Artwork for podcast Harshaneeyam
పాపం, మా సీన మావ!
7th July 2020 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:04:23

Share Episode

Shownotes

నేను ఆ రోజు బడి నుండి వచ్చేసరికి ముసునూరి నుండి మా సీన మామ వచ్చున్నాడు. ఈ సీన మామ వస్తే ఆయన వెంట పడి వూరు మీద లేక పోతే గుంజి పళ్లకోసమో లేక టేకు పళ్ళ కోసమో మా ఊరి హై వే కి ఆనుకొని వున్న చిట్టడవుల వెంట పడి బలాదూర్ తిరగటం నాకు చాలా ఇష్టం.

అలా వూరి మీద పడి తిరిగే మా సీన మామని కనపడ్డోళ్లంతా ఆపి, అబ్బయ్య నువ్వు మా బాబయ్య కొడుకువి కదా, ఎప్పుడొచ్చినావు అంటూ తెగ పలకరిచ్చే వాళ్ళు. ఊర్లో పడి తిరిగే నాకు యింత గుర్తింపు ఎప్పుడొస్తాడబ్బా అని నాకు భలే దిగులేసి పోతావుండేది. కానీ ఈ సీన మామని బాబ మామ కొడుగ్గానే పలకరిస్తా ఉంటే, అబ్బో యీ గొప్ప యీయనది కాదులే వాళ్ళ నాన్నదిలే అని సర్ది చెప్పుకొని, మా బాబ మామ ముసునూరులో ఎదో గొప్ప పని చేస్తా ఉంటాడు అందుకే ఆయన ఫాలోయింగ్ ఈ ఊరి దాకా పాకిపోతా వుంది అనుకొనే వాడిని.

అలా ఆయనంటే పెద్ద హీరో వర్షిప్ వున్న నాకు అప్పటిలోనే హతాశుడనయ్యె వార్త. మా పెద్ద వాళ్ళు పెద్దగానూ, మా ఊర్లో వాళ్ళు గుస గుస గాను చెప్పుకుంటుండంగా తెలిసిందేమిటంటే మా బాబ మామ తన మస్తానమ్మని , పిల్లకాయల్ని వదిలేసి స్వాములోళ్ళ వెంట పడి ఎక్కడికో వెళ్లి పోయాడని. అయితే మా బాబ మామ హీరో కాదా, జనాలెందుకు మా సీన మామని చూసి మా బాబయ్య కొడుకువా అని తెగ పలకరిచ్చే వాళ్ళు అని మా అమ్మ నడిగా, ఆవిడ నవ్వి చెప్పింది, పల్లెటూరోళ్ల పలకరింపులు అంతేరా, దానికి నువ్వో లేక మీ అబ్బో హీరోలు కానక్కర్లా అని.

పాపం ఆ మస్తానక్క కి ఎన్ని కష్టాలో అని నిట్టూర్చేనోళ్లే ఎక్కువ,, సాయం చేసేటోళ్ళకన్నా.

ఆవిడ కి మా సీన మామ కాక ఇద్దరు ఆడ పిల్లలు, మా బాబ మామ మాయం చేయకుండా మిగిల్చిన రెండెకరాల తోట ఉండేది.

చదువాపేశాడు మా సీన మామ. ఆ తోటలో వేసిన తమల పాకులు, అరిటాకులు, నాలుగు గేదెల పాలు కావలికి వేయటం మొదలు పెట్టాడు. ఆయన తోట లో వేసినవే కాకుండా ఆ ఊరి తోటల్లోవి కూడా టోకున కొని అంగళ్ళకి, హోటళ్ల కి వేయటం మొదలెట్టాడు. నాలుగు డబ్బులు వెనశాడు, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేసేసాడు. యిదంతా సినిమాలో చూపినట్టు ఓ మాంటేజ్ సాంగ్ అయ్యోలోపల జరిగిపోలా. కాలం కూడా దానికి దగ్గ కాలం తీసుకున్నది. ఇప్పుడు నాకు మా సీన మామ అసలు సిసలు హీరో.

ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో మా ముసునూరు కావలి లో కలిసిపోవడం తో ఆయనకున్న రెండెకరాలు, ఆయన కూడ బెట్టుకొని కొనుక్కున్న చుట్టు పక్కల వూర్ల పొలాలు బంగారమయ్యాయి. మా సీన మామ దశ మరియు దిశ లు మారి పోయినాయి. పిల్లకాయలు చదువులు కావలిలో, ఎక్కడికన్నా రావడానికి పోవడానికి ఒక కారు, మంచి యిల్లు కూడా కట్టుకున్నాడు ముసునూరు లోనే.

అబ్బా ఇక మా సీన మామ కు తిరుగు లేదు, ఎదురు లేదు అని నే సంబర పడిపోయా. ఆ సంబరం ఆయన కూడా కాస్త ఎక్కువే పడినట్టున్నాడు.

కాస్త సరదా పడదామని కాస్త పేకాట, ఆ పేకాట ఆడేటప్పుడు బోర్ కొట్టకుండా కాస్త మందు మొదలెట్టాడు. మా సీన మామ మొదట నుండి మొదలెట్టాక అంతు చూసే అలవాటు ఉందిగా, ఆ మందు అంతు చూసే పనిలో పడిపోయాడు, ప్రతీ రోజు. ఎంత పురోగమనం లో వెళ్ళాడో అంతకు రెట్టింపు తిరోగమనం మొదలయ్యింది. పులి మీద పుట్రలా ఈ ఆస్తి నాదంటూ మా బాబ మామ కూడా దిగి పోయాడు, తిరిగి తిరిగి వయస్సయ్యిపోయింది గా ఇల్లు గుర్తుకొచ్చిందాయనకు.

ఇక రామ రావణ యుద్ధమే ఇంట్లో ప్రతిరోజు; గొడవలు మధ్యస్థాలు మూడు పూవులు ఆరుకాయలుగా. ఈ గొడవల మధ్య మనఃశాంతి కరువయ్యి ఆ మస్తానక్క,, ఆవిడ పోయిన కొంత కాలానికి మా బాబ మామ ఇద్దరూ , పొయ్యారు. .చివరకు మేము విన్నది ఏమిటంటే ఓ రోజు మా సీన మామకి కావాల్సిన మందు తెచ్చి పెట్టి భార్య మరియు ఇద్దరు కూతుర్లు ఆయన ఆ మత్తులో ఉండగానే ఆస్తి కాగితాల మీద సంతకాలో లేక వేలి ముద్రలో తీసు కొని వెళ్లిపోయారని.

మా సీన మామ మరలా ముసునూరు లో ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడకే వచ్చాడు.
ఎదగటం కష్టం రా అబ్బయ్య, ఎదిగాక అక్కడే నిలబడటం ఇంకా కష్టం రా అబ్బయ్య అని పలవరించు కుంటూ.

దీనికి కొసమెరుపు ఏందంటే, ఈ కథంతా చెప్పి మా సుప్రియాను అడిగా, అయన భార్య పిల్లలు చేసింది తప్పు గదా అని. "తప్పేమి తప్పు, తమరి బొంద , అసలు గవర్నమెంటు వాళ్ళే ఒక చట్టం తీసుక రావాలి, ఇట్టా మొగుడు తాగి తందనాలాడితే,

ఆస్తి అంతా వూడబెరికి, పెళ్ళాం పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేటేటట్టుగా " అంది మా సుప్రియ.

నవ భారత నారీ జయహో.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube