Shownotes
అమ్మమ్మ వాళ్ళది దగదర్తి మండలం లోని ఉప్పలపాడు గ్రామం. నాన్నమ్మ వాళ్ళది కావలి దగ్గర్లోని ఉలవపాళ్ళ గ్రామం . మాకు మాతృస్వామ్యము ఇష్టం కాబట్టి అమ్మమ్మ నాన్నమ్మ అని మొదలెట్టా. ఇటు నుండి అటు వెళ్లాలన్న, అటు నుండి ఇటు వెళ్లాలన్న రాజు పాళెం లో దిగి బస్సులు మారాలి. నాకు ఈ పాళెం ఏందిరా బాబూ అని చిన్ననాటి నుండి డౌట్ కానీ అరవ దేశానికెళ్లాక అర్థమయ్యింది పాళ్యం రూపాంతరం అయ్యి పాళెం అయ్యిందని. ఎలా అయినా మనం మన ఎన్ .టి.ఆర్ రాక ముందు మదరాసీలము కదా. ఈ గోల వదిలెయ్యిహే! చెప్పాల్సింది చెప్పు , ఈ మధ్య అసలు కంటే కొసరేక్కువయ్యింది నీకు అని పొడస్తావుంది సుప్రియ పక్కంజేరి.
సరే అసలు కథ చెప్తా. నాకు ఐదేళ్లు వయస్సనుకుంటా, కాక పోతే మా అమ్మ దగ్గర తెలుగు నాలుగాకులే ఎక్కువ చదివా. మన గోపిగాడి లాగ కాకుండా బస్సుల మీద ఊర్ల పేర్లు చదివెయ్య గలుగుతున్న అప్పటికే. మా అమ్మ అత్తారిళ్ల మీద అలక తీరి అమ్మగారింటి నుండి నన్ను తీసుకొని ప్రయాణం కట్టింది. మనమూ ఊరెళ్తున్నామని దోస్తులందరికీ టామ్ టామ్ వేసి కొత్త చొక్కాయ వేసి బయలుదేరాము. బస్సు రాజు పాళెం రాగానే మా అమ్మ ముందు నన్ను దింపి ఆ తర్వాత వాళ్ళ పుట్టిల్లోళ్లు ముచ్చట పడి కట్టిచ్చిన చీపురు కట్టలు బస్సులోంచి కిందకిసిరి ఆమె దిగబోయేంతలో ఆ బస్సు' నాకొడుక్కేమొచ్చిందో రోగం సక్కా నూక్కొని పొయ్యాడు బస్సుని.
కిందకు దిగిన నాకు అర్థం కాలా నా కర్థమయ్యింది మా అమ్మ బస్సులోంచి దిగలా . ఆ బస్సు నెల్లూరెళ్ళి పోయింది, నేనేంజెయ్యాల చుట్టూ చూసా రోడ్ కి ఎదురుగుండా నెల్లూరు నుండి మా ఊరెళ్ళే బస్సు వుంది. ఒకటికి రెండు సార్లు చదివా, నెల్లూరు, కోవూరు, రాజుపాలెం, గండవరం, కొత్తవంగల్లు, గొట్లపాలెం, పెదపుత్తేడు, ఉప్పలపాడు అని బస్సు పక్క వైపున చక్కగా కనపడ్డాయి. అబ్బా చదవటం సూపర్ గా వచ్చేసింది , మా గోపిగాడు గాడిదెద్దులా పెరిగాడు ఆడికి ఇప్పటికీ రాదు అనుకుంటూ, ఒక్క తాటిన రోడ్ దాటినా. బస్సెక్కి ఇద్దరు పెద్దోళ్ల మధ్య సీట్ లో ఇరుక్కున్న. మనకి అప్పటికి ఇంకా అరటిక్కట్టు వయస్సు కూడా కాదు. ఎవరూ అడగాలా. మా వూరు చేరా.
ఎలా అబ్బా మా అమ్మమ్మకి చెప్పటం మా అమ్మ తప్పి పోయిందని ఒకటే ఆలోచన బస్సంతా. బస్సు దిగగానే నన్ను బస్సు ఎక్కిచ్చి ఆడే బడి ఆడుతున్న దోస్తులకేమీ అర్థం కాలా నన్ను చూసి. ఏమిటిరా మీ ఎదవ కన్ఫ్యూషన్ ముందే నేను మా అమ్మ తప్పి పోయి యాడస్తా ఉంటే అంటూ ఇంటికి బయల్దేరా. ఈళ్ళు గమ్మునుంటారా నాకంటే ముందు లగెత్తారు మా అమ్మమ్మ కాడికి . ఓ ఈసిరమ్మా నీకూతురు తప్పి పోయిందమ్మా అంటా. మా అమ్మమ్మ భలే హుషారయిన మడిసిలే అచ్చు నాలాగా వెంటనే మా సీనన్ని అదే బస్సు ఎక్కిచ్చింది రాజుపాళేనికి. ఈ లోపి మా అమ్మ, మా అమ్మ తో పాటు రాజుపాలెం లో దిగిన మా ఊరోళ్లంతా నాకోసం రాజుపాలెం అంతా వెతికి వెతికి, ఏడ్చుకొని ఏడ్చుకొని మల్లా అదే బస్సు నెల్లూరెళ్లి తిరిగొస్తుంటే దాన్ని రాజుపాలెం లో ఎక్కి మా వూరికి బయల్దేరారు. ఈ రెండు బస్సులు గండవరం లో కలుసుకున్నాయి. మా శీనన్న వెంటనే మా అమ్మ కాడికెళ్ళి మనోడు సూపర్ గున్నాడు నువ్వేమి ఏడవమాక అని మన క్షేమ సమాచారాలు చెప్పి మా అమ్మని ఉప్పలపాటి కి తీసుకొచ్చాడు.
ఎట్లా ఐన మా అమ్మ సూపర్ వీపు విమానం మోత మోగేలా కొట్టలా. నేను అనుక్కున్నట్టు మా అమ్మే తప్పి పోయిందని నమ్మేసింది. దగ్గరకి తీసుకొని తవుడుకొని పొట్టనిండా బువ్వ పెట్టి పొట్ట మీద వేసుకొని నిద్ర పుచ్చింది. నేను నిద్ర లేచేసరికి ఎదో పుస్తకం చదువుతా కనపడింది. అప్పుడు తొలిచింది ఎదో పురుగు నా బుర్రని. ఓ అమ్మ అమ్మ నేనొకటి అడగతా సెప్తావా అని. అడగర అంది మా అమ్మ తేటంగా . “అవునే నేను చిన్న పిల్లోడిని కదా రాజు పాళెం లో తప్పి పోయాను కదా నేను దొరికే వరకూ నువ్వు రాజు పాళెం వదలకూడదు కదా అక్కడే వుంటాను అనుకోకుండా మరి మన ఊరి బస్సు” ఎలా ఎక్కావు? ' అని.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy