నా పెద్ద కూతురు అమృత, చిన్ననాటి నుండి తనలోని ఆలోచనలు చాలా స్పష్టంగ వ్యక్త పరిచేది. మా స్నేహితుడు గిరిగాడి భాషలో చెప్పాలంటే భావవ్యక్తీకరణ మరియు భావప్రకటన. తన మూడవ ఏటనే మేము తనని డెన్వర్ కి కొనిపోయాము.
దానికి అప్పుడు చేపలు అంటే చాల ఇష్టం, పెంచటం కాదు సుమా. ఒక రోజు మేము తనని తీసుకొని చైనీస్ మార్కెట్ కి వెళ్ళాము. అక్కడ మంచి మంచి తిలాపియా చేపల బ్రతికున్నవే దొరుకుతాయి. వాటిల్ని పెద్ద పెద్ద గాజు తొట్టెల్లో వేసి ఉంచి, మనం ఎన్నుకున్నవాటిని తీసి ముక్కలుగా కొట్టి ఇస్తారు. అమృత ఆ చేపల్ని తొట్టెల్లో ఈదుతూ ఉండగా దగ్గర నుండి బాగా చూసింది ఆ రోజు. నాన్నా అవి చూడు మూతి ఎలా తెరిచి ఎలా మూస్తున్నాయో అంటూ తన చేతులను వాటి మూతిలా పెట్టి, తెరుస్తూ మూస్తూ చూపిస్తూ వాటితో బాగా ఆడింది.
ఆ రోజు రాత్రి మేము మాంచి నిద్రలో ఉండగా పెద్దగా ఏడుస్తూ లేచింది. ఎంతకూ ఏడుపు మానలేదు. కాస్త కుదుట పడ్డాక, ఏమ్మా! అంటే, ఒక పెద్ద చేప వచ్చింది, నన్ను నువ్వు తిన్నావు కదా ఇప్పుడు నేను నిన్ను తినేస్తా అంటుంది, అంటూ మళ్ళీ ఏడుపు. నేను తెగ సంతోషపడ్డా ! కల ఎంత బాగా చెప్పింది అని మరియు ఈ దెబ్బ కన్నా తన చేపల పిచ్చి వొదులుతుందని. కానీ నా ఆనందం ఎక్కువ కాలం నిలవలా. దొంగది కల కలే, తినటం తినటమే అని తేల్చింది.
అలాగే నిద్ర పోయే సమయంలో తనకి ఆవూ-పులి కథ చెప్పాల్సిందే. మళ్ళీ ఒకరోజు ఏడుస్తూ నిద్ర లేచింది, కాస్త సముదాయించి, ఏమ్మా అననడిగితే , నాన్నా! బుజ్జి దూడకి బాయి ఇచ్చి పులి దగ్గర కు వెళ్ళింది ఆవు. అప్పుడు, అప్పుడు, అంటూ ఏడుపు మళ్ళీ. బెక్కుతూ! చెప్పింది పులి ఆవుని తినేసిందని. నాకు మళ్ళీ తెగ ఆనంద మేసింది ఆహా నా కూతురు చాలా ప్రాక్టికల్ అమ్మాయని.
అలా పెద్ద దాన్ని పెంచుతూ, చిన్నదాన్ని కూడా నాలుగేళ్ల దాన్ని చేసేసరికి, మేము ఇండియా వచ్చెయ్యల్సి వచ్చింది. మా చిన్న దాని భావప్రకటన ఇంకో మెట్టు పైనే. వచ్చిన కొత్తల్లో తానూ, తనకన్నా ఎనిమి నెలల చిన్నదైన మా అన్న కూతురు, ఇంటి బయట ఆడుకుంటూ వున్నారు. అక్కడే మేస్తున్న ఒక కోడిపిల్లని, మా అన్న కూతురికి చూపిస్తూ దీన్నే చికెన్ అంటారు, దాని లెగ్ పీస్ ఉంటుంది చూడు, యమ్మీ యమ్మీ గా అంటూ చెప్పటం మొదలెట్టింది.
అది విని, ఆ భావ ప్రకటనకు ఈ సారి నాకు భయం వేసింది . దీన్ని వొదిలేస్తే ఇప్పుడే ఆ కోడి బతికుండగానే, దీనికి ఎక్కడ ఆహార మైపోతుందో అని. చాలా గట్టిగా నిశ్చయించుకున్నా, అసలుకే నా పిల్ల పీచులు ఆడ నలుసులు, వీళ్ళని కాస్త ఈ మాంసాహార హింసకు దూరంగా పెంచాలని.
ఒక పధకం ప్రకారం, ఇంట్లోకి తెచ్చిన కూరగాయల్ని తాకమనే వాడిని, వాళ్ళు హాయిగా తాకే వారు వంకాయలు, బెండకాయలు, సొరకాయ, బీరకాయలు అంటూ పేరు పేరునా. చికెన్ లేక మటన్ తెచ్చినప్పుడు తాకమనే వాడిని, ఛీ యాక్! అంటూ పారి పోయే వారు. సాయంత్రం నేను ఇంటికొచ్చే సరికి షరా మామూలే, యమ్మీ యమ్మీ !అంటూ, చికెన్ తింటూ. ఏరా! అంటే, మేము కట్ చేయ లేదుగా, మేము తాక లేదుగా, మమ్మీ ఏ కదా నోట్లో పెట్టింది అంటూ.
అలా నా ప్రయత్నాలకు సుప్రియానే దగ్గరుండి గండి కొట్టిచ్చింది. ఆ తర్వాత నేను సీటెల్ కి వెళ్లాల్సొచ్చింది ఆరునెలలకు ఒక్కడినే. రోజు ఫోన్ చేసే వాడిని ఇంటికి . ఒక రోజు చిన్నది నాన్నా! నాన్నా! ఇంతకు ముందు నిన్ను అనుకుంటే, నీ మొహం నా కళ్ళ ముందుకొచ్చేది, కానీ ఇప్పుడు రావటం లేదు నాన్నా, అని మళ్ళీ తన భావ ప్రకటనతో భయ పెట్టింది.
ఇక లాభం లేదని వెంటనే వాళ్ళని సీటెల్ కి రప్పించుకున్నా. అంతకు ముందు, ఎప్పుడన్నా అమ్మంటే ఆమూకి ఎందుకిష్టం అంటే, ఆమూకి బువ్వ పెడుతుంది కాబట్టి అని చెప్పేది, నాన్నంటే ఎందుకిష్టం అంటే, ఆఫీసుకెళ్లి ఆమూకి డబ్బులు తెస్తాడు కాబట్టి అని చెప్పేది. ఈ సారి మాత్రం అమెరికా కి తీసుకొచ్చాడు అని ప్రకటించటం మెదలెట్టింది నా కూతురు.
వాళ్ళచే మాంసాహారం మానిపించాలని ఇప్పటికీ పట్టు వొదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే వున్నా. ఇప్పుడైతే భావ ప్రకటనే కాదు యుద్ధ ప్రకటనే నా మీద అమ్మా కూతుర్లు. నువ్వు బాగా నలభై ఏళ్ళు దేశంలో వున్న అడ్డమైన వన్నీ తిని మమ్మల్ని మానమంటావ్, మాక్కూడా నీలా తిని తిని విసుగొస్తే మానేస్తామని. నా భావప్రకటన వీళ్ళ ముందర బాధాప్రకటనే.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy