ఆగదిలో యింకోవస్తువేదో ఉన్నట్టు రావుగారికి కనిపించింది. తెరచిన తలుపులోనుంచి లోపలికేదో ప్రవేశించినట్లుగా, చేతిలో దీపం వెలిగించి ఆయన ఆవేపు చూశారు. ముష్టి ఆమె గజగజ వణకుతూ నీరు కారుతూ వొకమూల నిలబడివుంది. ఆమె తడివెంట్రుకలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటివెంట నీరు కారుతోంది.
‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా వుంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియవేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్ళీ తలుపులు మూసి గదిలో వున్న కర్రసామాను అంతా కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, బరువైన డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది.
ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ఎక్కడో పెద్ద చప్పుడైంది. ఏదో పడిపోయింది. స్టేషన్ లోపలే పడిపోయిందేమో? “ఏం గాలి వానండి బాబుగారు నేను పుట్టిన్నాటి నుండి యింత గాలివాన నేను సూడలేదు.” అంది ముష్టి ఆమె గొంతులో ఏమీ బెదురులేకుండా.
అంత ప్రశాంతంగా ఆమె ఎట్లా మాట్లాడకలుతుందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశారు. మూలగా చలిచేత ముడిచి పెట్టుకుని వొణుకుతూ ఆమె కూచుంది. రావుగారు పెట్టి తీసి తనపంచ ఒకటి తీసి ఆమెవేపు విసిరి ‘తడిబట్ట విడిచి యిది కట్టుకో’ అన్నారు. ఆయనన్న దేమీ ఆమెకు వినిపించలేదు. కానీ పొడిబట్ట యిచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తూ బట్టమార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్నచోట కూర్చుంది. రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది
తన పెట్టె తీసి అందులో వున్న బిస్కట్ల పొట్లం తీశారు. ఒకటొకటి చొప్పునా నమలడం మొదలు పెట్టారు. |
అక్కడే కూర్చున్న ఆమె ముఖం వేపు చూసారు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని ఆయనకు స్ఫురించింది.
“బిస్కట్లు తింటావా?” అని అడిగారు.
“ఏంటన్నారు?” అన్నదామె గట్టిగా, ఆ గాలి హోరులో ఒకరు మాట్లాడితే ఒకరికి వినిపించలేదు. ఆయన దగ్గరగా వచ్చి కొన్ని బిస్కట్లిచ్చారు.
. “ఇవ్వేవున్నాయి, తినడానికి” అన్నారు రావుగారు ఏదో పొరబాటు చేసినట్లుగా.
కాని అసలు లేనిదానికంటె నయం కాదూ?
తన చోటికి తిరిగి వెళ్ళి పెట్టిమీద కూచున్నారు. కుర్చీలు తలుపులకి అడ్డం పెట్టివున్నాయి. ఆమె గదిలో వుండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటె ఆమె వుండడం కొంత నయం. – దేని గురించీ బాధ పడదు. గాలివానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు ఆమెకు అనుభవమై వుంటాయి. అంచేత ఆమె ఏ పరిస్థితినైనా కంగారు పడకుండా ఎదుర్కోగలదు. .
రావుగారు గడియారం వంక చూచారు. తొమ్మిది గంటలయింది. అయినా రైలు దిగిన తర్వాత కొన్ని యుగాలు గడిచినట్లు ఆయన కనిపించింది. ఆయన వచ్చే స్టేషను వరకు మిగతా వారితో కూడా ప్రయాణం సాగించివుంటే బాగుండును. పెద్ద గాలివాన చెలరేగుతుందనీ, తను దిగేది ఒక చిన్న స్టేషను అని ఆ కంగారులో ఆయనకు స్పురించలేదు. స్టేషన్ నుంచి వూరు సుమారు రెండుమైళ్ళు ఉంటుంది. వూరికి తర్వాత స్టేషన్ నుంచైనా చేరుకుని వుండవచ్చు.
అన్ని విషయాలను కొన్ని సూత్రాలతో బంధించడం అలవాటయిన ఆయన మనస్సు గాలి యొక్క వేగాన్ని గురించి యోచించింది. బహుశా గంటకు 80 లేక 100 మైళ్లు వుండవచ్చు గాలివేగం. పెద్ద భయం ఆయన మనస్సును ఆవరించింది. ఈ గది కూలిపోవచ్చు. బయటికి పోయే ఒక్కదారీ కుర్చీలతోటి, బల్లలతోటి మూసివుంది. ముష్టిమనిషి కూచున్న చోటికి ఆయన కంగారుగా పరిగెత్తారు.
“ఈ యిల్లు కూలిపోదుగదా?”అని ఆయన అడిగారు.
“ఎవరు చెప్పగలరు? యిల్లు గట్టిగానే వున్నట్టుంది. గాలిబలం ఎక్కువయితే ఏది ఆగుద్ది?”
ఆమె మాటల్లో ధైర్యాన్ని కలిగించేది ఏదీ లేకపోయినా, ఆమె గొంతులో ఏదో ఒక చనువూ స్థైర్యం ధ్వనించింది. ఆయన పెట్టి దగ్గరకు పోయి కూర్చున్నారు. ఆయన కూర్చున్న మూలకు నెమ్మదిగా ఆమెకూడా చేరింది. “అక్కడ కూర్చుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు” అంది.
“గాలివాన యింత ముదిరిపోతుందని నే ననుకోలేదు.”
“బాబుగారు ఎందుకలా భయపడతా” రందామె. “ఒక్కరుండే కంటె ఇద్దరమున్నాంగదా! టికెట్టు కలెక్టరు దొంగముండావాడు. రైలు కదులుతూంటే నన్ను దింపేశాడు, ఏం చెయను! యిక్కడుండి పోయాను. అయినా నాకేటి విసారం? బాబుగారు చుట్టమెట్టుకోనాకి ఓ పొడిగుడ్డిచ్చారు. ఏదో కాంత అకలికి మేత పడేశారు. వచ్చే టేసనులో ఈ మాత్రం సుకమయినా వుంటాదని ఎలా అనుకోగలను? వున్నంతలో సుకంగా వుండాలి బాబుగారు! అదిలేదని, యిదిలేదని సీకాకుపడితే ఏం లాబం?”
ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమిత పడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కసహ్యం. ఆయన మనస్సుకీ ఆమె మనస్సుకి ఎంతో అంతరం వుంది.
అయినా ఆ భయంకరమయిన రాత్రి తనకు తోడుగా ఆమె వున్నందుకు ఆ కృతజ్ఞత ఆయన మనసులో నిండింది.
“నీ కెవరూ చుట్టాలు లేరా?” అన్నారాయన, వెంటనే యింత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. తను రైలులో ఆమెకు ఒక కానీ కూడా యివ్వనందుకు ఆమెకు తనమీద ఏమన్నా కోపముందేమోనని ఆయన అనుమానం. మాటల్లోగానీ చేతల్లోగానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆమె కొంచెం ఆయన దగ్గరగా జరిగింది.
సుట్టాలందరికీ వుంటారు. ఏం లాబం బాబుగారు? మా అయ్య తాగుతాడు. ఆడే మా అమ్మని సంపేశాడంటారు. నాకు మనువు అవలేదు. కానీండి బాబుగారు ఓ దొంగముండావాడితో సేవితం కలిసింది. నాకు ఇద్దరు పిల్లలండి బాబుగారు. ఆడికి జూదం, తాగుడు అలవాటయిపోయాయండి. రోజూ ఏలకి ఏలు నెగ్గుతుంటాడు పోతుంటాయి. ఏం జెయ్యను బాబుగారు? ఇంట్లో తిండికి తిప్పలకీ నా సంపాదనే. పిల్లలింకా చిన్నోళ్లు బిచ్చమెత్తుకోనాకి. మావోడికి రోజుకో పావలా ఇత్తానండి తాగుడికి.
అడికి నన్ను సూత్తే అడలు బాబుగారు. తాగుడు లేకపోతే నా ఎదురుగా నిలబడి తట్టుకోలేడండి. అందుకే తాగుతాడు బాబుగారు! అసలు అందరికీ తాగుడు అలాగే అలవాటవుద్దండి.”
‘నువ్వు ఏమాత్రం సంపాదిస్తావు.”
‘ఒక్కోరోజు ఐదు రూపాయలు దాకా దొరుకుద్ది. ఒకోరోజు కానీ కూడా వుండదు. అయినా బాబుగారు! నేనడిగితే ఎవరూ లేదనరండీ మీరు తప్పితే. కొంతసేపు ఆరితో సరదాగా మాట్లాడితే యిచ్చేత్తారండి.”
రావుగారు అనుకోకుండానే ఆమె ముఖం మీదికి దీపం వేశారు. ఆమె కొంచెంగా నవ్వింది. ఎవరినైనాసరే ఆమె కిందా మీదా పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా యిష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపించింది. జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడచినకాలపు స్మృతుల బరువుగానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలుగానీ ఆమెకు లేవు. ఆమె నడవడిని నిర్ణయించే సూత్రాలు లేవు. ఆ సూత్రాలలో నిషేధాలసలే లేవు. నిత్యమూ ధర్మాధర్మచింతతో బాధపడే అంతరాత్మగానీ, నాగరికులకు సహజమయిన సంకీర్ణ మనస్తత్వంగానీ ఆమెకు లేవు. తను ఎన్నడూ ఎరగని మగవాడి కూడా ఆమె శరీరాన్ని అర్పించి తేలికైన మనస్సుతో ఆమె సుఖించగలదు.
ఆయన ఆమె కొంటె చిరునవ్వుని యింకా అలానే చూస్తూ కూచున్నారు. ‘ఏటండి బాబుగారు! నాకే సలా చూస్తారు?” అంది ఆమె.
“మునుపున్నంత రంగుగా యిపుడు లేనండి.”
వెంటనే ఆయన తనలోకి ముడుచుకుపోయారు. తనమనస్సులో అశ్లీలమయిన భావాలు వుంటాయన్నట్లు ఆమె సూచించినందుకు ఆమెమీద అసహ్యం కలిగింది…
“నీవేపు చూడ్డంలేదు నేను’ అన్నారాయన, గట్టిగా.
దీపం అర్పడం మరిచిపోయాను
అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. గది తలుపులు ఒక్క వూపులో తెరుచుకున్నాయి.
సామాను చెల్లా చెదరై పోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీ మీద నుంచి పల్టీకొట్టింది. రావుగారి గుండె గొంతుకలో అడ్డింది. శక్తి కొద్దీ ఒక మూలకి గెంతి, పిచ్చిగా ఆయన ముష్టి ఆమెని కౌగలించుకున్నారు.
వెంటనే తెలివి తెచ్చుకుని చాలా సిగ్గుపడ్డారు. కాని ఆమె ఆయన చెయ్యిపట్టుకు నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్లారు, గుమ్మం పక్కనున్న మూలకి. కఆమె ఆయనను తీసుకువెళ్లి ఆ మూలలో కూచోబెట్టింది. తనుకూడా దగ్గరగా కూర్చుని చేతులాయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మథన గుతోంది. కాని ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావసరం. అంచేత ఆయన కాదనలేదు.
“సరిగా కూకొని నా సుట్టూ సేతు లేసుకోండి. కాంత ఎచ్చగుంటది పాపం! బాబుగారు ఒణికిపోతున్నారు”.
ఆ మాటలు చాలా వెగటుగా ధ్వనించాయి రావుగారికి.. ఆమె మరీ దగ్గరగా జరిగి ఆయన వొళ్లోకి వాలింది. ఆమె రొమ్ముల బరువు ఆయన మోకాళ్ళమీద అన్చింది.
మోకాళ్లు మరి కాస్త దగ్గరగా ఆయన ముడుచుకొని దీర్ఘంగా అవమానకర మయిన ఆలోచనాపరంపరలో మునిగిపోయారు. ఆమె అలా మాట్టాడుతూనే వుంది.
“ఈ మూల బయం లేదండి. బాబుగారికి సక్కని కూతుళ్లుంటారు యింటికాడ. బాబుగారు ఆరిని తలుసుకుంటున్నారు. మా గుడిసె ఎగిరిపోయుంటది. మా పిల్లలేమైయారో! ఇరుగు పొరుగోళ్లు సూతుంటార్లెండి. మావొడొట్టి ఎదవ. ఎందుకూ పనికిరాడు. చిత్తుగా తాగిపడుంటే గుడిసి ఎగిరిపోతే ఆడికేం తెలుత్తాది? పిల్లలెట్టా వున్నారో యేమో?”
ఒక మానవ హృదయంలోనించి వెలువడిన యీ వేదన విటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్ని మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆ ముష్టి ఆమెను గట్టిగా దగ్గరగా అదుముకున్నారు. ఆయన ఆవేదన తనకు అర్థమైనట్టు ఆయన మోకాళ్లమీద మెల్లగా తట్టింది. క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానేసింది. గాలిచేసే అంతులేని గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. ఆయన కాళ్లమీద గుండెలమీద ఆనుకున్న మానవ శరీరపు వెచ్చదనం వొక్కటే ఆయనకు గుర్తుంది.
కాలం అతిమెల్లగా జరుగుతోంది, కాని ఆ సంగతి ఆయనకు తెలియదు. గాలివాన బలం హెచ్చింది. అన్ని పక్కలనించీ పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నై. తెల్లవారేసరికి ఒక చెట్టయినా నిలబడివుంటుందా అనిపిస్తోంది. కొంచెం యించుమించుగా పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కాని గాలి వల్ల వాన వారిద్దరి నుంచి దూరంగా రెండో పక్కకి పడుతోంది.
కొంతసేపటికి రావుగారి కాళ్లు తిమ్మిరెక్కాయి. పడుకునివున్న ఆ మూర్తి కదలకుండా మెల్లగా ఆయన కాళ్లు కదుపుకున్నారు. మెల్లగా మనస్సు మేలుకుంది. లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశారు. నిద్రలో ఆ ముఖం అమాయకంగా, నిశ్చింతగావుంది. స్వచ్ఛమైన, నిసర్గమయిన ఒక శోభ – ఆ ముఖంలోదివ్యత్వం స్ఫురింప జేసింది.
ఆయనకు మళ్ళీ మెలకువ వచ్చేసరికి వాన తగ్గింది. గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టిఆమె లేచి వెళ్లిపోయింది. గడియారం వేపు చూచుకున్నారు. ఐదుగంటలయింది. లేచి నిలబడ్డారు. మోకాళ్లు పట్టివేశాయి. అనుకోకుండానే జేబులు తడుముకున్నారు.
ఆయనకు స్ఫురించిన మొదటిమాట, ‘దొంగముండ!! కాని ఆమె అల్లా దొంగతనం చేసి ఉంటుందనుకోడం ఆయనకు యిష్టం లేదు. గదిలో నాల్గుమూలలా వెతికారు.గడిచిన రాత్రి కంగారులో ఎక్కడన్నా పడిపోయిందనుకున్నారు. గదిలోనుంచి బయటికి వచ్చారు. బయట దృశ్యం బీభత్సంగా వుంది. ప్లాట్ ఫారం తప్ప చుట్టుపక్కలంతా నీటిమయం. కొందరు దూరంగా రైలుగట్టు వెంబడి నడిచివస్తున్నారు. బహుశా వూళ్ళోనుంచి అయివుంటుంది. కొందరు దెబ్బలు తిన్న వాళ్లు స్టేషను రెండో పక్కన కింద పడుకుని వున్నారు. దూరాన్నుంచి చూసి ఆయన మొగం తిప్పుకున్నారు. ఏదో హాస్పిటల్ లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టినప్పుడు తప్ప, అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయనపుడూ చూడలేదు. ఆయనకు వికారం వచ్చింది, వెనక్కు తిరిగారు.
టిక్కెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది. గదితలుపులు ఎక్కడా కనబడ్డంలేదు. లోపల ఏవొ కుర్చీలూ, బల్లలూ, చిందర వందరగా పడిపోయి వున్నాయి. వెయిటింగు రూము కూలిపోతే ఏమైయుండునని ఆయన అనుకున్నారు. ఆ కల్లోలాన్ని శూన్యంగా చూస్తూ ఆయన నిలబడిపోయారు.
లోపలి చీకటికి కళ్ళు కాస్త అలవాటు పడ్డాక ఆ సామానుకింద ఏదో శరీరం అస్పష్టంగా ఆనింది. దీపంవేసి చూశారు. ముష్టియామె. –
ఆయన తట్టుకోలేక పోయారు. వంగి నుదురు తాకి చూచారు. చల్లగా చచ్చిపోయివుంది. చేతులు రెండూ యివతలకు వున్నాయి. క్రింది భాగం పూర్తిగా నలిగిపోయినట్టుంది. ఒకచేతిలో ఆయన పర్సుంది. రెండో చేతిలో కొన్ని నోట్లు, కొంత చిల్లరావుంది. బహుశా టిక్కట్లు అమ్మిన డబ్బై వుంటుంది. గుమస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి రాత్రి తొందరగా యింటికి పోయుంటాడు.
రావుగారు ఆకస్మాతుగా చిన్నపిల్లవాడివలె ఏడుపు ప్రారంభించారు. చల్లని ఆ నుదురు ముద్దుపెట్టుకున్నారు. గడచిన రాత్రి ప్రతి చిన్న విషయం ఆయనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. తనకు ఆత్మ స్థైర్యాన్ని, శాంతిని, గాలివానకు తట్టుకోగల శక్తినీ చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడిపోయివుంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపోయింది..! ఆయన హృదయం తుపానులో సముద్రంలాగా ఆవేదనతో పొంగిపొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు ఆయనకు అనిపించింది. తన పర్సు దొంగిలించినందుకు గాని, అంత గాలివానలో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చునని టిక్కెట్ల గదిలోకి వెళ్లినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు.
ఆమె ఆఖరుతత్వం ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆమె చిలిపి కొంటెతనాలు ఆయనకు ప్రేమ పాత్రాలయాయి. ఆయనలో ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవతత్వాన్ని ఈ జీవి వికసింపజేసింది. ఆయన భార్యగాని ఆయన పిల్లలలో ఎవరుగానీ ! ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు.
ఆయన విలువలు, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం అన్నీ త్యజిస్తా డాయన, ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే.
అవతల మనుష్యులు వస్తున్న సవ్వడి వినిపించింది. రావుగారు కళ్లు తుడుచుకొని ఒక క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ళ సందులోంచి డబ్బుతీసి తెరచివున్న డ్రాయరులోవేసి డ్రాయరు మూశారు. కాని తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయనకు మనస్సు వొప్పలేదు. తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయనకు అనిపించింది. కాని యితరులు ఆమె దొంగతనం చేసిందని అనుకుంటే ఆయన భరించలేరు. అంచేత జాగ్రత్తగా ఆ పర్సులో నుంచి తన పేరుగల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కణ్ణించి వెళ్లిపోయారు.