ట్రిగ్గర్
అశోకరాజు సోఫాలో కూచుని కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేసాడు.
‘ ముగ్గురు కాలేజీ పిల్లలు ఓ నగల దుకాణం మీద దాడిచేసి పట్టుబడ్డారని బ్రేకింగ్ న్యూస్ కింద చూపిస్తున్నారు. సంఘటనలో గాయపడ్డ వాచ్ మెన్ చావు బతుకుల్లో వున్నాడు. జరిగిందంతా ఊహించి 3 -డీ యానిమేషన్ సాయంతో, నేపధ్య సంగీతంతో కలిపి ఛానల్ వాళ్ళు ప్రేక్షకులకు అందచేస్తున్నారు. దీనికి అదనంగా స్టూడియోకి వచ్చి కూచున్న మేధావులు ‘నేటి యువత - సినిమాలు’ అనే చర్చా కార్యక్రమంలో ఒళ్ళు మరచి పాల్గొంటున్నారు.
టీవీ ఆఫ్ చేసాడు. కాఫీ గ్లాసు పక్కన బెట్టేసి, బయలుదేరబోతూ భార్యని అడిగాడు, “వీడింకా లేవలేదా?”
“లేదు. అదేదో తాడో, పేడో కొని చేతిలో పెట్టారుగా, రాత్రంతా దాన్ని ముందరేసుకుని కూర్చోనుంటాడు. స్కూల్ బస్ టైం కి అరగంట ముందు లేచి పరిగెడతాడు” అందావిడ.
*****
అన్న, చేతులు అటూ ఇటూ చాపుతూ రకరకాల పోజులు ఇస్తూంటే, తమ్ముడు మొబైల్ తోటి ఫోటోలు తీస్తున్నాడు. గదిలో ఓ మూల బంకర్ మంచం వేసుంది. ఇంకో పక్క పుస్తకాల అలమరలు, వాటి పక్కనే రెండు స్టడీ టేబిల్స్.
చేస్తున్న పని ఆపి “అన్నా నేనూ పట్టుకుంటా. నాకు గూడా ఫోటో తీయవా” అన్నాడు తమ్ముడు.
“నీ చేతి కొద్దు చిన్నా. నాన్న గూడా కింది నించీ వచ్చేస్తూంటారు ఈపాటికి”
చిన్నా మొహం ముడుచుకుని ఫోటో షూటింగ్ మళ్ళీ కంటిన్యూ చేసాడు. అలా ఓ ఐదు నిమిషాలు గడిచింతర్వాత, చెయ్యి కుర్చీకి తగిలి, అన్న చేతిలో ఉన్న తుపాకీ, జారి, బెలూన్ చిట్లినట్టుగా శబ్దం వచ్చింది. మొబైల్ పట్టుకునున్న, చిన్నా కుప్పకూలాడు. మెడ మీంచి రక్తం, సన్నటి ధారగా స్రవించడం మొదలైంది.
పదేళ్ళ తమ్ముణ్ణి ఒళ్ళోకి తీసుకుని చిన్నా! చిన్నా! అని అరవడం మొదలెట్టాడు అన్న. ఏ మాత్రం కదలిక లేదు. కుదిపి కుదిపి అలిసిపోయి, గోడకు చేరగిలబడ్డాడు. కళ్ళు మూతబడ్డాయి. తలమీద కన్నీళ్ళ కుండ ఒలికిందా అన్నట్టు, ఒళ్ళంతా తడిసిపోయి వుంది. మరుక్షణంలో గదిలో నిండిన నిశ్శబ్దాన్ని తొలుస్తూ, నేల మీద పడున్న మొబైల్ మోగడం మొదలైంది. బుగ్గ మీది చారికలు తుడుచుకొని, కనపడే ఎర్రచుక్కను బలంగా పక్కకు తోసి ఫోను చెవికి తగిలించాడు.
“రే! నాన్నని ఫోన్ చెయ్యమని చెప్పు? ఫోన్ తీట్లేదు.”
“హలో…. హలో… . మాట్లాడవేం రా? టైం అవుతోందక్కడ. వెళ్ళాలి నేను. చిన్నాగాడు ఏం చేస్తున్నాడు? టిఫిన్లు తిన్నారా?” ఆమె కంఠం ఆగకుండా మోగుతోంది.
ఫోన్ పక్కన పెట్టేస్తూంటే చెయ్యి వణుకుతోంది. పక్కన పడున్న రివాల్వర్ తీసుకుని తన కణతకు గురిపెట్టాడు. ఇంతలో తలుపు తోసిన శబ్దం. నాన్న… లైటర్ మంటను సిగరెట్ దగ్గరకు తీసుకొస్తూ లోపలికొస్తున్నాడు. కనపడిన దృశ్యం చూసి, కాళ్ళు ఘనీభవించిన కాంక్రీట్ లో ఇరుక్కు పోయినట్టుగా ఆగిపోయాడు. మరుక్షణం ఈ లోకంలోకి వచ్చి కేకలు పెడుతూ పిల్లల వైపు పరిగెత్తాడు.
*****
రాజు స్టేషన్కి వచ్చి, కూచుని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాడు. కరకరమని శబ్దం చేస్తూ, చెంగీజ్ ఖాన్ కాలం నాటి ఆ యంత్రం వేగంగా తిరగడం మొదలైంది. కుడివైపున్న కిటికీలోంచి బైటికి చూస్తే, సూర్యుడు ఇప్పుడల్లా బయటికొచ్చేటట్లు కనపడ్డం లేదు. ఆకాశం నలుపెక్కి పోయివుంది.
స్వింగ్ డోర్ ధడాల్న తెరుచుకుని కానిస్టేబిలు ఆనందరావు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. తల పైకెత్తాడు రాజు.
“సార్, గాంధీనగర్ లో , షూటింగ్ జరిగిందట సార్.”
“గాంధీనగర్ లోనా?“ కనుబొమలు పైకెత్తాడు.
“అవును సర్. ఫోన్ వచ్చింది. పది పన్నెండేళ్ల పిల్లలంట.”
“పిల్లలా?” కంఠం మారుమోగింది.
సమాధానం వచ్చే లోపలే, కుర్చీని ఒక్క ఉదుటున వెనక్కి తోసి వున్న పళంగా బయటికి కదిలాడు రాజు. ఆనందరావు, లెధర్ బాగ్ భుజానేసుకుని మఫ్టీలో వున్న ఇంకో కానిస్టేబులు జీపు వెనుకభాగంలో కూర్చున్నారు.
కొత్తగా రంగులేసున్న అపార్ట్మెంట్ కాంప్లెక్. కిందున్న లాన్ లో, మగా ఆడా కల్సి పోయి, రెండు చిన్న గుంపులుగా విడిపోయి మాట్లాడుకుంటున్నారు. జీపు దిగగానే ఒక నడివయసు వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడు.
అడిగాడు రాజు “మీరేనా ఫోన్ చేసింది?”
“అవునండీ. ఈ మధ్యనే దిగారు ఈ ఫ్యామిలీ.”
“ఎవరెవరు వుంటారు”
“భార్యా, భర్తా ఇద్దరు పిల్లలు. మా ఫ్లోర్ లోనే వుంటారు” చెప్పాడు ఆ నడి వయస్కుడు.
“ఏంచేస్తూ వుంటారు”
“ఆవిడ హౌస్ వైఫ్ అండీ. ఈయన ఏదో రియల్ ఎస్టేట్ లాటిదనుకుంటా..”
అటూ ఇటూ కలిపి మొత్తం నాలుగు ఫ్లాట్లు ఆ ఫ్లోర్లో. కారిడార్లో నడిచి వెళ్తూంటే ఆ నడివయసు మనిషి చెప్పాడు.
“ఇది మాదండీ. అటుపక్క ఆ చివరన వాళ్ళ ఫ్లాట్.”
“ఎంత సేపైంది జరిగి?”
“ఓ పదిహేను నిమిషాలు కూడా అయ్యుండదండీ . పిల్లల్ని హాస్పిటల్కి వెళ్ళగానే, మీకు ఫోన్ చేశాను. “
“ఎవరైనా వాళ్ళ ఫ్లాట్ వైపు వెళ్ళడం మీరు చూసారా?”
“లేదండీ. నేను మా హాల్లోనే కూచుని టీవీ చూస్తున్నాను. ఇది జరగడానికి ఓ పదిహేను నిమిషాల ముందర వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ వైపు వెళ్ళడం, మళ్ళీ తిరిగిరావడం నేను చూసాను.”
“పిల్లల మదర్… ఆవిడా ?”
“ఆవిడ ఏదో ఫంక్షన్ ఉందని, మొన్న వూరెళ్ళిందండీ. మధ్యాన్నం బయల్దేరి మేము కూడా వెడతాం అని చెప్పాడు అతను.”
ఫ్లాట్లో ఎంటర్ కాగానే, ఓ పెద్ద హాలు , ఫ్రంట్ డోర్ ను ఫేస్ చేస్తూ ఓ రూమూ. అటూ ఇటూ ఇంకో రెండు రూమ్లున్నాయి. ఇంకో పక్క వంటగది. హల్లో టీకుతో చేసిన సోఫాలు.మధ్యలో ఒక టీపాయ్. రిమోట్, టీపాయ్ కింద నేల మీద పడుంది. గోడ మీద తగిలించివున్న, భారీ LED టీవీ, పాస్ చేసుంది. ‘స్టోన్ బాయ్’ అని కనపడుతోంది స్క్రీన్ పైభాగంలో. రాజు, జీపెక్కివచ్చిన లెథర్ బాగ్ మనిషి, ఎదురుగా కనపడుతున్న బెడ్ రూమ్ లోకి వెళ్లారు.అక్కడక్కడా చిక్కటి జేగురు రంగు ద్రవం గడ్డకట్టి పడుంది. నేల మీద మొబైల్, రెండు బులెట్ షెల్స్ కనిపించాయి. రివాల్వరు బంకర్ మంచం కిందకెళ్ళిపోయి కనపడింది.
“అన్నీ కలెక్ట్ చేసి, ప్రింట్స్ అవీ తీస్కో” చెప్పాడు పక్కనున్నతనికి రాజు.
చేతికి గ్లోవ్స్ వేసుకుని రివాల్వర్నీ సీసం ముక్కల్నీ ఓ పాలిథీన్ సంచీలో వేసాడు, అతను.
“ఏదీ ఇలా ఇవ్వు “ అంటూ ఆ సంచీని తన చేతిలోకి తీసుకుని జాగర్తగా రివాల్వర్ని పట్టుకున్నాడు రాజు. ‘కంట్రీ మేడ్’.
గది బయటకొచ్చాడు రాజు. హాల్లో డైనింగ్ టేబిల్ మీదున్న ఐపాడ్లు రాజు కళ్ళబడ్డాయి. వాటితో బాటూ సగం తినేసి మధ్యలో వదిలేసిన సాండ్ విచ్ లూ, ఓపెన్ చేసి వున్న టొమాటో కెచప్ పాకెట్లూ. రెండు కుర్చీలు, ఎవరో కూర్చుని, వొదిలెళ్ళినట్టుగా కొంచెం దూరం జరిపి వున్నాయి. రివాల్వర్ సంచీ టేబిల్ మీద పెట్టి, ఒక ఐపాడ్ చేతిలోకి తీసుకున్నాడు. లాక్ చేసి వుంది. ‘1…. 2… 3…’ ప్రయత్నించాడు. తెరుచుకుంది. మిలిటరీ డ్రెస్సులో వున్న వాడు ఒకడు మెషిన్ గన్ పట్టుకుని పరిగెత్తడం మొదలెట్టాడు. టప టపా ఎదురొచ్చిన వాళ్ళని కాల్చేస్తున్నాడు. రెండో ఐపాడ్ లోనూ అదే దృశ్యం. వెనకనే వున్న ఆనందరావు అన్నాడు, “ మా పిల్లలు గూడా మొబైళ్ళు తీసేసుకుని, ఇదే ఆడుతుంటారు సర్ పొద్దస్తమానం. ఏ చైనా వాడో తయారు చేసాట్ట. ప్రపంచంలో వున్న అన్ని రకాల గన్లూ వాడుకోవచ్చు. ఎంత మందిని ఏసేస్తే అన్ని పాయింట్లు. కాలేజీ పిల్లలూ స్కూలు పిల్లలూ .. అందరికీ ఇదే పిచ్చ!”
అప్రయత్నంగా, తాను టేబిల్ మీద ఉంచిన రివాల్వర్ వైపు రాజు చూపులు మళ్ళాయి.
“ఏ హాస్పిటలో తెలుసా?”
“కనుక్కున్నా సార్!”
*****
నేరుగా కాజువాలిటీ వార్డుకి వెళ్ళాడు రాజు. ఇద్దరు వ్యక్తులు ఖద్దరు చొక్కాలేసుకుని, వార్డు డోరు పక్కనే వేసున్న కుర్చీల్లో కూర్చుని వున్నారు. ఒకతను మొహం చేతుల్లో పెట్టుకుని వున్నాడు.అతని పొట్ట ఎగిరెగిరి పడుతోంది. రెండో అతను ఏడుస్తున్న అతని భుజం మీద చేయి వేసి డోర్ వైపే చూస్తున్నాడు. కొంచెం దూరంలో నిలబడ్డాడు రాజు. చూడగానే లేచి దగ్గరికొచ్చాడు రెండో అతను. “పిల్లల తండ్రి ఫ్రెండ్ని” అని పరిచయం చేసుకున్నాడు.
“ఏవిటి పరిస్థితి?”
“ఇంకా ఏం తెలీదండీ. లోపలి తీసుకెళ్లారు.”
“పిల్లల మదర్ ఎక్కడున్నారు?”
కళ్ళు దించుకుని భారమైన గొంతుతో చెప్పాడతను, “వార్త వినగానే ఆవిడకు స్పృహ తప్పిందండీ. వాళ్ళ వూర్లోనే ప్రస్తుతం హాస్పిటల్లో వుంది.”
“ఎలా జరిగిందో మీకేవన్నా చెప్పాడా” అడిగాడు ఏడుస్తున్న పిల్లల తండ్రి వైపు చూపు సారిస్తూ.
వివరమంతా చెప్పాడతను.కంటిన్యూ చేస్తూ చెప్పాడు,“నిన్న రాత్రే గన్ చేతికొచ్చిందటండీ. బీరువాకు తాళం కూడా వేసి ఏదో ధ్యాసలో అలవాటు ప్రకారం బీరువా పైన పెట్టేడట తాళాన్ని . ఆయన కిందికి వెళ్లొచ్చే లోపలే తీసేసినట్టున్నారు పిల్లలు. మరీ పెద్దవాడైతే కళ్ళముందే..... ” అని చెప్తూ ఆగిపోయాడతను.
డోర్ తెరుచుకుంది. అప్పటి దాకా కూర్చుని ఏడుస్తున్న ఆ పిల్లల తండ్రి, కళ్ళు తుడుచుకుని దగ్గరకొచ్చి నిల్చున్నాడు. డాక్టర్ మొహంలో ఏ భావమూ కనపడట్లేదు. ఆదుర్దాగా డాక్టర్ వైపు చూస్తున్నారు అందరూ.
“పెద్దబ్బాయిని సేవ్ చెయ్యలేక పొయ్యామండీ. రెండో అబ్బాయికి మాత్రం డీప్ స్క్రాచ్ పడింది. షాక్ లోకెళ్ళాడంతే. హి విల్ బీ ఆల్రైట్”.
ఓ రెండు క్షణాలు నోరు తెరిచి డాక్టర్ వైపే చూసాడు ఆ పిల్లల తండ్రి. భోరున ఏడుస్తూ కుప్పకూలిపోయాడు.
*****
బయటకొచ్చి జీప్ పక్కనే నిలబడి సిగరెట్ వెలిగించాడు రాజు. ఎదురుగా రోడ్డు మీదున్న హోర్డింగ్ కి అతుక్కుపోయిన పిల్ల హీరో గారు, మారణాయుధం ఒకటి భుజానేసుకుని ఆహ్లాదంగా నవ్వుతున్నాడు.
“ ఇంట్లో తెచ్చిపెట్టుకోడం ఏంది సార్ తుపాకుల్ని, బుర్ర లేని పనులు కాకపోతే “ అన్నాడు ఆనందరావు.
సమాధానం ఏమీ ఇవ్వలేదు రాజు.
అప్పుడే కార్లోంచి దిగిన, తెల్లకోటు డాక్టర్ గారు మొబైల్ ఫోన్ లో మాట్టాడుకుంటూ, గట్టిగా నవ్వుతూ హాస్పిటల్ లోకి వెళ్తున్నాడు.
“ఇరవైనాలుగుగంటలూ నొప్పినీ, రక్తాన్నీ చూడాలి. మనకంటే భయంకరమైన ఉద్యోగాలు ఈళ్ళవి. ” అన్నాడు రాజు.
"మొదట్లో నాకు లాఠీని వాడినా, రక్తపు మరకలు చూసినా, అన్నం తినబుద్ధయ్యేది కాదు సార్. ఇప్పుడు తలలు తెగి పడున్న మొండాలు చూసినా, ఇంటికెళ్ళి బిర్యాని తిని హాయిగా నిద్ర పోతున్నా. అయినా టీవీలు, సినిమాలు, మొబైళ్ళు…. ఎక్కడ బట్టినా ఇదే గోలగా?” అన్నాడు ఆనందరావు.
ఓ క్షణం ఆగి అన్నాడు రాజు “ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం కదా!”.
బుర్ర గోక్కుంటూ, నెమ్మదిగా తల పైకీ కిందికీ ఆడించాడు, ఆనందరావు.
ఎదురుగా వున్న ఖాళీ స్థలంలో గాలి సుళ్ళుగా మారడం మొదలైంది. ఐపాడ్ లో గన్ పేలుస్తూ పరిగెడుతున్న మిలిటరీ వాడు, రూంలో నేల మీద చూసిన రక్తపు మరకలు, కుప్పకూలిన తండ్రి మొహం, ఆ దృశ్యాలన్నీ న్యూస్ రీలు తిరిగినట్టు బుర్రలో గిర్రున తిరిగాయి.
మొబైల్ మోగింది. అవతల్నించీ భార్య, కొడుక్కి స్కూల్ బస్సు మిస్ అయ్యిందనీ, ఆటోలు దొరకలేదు కాబట్టి ఇంట్లోనే ఉండిపోయాడనీ! అసంకల్పితంగా నడుముకి తగిలించి వున్న సర్వీస్ రివాల్వర్ ఓసారి తడుముకున్నాడు. ఓ దుమ్ము తెర వేగంగా వచ్చి రాజు మొహాన్ని తాకింది. గాలిదుమారం రాను రాను పెద్దదౌతూ మీదికొస్తోంది. సిగరెట్ మంట చివరికంటా వచ్చి, వేలు చురుక్కుమంది, అశోకరాజుకి.
*****