Artwork for podcast Harshaneeyam
'వార్తాహరులు' - ఉణుదుర్తి సుధాకర్ గారు
Episode 19629th May 2021 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:31:31

Share Episode

Shownotes

'వార్తాహరులు' అనే కథ, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు.

'తూరుపు గాలులు' అనే సంపుటం లోనిది.

మనదేశంలో బ్రిటిష్ వారు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పరచడానికి దారి తీసిన పరిస్థితులను ఆధారంగా తీసుకొని రాసిన కథ.

మెరైన్ ఇంజనీర్ గా పని చేసిన సుధాకర్ గారు రాసిన 'యారాడ కొండ' ఆటా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల.

'హిస్టారికల్ ఫిక్షన్' రాస్తున్న అతి కొద్దిమంది రచయితల్లో సుధాకర్ గారు ముందు వరసలో వుంటారు.

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన సుధాకర్ గారికి కృతజ్ఞతలు.

'తూరుపు గాలులు' పుస్తకం కొనడానికి కావాల్సిన లింక్ - https://amzn.to/3wGaJmX

'యారాడ కొండ' కొనడానికి -

https://amzn.to/3fwoQW9

ఆనాటి వేసవికాలపు ఆదివారం రోజున సూర్యోదయం కాగానే మార్నింగ్ సిక్నెస్  ని తాజా గాలులతో విదిలించుకోవాలని సూజన్ తన హౌస్ కోటులోనే వరండా మీదకి వచ్చి వాలుకుర్చీలో జేరబడింది. దూరంగా చెట్ల వెనుక తళతళా మెరు స్తూన్న గంగానదిపై బద్దకంగా కదులుతోన్న తెరచాప పడవల్ని చూస్తూ మైమరచి పోయింది. అదే అలనాటి అధ్యాయపు ఆఖరి మనోహర ప్రశాంత దశ్యం అని ఆమెకు అప్పుడు తెలియలేదు. ఖాళీ కుండలతో నదివైపు నడుస్తున్న స్త్రీల నవ్వులూ, తనకు అర్థం కాని వారి హిందుస్తానీ మాటలూ గాలివాటాన స్పష్టంగా వినిపించ సాగాయి. వాటిని నెమ్మదిగా, నిర్దాక్షిణ్యంగా చీలుస్తూ దగ్గరవుతున్న గుర్రపుడెక్కల చప్పుడుతోనే తన జీవితం పూర్తిగా తలక్రిందులవుతుందనీ, ఇండియాలో తన కాపురం కుప్పకూలుతుందని ఆమె అప్పుడు ఊహించలేదు.

అతడు స్వారీ చేస్తున్న గుర్రంతోబాటు మరో గుర్రాన్ని వెంటబెట్టుకొని వచ్చిన రౌతు రెండింటినీ గేటు ముందున్న వేపచెట్టుకి కట్టి లోపలికి బిరబిరా రావడం ఎందుకో సూజన్‌కి ఆందోళన కలిగించింది. మళ్లీ కడుపులో వికారంగా అనిపిం చింది. గుబురు మీసాల రౌతు 'కమాండర్ సాబ్ మర్రేసాబ్ ని వెంటనే తీసుకు రమ్మని పంపించారు' అన్నాడు.

రెండో గుర్రం ఎందుకో సూజన్ కి అర్థమైంది. అంటే ఈ ఆదివారం కూడా చర్చికి వెళ్లడం కుదరదన్నమాట. ఫాదర్ మార్లిన్ మెత్తగా పెట్టబోయే చివాట్లు తినక తప్పదు. తనకు ఈ నాలుగు నెలల్లో పట్టుబడిన హిందుస్తానీ ముక్కల్ని తడబడ కుండా ప్రయోగిస్తూ

'ఠీక్  హై' అని లోపలికి నడిచింది. జాన్ ఇంకా గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు. రాత్రి విస్కీ ఎక్కువైనట్లుంది.

ఆదివారం కదా ఆలస్యంగా లేవొచ్చు అనుకున్నాడు పాపం. లేపక తప్పదు. ఉలిక్కిపడి తటాలున లేచి కూర్చున్నాడు.

‘సీఓ నిన్ను వెంటనే రమ్మన్నాట్ట. గుర్రం ఇచ్చి సిపాయిని పంపించాడు. ఏమయ్యింది మళ్లీ?' అడిగింది.

దోమతెరను తప్పించి తన భారీకాయాన్ని బయటకు తెస్తూ 'ఏముంది? ఈ సిపాయిల గొడవే అయ్యింటుంది' అన్నాడు జాన్.

వంటవాడు కాలియా పొద్దున్నే బజారుకి పోయాడు. ఆదివారం కదాని మాంసం తేవడానికి తనే పంపింది. పనమ్మాయి మరియమ్ చేసిన చాయ్ తాగి, గబగబా షేవ్ చేసుకొని డ్రెస్సు వేసుకొని బయటకు పరుగెత్తాడు జాన్. క్రికెట్ మాచ్ ఆడడానికి బయిల్దేరిన బడిపిల్లవాడి ఉత్సాహం జాన్లో కనిపించింది సూజన్ కళకి. ఈ సిపాయిల అలజడి కాదుగానీ జాన్ విల్ఫ్రెడ్  మర్రే, సీనియర్ టెలిగ్రఫీ ఆఫీసర్, నార్త్ వెస్టర్న్ ప్రావెన్స్ గారికి మునుపెన్నడూ లేనంత గిరాకీ, ప్రాముఖ్యత ఏర్పడి పోయాయి. కొత్తగా నెత్తిన పడ్డ ఈ కిరీటకాంతుల ధగధగల్ని పూర్తిగా అస్వాదిస్తున్నాడని సూజన్కి  అర్థం అవుతూనే ఉంది. భర్తకి సర్వత్రా లభిస్తూన్న గుర్తింపుని చూస్తూంటే తొలిదినాల్లో ఆమెకు ఒకింత గర్వంగా కూడా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం రోజురోజుకీ పరిస్థితి మారిపోతోంది.

మొదట్లో అక్కడక్కడ జరుగుతున్న సిపాయీల అల్లర్లు', 'కొంతమంది సిపాయీల ఆగడాలు' అంటూ వచ్చిన కుంఫిణీ అధికారులే ఇప్పుడు ఏకంగా 'సిపాయిల తిరుగుబాటు' అని యథాలాపంగా వాడేస్తున్నారు. 'మొత్తం ఉత్తర హిందూస్తాన్ అంతా అల్లకల్లోలంగా ఉంది' అనేస్తున్నారు. అంతేగాని మిగతా వివరాలేవీ చెప్పడం లేదు. 'ఢిల్లీ తిరుగుబాటుదార్ల స్వాధీనంలో ఉంది' అంటున్నారు. మరో పక్క 'అంతా తమ కంట్రోల్లోనే ఉంది' అంటున్నారు. ఢిల్లీ, కాన్పూర్, మీరట్లలో పరిస్థితి పూర్తిగా విషమించినా తాముండే మిర్జాపూర్ పరిసరాలు చాలా వరకూ ప్రశాంతంగానే ఉన్నాయి. గంగానదీ తీరాన తిరుగుబాటుదార్ల కదలికలను గమనిస్తూ వారిని అడ్డుకొనే బాధ్యతను తమ బెటాలియన్ కి అప్పగించారనీ, అందు చేత పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా తిరుగుబాటుదార్లతో తలపడే అవసరం ఉండబో దనీ జాన్ ధైర్యం చెప్పాడు. తను ఇప్పుడున్న స్థితిలో ఎక్కువ చెప్పడం ఇష్టంలేక కాబోలు, జాన్ కూడా అంతగా ఏమీ చెప్పడం లేదు. ఏం దాస్తున్నాడో తెలీదు. దీంతో సూజన్ ఆందోళన మరింత ఎక్కువైంది.

'మీ ఆయన టెలిగ్రఫీ ఆఫీసర్ కదా అన్నీ తెలుస్తాయే! నీకేమీ చెప్పడా?' అని సూజన్ మొహం మీదే అన్న ఆఫీసర్ల భార్యలూ ఉన్నారు.

ఆఫీసర్ల భార్యల నడుమ, సిపాయీల బారకాసుల్లో, నవుకర్ల సంభాషణల్లో, బజార్లలో, వీధుల వెంటా పుకార్లు రాజుకుంటున్నయి. చెలరేగి వ్యాపిస్తున్నాయి. అయితే సూజన్ చెవులకి తరచూ వినిపించే వ్యాఖ్యలు రెండే: ఆడవాళ్లనీ, పిల్లల్నీ  త్వరలోనే కలకత్తా పంపించేస్తారనీ, ఇళ్లల్లో పని చేసే నవుకర్లని ఒక కంట కనిపె డుతూ ఉండాలనీను. ఒక పక్క ఈ ఆందోళనల్లో, అనిశ్చితుల్లో తను మగ్గుతూ  ఉండగా మరోపక్క జాన్లో ఉబికివస్తోన్న అత్యుత్సాహాన్ని చూస్తూంటే సూజన్ కి కంపరం వస్తోంది. కమాండింగ్ ఆఫీసర్తో ఎడతెగని మంతనాలు, తరచూ సాయం త్రాలు మెస్లో అతిగా తాగడాలూ, రోజూ ఆలస్యంగా ఇంటికి రావడం, వేళా పాళా లేకుండా బారక్సుకి పరుగులు తీయడం ఇవన్నీ దుర్భరంగా తయారయ్యాయి.

'ఈ వేసవిలో కలకత్తాకి బదిలీ కావడం ఖాయం. అక్కడ మంచి డాక్టర్లున్నారు, నీ ప్రసవం అక్కడే' అంటూ ఉండిన జాన్ ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. తను ఇలా మొదటిసారిగా గర్భిణిగా ఉన్నప్పుడు జాన్ తనకు మరింత దగ్గరవుతాడనీ, ధైర్యం చెబుతాడనీ అనుకుంటే ఇలా అయింది. ఈ సిపాయీల తిరుగుబాటేదో జాన్ని తన నుండి దూరం చెయ్యడానికీ, ఇద్దరి మధ్యా అగాధాన్ని సష్టించడానికి వచ్చిన ట్లుంది తప్ప మరోటి కాదు అనుకుంది సూజన్.

నిన్న రాత్రి జాన్ ని 'ఈ గొడవలన్నీ ఎప్పటికి ఓ కొలిక్కి వస్తాయి? మునపటి ప్రశాంతత మళ్లీ ఎప్పుడు తిరిగొస్తుంది?' అని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఆమెను మరింత కంగదీసింది.

“ఇదిగో సూజన్! నా మాటలు జాగ్రత్తగా విను. ఈ తిరుగుబాటు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అయితే దీని మూలంగా ఒక గొప్పమంచి జరిగింది. టెలిగ్రఫీ తడాఖా ఏమిటో కుంఫిణీలో ప్రతీ ఒక్క బడుద్దాయికీ తెలిసొచ్చింది. క్రిందటి సంవత్సరం నాటికి కలకత్తాలో కొంతమంది సీనియర్ ఆఫీసర్లు మాత్రమే దీని విలువ తెలుసుకున్నారు. ఇప్పుడో ? మారుమూల పోస్టింగుల్లో ఉన్న జూనియర్ ఆఫీసర్లు కూడా తమ ప్రాంతాలకి టెలిగ్రఫీ సర్వీసులు కావాలని పై అధికారుల్ని బతిమాలుకుంటున్నారు. ఈ గొడవల మూలంగా గంగానదీ ప్రాంత మంతటా ఇరవై కొత్త టెలిగ్రఫీ స్టేషన్లు నెలకొల్పమని నిన్ననే ఆదేశాలు వచ్చాయి. శుక్రవారానికల్లా యంత్రాలూ, తీగెలు వచ్చేస్తున్నాయి కలకత్తా నుంచి పడవల మీద. ఈ పనికి నన్నే ఇన్-ఛార్జ్ చేసారు. ఇది సరే, ఈ సిపాయీల గొడవలు కడ తేరనీ అప్పుడింక చూసుకో. కొత్త స్టేషన్లని ఏర్పరచడంలో నాకున్న అనుభవం ఇంకెవరికీ ఉండబోదు. ఈ దేశం మొత్తాన్ని పెషావర్ నుండి రంగూన్ వరకూ, మలబార్ నుండి సిమ్లా వరకూ టెలిగ్రఫీ తీగెలు ఎలా పెనవేసుకు పోతాయో నువ్వే చూస్తావు, డాట్-డాష్ డాట్ల మార్ఫ్ కోడుతో ఈ దేశం మార్మోగిపోతుంది. అసలీ దేశం ఎంత పెద్దదో ఊహించగలవా? మొత్తం గ్రేట్ బ్రిటన్‌కి ఓ ఇరవై రెట్లు ఉంటుంది. అంతే కాదు, ఈ దేశంలో ఉన్న వైవిధ్యమైన జాగ్రఫీ, వాతావరణ మండలూ ఏ ఒక్క దేశంలోనూ లేవు- నాకు తెలిసి. నదులూ, సముద్రాలూ, అడవులూ, కొండలూ, హిమాలయాలూ, ఎడారులూ సర్వం ఒకే ఒక్క దేశంలో, ఇలాంటి చోట తపాలా, రైల్వే, టెలిగ్రఫీ వ్యవస్థల్ని సృష్టించి  నిర్వహించాలంటే అదేమన్నా సామాన్యమైన విషయమా? మారుమూల ప్రాంతాలకి ఉత్తరాలు బట్వాడా కావాలంటే రైల్వేలుండాలి. రైళ్లు నడవాలంటే ప్రతీ స్టేషన్లోనూ టెలిగ్రఫీ ఉండాలి. అందు చేత టెలిగ్రఫీయే అన్నిటికీ మూలం. టెలిగ్రఫీయే భవిష్యత్తు. 

ఇంత పెద్దదేశాన్ని చెప్పుచేతల్లో పెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు తాజా సమాచారం కావాలి. అంటే విస్తారమైన టెలిగ్రఫీ వ్యవస్థ ఉండి తీరాలి. అదే నాడీవ్యవస్థ. ఇవాళ నన్నంతా నెత్తిన పెట్టుకుంటున్నారంటే అదంతా టెలిగ్రఫీ మహిమ. ప్రస్తుతం ఇది సరికొత్త శాస్త్రం. దీని గురించి ఎవడికీ ఏమీ తెలీదు ముఖ్యంగా కుంఫిణీలో. అందుచేత మన భవిష్యత్తు దివ్యంగా ఉంది. నీ భర్త ఇండియన్ టెలిగ్రఫీ సర్వీస్ కి డైరెక్టర్ జనరల్ గా రిటైర్ అయినా నువ్వు ఆశ్చర్య పోనక్కర్లేదు. అదే జరిగితే కలకత్తాలో హుగ్లీ నది ఒడ్డున ఓ పెద్ద బంగాళాలో ఉంటాం వచ్చే పోయే స్టీమర్లని చూస్తూ. ప్రతీ గది లోనూ పంఖాలూ, వాటిని లాగేందుకు మనుషులూ, నవుకర్లూ, చాకర్లూ, గుర్రపు బగీలూ, గుర్రాలకి మాలిష్ చేసే వాళ్లు....' అంటూ నిద్రలోకి జారుకోబోతూ ఆ 'అన్నట్టు నీకెలా ఉంది? మళ్లీ వాంతులయ్యాయా? డాక్టర్ కిల్బర్న్ కి చెప్పాను. రెండు రోజుల్లో మన ఇంటికే వచ్చి చూస్తానన్నాడు. రేపు ఎలానూ చర్చిలో కలుస్తాం అనుకో' అని ముగించాడు.

సూజన్ కి చిర్రెత్తుకొచ్చింది. 'ఇప్పుడా నా గురించి అడగడం?' అందామను కొని, తమాయించుకొని, - 'పొద్దున్న మాట్లాడదాంలే, ఇంక నోర్మూసుకొని పడుకో. విస్కీ తగ్గించు. ఈ వేడికీ విస్కీకీ నప్పదు' అంది. దోమతెర నాలుగు మూలల్నీ సర్ది తనూ జేరబడింది గాని నిద్ర ఎగిరిపోయింది. ఇవాళ జాన్ అన్నదాంట్లో ఒక కొత్త విషయం తెలిసింది. ఈ గొడవలు ముగిసాక యినా జాన్ వేళకి వస్తాడనీ, ఇంటిపట్టున ఉంటాడనీ తను పెట్టుకున్న ఆశలు కాస్తా అడుగంటాయి.

అలా గడిచిన నిద్ర చాలని రాత్రిని గుర్తుచేసుకుంటూండగా మరియమ్ వరండాలోకి వచ్చి 'నాస్తా లగాదియా, మేమ్ సాబ్' అంది.

అప్పటికే ఎండ ఛుర్రుమంటోంది. వాలు కుర్చీమీంచి లేచి లోపలికి నడుస్తూ, 'కాలియా కహాగయా?' అనడిగింది సూజన్. 'పొద్దున్నే బజారుకి వెళ్లి తాజా మేకమాంసం తెమ్మని మీరు నిన్న చెప్పారుకదా. తేవలసిన మిగతా వస్తువులు కూడా చాలానే ఉన్నాయి. బజార్లో ఆలస్యం అయినట్లుంది. అందుకని నేనే నాస్తా తయారు చేసాను'

'ఈ రోజు సాబ్ భోజనానికి రాడు. చర్చికి వెళ్లేది కూడా లేదు. కాలియా వసే ఈ పూటకి కిచిడీ చెయ్యమని చెప్పు. మాంసం రాత్రికే'

'అలాగే, మేమ్ సాబ్' అని మరియమ్ వంటింట్లోకి వెళ్లిపోయింది కూరలు తరగడానికి,

మరియమ్ ఉడికించి పెట్టిన దలియా తిని కాఫీ తాగాక తన తల్లికి ఉత్తరం రాద్దామని మేజా వద్ద కూర్చుంది సూజన్. ఇంగ్లాండులో ఉన్న తల్లీ, అక్కా ఈ మధ్య తరచూ గుర్తిస్తున్నారు. కాని రెండు వాక్యాలు రాసాక ఇక ఉత్తరం ముందుకి సాగ లేదు. ఉక్కపోత మొదలైపోయింది. బారెడు పొద్దెక్కిందిగాని ఈ కాలియా ఇంకా రాలేదు. జాన్ భోజనానికి రాడు కాబట్టి సరిపోయింది. అయినా వీడికీ మధ్య వ్యాపకాలెక్కువైపోయాయి. మరియమ్ వాణ్ణి బాగానే వెనకేసుకుంటూ కాపాడుకుంటూ వస్తోంది. వీళ్లరిమధ్యా ఏదో వ్యవహారం సాగుతున్నదని ఈ మధ్య సూజన్కి అనుమానం కలుగుతోంది.


మరియమ్ పాతికేళ్ల ముసల్మాన్ అమ్మాయి. బక్కపల్చగా, తెల్లగా ఉంటుంది. కాలియా హిందువు. ముప్పై అయిదు ఉంటాయేమో. నల్లగా, దృఢంగా ఉంటాడు. ఈ ఇద్దరికీ ఎలా కుదిరిందో? ఏమైతేనేం, ఇద్దరికిద్దరూ మంచి పనిమంతులు. ఒక్కసారి చెబితే గ్రహించేస్తారు. కాలియాని ఆఫీసర్ల మెస్ నుండి తప్పించి తమకు వంటవాడిగా కుదర్చడానికి సీఓగారి చలవే కారణం. సీనియర్ ఆఫీసర్ల భార్యలు కొంతమంది కాలియా సేవల కోసం విశ్వప్రయత్నం చేసినా అవి తమకే దక్కేటట్టు చేయడం నాలుగు నెలల క్రితం ఈ పోస్టింగ్ రాగానే సూజన్ కోసం జాన్ మర్రే సాధించిన మొదటి ఘనవిజయం.

మరియమ్ ఈ మధ్యనే వచ్చింది. రెండు నెలలై ఉంటుందేమో. కాలియాకు అంత గిరాకీ ఏర్పడడానికి కారణాలున్నాయి. మెస్  లో మొదట బేరర్ గా , ఆ తర్వాత పెద్ద వంటవాడికి అసిస్టెంటుగా చాలాకాలం పనిచేసి దొరల అలవాట్లు, వంటలూ మహా చక్కగా నేర్చుకున్నాడు. హిందువులు గొడ్డు మాంసం ముట్టరు. ముసల్మాన్లు పంది మాంసం తినరు. ఈ సంగతి తనకు ఇంగ్లండులో ఉన్నప్పుడే తెలుసు. కాలియా హిందువేగాని బాగా కింది కులం వాడట. వాళ్లకి అలాంటి పట్టింపులు ఉండవుట. ఈ ముక్క జాన్ చెప్పాడు.

ఏమైతేనేం ఈ వెసులుబాటు దొరలకి మాబాగా ఉపయోగపడింది. అయినా ప్రపంచంలో ఇంకెక్కడా లేని కులాలు ఈ హిందూస్తాన్లో ఎందుకున్నాయో? ఫాదర్ మార్టిన్ ని అడగాలి. ఫాదర్ అన్నట్లు ఈ దేశం అంతటా క్రైస్తవం వ్యాపిస్తేనే కులాలు మాయమవుతాయేమో. మొన్న ఇదేమాట జాన్ అంటే “ఈ దేశపు మతవ్యవహా రాల్లో కలగజేసుకుంటే మొత్తం బెడిసికొడుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే' అన్నాడు.

సూజన్ కునికిపాట్లు పడసాగింది. రాత్రి సరిగ్గా నిద్రలేకపోయినదాని ఫలితం. ఉత్తరం  రాసే ప్రయత్నం మానుకొని లేచి పడకగదివైపు నడుస్తూ 'మరియమ్, కాసేపు రెస్టు తీసుకుంటాను, వంట కాగానే లేపు' అంది.

మరి కొద్దిసేపట్లోనే కాలియా ఇంట్లోకి వచ్చాడు కావడితో సామాన్లు మోసుకొచ్చిన కూలీని వెంటబెట్టుకొని. కూలీ అతను మంచినీళ్లు తాగి పైసలు తీసుకొని బయటకు నడవగానే మరియమ్ ఆత్రుతగా అడిగింది: ''ఏమైంది, కాలియా ? బషీర్ భాయిని కలిసావా ? ఏమన్నాడు?" 

'ష్! ఇక్కడేమిటీ మాటలు? వంటయ్యాక మాట్లాడుకుందాం' 

“'ఫరవాలేదు. మేమ్ సాబ్ మంచి నిద్రలో ఉంది. ఈ పూటకి కిచిడీయే. చేయడం కూడా అయిపోయింది. వంటింట్లోకి పద. త్వరగా చెప్పు"

'బషీర్ భాయిని కలిసాను. కొత్త టెలిగ్రఫీ యంత్రాలు వస్తున్నాయనీ వాళ్లింక తొందరగా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పాను'

'ఏమన్నాడు?" 

'అమీనుద్దీన్ సాబ్ దగ్గరకు తీసికెళ్లాడు. ఆయనకీ అదే ముక్క చెప్పాను. ముసలాడు ఏమన్నాడో తెలుసా? సైతాను కనిపెట్టిన సాధనం టెలిగ్రఫీ అన్నాడు. సమాచారం అందించేవరకే అయితే తన పావురాల ముందు ఇవేవీ పనికి రావన్నాడు. హిందువుల గుడి, ముసల్మాన్ల మసీదు, అలాగే శ్మశానం, సమాధి అని చూడకుండా ఈ దొరలు ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు పాతి తీగెలు లాగు తున్నారు, ఈ పాపం ఊరికే పోదన్నాడు. తూటాల మీది కొవ్వులాగా ఇది కూడా అందరి మతాల్ని భ్రష్టు పట్టించేందుకు దొరలు చేస్తున్న కుట్ర అని మండిపడ్డాడు'

 'బషీర్ భాయి అక్కడే ఉన్నాడా?'


బషీర్ మరియమ్ కి పెద్దనాన్న కొడుకు. అతనంటే చిన్నప్పటి నుండి ఆమెకు గొప్ప గురి. ఇటీవల అతని తమ్ముళ్లు ఇద్దరు కుంఫిణీ కొలువు వొదులుకొని పారి పోయి నానాసాహెబు సైన్యంలో చేరిపోయారు. చిన్నప్పుడు ఆ కుటుంబంలోనే మరియమ్ ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యా ముద్దుగా పెరిగింది. పట్టుబట్టి వాళ్లతో బాటు కత్తిసాము, గుర్రపుస్వారి, తుపాకి కాల్చడం నేర్చుకుంది.

 ‘ఇది చాలా ముఖ్యమైన పని, నువ్వే చేయగలవు' అంటూ జాన్ ఇంట్లో మరియమ్ ని పనిలో కుదిర్చింది కూడా బషీరే.

టెలిగ్రఫీ వల్లనే దొరలు నిమిషాల మీద సిపాయీల రాకపోకలు తెలుసుకుం టున్నారనీ, కుంఫిణీ సైనికుల్ని హుటాహుటిన తరలిస్తున్నారనీ బషీర్ ఎప్పుడో గ్రహిం చాడు, తిరుగుబాటు నాయకులు పంపే పావురాలేవీ సరిగ్గా గమ్యం చేరడం లేదని కూడా అతనికి తెలుసు.

ఆ రోజు నానాసాహెబు, తాంతియా తోపేలకు రహస్యంగా సహకరిస్తున్న బషీర్ భాయితోనూ, తిరుగుబాటుదార్లకు మద్దతుగా నిలిచిన స్థానిక పెద్దమనిషి అమీనుద్దీన్ సాబ్ తోనూ జరిగిన సమావేశం గురించి మరియమ్ కు వివరించ సాగాడు కాలియా. 

'నానాసాహెబు సైన్యంతో కలవడానికని బయలుదేరిన మన సిపాయిల ఆచూకీ టెలిగ్రాఫీ ద్వారా తెలిసిపోయిందనీ, మనవాళ్లు గంగానదిని ఎక్కడ దాటాలని అనుకున్నారో అది కూడా దొరలకి తెలిసిపోయిందనీ టెలిగ్రాంలు ఇచ్చి కుంఫిణీ సైనికుల్ని అక్కడికి ముందుగానే తరలించి, మాటు వేసి మనవాళ్లని సునాయాసంగా చంపేశారనీ, కొద్దిమంది మాత్రమే అవతలి ఒడ్డుకు చేరారనీ బషీర్ భాయికీ, అమీనుద్దీన్ సాబ్ కీ వివరంగా చెప్పాను'

 'వాళ్లేమన్నారు?

'ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బషీర్ భాయి అయితే వలవలా ఏడ్చేశాడు. నాకూ దుఃఖం ఆగలేదు. అమీనుద్దీన్ సాబ్ కోపంతో మండిపడ్డాడు."

మరియమ్ కాసేపు మాట్లాడలేక పోయింది. చివరికి ఆమె నోరు పెగిలింది'ఇప్పుడిక ఏం చెయ్యాలని నిశ్చయించారు?'

'కొత్త యంత్రాలు రాకుండా ఒకటి రెండు నెలలైనా అడ్డుకోవాలని చివరికి వాళ్లు ఒప్పుకున్నారు'

'ఎలా అడ్డుకుంటాం?"

'కలకత్తా నుండి యంత్రాలతో వచ్చే పడవలు శుక్రవారానికల్లా దినాపూర్ వరకూ వస్తాయి. అక్కడి రేవులో కూలీలు వాటిని దింపి ఎడ్లబళ్ల మీదికి ఎక్కిస్తారు. ఇక్క డికి రావడానికి ఒకపూట పైనే పడుతుంది. దారిలో మాటువేసి యంత్రాలని ధ్వంసం చెయ్యాలి. రాగి తీగెల్ని మోసుకొచ్చి ఎక్కడైనా దాచి పెట్టాలి. తరవాత కరిగించి వాడుకోవచ్చు. ఎడ్లబళ్ల వెంట ఒక సార్జెంటు దొర, ఆరుగురు సిపాయీలూ ఉంటారు. వీలైనంత మట్టుకు సిపాయీలని చంపొద్దన్నాడు అమీనాబ్. సార్జంట్ ని మాత్రం ఖతం చెయ్యాలి. అన్నిటికంటే ముఖ్యంగా యంత్రాలని పూర్తిగా నాశనం చెయ్యలి. ఇదీ పథకం."

'బషీర్ భాయి వస్తున్నాడా?

'లేదు. అతనికి వేరే ముఖ్యమైన పని ఉందిట. అదేమిటో చెప్పలేదు. నేనూ అడగలేదు. నలుగురు తిరుగుబాటుదార్లను తుపాకులిచ్చి పంపుతానన్నాడు. కానీ నేనూ వెంట ఉండాలన్నాడు. నేను కత్తి తిప్పి చాలాకాలం అయిందనీ, ఈ మధ్యంతా గంటలే తిప్పుతున్నాననీ చెబితే వినిపించుకోలేదు. మరో విషయం, ఈ ఘటన కాగానే నువ్వు కూడా ఇక్కడ పని మానెయ్యాలన్నాడు'

'నేనూ నీ వెంట వస్తాను. కత్తి తిప్పడం, తుపాకీ పేల్చడం నాకు వచ్చు." 

కాలియా నివ్వెరపోయాడు. 'అదేమిటి మరియమ్, నాకీ సంగతి ఎప్పుడూ చెప్పనే లేదు?' 

'నీకు దొరల భాష అర్థం అవుతుందని నాకు మొదట్లో చెప్పావా? ఇదీ అలాగే మరి'

మేమ్ సాబ్ గదిలోకి మరియమ్ తొంగి చూసింది. సూజన్ మంచి నిద్రలో ఉంది. కాలియాకి మజ్జిగలో ఉప్పు కలిపి ఇచ్చింది. వాళ్లిద్దరూ బజారు నుండి వచ్చిన సామాన్లను కొట్టుగదిలో పేర్చసాగారు. కాలియా ఆనాటి సమావేశాన్ని గుర్తు చేసు కుంటూ మరియమ్ తో అన్నాడు--

‘ఇవాళ బషీర్ భాయికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. టెలిగ్రఫీ యంత్రాలని ధ్వంసం చెయ్యకుండా స్వాధీనం చేసుకొని మనమే ఎందుకు వాడుకోకూడదు అంటాడు. కానీ ఈ విషయం మీద అతనికి సవాలక్ష సందేహాలున్నాయి.'

'అంటే?' కాలియా మాటలని ఆసక్తిగా వింటూనే మేమ్ సాబ్ ఎక్కడ లేస్తుందో అని ఒక చెవి అటు పడేసింది మరియమ్.

'టెలిగ్రాపు తీగెలకి రంధ్రం ఉంటుందా? లేకుంటే మరి వాటిల్లోంచి మాటలు ఎలా ప్రయాణిస్తాయి? మీ మర్రేసాబ్ తీగెల కొసల్ని పట్టుకొని అరుస్తుంటాడా? అలా అయితే పక్కనే నిలబడి వినొచ్చు కదా? లేదంటే ఎక్కడో ఓ చోట ఆ తీగెల్ని కత్తిరిస్తే మనకి కూడా ఆ మాటలు వినబడాలి కదా? ఇలాంటి యక్షప్రశ్నలు వేసి నన్ను వేధించాడు. నాకొకటి తెలిస్తేకదా ఏం చెప్పడానికయినా?'

'మరి?" 

“మనం స్వయంగా ఈ యంత్రాల్ని వాడుకోవడం ఇప్పట్లో జరిగేపని కాదని ఒప్పుకున్నాడు"

ఆ రోజు రాత్రి బాగా పొద్దు పోయాక మరియమ్ పక్క మీద నుండి లేచి తన గదికి వెళ్లబోతూ,

'ఈ వారంతో ఇక్కడి కథ ముగిసిపోతుంది. తరవాత ఎలా ఉంటుందో?'

అన్నాడు కాలియా.

'మనవాళ్లు గెలుస్తారు, ఇన్స్ అల్లాహ్ ! మళ్లీ మొఘల్ హుకూమత్ వస్తుంది. మనకి ఎక్కడో ఒక చోట పని దొరికిపోతుంది. ఏది ఏమైనా మనం ఇద్దరం కలసి ఒక చోట ఉంటాం. అది చాలు' అన్నది మరియమ్,

'అవును మరియమ్. నిజం చెప్పావు. నాకైతే మనవాళ్లు గెలవగానే పెళ్లి చేసుకొని లక్నో వెళ్లిపోయి అవధ్ వంటలు నేర్చుకోవాలని ఉంది. ఈ దొరల వంట లతో విసుగొచ్చింది. కాని ఒకవేళ ఓడిపోతే?

'తోబాతోబా ! నిజంగా మన కిస్మత్ అలా రాసిపెట్టి ఉంటే దక్కన్ వెళిపోయి పెళ్లి చేసుకొని అక్కడే ఉందాం, 'బాగా చెప్పావు. హైదరాబాదు వంటలు మాత్రం ఏం తక్కువ?'

ఇద్దరూ బిగ్గరగా నవ్వుకున్నారు. వారి ఆందోళనలు మబ్బుల్లా చెదిరిపోయాయి. ఒక ఆశాకిరణం వికసించింది. నిద్రపట్టక దొర్లుతున్న సూజన్ కి వీళ్ల నవ్వు లీలగా వినిపించింది. ఆమె అనుమానం మరింత దృఢపడింది.

కలకత్తా నుండి వస్తున్న టెలిగ్రఫీ యంత్రాలను ధ్వంసం చేసే పథకం అనుకున్నట్లుగా సాగలేదు. అమీన్‌సాబ్ పంపించిన నలుగురిలో ఒకాయన బాగా వయసు మీరినవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా కనిపించదు. పేరు రాణా. అతనో రాజపుట్. అతనికి మందుగుండు పేల్చడం బాగా వచ్చనీ కాబట్టి వెంట ఉండి తీరాలనీ అమీన్‌సాబ్ పట్టుబట్టాడు. మిగతా ముగ్గురూ ఈ మధ్యనే తర్ఫీదు పొందిన యువకులు. వాళ్లని లక్నో పంపేముందు ఈ విధంగా వినియోగిస్తే మంచి తిరుగు బాటు సైనికులవుతారని బషీర్ భాయి ఆలోచన. అయితే ఈ నలుగురిలో ఇద్దరికే తుపాకులున్నాయి. మిగతా ఇద్దరూ కత్తులు పట్టుకున్నారు. ఇవి కాక కాలియాకీ, మరియమ్ కీ చెరో బాకూ ఇచ్చారు. 

ఈ మరో ఊహించని పరిణామం ఏమిటంటే- ఈ యంత్రాలు తన శాఖకు చెంది నవి గనక వాటిని సురక్షితంగా చేరవేసే బాధ్యత తనపై కూడా ఉందని భావిం చిన జాన్, సీఓని ఒప్పించి తాను కూడా కుంఫిణీ దళంతో బాటు దినాపూర్ బయిలుదేరాడు. ఈ సంగతి తిరుగుబాటుదార్లెవరికీ తెలియలేదు.

ఆ సాయంత్రం దినాపూర్ శివార్లలో తుపాకులు పేలగానే కుంఫిణీ దళం అప్రమత్తం అయి జవాబుగా కాల్పులు జరిపింది. ఎడ్లబళ్లు అదుపు తప్పాయి. తలో దిక్కూ అయ్యాయి. తిరుగుబాటుదార్లని వెంట తరిమితే, లేదా చంపితే బళ్లలోని సామగ్రి సురక్షితంగా ఎక్కడో ఒకచోట ఉంటుందని అనుభవం కలిగిన కుంఫిణీ దళసభ్యులకు తెలుసు. ఈ విషయాల్లో బొత్తిగా అనుభవంలేని జాన్ మాత్రం తొంద రపడి బళ్లను ఒంటరిగా అనుసరించాడు. అదే అతను చేసిన పెద్ద తప్పిదం.


రాణా, ఒక యువసైనికుడూ, కాలియా ఈ ముగ్గురూ కలిసి వీలైనన్ని ఎడ్లబళ్లని  తొందరగా ధ్వంసం చెయ్యాలనీ, మిగతా ముగ్గురూ కుంఫిణీ దళాన్ని నిలువ రించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే రాణా బృందం మూడు బళ్లను ధ్వంసం చేసింది. మరో బండిని పేల్చబోతూ ఉండగా జాన్ వాళ్లని సమీపించాడు. పిస్తోలు  రాణాను వెనకనుండి కాల్పాడు. రాణా అక్కడే కుప్పకూలాడు. 

కాలియా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా జాన్! 'నువ్విక్కడ ఏం చేస్తున్నావ్, కాలియా?' అని అరిచాడు జాన్. 

కాలియా నిశ్చేష్టుడై నిలబడ్డాడు. జాన్, కాలియాపై తన పిస్తోల్ని గురిపెట్టాడు. సార్జంట్ ఒక్కడే కాకుండా మరో తెల్లదొర కూడా ఉన్నందుకు మొదట ఆశ్చర్యపో యిన మరియమ్ బృందం, దొరల పైనే దష్టి పెట్టాలనే లక్ష్యం ప్రకారం, జాన్ని అనుసరించింది. కాలియా ప్రాణానికి ఏర్పడ్డ ముప్పును గమనించిన మరియమ్, తన బాకును బలంగా విసిరింది. అది వీపున గుచ్చుకొని జాన్ నేలకొరిగాడు. కాలియా తేరుకొని, జాన్ చేతిలోని పిస్తోల్ని లాక్కున్నాడు. అతని తలపై గురిపెట్టి కాల్చాడు.

Chapters

Video

More from YouTube