నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో. కాబట్టి నాకు తెలిసినంత వరకూ తటస్థం గానే రాస్తాను. మా శ్రీధర గాడు మాత్రం దీనికి మినహాయింపని మీకిది వరకే బోధపడిందను కుంటా. వాడో మంచి స్నేహితుడు మరి. ఈ కథ నా ఇంకో స్నేహితుడు సుబ్రహ్మణ్యం గురుంచి.
నేను, సుబ్రహ్మణ్యం మరియు చంద్రశేఖర్ మా వాకాటి కాలేజీ వుండే విద్యానగర్ అనే పల్లెకి ఎక్కువ, పంచాయితీకి తక్కువ లాటి ఊర్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరపు కాలంలో రూమ్ మేట్స్ మి. ఆ వూర్లో పేరుమోసిన ఆర్ట్స్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటంతో రూమ్స్ కి డిమాండ్ ఎక్కువే. ఆ ఊరి మోడల్ హై స్కూల్ లో పని చేసే గరటయ్య అనే లెక్కల మాస్టారు, కోటలో పని చేసే మా బావకి స్నేహితుడు కావటం మూలాన, మా బావ కోరికతో, ఆ మాస్టారు మాకు రూమ్ అని ఏకోశానా గుర్తింప మనస్కరించని ఓ సగం కూలి వంగిపోయిన కప్పుగల ఒక పూరి గుడిసె చూపించి పుణ్యం మూటకట్టుకున్నారు. మరి మేము ముగ్గురము ఎలా రూమ్ మేట్స్ మి అయ్యామంటే, చంద్రశేఖర్ గరటయ్య మాస్టారి ప్రియ శిష్యుడు మరియు మా సుబ్రహ్మణ్యం యొక్క చెడ్డీ మిత్రుడు, నన్ను గరటయ్య మాస్టారు వీళ్ళతో కలిపాడు. మా చంద్రశేఖరుడు ఇంజనీరింగ్ విద్యార్థి కాదు, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి. మేము ఆ గుడెసెనే దేవాలయంగా ఆ ఓనరమ్మనే దేవత గా కొలిచాము. మరలా అప్పుడప్పుడూ ఆవిడ రూమ్ ని నీట్ గా పెట్టామా లేదా అని ఇన్స్పెక్షన్ కి వచ్చేది. ఆవిడకి మా సుబ్బూ మాట అంటే తెగ గురి, చదుకొని బాగుపడే లక్షణాలు ఉన్నాయని.
కానీ మా సుబ్రమణ్యాన్ని చూసాక అసలు ఒక వ్యక్తి ఇంతలా చదువుతాడా అన్న ప్రశ్నకి సమాధానం ఇప్పటికీ దొరకలా. స్వయం పాకం చేసుకునేవాడు. ఉదయం లేచి స్టవ్ మీద అన్నం పెట్టి, అది అయ్యేలోపల చదువుతూ, చదివినది పలక మీద పర పరా రాస్తూ మొదలెట్టి, మరలా కాలేజీ నుండి వచ్చాక అన్నీ సబ్జెక్టులు, అన్నీ టెక్స్ట్ బుక్కులు, ఆ బుక్కుల్లో అన్నీ పేజీలు చదివేసే వాడు, చదివింది మరలా యధావిధిగా పలక మీద పర పరా రాసేసేవాడు. మా గుడిసెలో ఒకే బల్బ్ హోల్డర్ వుండేది కాబట్టి మా చదువులన్నీ ఒక దగ్గరే. చాలా శ్రద్దగా చదివే సుబ్రహ్మణ్యం అవతలి వాడు చీమని చిటుక్కుమనిపించినా చిరాకు పడిపోయేవాడు. నాకది చాలా వింతగా వుండేది మరియు వాడిని ఇరిటేట్ చేయడానికి సాధనంగానూ కూడా. నేను కూడా అప్పుడప్పుడు కొంచెం పెద్దగా చదువుతూ వాడిని గీరే వాడిని తగువుకి.
సుబ్రహ్మణ్యం నాయుడుపేట మండలంలో ఓజిలి దగ్గరైన అన్నమేడు గ్రామస్థుడు. మొదటి నుండీ అన్నీ తరగతుల్లో ప్రధముడే. వాళ్ళ నాన్నగారు వాడికి ఊహ రాక ముందే గతించడంతో, తన ఇద్దరి పిల్లల్ని వాళ్ళ అమ్మగారు తన రెక్కల కష్టంతో చదివించుకుంటున్నారు. వీడు మూడు వారాలకో లేక నెలకొకసారో సైకిల్ మీదనే వాళ్ళ ఊరెళ్ళి తనకి కావాల్సిన సామగ్రి తెచ్చుకొనే వాడు. వాడి ధ్యాస అంతా చదువే. నాకు మొదటి నుండీ ప్రశ్న-అర్ధకమే, వీడు మా వాకాటి కాలేజీలో ఎలా పడ్డాడురా నాయన శాపవశాత్తూ, ఎక్కడో ఐ.ఐ.టి లో ఉండాల్సినోడు అని. అలా చదవటమే తిండీ నిద్రలాగా భావించే మా సుబ్రహ్మణ్యం మొదటి సంవత్సరంలో మా కాలేజీకి ప్రధముడిగా నిలిచాడు. మా కాలేజీ మా యూనివర్సిటీలో చదువుల్లో మేటి కాబట్టి, మా యూనివర్సిటీకి ప్రథముడు వాడు. మాకూ ఎదో గుర్తింపు యూనివర్సిటీ ప్రధముడి రూమ్ మేట్ గా. కొందరు చదువుల ఔత్సాహికులు వాడితో పాటూ నాతో మాట మంతీ కలిపేవారు, మా సుబ్రహ్మణ్యం రాంక్ యొక్క రహస్యం చెప్పమని. అక్కడ రహస్యమేమీ కనపడలా నాకు అస్సలు సాధ్యం కానీ కఠోర శ్రమ తప్ప.
సుబ్బూ చదువు చూసి ఉత్తేజితుడైన మా చంద్రశేఖరుడు కూడా నా మడత కూడా పడని మరియు కొత్త కరుకులా మిగిలిపోయిన ఇంజనీరింగ్ మెటీరియల్ నాచేతనే తెప్పించుకొని, మా చేత సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఎంసెట్ లో రాంక్ తెచ్చుకొని తదుపరి సంవత్సరం ఇంజినీరింగ్ లో చేరటం మాకు మిగిలిన గొప్ప అనుభూతి. కానీ ఇలా చదివే సుబ్బుని నేను రెండవ సంవత్సరంలో భరించలేక మా శ్రీధరగాడితో కలిసి వేరే రూమ్ కి మారిపోయి ఊపిరిపీల్చుకున్న.
నాకు మా సుబ్బూ మీద మొదటి నుండి చివరి వరకూ ఓ ఫిర్యాదు లేక ఓ మనస్తాపం ఉండేది. మా బోటి వాళ్ళము మాకొచ్చిన అరాకొరా విజ్ఞానంతోనే, ఎవరైనా స్నేహితులొచ్చి ఏమన్నా సందేహాలు అడిగితే, పరీక్షా సమయంలో కూడా, మేము చదివేది పక్కన పెట్టి వాళ్ళ సందేహాల్ని నివృత్తి చేయ ప్రయత్నించే వాళ్ల
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy