Artwork for podcast Harshaneeyam
దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!
16th July 2020 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:01:48

Share Episode

Shownotes

నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు - ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు మా చిన్నది, వాళ్ళ పాప సహాధ్యాయులు అవటం మూలాన మేము క్రమం తప్పకుండా వారాంతరాలలో కలిసే వాళ్ళము.

అట్టి నర్సింలు చెప్పా పెట్ట కుండా మా కంపెనీ కొలువు వదిలేసి, ఒక దేశీయ గుత్తేదారుని ద్వారా టి-మొబైల్ లో చేరిపోయాడు. అలా ఓ నాలుగు నెలలు గడిచాక, ఒక వారాంతరం రోజున తన స్నేహితుడు ఇండియానుండి వస్తుండటంతో, విమానాశ్రయానికి వెళ్లి, వాళ్ళను తీసుకొని వాళ్ళ ఇంటివద్ద దింపి వచ్చి, తన ఇంటికి వచ్చి పరుండి , ఇక లేవలేదు. మాసివ్ కార్డియాక్ అరెస్ట్ అని తర్వాత తెలిసింది మాకు.

ఇద్దరు పిలల్లు మరియు నర్సింలూ పార్థీవ శరీరంతో మిగిలిపోయింది తన భార్య. మంచి చెడులు చూసుకోవాల్సిన గుత్తేదారుడు పత్తా లేదు. తనకుండే స్నేహితులంతా మా కంపెనీ వారే, నాలాటి వారు. ముందు వాళ్ళ తలిదండ్రులతో నేనే మాటలాడినా, తన పార్థీవ శరీరాన్ని ఇండియా కి పంపిస్తాము అన్న వాళ్ళ ఆశల మీద నీళ్లు చిలకరించా, చాలా ఖర్చు మరియు మాకు అంత పలుకుబడి లేదు అన్న నెపం తో. అది వాళ్లకు చాలా ఘాతం లాగా తగిలింది. కష్టమైన అర్థం చేసుకొని సరే అన్నారు కొన్ని గంటల తరువాత.

తప్పు అన్ని తెలిసినా, కట్టటం ఉండదు అని తెలిసినా, తన క్రెడిట్ కార్డుతో, ప్రయాణానికి కావాల్సిన టికెట్స్ కొనేశాము. మా కొలీగ్స్ అందరం కూడబలుక్కుని ఓ ఇరవై ఆరువేల డాలర్స్ కూడవేసాము. ఎవరు ఎంత చిన్న మొత్తమిచ్చినా స్వీకరించాము. ఈ మనీ కలెక్షన్ అంతా మా ఇంకో సహోద్యోగి అయిన శశీ సుంకు చూసుకున్నాడు. తరువాత చాలా కష్టమైనది తన దహనం. చాలా మంది, ప్రతిరోజు పండగే చిత్రం చూసి, తండ్రి సమాధి ఎలా వుండబోతుందో చూపటం చూసి, చాల అతి అన్నారు. కానీ నేను వెళ్ళినప్పుడు ఆ దహనవాటిక వాళ్ళు, నా ముందర చాలా ప్యాకేజీలు పెట్టి ఒక్కో ప్యాకేజీ ఆవశ్యకతని వివరించారు. ఇరువది మంది దర్శనార్థం వస్తే ఇంత, ఏభై మందికైతే ఇంత, డ్రెస్సింగ్ చేస్తే ఇంత, రాళ్లు పెడితే ఇంత పెట్టకపోతే అంత అంటూ ఓ గంట. గీచి గీచి బేరాలాడి అతి తక్కువ డబ్బుకు ఒప్పించి వచ్చా. ఈ లోపు మా నర్సింలూ కూతురు, హర్ష మామా! నాన్న నన్ను ఈతకు తీసుకెళ్తానన్నారు, నువ్వన్నా తీసుకెళ్ళు, నాన్నని చూడనిస్తారటగా నేను ఏ డ్రెస్ వేసుకోను అంటూ చాలా అమాయకంగా అడిగేది, పిల్లలు ఎలా అడుగుతారో మరియు ఎలా వుంటారో అలా.


ఆ పక్కరోజు నేను మరియు ఇంకో సహోద్యోగి అయిన ప్రదీపు, నర్సింలూ ఒకటిన్నర సంవత్సరాల కొడుకుని తీసుకెళ్లి, శరీరాన్ని దహనపు గదిలోకి తీసుకెళ్లే స్విచ్ ని నొక్కించాము. బ్యాంకు అకౌంట్ ని మూసివేయించి, తన కారుని నేను తన తరుపున అమ్మి, అన్నీ డబ్బులు ఆ అమ్మాయి చేతిలో పెట్టి విమానమెక్కించాము. వాళ్ళ గుత్తేదారుని ఒక నక్షత్రకునిలా విసిగించి, వేధించి వాడి చేత నర్సింలూ కి రావాల్సిన డబ్బులన్నీ ఇండియా లోనే కక్కించాము. కానీ ఆ వెధవ, ఎచ్ 1 -బి ప్రాసెసింగ్ కింద మూడు వేల డాలర్లు పట్టుకొని మిగతా డబ్బులు ఇచ్చాడు. మాకు అర్థమైనది, అన్నీ బాగుంటేనే దేశం కానీ దేశం లో బతుకు బాగుంటుంది, ఎమన్నా తేడా వస్తే దిక్కులేని వాళ్లమవుతామని. కొలువు చేస్తే కనీసం కొంత పెద్ద కంపెనీలకన్నా చేయాలి కానీ చిన్న చిన్న దేశీయ గుత్తేదారుల దగ్గర చేయరాదని.


అప్పుడు నాన్న చనిపోయినప్పుడు అసలు బాధ కూడా తెలియని అమాయకురాలైన మా నర్సింలూ కూతురి, ఇప్పుడు, రాష్ట్రం లోనే 160 రాంక్ తెచ్చుకొని, మన గాంధీ మెడికల్ కాలేజీ లో రెండవ సంవత్సరం చదువుతున్నది, వాళ్ళ అమ్మకి, పైనున్న వాళ్ళ నాన్నకి గర్వకారణమై.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube