చెన్నై లో నివసించే వాళ్ళము మేము 2009 వ సంవత్సరములో. పిల్లలిద్దరూ వెళ్ళాచ్చేరీ లోని నవదిశ మాంటిస్సోరి స్కూల్ లో ఏడూ మరియు ఐదవ తరగతుల్లో చేరారు. ఆరు నెలలు గడిచాకా మా చిన్నది వాళ్ళ తరగతిలో రెండు సమూహాలు ఉన్నాయనీ, ఆ రెండు సమూహాలకి ఎప్పుడూ పడదని, ఒకరు ఎడ్డెము అంటే ఇంకొకరు తెడ్డెమని చెప్పటం మొదలెట్టింది.
కొన్ని రోజుల తర్వాత యీ రెండు సమూహాల మధ్య తనే సమన్వయ కర్తనని, ఆ మరి కొన్ని రోజుల తర్వాత తాను లేక పోతే ఆ సమూహాలు కొట్టుకొనేస్తారు అని డప్పులు కొట్టుకోవటం మొదలెట్టింది. రోజు వినే వాడిని అడిగి తెలుసు కొనేవాడిని వాళ్ళ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తుందో అని, వీలైతే నాలుగు ఉచిత సలహాలు ఇస్తూ.
అప్పటికీ సుప్రియ నన్ను వారిస్తూనే ఉండేది , నీ వెధవ మానేజ్మెంట్ స్కిల్స్ తో దాన్ని చెడగొట్ట మాక అంటూ. ఐన మనం సుప్రియ మాట ఎప్పుడు వింటాం కనుక. అందులోను నేను నా కూతురి అంతర్జాతీయ విషయాలలో.
సరే ఒక సమయం లో మా చిన్నది జ్వరం వల్ల మూడు రోజులు బడికి వెళ్ల లేదు. దానికి, వాళ్ళ రెండు సమూహాలు ఏమయ్యాయో అన్న ఆందోళన, నాకేమో అది బడి నుండి మోసుకొచ్చే కబుర్లు లేక పొద్దుపోవటం లేదు. నాలుగో రోజు అది బడికెళ్తుంటే చెప్పా, “మీ రెండు సమూహాల మధ్య సమస్య తీరిపోయింది, ఆందోళన పడకు” అని. “సమస్యే లేదు, వాళ్ళే మన్నా నువ్వు, మీ స్నేహితుడు అనిల్ మామ అనుకున్నావా, తిట్టుకొని కొట్టుకొని తర్వాత రోజు ఒరే మామ అని పలకరిచ్చుకోవడానికి”, అంటూ వెళ్ళింది బడికి.
సాయంత్రం నేను ఆఫీస్ నుండి రాగానే చాలా గంభీరంగా పుస్తకాలు ముందేసుకుని భీకరంగా చదివేస్తుంది. ఏమ్మా! అంటే, ”నాకు ఎఫ్.ఏ పరీక్షలు నేను చదుకుంటుంటే కనపడటంలా”, అంటూ కయ్ అంది. నేనొదలనుగా, ఏరా! ఏమయ్యారు మీ రెండు సమూహాలు అనడిగా. అది నీరసంగా, “నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పావ్ నాన్న వాళ్ళు కలిసిపోతారని, వాళ్ళు కలవటం, నన్నసలే పట్టించుకు పోవటం” అన్నీ జరిగి పోయాయని గుడ్లనిండా నీరు కుక్కుకుంటూ చెప్పింది.
దాన్నెందుకు లే ఇంకా గిల్లటం అని నేను బాగా చదుకో అమ్మ అంటూ ఫ్రెష్ అవుదామని వెళ్ళిపోయా అక్కడ నుండి. దానికి సందేహం వదలా, మా నాన్నకి ఇంత ఖచ్చితంగా ఎలా తెలిసింది అనీ. రాతిరికి బెడ్ టైం స్టోరీస్ అంటూ వచ్చింది, చిన్నగా మళ్ళి అడిగింది, “ఎలా కనుక్కున్నావు నాన్న” అని .
"సిన్నీ! ఇన్ని రోజులు వాళ్ళ ని కలవ కుండా ఆపింది నువ్వే నని , నువ్వు మూడు రోజులు బడికి వెళ్ళక పోతే వాళ్ళు కలిసిపోతారని", నాకు తెలుసు అని చెప్పా!. అంత ఖచ్చితంగా ఎలా ఊహించావ్ నాన్న అంది ఆశ్చర్యపోతూ.
ఎలా అంటే నువ్వు నా కూతురువి సిన్నీ!, నా నోట్లోంచి ఊడి పడ్డావ్ రా!. నీ నీవన్నీ నా బుద్ధులే నా పనులే అనగానే అది కూడా నన్ను హగ్ చేసుకొని ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేయదుగా అంది. నీకెలా తెలుసురా యీ సామెత అంటే సాయంత్రమే నాన్నమ్మ నిన్నూ నన్నూ కలిపి తిట్టింది నాన్నా! అన్నది. తిట్టనీయరా! ఎవరు తిట్టినా మనం చేలోనే మేసేద్దాం అని నిశ్చయించి హాయిగా గుర్రు కొట్టాం.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy