మా పెద్దమ్మ కూతురి మనవడు అభిరాం. వాడి వయస్సప్పుడు మూడేళ్లు. కొన్నాళ్ళు నేను ప్రాజెక్ట్ పని మీద చెన్నైలో వాళ్ళింట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళదొక డూప్లెక్స్ బాడుగిల్లు. పైన నాకొక బాత్ రూమ్ కూడా కలిసి వుండే పెద్ద రూమ్ ఇచ్చేసారు వాళ్ళు. వాడు ఉదయాన్నే తాతా! కాఫీ తాగుతావా అంటూ వచ్చేసేవాడు. అప్పటి నుండి నేను ఆఫీసుకు వెళ్లే వరకూ నేను వాడితోనే ఆటలు. ఒక రోజు నేను కాఫీ తాగుతుంటే వచ్చి నా బుగ్గ నాకటం మెదలు పెట్టాడు, ఏందిరా !అబ్బీ అంటే నీ బుగ్గకి చక్కెర అంటుకుంది తాతా అని నవ్వటం మొదలెట్టాడు. ఏందబ్బా వీడు ఇలా అంటున్నాడు అని అద్దంలో చూసుకుంటే, నిజమే గెడ్డం నెరవటం మొదలెట్టినది, అక్కడక్కడా చక్కెర అద్దినట్టు. ముసలోడు అయ్యే తొలి లక్షణాలు వాడు ఎంత ముచ్చటగా చెప్పాడో.
నాకో ఛండాలపు ఐ.డి కార్డు ఉండేది. నా ఫోటో ఎంత దరిద్రంగా ఉండేదంటే, ఆ ఫోటో ని చూసి మా అభిరాం రోజు అడిగేవాడు, తాతా ఈ ఫోటో లో ఉండేది ఎవరూ అని, నేనేరా అంటే, ఓహో నువ్వేనా అనే వాడు. మరలా, రెండు మూడు రోజుల తర్వాత అదే ప్రశ్న, వేసేవాడు, తాతా! ఈ ఫోటో లో ఉండేది ఎవడు అని, నేను మరల నేనేరా అనటం, వాడు ఓహో అనటం నిత్యకృత్యమయ్యింది. వాడే నిజం ఒక రోజు మా ఆఫీసులో సెక్యూరిటీ గార్డ్ నన్ను లోపలకి రానివ్వలేదు, నా ఐ.డి నాది కాదంటూ.
అభిరాం బాగా యాక్టీవ్ గా మరియు ఎనర్జిటిక్ గా వుండే వాడు. వాడిని నేను ఆటలకి బయటకి బాగా తీసుకెళ్లే వాడిని. వాడికిష్టమైన ఆట ఫుట్ బాల్. వాడు బంతిని తంతే, అది బులెట్ లాగా దూసు కెళ్ళేది. అలాగే వాడి కొక బుజ్జి సైకిల్ ఉండేది. వాడిని తీసుకొని వాకింగ్ వెళ్ళేవాడిని. వాడు నాతో ట్రైనింగ్ వీల్స్ వున్న ఆ సైకిల్ వేసుకొని బుద్ధిగా వచ్చేవాడు. నేను నడుస్తుంటే నా ముందర మరియు దారికి ఎడమ పక్కన. ఒక రోజు వాడికి చెప్పా! నువ్వు పెద్ద వాడివి అయ్యావు రా, నీ సైకిల్ కి ఇక ట్రైనింగ్ వీల్స్ తీసేస్తా అని. అలాగే తీసేసా. మొదట బాగా భయపడినా రెండో రోజే అలవాటు పడిపోయాడు. వేగంగా కూడా తొక్కటం మొదలెట్టాడు. అలా ఇంకో రెండు రోజులు గడిచాయి. అలవాటు ప్రకారం, ఓ రోజు వాడిని తీసుకొని బయల్దేరా. వాడు చాలా వేగం గా రోడ్ కి అడ్డదిడ్డం గా తొక్కటం మొదలెట్టాడు. అభీ ! ఇలా తొక్కితే నేను ఒప్పుకోను, ఇంటికి పద అని కోపంగా చెప్పా. వాడు అంతే కోపంగా తాతా ! ఏమి నేనేనా చూసుకోవాల్సింద , అవతల వచ్చే వాడు కూడా చూసుకోవాలిగా, వాడే చూసుకుంటాడు లే అంటూ వేగంగా అక్కడ నుండి ఇంకా అడ్డదిడ్డం గా వెళ్లి పోయాడు. హత విధీ ! మనకి ఎవరూ నేర్పక్కర్లేదు రూల్స్ బ్రేక్ చేయటం , అది మన రక్తం లోనే వుంది అనుకుంటూ ఇల్లు చేరా.
అలాగే కొన్నాళ్ల తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద బెంగుళూరు వెళ్లి పోయారు వాళ్ళు. వాడి కబుర్ల కోసం ఫోన్ చేసే వాడిని నేను రెగ్యులర్ గా వాడికి. ఒక రోజు తాతా! నాకు స్పెల్లింగ్ టెస్ట్ అని చెప్పాడు. ఏంటిరా డీటెయిల్స్ చెప్పు అంటే, నేను ఏ ఆల్ఫాబెట్ తో మొదలయ్యే పదిపదాలలో మా మిస్ అడిగే పదానికి స్పెల్లింగ్ చెప్పాలి అన్నాడు. సరే ! పదీ పదాలు నేర్చుకున్నావురా అంటే. తాతా ! పిచ్చోడివి నువ్వు నాది క్లాస్ లో మెదటి పేరు, మా మిస్ నాతో నే మొదలెడుతుంది అందుకే నేను మొదటి పదమే నేర్చుకెళ్తున్న అన్నాడు. ఓరి నీ పాసుగులా నీ తెలివి మాకు లేదయ్యె అని నిట్టూర్చా. తర్వాత రోజు వాడు ఫోన్ చేసి చెప్పాడు, తాతా ! మా మిస్ కి బుర్ర లేదు అని. ఏందిరా! అబ్బయ్య అంటే, నన్ను లాస్ట్ పదమడిగింది అని చెప్పాడు. వాళ్ళమ్మ పదికి నాలుగే మార్కులు వచ్చాయి ఎందుకురా, అనడిగితే వాళ్ళమ్మని ఓదారుస్తాడు! మా క్లాసులో మూడు రెండు వచ్చినోళ్ళు ఇంత మంది వున్నారు అంటూ. నేను కుటుంబాన్ని వొదిలి చెన్నైలో ఉండగలిగానంటే వాడి తోడు చాలా దోహద పడింది.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp