Artwork for podcast Harshaneeyam
'సీతా.....రాముడొస్తున్నాడోయ్ ' - యండమూరి గారి రచన !
Episode 1702nd April 2021 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:18:49

Share Episode

Shownotes



నవలా రచయితగా, లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి ఎంపిక చేసిన 25 కథలతో వచ్చిన పుస్తకం ' ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్' .

ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, 'సీతా... రాముడొస్తున్నాడోయ్'.

ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు.

ఈ పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండి

https://www.telugubooks.in/products/the-best-of-yandamoori-veerendranath

హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

ఆ రాత్రి - అయోధ్య నిశ్శబ్దంతో సయోధ్య చేసినట్టుంది.

శ్రీహితుడికి కన్ను మూత పడటంలేదు. మెత్తటి పాన్సు అంపశయ్యలా తోచింది. కొంచెం సేపు నిదురించే ప్రయత్నం చేస్తున్నాడు. లేచి కూర్చుంటున్నాడు. అంతకు మునుపే, దూరంగా రోదన వినిపించింది. వినిపించిన వైపు వెళ్ళాడు.

సరయూ నది ఒడ్డున ఒకామె రోదిస్తూ కనబడింది. “ఎవరు తల్లీ నీవు? ఎందుకు రోదిస్తున్నావు?” అని అడిగాడు. "నాయనా! నేను నిద్రాదేవిని. నిన్ను సమీపించుటకు చేతకాని అవమాన భారంతో రోదిస్తున్నాను” అన్నది.

ఆమె రోదనకు సరయూనది గలగలలు ఉపశృతులు అవుతున్నవి. ఏమి చేయాలో తోచనట్టు నిలబడినాడు.

అంతలోనే అతడికి మెలకువ వచ్చింది. అంతా కల అని తెలిసింది. మళ్ళీ అనుమానం నిదుర రాకపోతే కల వుండదుకదా. మరి అది కలా? లేక తన భావావేశమా? అంతా అయోమయమే! ఈ అయోమయం వేకువ నుంచీ వున్నది. ఏ పనీ చేయబుద్ధి కాదు. ఊరికే ఉండబుద్దికాదు. కాలు ఒక చోట నిలువదు. అది నిలుచున్నా మనసు నిలవదు. అవును మరి అతడికి అలజడికి కారణమున్నది.

రాముడు బయల్దేరినాడట. పుష్పక విమానంపై సీతా సమేతుడై వస్తున్నాడట. రావణ సంహారానంతరం అయోధ్యలో అడుగిడుతున్నాడట.

- శ్రీహితుడికి ప్రస్తుతం ఇరవయ్యేళ్ళ ప్రాయం. అతడి తల్లి కైకేయి వద్ద ముఖ్య పరిచారిక. తండ్రి దశరధ రథ చోదకుడు.

అతడికి గతము బాగా గుర్తున్నది. అప్పుడతడికి ఆరో వసంతము. ఆడవారితో వామన గుంటలు, ఈడు వారితో కోతి  కొమ్మచ్చులు ఆడుకునేవాడు.  ఆరోజు ఎవరూ అతనితో ఆడేటందుకు రాలేదు. పలకరించనయినా లేదు. అంతా దుఃఖ  సాగరంలో మునిగి వున్నారు. ఆటకెవరూ తోడు లేనందున అతడికి కోపము వచ్చింది. కసి పెరిగింది. బిక్కు - బిక్కు మంటూ ఒక్కడే కూర్చున్నాడు. గదిలో ఒక మూల తల్లి రోదిస్తున్నది. - అంతలో పుర వీధిలో కలకలం వినిపించింది. పరుగు పరుగున బయటకొచ్చాడు. ఆ దృశ్యాన్ని  అతడు, తరువాత జీవితంలో ఎన్నడూ మర్చిపోలేదు.

నార బట్టలతో రాముడు, సీతతో కలిసి నడుస్తున్నాడు. లక్ష్మణుడు వారిని అనుసరిస్తున్నాడు. వెనుక అయోధ్య నడుస్తున్నది. శ్రీహితుడు కనులు పెద్దవి చేసుకుని చూసాడు. అతడి పసి మనసుకి అర్థం కాలేదు. పరుగెత్తుకుపోయి, “అమ్మా! అందరూ వూరొదిలి పోతున్నారే” అన్నాడు. 

తల్లి అతడి పొదివి పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చింది. 

ఆమె దుఃఖమునకు మరొక కారణము కూడా వున్నది.

కైకను తిట్టనివారు లేరు. ముఖ్య పరిచారక కాబట్టి ఆమెది కూడా తప్పన్నటు తూలనాడారు. ఆ తల్లి దుఃఖం అందుకే. శ్రీహితుడికి తల్లి దుఃఖం అర్థం కాలేదు. తనూ ఏడ్చినాడు.

ఎప్పటిమాట అది! పధ్నాలుగు వసంతాల క్రిందటి మాట!

ఆ తరువాత రాముని కథలు ఒకటి తరవాత ఒకటి విని పులకించి పోయినాడు. వాస్తవముకంటే ఊహ గొప్పది కదా! శ్రీహితుడి మనసులో శ్రీరాముడట్లే పెరిగిపోయినాడు. కథలన్నీ తల్లే  చెప్పినది.

రాతిని నాతిగ చేసినాడని చెప్పగ నోటిని తెరుచుకు విన్నాడు. దండిగ నసురుల చెండిన రాముని, కంటికి నిండుగ వూహించుకున్నాడు. ధనస్సు వంచిన దనుజభిరాముని మనస్సునందే నింపుకొన్నాడు.

ఆ విధంగా రాముడు, శ్రీహితుడి మనసులో వయసుతో పాటే ఎదిగినాడు. అటువంటి రాముడు ఈ రోజు.... ఇన్నాళ్ళకి వస్తున్నాడంటే నిద్ర ఎలా పడుతుంది?

లేచి బయటకు వచ్చాడు.

శ్రీహితుడికి అయోధ్య మీద చాలా కోపంగా వుంది. దానికి కారణం కూడా వున్నది. రాముడొస్తున్న రాత్రి, ఇంత హాయిగా అందరూ ఎలా నిద్ర పోతున్నారన్నదే ఆ కారణం.

అంతకు ముందు రోజే భరతుడు అగ్ని ప్రవేశం చేయబోయాడు. పదునాలుగు సంవత్సరములు దాటినా రాముడు రాకపోయే సరికి ప్రాణాలు తీసుకోబోయాడు. అంతలో హనుమంతుడొచ్చి రామాగమన సందేశాన్ని వినిపించాడు. -

అంతే! ఆ క్షణము నుంచీ అయోధ్యలో ఎవరికీ నిద్రాహారాలు లేవు. నగరాన్ని అలంకరించటము ప్రారంభించారు.

కౌసల్య కళ్ళలో తెలి మంచుముత్యాలూ, సుమిత్ర కళ్ళల్లో మణిదీపాలు వెలిగితే, కైకకి వళ్ళంతా కళ్ళే అయినవి. ముగ్గురు తల్లులూ, కళ్ళని దీపాలు చేసి, రాముడొచ్చే దారిని వెలిగించారు.

భవంతులకి రంగులు వేసారు. దారులని నీటిలో కడిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాముని అవతార మెత్తిన విష్ణువుని వదిలి వుండలేని ఆదిశేషువు అయోధ్య కొచ్చి, తన శరీరాన్ని కోటగానూ, పడగలను సౌధాలుగానూ చేసినట్లున్నాడు. 

ఇంతాజేస్తే రాముడేమో  అన్నీ వదిలి అడివికి పోయినాడు. నిస్తేజుడైన ఆదిశేషుడికి కూడా ఆ రోజు రామాగమన వార్త తెలిసినట్టుంది. ఒక్క సారిగా పడగ విప్పాడు. సౌధాగ్రాల్లో వెలిగించిన మాణిక్యపు దివ్వెలు ఆ శేషువు పడగలపై మణుల వలె భాసిస్తున్నాయి. 

ఎక్కడ చూసినా మకర తోరణాలు, పరిమళ గంధాలు... కస్తూరి కలిపిన కన్నీటి కలయంపి ఊరు వూరంతా కలాపి జల్లి, రత్నాల రంగవల్లులూ, ముత్యాల ముగ్గులు తీర్చిదిద్దారు ముదితలు.

పనికి అడ్డు వస్తున్నారని పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చబోయారు తల్లులు. స్తన్యమిచ్చి జోకొడుతూ, “లాలీ... లాలీ.. మేఘశ్యామా లాలీ.... తామ రస నయన ...... దశరథ తనయ లాలీ ... రామ లాలీ...”. అని పాడసాగారు. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్న పసివాళ్ళు, పాటలో రాముని శబ్దం వినగానే తత్తరపడి మళ్ళీ మేల్కొంటున్నారు.

ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని తల్లుల పవిటలు పిల్లలు అడ్డు తీస్తున్నారు. ఆ విధంగా రెండు రోజులనుంచీ సాగుతోంది.

రాముని రాక కోసం అయోధ్య నలంకరించిన నగర వాసులందరూ ప్రస్తుతం గాఢనిద్రలో మునిగి వున్నట్టున్నారు. పుర వీధులన్నీ నిశ్శబ్దంగా వున్నాయి. పిల్లగాలి హితుడిని పరామర్శగా తాకింది. దక్షిణం వైపునుంచి వస్తోంది అది. ఎక్కడో యోజనాల గరంలో వున్న రామచంద్రుని తాకి పునీత మైనట్టుంది. ఆ ఆలోచనతోనే అతడి శరీరం పులకించింది.

అతడికి ఒంటికాలి తిన్నడు గుర్తొచ్చాడు. వాడికి రాముడంటే మరీ భక్తి. చెట్టు పైకెక్కి రాముడు శివ ధనుస్సు నెలావంచాడో సోదాహరణగా మిత్రులకి వర్ణిస్తుండగా కొమ్మ విరిగింది. కాలు విరిగింది. అప్పటినుంచీ ఒంటికాలి తిన్నడు అయ్యాడు. అదీ వాడికి సంతోషమే! కన్నుపోయిన కాకి కన్నా తనే గొప్ప అంటాడు. వాడూ నిదురోతున్నట్టున్నాడు. నిన్న సాయంకాలం మోగిన భేరీ వాద్యాలూ, మంగళస్వనాలూ కూడా విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నాయి.

శ్రీహితుడు ఆకాశం వైపు చూసాడు. చంద్రుడు లేడు. మేఘాలు మాత్రం వున్నాయి. చంద్రుడికి మచ్చ ఎలా వచ్చిందో తిన్నడు చెప్పాడు. 'రాముని జైత్రయాత్రలో వానరుల కాళ్ళ క్రింద రేగిన దుమ్ము, పాల సముద్రంలో పడి బురద అయ్యిందట. ఆ సముద్రం నుంచి పుట్టినందువల్ల చంద్రుడి మీద మచ్చ అయిందట.....

కథ విన్న శ్రీహితుడికి అనుమానం వచ్చింది. 'చంద్రుడు ముందు పుట్టాడా? రామచంద్రుడు ముందు పుట్టాడా?” అని. చంద్రుడు కావాలని అడిగినప్పుడు కౌసల్య పాడిన పాట, “ఎందుకు ఆ చందమామ?... అందగాడనా నీకన్నా? అందరాడనా ఓ కన్నా” అన్నది కదా! అది గుర్తుంది. ఆ సందేహాన్నే తిన్నడి ముందుంచాడు. ఒంటికాలిమీద లేచాడు తిన్నడు. భక్తి వున్నచోట సందేహముండకూడదని బోధన చేసాడు. సంయుక్తంగా లెంపలు చేసుకున్నారు ఇద్దరూ.

అటువంటి తిన్నడు ఈ రాత్రి ఎలా నిద్రపోతున్నాడు?

శ్రీహితుడు నడక సాగించాడు. వీధుల్లో శునకాల అలికిడి కూడా లేదు. అందరూ కలిసి నిద్రిస్తున్నట్టున్నారు. అందరూ సరే! జనకులవారి మాటేమిటి? కూతురు రాక్షస చెరలో అష్టకష్టాలూ పడి, అగ్నిచేరి పునీతురాలిననిపించుకుని వస్తున్నదే.... మంగళహారతులతో, పచ్చనక్షంతలతో ఎదురేగవలసిన ఆడపడుచులు అలసి పోయినారు సరే- ఆయన ఎదురేగవచ్చుగా. భూమిలో దొరికినది కాక, కడుపున బుట్టినదయితే ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉండగలడా?

శ్రీహితుడికి అయోధ్యమీద కినుక కలిగింది.

“ఆరేళ్ళ ప్రాయంలో రాముడు వనవాసానికి వెళ్తుంటే, ఆ సమయంలో బొంగరాలాట ఆడినందుకు తిట్టిపోసిన ఇరుగమ్మలు పొరుగమ్మలు ఇప్పుడేం చేస్తున్నారో” అనుకున్నాడు కసిగా.

రాముడు వెళ్ళే రోజు మన్ను మిన్ను ఏకమయ్యేలా శోకించిన ప్రజలేనా వీళ్ళు?” అనుకున్నాడు ఉక్రోషంగా.

జోలపాటలో రామనామము విని లేచి కూర్చున్న పిల్లలు కూడా పాల బువ్వ తిని హాయిగా నిద్రపోతున్నారట్లే వుంది. మనుష్యుల సంగతి సరే. మర్చిపోతారు. పశువులూ, పక్షులూ ఏమయ్యాయి? కలరవాలు, హయ హుషలు, గజ కలాప కరవాలు వినపడవేం? 

ఒక్క పావురవైనా నా రాముని రాక కోసం కువ కువలాడదే? ఒక్క లేగదూడ కూడా నిద్దురలో ఉలిక్కిపడదే?

తానెంత వెర్రివాడు? ఊర్మిళాదేవి తప్ప, చివరికి ఆమె పెంపుడు కీరవాణితో సహా మొత్తం అయోధ్యంతా ఆ రాత్రి మేలుకొని వుండి, రాముడికి స్వాగతం చెపుతుందనుకున్నాడు.

"ఓ నిద్రాదేవీ! నువ్వు నిజంగా గొప్పదానివి. పధ్నాలుగేళ్ళు...కళ్ళు మూసినా తెరిచినా కూడా రాముని పాదపద్మాలే దర్శిస్తూ రాముడిని స్మరిస్తూ, రాముడికోసం నిరీక్షిస్తూ తపించిన వాళ్ళని కూడా నీ మాయతో, మరోమాట లేకుండా నిద్రపుచ్చావే! సరయూనది గల గలలు నీ విజయానికి మంగళకైవారాలని అనుకోకు. అయోధ్యపై నీ విజయానికి అస్థిత్వం లేకుండా, ఇదిగో... రాముడిని నా కళ్ళల్లో, ఊపిరిలో, రక్తంలో నింపుకోవటానికి అనిమేషుడివై నేను వెళ్తున్నాను”. 

“జయోస్తు!” అన్నట్టు వర్షపు చినుకులు పడ్డాయి. అతడి శరీరం పులకించింది. అరచేతిమీద పడిన నీటి చినుకువైపు చూసాడు. తలెత్తి మేఘం వేపు చూసాడు. వర్షమెందుకు పడిందో అతనికి తెలుసు. అర్థమైనట్టు నవ్వేడు.

భూదేవి అలిగింది. అలగదూ మరి...!

ఆమె అనుకుని వుంటుంది... 'వనవాసానికి వెళ్ళినప్పుడు అల్లుడు నన్ను స్పర్శిస్తూ ..... గిరులు, ఝరులు దాటుకుంటూ న..డు..చు..కుంటూ వెళ్ళినవాడు, పట్టాభిషేకం  వచ్చేసరికి గాలిలో తేలుతూ వస్తున్నాడు. పుష్పక విమానం ఎక్కి ఆకాశంతోనూ, మేఘాలతోనూ చెలిమి చేస్తున్నాడు. లోకంలో జామాతలను ఏనాడూ నమ్మరాదు కదా' అని అలిగిందట.

ఆమె అలక తీర్చటానికి మేఘాలు వర్షపు చినుకులతో రాయబార మంపుతున్నాయి. “తల్లీ నీ కూతురూ, అల్లుడూ ఎప్పుడూ నీ వద్దే వుండేవారే కదమ్మా. కొద్ది సేపైనా మాతో ముచ్చటించనీ” అని. 

"మరి గుహుడూ ఈ విధంగానే అలిగి వుంటాడు కదా. అతడి అలకా సహేతుకమే! అతడినే విధంగా ఓదారుస్తాయో ఈ మేఘాలు-?” అనుకుంటూ శ్రీహితుడు ఆకాశంవైపు చూసాడు. 

చంద్రుడి జాడే లేదు. విజయదశమినాడు రావణ వధ. అయోధ్యకు అమావాస్య నాడు రాక. శ్రీహితుడు అలా అనుకోలేదు.

“ఏమయ్యా చంద్రుడా! అమ్మవారి అనుంగు సోదరా! ఎదురేగి బావగార్ని తీసుకు రావటానికి వెళ్ళవా?” అనుకున్నాడు.

తూరుపుకు తిరిగి, రాజమార్గాన ప్రవేశించాడు. అశోక చెట్ల గుబురులు గాలికి తలలూపుతున్నాయి. 

అతడికి హనుమంతుడు, 'సీతాదేవి అశోక వృక్షం క్రిందే కూర్చొని శోకించింద'ని చెప్పిన వైనం గుర్తు వచ్చింది. ఆర్ద్రంగా ఆ చెట్ల కేసి చూసాడు.

“లోక పావనికి నీడ నిచ్చిన పుణ్య తరువులు మీరు. అందుకే భూదేవి తన కుమార్తెకు మీరు చేసిన ఉపకారాన్ని గుర్తించి, ఏ ఋతువు లోనూ ఆకులు రాలకుండా నిత్యవసంతాన్ని వరమిచ్చింది కదా!” అనుకున్నాడు.  నాలుగు అడుగులు వేసాక, అంతఃపురాంతర్భాగం నుంచి కస్తూరీ, మృగ మదమూ కలిసిన సౌరభం నాసికా పుటాల్ని తాకింది.

పొరుగింటి పడతితో తల్లి చెపుతున్న మాటలు గుర్తొచ్చాయి. సీతారామ లక్ష్మణులు వనవాసాన్నించి రాగానే అన్నదమ్ములు నలుగురికీ శోభన ముహూర్తాలట. 

తన తల్లి “కైక పరిచారిక కదా. ఆ పర్యవేక్షణంతా కైకదయితే, పని తన తల్లిది. అందుకే ఏర్పాట్లనన్నీ వర్ణించి మరీ చెబుతోంది. 

ఆ శ్రీహితుడి వయసు ఇరవై వసంతాలు. ఉరకలేసే ప్రాయం. ఉత్సుకంగా అంతా విన్నాడు చాటునుంచి. భగవంతుడి గురించి ఏమి ఆలోచిస్తే ఏమి తప్పున్నది? దానినీ వూహించుకొన్నాడు.

సీతాపతి అర్ధాంగికి ప్రథమ చుంబనం ఎక్కడ ఇస్తాడు?

'సిరి' అంటే మక్కువ కదా. శ్రీకారమును తలదన్ను ఆమె కర్ణములకా ఆ అదృష్టం? శంకు చక్రములంటే విష్ణువుకి ప్రీతి పాత్రములు కదా. శంఖమైతే కంఠము మీదే ప్రథమ చుంబనం. లేక చక్రమే అయితే, మన్మధుని రధ చక్రముల పోలు ఆమె నితంబములదే ఆ పుణ్యం. లేక కౌమోదకి ధరించేవాడు కాన ఆమె ఊరువులకా ఆ భాగ్యం?

వనవాస సమయాన శబరి సమర్పించిన ఫలములను ప్రీతి నారగించాడు కనుక బింబాధరాలను ప్రథమంగా చుంబిస్తాడా, లేక కోదండపాణి కాబట్టి విల్లును పరిహసించే ఆమె నడుమును ముందు చుంబిస్తాడా?

“అమృతం త్వమంగే...” అంటున్నాడు రాముడు. అతడి శరీరానికి ఆమే అమృతం! “త్వం నయనమో కౌముదీ” అంటోంది మైధిలి. ఆమె కన్నుల వెన్నెల అతడేనట!

అతడావిధంగా కల్పనలోంచీ, కవితావేశం నుంచీ బయటపడి చూసేసరికి సరయూ తీరాన నిలబడి వున్నాడు. ప్రకృతి నిశ్శబ్దంతో చెలిమి చేసినట్టుంది. అంతా ప్రశాంతంగా వుంది. అతడికి దిగులేసింది. స్వపురవాసుల మీద అంతులేని ఆగ్రహం కలిగింది. కలలో కనపడిన నిద్రాదేవి ఒడ్డున లేదు. ఎందుకుంటుంది? అయోధ్య ప్రజల కనురెప్పలపై లాస్యం చేస్తూ వుంటుంది 

కానీ..ఆగ్రహమో, రాముని ముందు చూడాలన్న ఆరాటమో-నడుము బిగించి నదిలోకి దూకాడు. ఆజానుబాహువులతోనే ఈ దాడో, రాముని చూడాలన్న ఆరాటంతోనే ఈ దాడో కానీ అనతికాలంలోనే ఆవలి ఒడ్డుకి చేరుకున్నాడు. అక్కడ....

“రాముని చేరటం అంత సులభమా?” అని పరిహసిస్తున్నట్టు రొమ్ము విరుచుకుని నిలబడి వున్నది అడ్డుగా ఒక కొండ.

అతనికి కాలు నిలువలేదు. తానొక్కడే... రామ దర్శనామృతమంతా తనకొక్కడికే అన్న ఆశ డెందమున సందడి జేయ, వెనుకనున్న అయోధ్య వంక ఎడమ కంటి కొస నుంచి ఒక నిరాశనా పూర్వకమైన చూపు సారించి, కొండ నెక్కటం ఆరంభించాడు.

శిఖరం అంచు ఆవలివైపు నుంచి ప్రజ్వలమైన వెలుగు కనిపిస్తోంది. వస్తున్నాడు సీతారాముడు! పుష్పక విమానం వచ్చేస్తుంది!

అతడు కొండపైకి పరుగు దీయటం ప్రారంభించాడు.

“పాహిమాం రాజరాజేశ్వరీ! మమ్ముల అనుగ్రహించు. ఆహ్వానం పలుకలేని మా వూరి వారి అమర్యాదని క్షమించు. వాహిని... దయాప్రవాహినీ.. భండ చండ నిమహిష భంజనీ నిరంజనీ జన రంజనీ పండిత శ్రీధుహదాస పోషణీ సుభాషిణీ-రివు భీషణీ - వరభూషణీ- పాహిమాం”  అనుకొంటూ కొండ కొమ్ముని అతి ప్రయాసమీద చేరుకున్నాడు.

ఆవలి దిమ్మను దృష్టి నిగిడ్చి చూసాడు. అచ్చెరువుతో చిత్తరువు అయ్యాడు. ఏమున్నది అక్కడ?

మొత్తం అయోధ్య అంతా అక్కడే వున్నది. పసి పిల్లలు, పావురాలు, లేడి కూనలతో సహా అక్కడ పరివేష్టించి ఆకాశం కేసి చూస్తోంది. అనిమేషత్వంతో... రాముడి నిరీక్షణలో,

అందరికన్నా చివరున్న ఒంటికాలి తిన్నడు అలికిడికి తల తిప్పి శ్రీహితుడిని

“ఇప్పుడా రావటం?” అన్నట్టు చూసాడు.

‘సీతా! రాముడొస్తున్నాడోయ్’  - యండమూరి వీరేంద్రనాథ్ (రచన - 1994)



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube