కేరళ - ఒక కేళీరవం, కళల మౌక్తికం..
ప్రపంచమంతా ప్రేమగా పిలిచే " గాడ్స్ ఓన్ కంట్రీ "
ఎలా వర్ణిద్దాం ఈ అద్భుతాన్ని!!
పర్యాటకులను కట్టిపడేసే వాయనాడ్ లో ఉదయించే సూర్యుడిని తాకే చల్లటి మబ్బుల్లా, మున్నార్ టీ తోటల్లో వీచే పిల్లగాలుల్లా, జారే జలపాతాల్లా, సోయాగాల సాగర తీరాల్లా, బ్యాక్ వాటర్స్ లా, రబ్బర్ తోటల్లా, వంద శాతం అక్షరాస్యతలా..
దేవుళ్ళంతా ఆనంతపద్మనాభుడిలా, గురువాయూర్ కృష్ణుడిలా, శబరిమల మణికంఠుడిలా మాకు రక్ష.
మాది ఒక వ్యవసాయం కుటుంబం. వరి మా ఇంటి సిరి.
కాస్త డబ్బు వెనకేసి నాన్న మున్నార్ లో ఓ చిన్న 'టీ ఎస్టేట్' కొని దాని భాద్యత అన్నయ్య ఇచ్చాడు.
టూరిజంలో భాగంగా పర్యాటకులకు మా ఇంటి భోజనం పెట్టే లైసెన్స్ ఉండి ఎన్నో అవార్డ్లు తెచ్చిపెట్టాయి. ఆ విషయాలు అమ్మ వదిన చూస్తారు.
ఓణం పండుగ, బోట్ రేసులు, టూరిస్టులు మా ఇంట్లో భోజనం చేయడం ఎంతో మధురమైన క్షణాలు.
ఎంబిఎ చేసిన నేను, అందరికీ సాయంగా ఉంటూ ఏదైనా స్టార్టప్ స్ధాపించాలని కల.
ఓ రోజు మా భోజన మీటింగ్ లో నాన్న నా గురించి అడగడం, నా ఆలోచనలు చెబితే సరేననడంతో కాస్త కుదుటపడ్డా.. నాకైతే ఇక రంగంలో దిగాల్సిన టైమ్ వచ్చిందనిపించింది.
రెండు బెడ్ రూమ్స్ ఉండే హౌస్ బోట్ ప్రాజెక్ట్ అనుకున్నాను. ఇంట్లో ఓకే అనడంతో పని మొదలుపెట్టాను.
నేను లంచం ఇవ్వకపోవడంతో పర్యాటక విభాగంలో నా ప్రాజెక్ట్ ఫైల్ బ్యాంక్ లోన్ కోసం ఆమోదం ఆలస్యం అయితే విజిలెన్స్ కమిషనర్‌కు నేను రాసిన లేఖ పని చేసి పెట్టింది. బోటును షూరిటీగా పెట్టి లోన్ తీసుకునే స్కీంతో కొత్త బోటు తీసుకున్నాను.
అలెప్పిలో నా ఆరు నెలల టూరిజం ట్రైనింగ్ అయ్యాక నాన్న అన్న మాటలు " నీ ప్రొఫెషన్ లో నమ్మకమే పెట్టుబడి. అది నిలబెట్టాలి అంటే లాభ నష్టాలు ఒక్కో క్షణాన మర్చిపోవాలి అని "
హౌస్ బోట్ నీళ్ళ మీద రిసార్ట్ లాంటిది, సదుపాయాల కొదవే లేదు. ఏసి బెడ్రూంలు, హాల్, కిచన్, పై ఫ్లోర్ లో డైనింగ్ పర్యాటకులను ఆకర్షిస్తాయి. 24గంటల పాటు వాళ్ళే యజమానులు.
నా బోట్లో ముగ్జురు ఉద్యోగులు. ఒక కుక్, బోట్ కీపర్, బోట్ క్యాప్టెన్. ఒక్కరోజు ప్యాకేజీలో లంచ్, డిన్నర్, ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఉంటాయి. ప్రతిరోజూ ట్రిప్ వివరాలు ముందే మాకు అందుతాయి.
వెంబనాడ్ సరస్సు కేరళలో అతిపెద్ద మంచినీటి సరస్సు, ఇది మా జీవనోపాధి. పర్యాటక రంగానికి ఆయువుపట్టు. వరి, చేపల ద్వారా జీవనోపాధిని అందిస్తుంది. నది ఒడ్డున ఉన్నవారికి ప్రధాన రవాణా సొంత బోట్లే.
ఇక ముందు రోజు వేసిన టెండర్లు తెల్లారే తెరిచే ప్రోగ్రాం ఉండడంతో బోట్లన్నీ ఆపేశారు. నాకు చాలా ముఖ్యమైన రోజది. చుట్టూతా చాలా హడావిడి. దాదాపు అయిదొందల బోట్ల కొత్త పర్మిట్ కావడంతో కాస్త రాజకీయ వేడి కూడా తగులుతోంది. అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది.
టూరిజం అధికారులు, లేక్ పోలీస్ బృందాలు కలిసీ పడవ నాణ్యత, ఫిట్ నెస్, సౌకర్యాల తనిఖీలు చేస్తున్నారు.
టెండర్లు కొందరికి దక్కితే కొంతమందికి రాలేదు. నా బోటు ఓకే చేసి పర్మిట్ ఇచ్చారు. ఇక రెండేళ్లు భయం లేదు. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పేశా, రాత్రి బోట్లో ఉంటా అని.. ఎందుకో బోట్లో సరస్సంతా తిరగాలనిపించింది.
టెండర్ రాని వాళ్లలో ఎవరో ఎమ్మెల్యే, నా పర్మిట్ ఇవ్వాలని బలవంతంగా బెదిరించేలా వేడుకున్నా నేనివ్వలేదు. నేను కొత్త కదా అని నన్నడిగాడేమో!!
కలెక్టర్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు.
ఆ రోజు బోట్ మొత్తం ఇద్దరి పేర్ల మీద ఉంది. వీళ్ళిద్దరి కోసం చూస్తుంటే వాళ్లకు తోడుగా వచ్చిన ఓ ముగ్గురు సెండాఫ్ ఇస్తే బోటు మాతో, వాళ్ళిద్దరితో కలిపి బయలుదేరింది.
వెల్ కమ్ డ్రింక్ సర్వ్ చేసి వాళ్ళను పరిచయం చేసుకుని టూర్ గైడ్ అయిపోయా.
వినయ్, అంజలి కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ ట్రిప్ అది. కేరళ కాస్త తిరిగి రేపు రాత్రి కొచ్చిన్ టు ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళిపోతారు. కేరళలో మా హౌస్ బోట్ వారి చివరి మజిలీ..
ఈ మద్య కాలంలో మా అతిథులతో ప్రయాణించింది చాలా అరుదు. ఒడ్డున నిలబడి సెండాఫ్ ఇవ్వడం, వచ్చాక రిసీవ్ చేయడమే నా పనిగా ఉండేది. కొత్త జంట కావడంతో నేనే దగ్గరుండి అన్నీ చూసుకున్నా..
మాతో పాటు వెంబనాడ్ అలలపై తేలుతున్న ఓ రెండొందల బోట్లని చూసి వారు మైమరచిపోయారు. అటూ ఇటూ కనపడే వరి పైరు, పక్కనే ఇళ్ళు, సరస్సులో చేపలు, వాటి కోసమొచ్చే కొంగలు, అవన్నీ చూడ్డానికే అన్నట్టు బరువుగా ముందుకెళుతున్న మా బోటు, ఒక్కో కవికి ఒక్కో ఊహకందని వర్ణనాచిత్రం.
మధ్యాన్న భోజనంలో ప్రపంచం మెచ్చే "కేరళ సద్య" లో అన్ని రకాల వంటలను ఆస్వాదిస్తూ తృప్తిగా భోంచేశారు. సాయంత్రానికి మా బోటు ఒడ్డు చేరింది.
బోట్ ఆసిస్టెంటుకు కావలసినవి చెప్పి ఊళ్ళోకి పంపితే అరగంటలో అన్నీ తెచ్చేసి బోటు కిచన్లో ముగ్గురూ బిజీ అయ్యారు.
రాత్రి భోజనానికి మా రూఫ్ టాప్ డైనింగ్ రూమ్ క్యాండిల్ లైట్ డిన్నర్ తో స్వాగతం పలికింది. కేరళ సీఫుడ్, పరోటా, తలశేరి స్టైల్ బిరియాని, ఇతర రుచులతో కేరళ వాళ్ళని హక్కున చేర్చేసుకుంది.
టెన్షన్ తో మొదలైన ఆ రోజు ప్రశాంతంగా ముగిసింది.
తెలిమంచు కరుగుతూ తెలవారుతోంది. పక్షుల కిల కిల రావాల మద్య వెంబనాడ్ మేల్కొంటోంది
తెల్లవారుజామున సమయంలో కుమరకం రిసార్ట్ నది ఒడ్డు గందరగోళంగా ఉంది అని ఫోన్.
నిద్రపోతున్న కొత్తజంటను, కిచెన్ లో మా వాళ్ళను డిస్ట్రబ్ చేయక బోట్ డెక్ మీద నిశ్శబ్దంగా కూర్చున్న నన్ను కాసేపటికి వాళ్ళ చేతిలో స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీతో విష్ చేశారు.
కాసేపు తరువాత బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, ఆప్పం, పైనాపిల్ సర్వే చేశాం.
అసలేం జరిగిందంటే.. నిన్న వినయ్, అంజలి ఉన్న రిసార్ట్‌లో అదే ఎమ్మెల్యే తన వాళ్ళతో బోట్ల టెండర్ల గురించి వచ్చాడు. టెండర్లు గెలిచిన వాళ్ళతో కలిసో బెదిరించో సిండికేట్ కావాలని ప్లాన్.
అదే రిసార్ట్‌లో ఉన్న వీళ్ళతో ఎమ్మెల్యే మనిషి ఒకడు అసభ్యంగా మాట్లాడితే అంజలి వాడి చెంప వాచేలా కొట్టింది. వెంటనే హోటల్ మేనేజర్, సెక్యూరిటీతో కలిసి వాళ్ళని సురక్షితంగా మా బోటు చేరుకునేలా చూశారు.
ఇప్పుడా మనుషులు మా బోటు కోసం చూస్తున్నారు.
వాళ్ళు తినేశాక లగేజ్ సర్దుకుంటుంటే అన్నయ్యకు ఫోన్ చేసి విషయం వివరించా. ఓ పది నిమిషాల్లో మూడు బొట్లలో ఒక పన్నెండు మంది మా బోటుకు సెక్యూరిటీ అయ్యారు. అందరూ మాకు తెలిసినవారే..
సంక్షోభ నివారణలో నేర్చుకున్న మొదటి పర్వం, ఇక ముందెన్ని చూడాలో!!
కుమరకం చేరగానే నది ఒడ్డున ఉన్న వాళ్ళూ, అప్పటికే అక్కడికి చేరుకున్న టూరిజం, మున్సిపల్, పోలీసు అధికారులను చూసి అన్నయ్య జిల్లా కలెక్టరుగారితో మాట్లాడాడని తెలుస్తోంది.
ఆ ఎమ్మెల్యే మనుషులు వెనక్కి తగ్గడంతో సమస్య తీరినట్టైంది.. కానీ ఇద్దరూ చాలా భయపడ్డారు. ఊరు గాని ఊరాయె!!
తోడుగా నేనున్నాను కదరా అని అన్నయ్య అన్నట్టు అనిపించింది.
భద్రత, రక్షణ ఇవ్వడానికి, నిబద్ధతతో మన రాష్ట్ర పరువు దిగజారకుండా అందరం చేసిన కృషి సంతృప్తినిచ్చింది.
సాటి మనిషికి గౌరవం ఇవ్వలేని ఈ మూర్ఖులకు తమ స్థానాన్ని చూపించాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతాను. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చే పర్యాటకులను ఇబ్బంది పెట్టకుండా స్థానిక సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలి.
నిన్న ఇబ్బందుల్లో ఉన్నది మీరేనా అని ఇద్దరినీ అడిగితే ఆశ్చర్యపోయారు. తర్వాత విషయం తెలుసుకుని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదంతా ఎందుకు చేయాలంటే ఇది మా రోజువారీ కష్టం. నేను సర్వీస్ తో హృదయాలను గెలవాలి, వారు గడిపిన ప్రతి క్షణం వారు ఖర్చు చేసే ప్రతీ పైసా మా సేవలతో సంతృప్తి చెందాలి.
కానుకగా రవివర్మ పెయింటింగ్ ఇచ్చాక, కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ వరకూ రెండు కార్లు తోడుగా వెళ్లి ఇద్దరినీ డ్రాప్ చేశాయి.
మొత్తం సంఘటనలో నేను ఎంత డబ్బును కోల్పోయానో కూడా చూడలేదు,
కాని నేను, మేము, మొత్తం రాష్ట్రం మా లాభాన్ని విశ్వసనీయతతో చాటుకున్నాము.
ఇల్లు చేరాక అందరూ నన్ను, అన్నయ్యను ప్రశంసించారు. అందరి భోజనాల మద్య నాన్న నవ్వుతూ.. "ఒకడు మార్గం చూపిస్తే ఇంకోకడు దాన్ని సుగమం చేశాడన్నాడు".
ఇక బెడ్రూంలో నిద్ర మెల్లగా పిలుస్తోంది, ఇంతలో ఫోన్ మోగింది. ఢిల్లీ క్షేమంగా చేరాం అని.. అవతల వినయ్. అది చాలు నాకు.. ఏదో చెబుతున్నాడు కానీ నిద్రకు కళ్ళు మూసుకుపోతున్నాయి..
రేపటి పర్యాటకులను సంతోషంగా ఆలింగనం చేసుకోడానికి వెంబనాడ్ నిశ్శబ్దంగా వేచి ఉంది.