఎన్ని ఉప్పెనలు చెలరేగాయో ఊహించుకోగానే అతని ఒళ్ళు జలదరించింది. తలుపు మెల్లగా మూసి, డ్రైవరు సీటు వేపు కొచ్చాడు. ఒక్కసారి దిగంతం వరకూ పరుచుకున్న స్మశానం వేపు చూశాడు. మెల్లగా కారులో ఎక్కి తలుపు మూశాడు. పరధ్యానంగా ఇంటికి నడిపించాడు కారు.

మిగతావాళ్ళు చిట్టి తల్లిని తియ్యబోతోంటే వారించాడు. తనే ఎత్తుకుని వెళ్ళి లోపల సోఫాలో పడుకోబెట్టాడు.

పక్కనున్న ఫోను తీసి అలవాటైన నంబరొకటి డయల్ చేశాడు. కొంత సేపటికి – ఎంతో సేపటికి పరిచయమయిన కంఠం నిద్రమత్తులో బరువుగా పలికింది.

“డార్లింగ్! ఏమి టింత రాత్రివేళ?” అంత రాత్రివేళ అతడు తప్ప మరెవ్వరూ ఫోన్ చెయ్యరని ఆమెకు తెలుసు. –

“నువ్వు తక్షణం ఇక్కడికి రావాలి.”

 “రేపు పెళ్ళన్న సంగతి మరిచిపోయావా?”

“లేదుగనకే రమ్మంటున్నాను. నువ్వు వచ్చి తీరాలి. నీకో ముఖ్యమైన బహుమానం ఇవ్వదలిచాను…. అది నువ్వు అంగీకరించాలి.”

“ఏమిటది?”

“నువ్వు రాగానే చూపిస్తాను” అతడు ఫోన్ పెట్టేశాడు. ఆమె వస్తుందని తెలుసు. అతని చెయ్యి అప్రయత్నంగా చిట్టితల్లి తల నిమురింది, అనసూయతో మాట్టాడినంతసేపూ. ఫోన్ పెట్టేసాడు. అనసూయతో చెప్పదలుచుకున్న మాటలు మననం చేసుకున్నాడు.

“అనసూయ! ముందీ చిట్టితల్లికి నువ్వు తల్లివి కావాలి. అయితేనే నాకు భార్యవు కాగలవు.” 

అతని హృదయంలో అమితమైన ప్రశాంతి నిండింది.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube