‘చిలుకంబడు దధికైవడి’ అనే కథకు మూలం, రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ, ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
ఈ కథను ప్రముఖ కథా రచయిత శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు ఈ ఎపిసోడ్ లో సమీక్షిస్తారు.
వారికి కృతజ్ఞతలు.
ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు.
ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు. ‘కంబ రామాయణం’ విస్తృతంగా అధ్యయనం చేసి, అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వేలాది విద్యార్థులను తన ఉపన్యాసాలతో అపరిమితంగా ప్రభావితం చేసి, వారిని సాహిత్యం వైపు మళ్ళించారు. తమిళ సాహితీ విమర్శకుడిగా కూడా ఎంతో పేరు గడించిన ప్రొఫెసర్ జేసుదాసన్ 2002 వ సంవత్సరంలో మరణించారు.
రామాయణంలోని సీతారాముల మధ్య వియోగాన్ని కంబ రామాయణం లోని పద్యాల ద్వారా మనకు వివరిస్తూ, వర్ణిస్తూ, తద్వారా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది.
*ఈ కథలో ప్రస్తావించబడ్డ పద్యాలు పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారు తెనిగించిన ‘కంబ రామాయణం’ లోనివి.
‘చిలుకంబడు దధికైవడి’ -
“నువ్విక్కడుండి చేసేదేవుంది? బండెక్కు!” అన్నాడు కుమార్, ప్రొఫెసర్ని సభకు తీసుక రావడానికి బయలుదేరుతూ.
“అరుణ కూడా వస్తానంది! ఆమె కోసం చూస్తున్నాను” అంటూ నసిగాను.
“బావుంది.ఎదురెళ్ళి హారతి ఇస్తావా ఏంటి? భార్య, అంటే ‘ప్రేమ’ ఉండాలి కానీ ‘ఇంత’ అవసరం లేదేమో?” అంటూ వాన్ తలుపు తెరిచాడు కుమార్.
“ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు, ప్రొఫెసర్ మాంఛి ఊపులో ఉంటాడు. అపుడు ఆయన మాట్లాడుతూంటే వినడం ఓ గొప్ప అనుభవం. నువ్వావకాశం కోల్పోడం నాకిష్టం లేదు. చూస్తావుగా? ” అన్నాడు బండి నడుపుతూ కుమార్.
“ వాళ్ళావిడ కూడా హల్లెలూయా అనుకుంటూ పక్కనే వుంటారేమో” అన్నా నేను.
“లేదు…లేదు. ఆవిడ స్టీఫెన్ కార్లో వస్తున్నారు. వాన్లో ఎక్కితే కళ్ళు తిరుగుతాయంది. సరే అంబాసిడర్ లో రండి, దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పాను. ప్రొఫెసర్ తో మాట్లాడేటప్పుడు మటుకు - సంభాషణని తెలివిగా కంబ రామాయణం మీదికి మళ్ళించే బాధ్యత నీదే! మధ్యలో పొరపాటున బైబిలని కానీ ప్రభువా! అని కానీ అన్నావో… అంతా వేరే దార్లో కెళ్ళిపోతుంది.” నింపాదిగా చెప్పుకుపోతున్నాడు కుమార్.
“ఇప్పుడు మూడేగా. సభ మొదలయ్యేది ఆరుగంటలకు కదా?” అన్నాను.
“నన్నడిగితే ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటాను. కాలాలు, వాటికి సంబంధించిన పరిమితులు.. వీటన్నిటికీ అతీతుడు ఆయన. ఇది పొద్దునా, రాత్రా, అనే స్పృహ కొంచెం కూడా ఉండదు. ఈ పాటికే ఊళ్ళో వుండే దిక్కుమాలిన సంతంతా ఆయన చుట్టూ చేరి, పోచుకోలు కబుర్లలో దింపేసుంటారు. ఈ మహాత్ముడు చిన్న పిల్లాడిలా వాళ్ళకు తన చెవులు అప్పగించి, వింటూ ఉంటాడు. వెళ్ళగానే ఆయనకు స్నానం చేయించి, లాల్చీ, పంచె తగిలించి, తీసుకవెళ్ళాల్సి ఉంటుంది.”
“స్నానం కూడా చేయించాలా?” నవ్వాను నేను.
“అలానే ఉండబోయేట్టుంది!”
కారు పున్నైవనం దగ్గర, కుడివైపుకు తిరిగింది.
”సజిన్ కి ఒక పని అంటగట్టి, నీ మీద గురి కుదరాలంటే, నువ్వీ పని పూర్తి చేయాలి! అని చెప్పి మరీ వచ్చాను.” అన్నాడు కుమార్.
“అతనికి ఈ రోజు కాలేజీ లేదా?”
“ వుంది. కానీ నాకు అసలు విషయం అకస్మాత్తుగా నిన్న రాత్రి గుర్తుకొచ్చింది. మన వల్ల అయ్యే పని కాదు! అందుకని అప్పటికప్పుడు అతనికి ఫోన్ చేసాను. పొద్దున్నే ఎనిమిదిన్నర కల్లా తయారై , మా ఇంటి దగ్గరికొచ్చేసాడు. మరీ అంత పెందరాడే వచ్చేసేటప్పటికీ, మా అక్కా వాళ్ళింటికి వేరే ఏదో చిన్న పని మీద పంపించి, అది అయింతర్వాత సభ దగ్గరికి రమ్మన్నాను. అవడానికి అరవ పంతులు అయినా, పనిమంతుడే, చూద్దాం! ఏం చేస్తాడో?”
****************
ఆయన ఇంటికి వెళ్లేసరికి మేము అనుకున్నట్టే, ప్రొఫెసర్ కేవలం పంచ మాత్రమే కట్టుకుని, నింపాదిగా వరండాలో కూచుని వున్నాడు. పాలిపోయిన తెలుపు, చిన్నపాటి ఆకారం ఆయనది. దేనికో పగలబడి నవ్వుతున్నాడు.
ఒంటిమీద చొక్కా లేకుండా, ఉన్న ఒక నల్లటి మనిషి, ఆయనకెదురుగా ఉన్న స్థంభానికి అనుకుని నిలబడి గొంతెత్తి అభినయిస్తున్నాడు, “రేయ్ ఉన్న చోటి నించీ కదలొద్దు, నీటి పాము ఉంది పక్కనే! అనంగానే, ఆ పిల్లోడు నా మాట పూర్తిగా వినకుండా వెంటనే కొబ్బరి చెట్టెక్కేసి, ‘అన్నా! అన్నా!’ అని ఆపకుండా కేకలు పెట్టాడు. రేయ్! చూస్కో, పాములు కొబ్బరి చెట్లు తేలిగ్గా ఎక్కేస్తాయి అన్నా! వాడు ‘ఏసు ప్రభువా! ఏసు ప్రభువా! అని ఆపకుండా అరిచెయ్యడం మొదలెట్టాడు.”
మేము రావడం గమనించి మాటలాపేసాడు ఆ నల్లటి మనిషి.
“కుమారూ! నువ్వేమిటి? ఇలా వచ్చావు?” అన్నాడు ప్రొఫెసర్ మమ్మల్నిద్దర్నీ చూస్తూ. “పిల్లలెలా వున్నారు? వీడు చెప్పింది విన్నావా? పాము ఈత చెట్టు ఎక్కగలదట. కల్లు కూడా తీస్తుందేమో? హ్హ హ హ్హ” నవ్వాడాయన.
“చెప్పానా! ఏవీ గుర్తు ఉండదు ఈయనకు!” నా చెవిలో గుసగుస లాడాడు కుమార్.
“ఏం సార్! బయలుదేరడానికి తయారా?” అడిగాడు కొంచెం బిగ్గరగా ఆయన్నుద్దేశించి కుమార్.
“అయ్యో! మర్చే పోయాను.” అన్నాడు హడావుడి పడుతూ ప్రొఫెసర్. “ ఈ రోజు ఆదివారం అని నాకు గుర్తే లేదు. చూడు! చర్చి కెళ్ళే రోజులు గూడా మర్చిపోయే వయసు వచ్చేసింది.”
“ఈ రోజు ఆదివారం కాదు!”అన్నాడు కుమార్ కొంచెం అసహనంగా.
“ఆదివారం కాదా!”అడిగాడు ప్రొఫెసర్ అనుమానంగా. “ఓహ్ జ్ఞానరాజ్ కూతురు పెళ్ళి కదా!” అన్నాడు ఏదో నిర్థారించుకున్నట్టు, పేలవమైన స్వరంతో.
“అది కూడా తప్పే. ఆ పెళ్ళి చైత్ర మాసంలో. ఇది మాఘ మాసం.” అన్నాడు కుమార్ కూచుంటూ.
నేను గూడా అరుగు మీద తిష్ట వేసాను. ప్రొఫెసర్ నా వైపు ప్రేమగా చూసిన చూపుతో, నన్ను ఇంకెవరో అనుకుని పొరబడ్తున్నారని నా కర్థం అయ్యింది.
“పాస్టర్! మీరెప్పుడు వచ్చారు?” అడిగాడాయన నన్ను చూస్తూ.
వచ్చే నవ్వుని పెదాల దగ్గర ఆపాను.
కుమార్ మధ్యలో కలగజేసుకుంటూ “ఈరోజు సాయంత్రం ‘కుమారి మండ్రమ్’ వాళ్ళ వార్షికోత్సవం. మీరు బయల్దేరాల్సింది, అక్కడికి”.
ప్రొఫెసర్ మొహం ఒక్క వెలుగు వెలిగింది. “అదీ అసలు విషయం!” అని, విప్పారిన మొహంతో నవ్వుతూ, “డైసీ వెడుతూ వెడుతూ చెప్పింది. అయితే ఏం చెప్పిందో మర్చే పోయాను కుమారూ!” అన్నాడు.
ఆయన కళ్ళు మళ్ళీ నా వైపు తిరిగాయి. “ఇతను జెయమోహన్. రచయిత” అని ప్రొఫెసరుకి గుర్తు చేసాడు కుమార్.
ఒక్కసారిగా దగ్గరికొచ్చి ప్రొఫెసర్ నా చేతులు ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. “అరే నిన్ననే, ‘మాదన్ మోక్షం’ చదివాను. కథంటే అలా ఉండాలి. అదో అద్భుతం! కుమారూ, నువ్వు చదివావా?”
“చదివాను” అన్నాడు కుమార్. “మీరింకా స్నానం కూడా చెయ్యలేదు. ముందు మీరెళ్ళి స్నానం చెయ్యండి. అస్సలు సమయం లేదు”
ప్రొఫెసర్ మనవరాలు తలుపు చాటు నించి, తల బయటకు పెట్టి, చూసింది.
“స్నానానికి వేణ్ణీళ్ళు ఉన్నాయామ్మా?” అడిగాడు కుమార్.
“ఎవరూ చెప్పందే?” అందామ్మాయి.
“ఆ సంగతి కొంచెం చూడమ్మా! తొందరగా బయలుదేరాలి.”
ఆ అమ్మాయి లోపలికెళ్ళగానే, చొక్కా లేని ఆ నల్లటి మనిషి మళ్ళీ ప్రొఫెసర్ తో సంభాషణ ప్రారంభించాడు. “అసలు తమాషా ఏందంటే, అది పామే కాదు, తెల్సా మీకు?”
“మరి?” అడిగాడు ప్రొఫెసర్ ఆసక్తిగా.
“రేయ్ పనేం లేదా! ఫో ఇక్కణ్ణించీ” కుమార్ ఆ మనిషిని అదిలించాడు.
‘వెడుతున్నా!’ అని ప్రొఫెసర్ కు చూపుల్తోనే చెప్పి వెంటనే పలాయనం చిత్తగించాడు అతను.
“సభ ఎక్కడ జరుగుతోంది? కుమారూ!” అడిగాడు ప్రొఫెసర్.
“అసిసి స్కూల్లో, మన జిల్లాకు చెందిన రచయితలు అందరూ వొస్తున్నారు. పచ్చయిమలై అందరికీ సన్మానాలు ఏర్పాటు చేసాడు.”
“దానికి, నేనెందుకు?” అన్నాడు కిసుక్కున నవ్వుతూ ప్రొఫెసర్.
“అక్కడికొచ్చే రచయితల్లో దాదాపుగా అందరూ మీ శిష్యరికం చేసినవాళ్ళే. మీరే ఆ సభకి ముఖ్య అతిథి” అని అందించాను నేను.
సమాధానంగా నవ్విన నవ్వుకి, పొరబోయింది ప్రొఫెసర్ కి.
“చూడు కుమారూ! రచయితలను తయారు చేయడం అంటే మాటలు కాదు. గుర్తుపెట్టుకో!” అంటూ మళ్ళీ పగలబడి నవ్వాడాయన.
ఇంక ఆయన్ని కంబన్ వైపు మళ్ళిద్దామని, ఏ పద్యం గురించి మాట్లాడాలో ముందు మననం చేసుకున్నాను.
“నిన్న కంబ రామాయణంలో ఒక పద్యం చదువుతున్నప్పుడు, మీరే గుర్తొచ్చారు” అన్నాను.
ఒక్కసారిగా ఆయన ముఖాన్ని ప్రశాంతత ఆవరించింది. “కంబ రామాయణమా? నిన్నే చదివావా? ఆ కావ్యాన్ని తాకే అదృష్టం కలగాలన్నా, ఆ మహాకవే ప్రేరేపించాలి. మనం రామాయణం గురించి మాట్లాడటం మొదలెట్టగానే ఆయన మన మధ్యకే వచ్చి కూర్చోడం నా కళ్ళకు కనపడుతోంది. కంబన్ మహాకవి చిరంజీవి. ఆయన మనలో ఒకడిగా ఈ భూమి మీద తిరగడం మానవాళి చేసుకున్న గొప్ప పుణ్యం.” అంటూ తన మూసివున్న కళ్ళు తెరిచి కనుబొమ్మలు పైకెత్తి నన్నడిగాడాయన, “ఏ పద్యం?”
పద్యం చదివాను.
తేll చిలుకంబడు దధికై వడి, గలతనొంది, యెడను తడలబడు ప్రాణంబులింద్రియంబులు, గందనగు పైత్యమును వియోగంపు వంత, యెంతకలదో లెక్కగ వచియింపనగునె.
“నువ్వలా చదివేయకూడదు. రాగయుక్తంగా పాడాలి. మంద్రంలో… ఆభేరి రాగంలో పాడాలి!” ప్రొఫెసర్ చేతులూపుతూ అభినయిస్తున్నాడు. వయసు పైబడడం వల్ల వదులైపోయిన ఆయన మొహంలోని కండరాలన్నీ, ఒకింత ఆవేశంతో కదులుతున్నాయి.
“ఏవంటున్నాడో చూసావా? ‘వియోగంపువంత’... వియోగం వల్ల జనించిన విషాదం! అసలు, మనిషి జన్మ కంటే, పెద్ద విషాదం ఉంటుందా? మనిషి ఒంటరి కాదు. ప్రతి మనిషి జీవితం ఇంకో మనిషితో ముడిపడి ఉంటుంది. వాడిది ఇంకోడి జీవితంతో ! శరీరానికి, తగిలించబడ్డ కాళ్ళు, వేళ్ళు, చేతులూ వీటిలాగే, ప్రతి మనిషి, సమస్త మానవాళి తో అనుసంధానం అయి ఉంటాడు. ఆ మహా సముద్రం నించి ఒక నీటి బిందువు విడివడడాన్నే, మనం వియోగం అంటాం. జీవన్మరణాలు రెండూ వేరు కాదు. ఒకటే! ప్రతి వియోగం ఒక మరణం లాంటిది!”
వృద్ధాప్యం వల్ల వచ్చిన వణుకు మాయమై, దాని స్థానే వచ్చిన ఉద్వేగం, ఆయన గొంతులో స్పష్టంగా కనపడుతోంది. స్వరం కొంత హెచ్చింది. పైస్థాయిలో నాజూగ్గా మారిపోయే, శ్రావ్యమైన గొంతు ఆయనది.
“ యెంతకలదో లెక్కగ వచియింపనగునె? అని అడుగుతున్నాడు మహా కవి. మనిషి పడే వెతలను లెక్కించగలమా? ఎన్నో రకాల వ్యధలు. బతికే ప్రతి నిమిషమూ బాధాతప్తమేగా ? అస్తిత్వాలు వేరు వేరైనా దేని వేదన దానిదే. దూరాన్ని కొలవొచ్చు, బాధను కొలవగలమా?” అంటూ కళ్ళు మూసుకుని, “ఓ ప్రభూ! అంతుతెలీని యాతనలో మమ్మల్ని ఓలలాడించి, ఆత్మ శుద్ధి కావించి, నీ చేరికనిస్తావు! నా వేదనంతా నీ దీవెనే కదా !” ప్రార్థించాడు ప్రొఫెసర్.
కొంచెం జాగ్రత్తగా సంభాషణను, మళ్ళీ దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసాను - “చిలుకంబడు దధికైవడి ప్రాణంబులింద్రియంబులు, సీతకు దూరమైన రాముడి ప్రాణం, ఆయన పంచేద్రియాలూ, కవ్వంతో చిలుకబడ్డ చల్ల లాగా మధించ బడుతున్నాయని చెబుతున్నాడు,కవి. నాకు అంతమటుకు అర్థం అయ్యింది. కానీ ‘తడలబడు’ అన్న పదం అక్కడ ఎందుకు వాడాడు?” అడిగాను.
“కంబన్ ఒక మహాకవి. మహా కవులు పసి పిల్లల్లాంటి వారు. వాళ్ళకు తమ మేధస్సును వుపయోగించి రాయాల్సిన అవసరం ఉండదు. మనో నేత్రం ముందు ఆవిష్కరింపబడ్డ దృశ్యాన్ని మాటల్లో పెడతారు. కంబన్ సాక్షాత్ సరస్వతీ స్వరూపం. ఆమె ఆయనతో పలికించిన పలుకులివి. ‘తడలబడు’, అంటే అలలా ముందుకూ వెనక్కీ వెళ్ళడం!”
ఒక్క సారి పైకి లేచి నిలబడి, తన చేతులను కవ్వం చిలుకుతున్నట్టు కదుపుతూ, “ఇది అర్థం కావాలంటే, ఆ దృశ్యాన్ని మనం పూర్తిగా కళ్ళ ముందు ఊహించుకోవాలి. ‘కవ్వం, కుండలోని చల్లను చిలుకుతోంది. కుండ - శరీరం. కవ్వం అంటే మనో వేదన. చల్ల - జీవితం. వేదన అనేది జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. చిలకబడుతున్నప్పుడు చల్ల అవస్థను ఎప్పుడయినా గమనించావా? ఒక చివరను చేరుకొని, నురగతో సహా పైకి లేస్తుంది. ఏ క్షణం లోనైనా ఎగిరి బయటకు వచ్చి పడుతుందేమో… అనిపిస్తుంది. కవ్వం మళ్ళీ వెనకకు తిరగడం మొదలై చల్ల మరో వైపుకు మళ్ళుతుంది. మళ్ళీ ఆ వైపు అదే పరిస్థితి! ఇలా ఆయాస పడుతూ పడుతూ, లేస్తూ, ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా నానా యాతనకూ గురవుతుంది. మన జీవితాలూ అంతే కదా. నిరంతర బాధా మయం. అదైనా, ఇదైనా.. అటైనా, ఇటైనా. .. చావనీక, బతకనీక ..’ - దీని గురించే ఆ మహాకవి మాట్లాడటం!” అన్నాడు ప్రొఫెసర్.
నేను ఆయన చెప్పేదంతా వూహించుకుంటున్నాను.
“కంబన్ అక్కడితో ఆగిపోలేదు. ఆయన పరిశీలన చాలా లోతైనది. అసలు, దీని ముందరి పద్యం గమనించావా?” ప్రొఫెసర్ కొనసాగించాడు.
నాకు ఆ పద్యం గుర్తుకు రాలేదు.
“రేయ్ కుమారూ! నువ్వు పాడు” అన్నాడాయన.
“నాకు గ్యాపకం లేదు” అన్నాడు కుమార్ సిగ్గుతో, తలవంచుకుని నవ్వుతూ.
“అప్పుడెలావున్నావో ఇప్పుడూ అలానే ఏడిశావు…నిన్నెవరు బాగు చెయ్యగలరు? ఏం చదివావో… ఎలా బయట పడ్డావో…” అన్నాడు ప్రొఫెసర్.
ఆయనే మళ్ళీ మొదలుపెట్టాడు. “ నువ్వు చెప్పిన పద్యం ముందు పద్యాన్ని ‘ఎరుక కలదు రాఘవోర్వి పతికి’ అని ముగిస్తాడు. చల్లను చిలికితే వచ్చేది వెన్న అయితే, వేదనతో చిలకబడ్డ వాడికి లభించేది ‘ఎరుక’... అంటే జ్ఞానం. పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిందేమిటి? అమృతం. అంటే మోక్షం. అదే నేనిందాక చెప్పింది. ఆ ప్రభువును చేరుకునే మార్గం ఒకటే… ఆయనిచ్చే వేదనను అంగీకరించి, భరించడం.’ - రేయ్, కుమారూ! ఇకనైనా చర్చికి రావడం మొదలుపెట్టు”
“అవునవును. ఇంక రావాలి!” అన్నాడు కుమార్.
“చాలా సంతోషం. అసలు చర్చికొచ్చే మొహమేనా ఇది. సరేలే, నేను మటుకు చెయ్యగలిగింది ఏముంది?”
ఈ లోపల ఆయన మనవరాలు వొచ్చి “వేణ్ణీళ్ళు తయారు!” అని ప్రకటించింది.
“స్నానం చేసి వస్తాను.” అన్నాడు ప్రొఫెసర్.
కుమార్ ఆయన మనవరాలితో “ఆయన లాల్చీ, పంచె కొంచెం తీసి పెడతావా… ఈయన్ను ఫంక్షన్కి తీసుకెళ్ళాలి!”. అన్నాడు.
“రేయ్, అక్కడ మనవాళ్ళందరూ వుంటారుగా!” అడిగాడాయన.
“ఆ.. ఆ.. కార్లోస్, పెరుమాళ్ అందరూ వుంటారు” జవాబిచ్చాడు కుమార్.
“ రాజం….రాజం వస్తున్నాడా?” అడిగాడాయన.
కుమార్ వెంటనే బదులివ్వలేదు. ఎక్కడో ఆలోచిస్తూ, “ఆ.. ఉంటాడు!” అన్నాడు.
“వాణ్ణి చూడాలనుందిరా, కుమారూ! కిందటి వారం ఒక కలొచ్చింది, వాడికి ఏదో బహుమతి వచ్చినట్టు. కవిత్వానికో, నవలకో గుర్తు రావడం లేదు. బహుమతి ఇస్తున్న మనిషి మటుకు నెహ్రు గారే!”
“నెహ్రూ వచ్చాడా?” నవ్వాను నేను.
“కలలోనే కదా! అయినా, నాలాగా ఖాదీ వేసుకునే వాళ్ళ కలల్లో తప్ప నెహ్రూ ఇంకెక్కడ కనబడుతున్నాడు ? ‘మన రాజం, ధగ ధగ లాడే తెల్ల లాల్చీ వేసుకుని, స్టయిలు గా నడుచుకుంటూ వెళ్ళి, నెహ్రూ గారి దగ్గర బహుమతి తీసుకుని, ‘ధన్యవాదాలు’ అని మైకులో చెప్పాడు. మైకులో నా పేరు కూడా చెప్పాడు. ‘రేయ్… కుమార పిళ్ళై, కుమార పిళ్ళై గారిని మర్చిపోవద్దు’అని నేను కింద నించి అరుస్తున్నాను. కానీ వాడు వినిపించుకోవడం లేదు. అక్కడుండే మిగతా వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. ఈ లోపల నాకు మెలకువ వచ్చేసింది.” నిట్టూర్చాడాయన.
“నిజంగా చూడాలనుందిరా వాణ్ణి! ఈ మధ్య, ఎందుకోగానీ ఇంకెప్పుడూ రాజాన్ని చూడలేనేమో, అన్న బాధ మొదలైంది!”
“మీరు స్నానానికి వెళ్ళండి. ఆట్టే సమయం లేదు సభ మొదలౌడానికిక” అని తొందరపెట్టాడు కుమార్.
“రెండు నిమిషాల్లో వచ్చేస్తా!” అని చెప్పి లోపలికెళ్ళాడాయన.
“ఈయనఈ నడుమ, రాజం గురించి ఒకటే అడుగుతున్నాడు. రాజం ఈయన కలల్లోకి రావడం కూడా ఎక్కువైంది” అన్నాడు కుమార్ నాతో.
“ఎందువల్ల?” అడిగాను నేను.
“ఎందువల్ల, ఏవిటి? గొర్రె పిల్ల దారి తప్పితే, కాపరికి వేరే ధ్యాస ఏవుంటుంది?”
నవ్వాను నేను.
“కిందటి వారం, రామస్వామి గారి అమ్మాయి పెళ్ళి విందులో, రాజం కనపడ్డాడు ఈనకి! నేను కూడా పక్కనే వున్నాను. మేము రోడ్డు మీది కెక్కుతూంటే కనబడ్డాడు రాజం. అతన్ని ప్రొఫెసరే ముందు చూసారు, నేను చూడలేదు. “మన రాజం కదూ?” అని అడిగాడు ఈయన నన్ను. ప్రొఫెసర్ ఎదురు పడతాడని రాజం ఊహించి వుండడు. అతని చొక్కా మాసిపోయి వుంది. తైల సంస్కారం లేని జుట్టు. కట్టయాన్విలై గోపాలన్ తో వెళ్ళి పూటుగా తాగి, ఎక్కడో రోడ్డు మీద పడి పోయాడు. అప్పుడే తెలివొచ్చి, అటువైపే నడుచుకుంటూ వొస్తున్నారు ఇద్దరూ. “రాజం, ఏరా అబ్బాయ్! నువ్వేనా అదీ?” అడిగాడు ప్రొఫెసర్. అంతే! రాజాం నేల మీద గొంతుకు కూర్చుని, తల వొంచి రెండు చేతుల మధ్యలో పెట్టేసాడు. ఇంకా పూర్తిగా దిగినట్టులేదు. గోపాలన్ మటుకు ‘ ఇంకో చిన్న పెగ్గు విస్కీ!’ అంటూ గొణుగుతూనే నిలబడి వున్నాడు. ఇంకో పక్క రాజం కట్టలు తెంచుకుని ఏడవడం మొదలెట్టాడు. ఎలాగోలా అతి కష్టం మీద ప్రొఫెసర్ని కార్లో ఎక్కించాను. ‘ “రేయ్! వాణ్ణి ఆసుపత్రికి తీసుకుపోదాం, వాడికి ఒంట్లో బాగాలేదు!” అని ఈయన దారంతా ఒకటే గొడవ. తాగుబోతులతో ఈయనకి పెద్ద పరిచయాలు లేవు. అసలు ఒక మనిషి ఒళ్ళు తెలీనంత తాగగలడనేది… ఈయన ఊహకే అందని విషయం. “
“ రాజం అన్న తాగుతాడని, ఊరంతా తెలుసుగా?” అడిగాను నేను.
“ఆ! ప్రొఫెసర్ కు కూడా రాజం ఇరవై ఐదు ఏళ్ళ నించీ తెలుసు. కానీ ఇలా, ఇంత ఘోరంగా తయారయ్యాడని తెలీదు. అదీ విషయం! ప్రొఫెసర్ కళ్ళ ముందే రాజం చేజారి పోవడం మొదలైంది. అతన్ని కాపాడాలని ఈయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆఖరికి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి బతిమాలడానికి కూడా తయారయ్యాడు ఈయన.”
“ఏ అమ్మాయి?”
“ఆ అమ్మాయి విషయం ఇప్పుడెందుకులే?”
“చెప్తే ఇప్పుడొచ్చే నష్టం ఏవుంది?”
నేరుగా సమాధానం చెప్పకుండా “అందుకే సజిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఏదో కొంచెమైనా సంస్కరించి, రాజంని ఆయన ముందు నిలబెడదాం, అనుకున్నాను. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రాజంకి, ఓ లార్జ్ గూడా పోయించమని చెప్పాను సజిన్ కి .” అన్నాడు కుమార్.
“అరె! అదేవిటి?”
“ రోజంతా అస్సలు ఏవీ పడకపోతే, నించోను కూడా నిల్చోలేడు గురుడు. మూడు గంటలకు ఒక పెగ్గు వేసుకుంటే, ఐదు గంటలకల్లా మామూలు మనిషైపోతాడు. అప్పుడు రామస్వామి ఇంటికి ఎలాగోలా పట్టుకెళ్ళి, కొంచెం తయారు చేసి తీసుకొచ్చి, ప్రొఫెసర్ ముందు నిలబెట్టాలని నా ఆలోచన. దాంతో మన పని పూర్తయ్యినట్టు. రామస్వామి ఇంట్లో ఇస్త్రీ చేసిన బట్టలు కూడా పెట్టి వుంచాను.”
“నీ శిష్యుడేగా సజిన్. ఆ మాత్రం నెగ్గుకొస్తాడులే.. …”
“తెలివైనోడే. కానీ ఏ పుస్తకం చదవమని చేతికిచ్చినా, సజిన్ సగం చదివి వదిలేస్తాడు. ఒక్కో సారి తిక్క పుట్టి అరిచెయ్యాలనిపిస్తుంది”
“అది సరే.. రాజం మీ క్లాసే అనుకుంటా కదా?”
“ఊహూ… ఒక సంవత్సరం సీనియర్. నేను కాలేజీలో చేరిన రోజుల్లో ప్రొఫెసర్ ఎప్పుడూ అతన్ని వదిలిపెట్టి