Artwork for podcast Harshaneeyam
స్వింగ్ - ఛాయా మోహన్ గారి 'ఒంటరి పేజీ' కథ
Episode 31125th February 2022 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:02:53

Share Episode

Shownotes

స్వింగ్

-----------------------------

వేసవి సాయంత్రపు ఎండ, కాలం చీకటిలోకి జారిపోకుండా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. 

పార్కులో పిల్లల సందడి అలల అల్లరిలా  ఉంది.

చాలా సేపటి నుంచి నా చూపు కొంచెం దూరంగా ఉయ్యాల ఎక్కి ఊగుతున్న పిల్లలు , అక్కడే తచ్చాడుతున్న ఓ ముసలాయన దగ్గర ఆగిపోయింది. 

ఓ పది మంది దాకా పిల్లలు వంతులు వంతులుగా ఉయ్యాల ఊగుతున్నారు. ఓ పిల్లాడు దిగంగానే ముసలాయన ఏదో అడుగుతున్నాడు.  వాళ్ళు అడ్డంగా బుర్ర ఊపుతున్నారు. అంతలో ఉడతలా మరో కుర్రాడు ఉయ్యాల మీదికి ఉరుకుతున్నాడు. 

నేను రోజూ సాయంత్రం పార్క్ కి వస్తా. తను పనినుంచి రావడానికి ముందే నేను ఇంటికొస్తా, తనొచ్చేదాకా పార్క్ లో గడుపుతా. నేనెప్పడూ ఈ ముసలాయన్ని చూసిన గుర్తులేదు.

నెమ్మదిగా చీకటి బలానికి వెలుగు లొంగక తప్పలేదు. కొందరు పిల్లలు వెళ్లి పోయారు.

ఇంతలో మా అపార్టమెంట్ అబ్బాయి ఒకడు ఉయ్యాల దగ్గర నుంచి పరిగెత్తుకొస్తూ కనబడ్డాడు.

" ఏయ్ విశేష్ ఆ ముసలాయన ఇందాకటి నుంచి మిమ్మల్ని ఏంట్రా అడుగుతున్నాడు. "

" ఏం లేదంకుల్ ఆయన ఉయ్యాల ఎక్కుతాట్ట మేం హెల్ప్ చేయ్యాల్ట , ఏమైనా చిన్న పిల్లాడా అంకుల్ !? " సమాధానం ఇస్తూనే ట్యూషన్ కి టైం అవుతోందని పరుగెత్తాడు.

నే నెమ్మదిగా ఉయ్యాల దగ్గరికి వెళ్ళా. పిల్లలు ముగ్గురో, నలుగురో ఉన్నారు. చీకటి పడుతుండటంతో వాళ్ళు వెళ్ళి పోయే మూడ్ లో ఉన్నారు.

నెమ్మదిగా నే ముసలాయన దగ్గరికి వెళ్ళా. కొంచెం మావయ్యలా ఉన్నాడు. ఒకసారి ఆయన మొహంలోకి చూసి నవ్వా, ఆయనా నవ్వాడు. 

" ఉయ్యాల ఊగడం చాలా ఇష్టమా ? "

మొహమాటంగా నవ్వాడు.

" ఎక్కుతారా ? "

" నే నేమైనా చిన్న పిల్లాడినా " కొంచెం చికాగ్గా మొహం పెట్టి అన్నాడు.

" పర్లేదు రండి "

దగ్గరుండి ఉయ్యాల మీద కూర్చోబెట్టా. బాలన్స్ చేసుకోలేక జారిపోబోయాడు. పట్టుకుని సర్ది కూర్చో బెట్టి నెమ్మదిగా ఊపసాగాను.

" చిన్నప్పుడు మావయ్య ఇలాగే ఉపేవాడు " నాలో నేనే గొణుక్కున్నా.

ఆ ముసలాయన మొహం నిండా బాల్యం ఆవహించింది. కొద్ది నిమిషాలు ఊగాక నెమ్మదిగా దిగిపోయాడు.

" థాంక్యూ " అని కొంచెం సిగ్గుగా, నెమ్మదిగా అంటూ చీకట్లోకి నడిచాడు

" అమ్మ గుర్తొచ్చిందా " అన్నా నవ్వుతూ.

--- * ------



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube