హర్షణీయంలో వినబోతున్న కథ శ్రీ మల్లిపురం జగదీష్ గారు రచించిన 'నా పేరు సొంబరా'
ఇది వారు రచించిన 'గురి' కథాసంకలనం లోనిది.
(ఈ పుస్తకం లభ్యత గురించిన వివరాలు ఇదే వెబ్ పేజీ క్రిందిభాగం లో ఇవ్వబడ్డాయి.)
ఏజెన్సీ ప్రాంతాల్లోని జన జీవన సమస్యలపై సాధికారంగా రచనలు చేస్తున్న జగదీశ్వరరావు గారు, విజయనగరం జిల్లాలోని ఒక గిరిజన గ్రామంలో జన్మించి, 'టిక్కబాయి' ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.
ఇంతకు మునుపు వారు రాసిన 'సిల కోల' కథాసంకలనంలో కానీ, 'గురి' అనే ఈ కథా సంకలనంలో కానీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన కథల రూపంలో విస్తృతంగా చర్చించడం జరిగింది.
ఈ కథ ద్వారా రచయిత , గిరిజనుల జీవితాల్లో వస్తున్న కొన్ని సామాజిక మార్పుల గురించి , వాటి కారణంగా ఉనికిని పూర్తిగా కోల్పోతూ , వారు పడుతున్న వేదన గురించి మన మనసుకు హత్తుకునేలా నివేదిస్తారు.
కథ ఆడియో చివరన , జగదీష్ గారు , కథానేపధ్యాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది.
హర్షణీయం ద్వారా మీకు తన రచనను అందించడానికి అనుమతినిచ్చి, శ్రోతలకు కథ గురించి వివరించిన జగదీష్ గారికి కృతజ్ఞతలు.
* కథలో బోల్డ్ ఫాంట్ లో వున్న పదాలకు , పేజీ చివరన అర్థాలు ఇవ్వడం జరిగింది.
నా పేరు సొంబరా
కలెక్టరు కార్యాలయం... గ్రీవెన్స్ రోజు. గుంపులు గుంపులుగా జనం. సమస్యలన్నీ సాయం కోరుతూ. వరండా నిండా వరుసల్లో. ఎదురు చెట్ల కింద చెల్లా చెదురుగా ఎవరి ఆతృత లో వాళ్ళు.
ఊపిరాడని ఉక్క, ఒళ్లంతా చెమట, చికాకు. క్షణ క్షణం నాలో అసహనం. ఎవరి మీదో చెప్పుకోలేని కోపం. వరండా చివర టాయిలెట్స్ లో దూరి ముఖమ్మీద నీళ్లు చల్లుకున్నాను. రిలాక్స్ అయ్యాను. ఎదర అద్దం. నన్ను నేను చూసుకున్నాను.
వెడల్పాటి ముక్కు, విశాలమైన నుదురు, వంపులు తిరిగిన జుట్టు. నా వయసప్పుడు నాన్న ఇలాగే వుండి వుంటాడు.
నాన్న ఇప్పుడు ఉండివుంటే, అన్నదమ్ముల్లా వుండే వాళ్ళం.
నేను పుట్టగానే తాత, నాన్నని కౌగిలించుకొని ముద్దులాడేడట.
“నిలబెట్టేవురా! జాతి కాపు కాసినోడివనిపించేవురా!!” అని , రెండు ఎడ్లని కొని కానుక గా యిచ్చేడట. పుట్టిన వెంటనే నన్ను చేతుల్లోకి తీసుకొని అడవి వైపు చూపిస్తూ 'ఇదిగో నా రాజు... అడివికే రారాజు" అని గర్వంగా తాతల్నందర్నీ స్మరించుకున్నాడట.
నేను పుట్టడం ఇంటికే కాదు, ఊరికే పండుగట. ఎందుకంటే వూరికి పెద్ద అయిన తాత కి పుట్టిన ముగ్గురన్నదమ్ముల్లో అందరికీ ఆడపిల్లలే. చిన్నవాడైన నాన్నకి పుట్టిన ఏకైక మగ సంతానం నేను.
నాకు గుర్తొస్తోంది....
తాత భుజమ్మీద గుర్రంపండేసుకుంటే తాత వుంగరాల జుట్టు పట్టుకుని నేను రాజునై వీధులన్నీ ఊరేగేను. రెండు చేతుల్లోనూ కిన్నెర పట్టుకుని నన్ను పాటలు పాటలుగా తిప్పేవాడు తాత. అదే భుజాల మీద డప్పు దరువుల్లో కొత్త వూర్లు, కొత్త కొండలూ, వింత వింతల అడవీ చూసేను.
ఆ భుజాల మీదే... తాత పెదాల మీద పలికిన పిన్ల కర్ర పాటల్లో ముత్తాతల గొంతులు విన్నాను. మా ఇద్దరి వైభవం చూసి వూరంతా ముచ్చట పడేది.
నాకు పేరు పెట్టడానికి ఇంటికి ఆకుల తోరణం కట్టించేరట. ఎజ్జోడిని పిలిపించి ఇంటి దేవత మూల "కానికు” వేయించేరు. దీపం వెలుగులో అమ్మ ఒడిలో వున్న నన్ను తాత ఎత్తుకుని చేటలో బియ్యం నెరుపుతు గుగ్గిలం వేసి ధూపం పట్టేరట. ఎజ్జోడు ముంతలో నీళ్లను చిలకరిస్తూ రాగాలు తీసి దేవతలందరినీ స్మరించేరట. మా వంశం లోని అందరి పేర్లూ గొంతెత్తి పలుకుతున్నాడట. ఒక్కొక్క పేరుకీ ఒక్కొక్క బియ్యం గింజను నీటిలో వేస్తున్నాడట. చుట్టూ మూగిన చుట్టాలు. వూరి వాళ్లూ, బంధువులూ ఆతృతగా ఆ ముంతలోని బియ్యం గింజలు వైపే చూస్తున్నారట. ఏ పేరు పలికినపుడు గింజ నీటిలో మునుగుతుందో అదే నా పేరు.
మంగడూ...
బారికీ...
ఆ లక్కాయీ...
సన్నాయీ...
సుక్కూ ...
సొంబరా...
చివరి పేరుకి బియ్యం గింజ నీట మునిగింది. ఒక్కసారిగా ఉల్లల ఉత్సవం... వూరంతా వెలుగు. తాత ఒక్కసారిగా ఎగిరి గెంతేసేడు. వీధుల వెంట నన్నెత్తుకుని ఊరేగించేడు. తుడుం కుండ నడుముకి కట్టి నడిరేయి దాకా వాయిస్తూ... ఏజామునో నిదుర పోయేడట. తాత కంత సంబరం. ఎందుకంటే... నాకు దేవతలిచ్చిన పేరు ఎవరిదో కాదు, మా తాతదే.
“నా జాతిని నిలబెడతాడు... నా మనవడు” అనే కన్ను మూసేడు తాత.
----------------------------------------------
“రాబర్టూ! రాబర్టూ!!” ఎవరో పిలుస్తున్నారు. నన్నే... నన్నే.... నన్నే.
నా పిడికిలి బిగుసుకుంది. బలంగా గాల్లోకి చేయి విసిరేను. ఎదురుగా వున్న అద్దం ముక్కలయ్యింది. నా గుండెలాగే.
ఇప్పుడు నా పేరు రాబర్ట్ విల్సన్... ఔను రాబర్ట్ విల్సన్.
నన్ను నా నుంచి దూరం చేసిన పేరు, నేను నేను కాకుండా పోయిన పేరు. గుండెలోని గాజు పెంకుల్ని కెలుకుతున్న పేరు. -
నేను 'సొంబరా' నుంచి 'రాబర్ట్ విల్సన్' గా ఎలా రూపాంతరం చెందేనో లీలగా గుర్తొస్తోంది నాకు. -
ఆ రోజు నాన్న నన్ను హాస్టల్లో చేర్పించడానికి వచ్చిన రోజు. అప్పటికే వేరే స్కూల్లో నాలుగు చదివి మానేసిన నాకు సీటివ్వడం కుదరదన్నారు. మాష్టారు. ఆ స్కూలు నుండి టీ.సీ. తెస్తే గానీ చేర్పించడం వీలవదని అంటూనే ఒక మార్గం చెప్పేరు. అక్కడ వున్న పేరు కాకుండా వేరే పేరున ఇక్కడ చేరడం. అప్లికేషన్ నింపుతూ మాష్టారికి నచ్చిన సినిమా హీరోల పేర్లు చెప్తూ వచ్చారు... నాన్న దేనికి తల వూపుతాడోనని.
“అవేవీ ఒద్దండీ... రాబర్ట్ విల్సన్ అని రాయండి? కొత్త గొంతు వినపడింది. అతని వైపు చూసేను. తెల్లబట్టలేసుకొని, చేతిలో నల్లటి పుస్తకంతో వున్నాడతను. మెడలో సిలువ వేలాడుతో.. అతను తరచూ వూరు రావడం, ఇంటికి దగ్గరవడం నాకు గుర్తుకొచ్చింది అప్పుడు.
"ఇదేటి వోయ్! ఇలగుందీ పేరు?” అని నాన్నని అడిగారు మాష్టారు ఆశ్చర్యంతో. నాన్న నేల చూపులు చూస్తున్నాడు.
“మీము మతము తీసుకున్నాము” అని నాన్న అమాయకంగా అనడం నాకింకా గుర్తే .
మతమూ... తీసుకోవడమూ!?
తీసుకోవడానికి ఎవరిస్తారు? ఎందుకిస్తారు? అసలు ఇవ్వడమేమిటి? మతమంటే ఏమిటి? మా వూరికి మతమెలా వొచ్చింది?
మరి అప్పుడు మా వూరెలా వుండేది?
బద్దలైన అద్దం పెంకుల్లో నా ప్రతిబింబంలా... పగిలిన నా గుండె లోతుల్లోంచి వెల్లువెత్తుతున్న హృదయ ఘోషలా...
ప్రశ్నలు... సందేహాలు....
తాతల నాటి ముచ్చట్లలో మా వూరిని చూసేను. ఇప్పుడు ప్రధాన రహదారికి నాలుగు కొండల అవతల, అడివికి ఆమడ దూరంలో, చుట్టూ పొలాలతో మూడే మూడు వాసల్లో వుండేది వూరు. భూములున్న వాళ్లు పొలాల్లోనూ, లేనివాళ్లు కొండల మీద పోడు వ్యవసాయం చేసే వాళ్లు. అడవిలొ చింత పండూ, చీపుర్లూ, పనస పళ్లు, ఇప్పమొగ్గలూ సంతలో అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళు.
అంతా వర్షాధారమే. వాన కురిస్తే తిండి, లేదంటే పస్తులు. వాన కురిపించేది అడివి తల్లి, అందుకు సాక్షులు పూర్వీకులే అని నమ్మకం. చనిపోయిన వాళ్లు చల్లగా చూస్తే అడివి తల్లి కరుణించినట్లే.. లేదంటే కరువు.
పెద్దల్ని ప్రసన్నం చేసుకుని చినుకుల ఆశీర్వాదం పొందడమే పండుగ.
పండుగంటే... గూడెంలోని అందరి గుండె చప్పుళ్లనూ డప్పులు చేసి అడవికి వినిపించడం.
పండుగంటే... కొండమీద పండిన ప్రతి గింజా మీ చలవేనని పిన్ల కర్ర పాటలు పాడడం.
నీ నీడలో ఒక్కటై వున్నామని అడివి తల్లి ముందు గజ్జె కట్టి థింసా అడుగులు వేయడం... అడవికి దండం పెట్టడం.
అంతే. అడవే దేవత. పోయిన పెద్దాళ్లే దేవుళ్లు. దేవుళ్ల కనుసన్నల్లో దేవత ఒడిలో బతకడమే మతం. .
మరి ఇప్పుడు? మా వూరెలా వుంది??
అనడానికి ఆదివాసీ గ్రామం గానీ అన్ని ఆధునిక సదుపాయాలు అందుకుంది. టి.వీ, సెల్ పోన్, ఫ్రిజ్, మోటారు బైక్. ఈ వస్తువుల కంటే ముందు... వస్తువుల్ని మోసుకొచ్చిన రోడ్డు కంటే ముందు మా వూరికి ఒక సిమెంట్ కట్టడం వొచ్చింది. అది బడి కాదు... పంచాయితీ భవనమూ కాదు... చర్చి! -
అత్యంత వైభవంగా... ఆధునిక హంగులతో... ఆకుపచ్చని అడవిలో రంగురంగుల కట్టడం. దాని చుట్టూ పూరి గుడిసెల్లో మోకాలిపై మేము..
చలిచలి గాలుల్లో తుడుము డప్పుల హోరు.
చలి మంటల్నీ, మంచం క్రింది కుంపట్లనీ వదిలి వూరు వూరంతా వీధుల్లో ప్రవాహమైపోతున్న రాత్రి... యువతీ యువకుల థింసా అడుగుల సవ్వడీ....
ఇవేవీ నన్ను నిలువనీయడం లేదు. నా కాళ్ల సంకెళ్లు తెంచుకుని నాన్న కు తెలీకుండా పాత వూరి వైపు అడుగులేసేను.
అక్కడ...
మేము వదిలేసిన ఇల్లు... ఆ సందడిలో ఎంతో దిగులుతో కనిపించింది. నా కోసం ఎన్నో కలలు గన్న తాత కనిపించేడు. తాత నడిచిన అడుగులు కనిపించేయి. జీవం తొణికిసలాడే వూరు కనిపించింది. సందడితో వున్న సమూహం కనిపించింది.
అలాంటి వూరు నుంచి ఎందుకు వేరయ్యేము?
---------------------------------------------
తాత చనిపోయిన తర్వాత ఊరి పెద్దమనుషుల్లో ఒక నాన్న వ్యవసాయం తో పాటు వ్యాపారం కూడా చేసేవాడు. మా రోడ్డుకు మరీ దూరంగా, కొండల మధ్య వుండడంతో ఏ షావుకారీ వచ్చేవాడు కాదు. అందుకని నాన్న సంతలోని కొన్ని వస్తువుల్ని కొని వూర్లో అమ్మేవాడు. డబ్బు కోసం కాకుండా వూరి అవసరాల కోసం వ్యాపారం చేసే వాడు. ఇప్పమొగ్గలు, కందులు, చింతపండు, చీపుర్లు... ఏవైనా వస్తు మార్పిడి చేసే వాడు.
అప్పట్లో ఐదు చదివి మానేసిన నాన్నని హాస్టల్లో కుక్కు ఉద్యోగం ఇస్తామని పిలిచిందట ఐటీడీఎ. తీరా అక్కడికెళ్లాక హాస్టల్లో అందరూ తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు తప్ప జీతమొచ్చే ఉద్యోగం కాదని తెలిసి మానేసాడు. అప్పటి నుండి నాన్నకి ఆ ఆఫీసంటే రోత పుట్టింది. ఆ తర్వాత రోజుల్లో ఊర్లో వాళ్లు ఏదో సాయం అందుతుందని ప్రతి సోమవారం గ్రీవెన్స్ కి వెళ్లి వస్తున్నా నాన్న మాత్రం ఎప్పుడూ ఆ మెట్లెక్కలేదు. అతని మనసులో 'అది మా కోసం కాదు' అని ముద్ర పడిపోయిందేమో! -
సరిగ్గా అలాంటి సమయంలోనే తెల్లదుస్తుల్లో వున్న వ్యక్తి వూర్లోకి అడుగు పెట్టేడు. ఆ తర్వాత్తర్వాత తెలిసొచ్చింది. అతని ద్వారానే మా వూర్లో మతం నడిచొచ్చిందని. తరచూ ఇంటికొస్తూ వుండే వాడు. నాన్నతో సన్నిహితంగా వుండేవాడు. అతనే నాన్న వ్యాపారాభివృద్ధికి ధనసాయం చేసాడని ఆ తర్వాత తెలిసొచ్చింది. ఎవరికైనా ఒంట్లో బాగోలేక పోతే వాక్యం చదివి ప్రార్ధన చేసేవాడు. ఒక్కోసారి మాత్రలని కూడా ఇచ్చేవాడు. మాత్రలతో తగ్గిన జ్వరాన్ని ప్రార్ధనతో తగ్గినదిగా చెప్పేవాడు.
క్రమక్రమంగా వూర్లోని కొంతమందితో సంఘం స్థాపించాడు. వాళ్లంతా ఒక్కచోట చేరి బైబిల్ చదివి ప్రార్థన చేసే స్థాయికి తీసుకొచ్చేడు.
ఓ రోజు....
ప్రార్ధన ముగించి కళ్లు తెరిచేసరికి నాన్న చేతిలో వందల నోట్లు కొన్ని మెరుస్తూ కనిపించేయి. ఎదురుగా అతను. 'ఎందుకు?” అన్నట్లు అడిగాడు నాన్న. “ఇక నుంచి వూరి ప్రజల బాధల్ని ప్రభువుకి నువ్వే వినిపించాలి. ముందుండి అందరినీ దేవుని సన్నిధికి చేర్చాలి. అందరికోసం ప్రార్ధన చేయాలి.” అని ముగించేడు.
ఆ కొద్ది రోజులకే నాన్న లాంటి వారందరికీ ట్రైనింగు కోసం పంపించేరు. ప్రతిరోజూ విధిగా ప్రార్ధన చేయాలి. ఆడవాళ్లు బొట్టు పెట్టుకోకూడదు. కొత్త వాళ్లెవరైనా వస్తే షేక్ హేండ్ తీసుకోవాలి. సారా మానేయాలి. తుడుం కొట్టకూడదు. డప్పు ముట్టకూడదు. ఇలాంటి కొత్త నిబంధనలెన్నో వూర్లోకొచ్చేయి.
ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం వొచ్చేది నాన్నకి. వాటితో పాటు సవర భాషలో పాడిన క్రీస్తు గీతాల సీడీలు, బైబిళ్లు, రంగురంగుల కేలండర్లూ తో పాటు విలువైన కానుకలు ఎక్కడి నుండో వచ్చేవి.
తమ భాష ఆధునిక సంగీత పరికరాలతో అందంగా వినబడుతుంటే ఎవరికి ఆనందంగా వుండదు? ప్రార్ధన కొచ్చిన వాళ్లు పండిన పంటలో తొలికాయ, తొలిగింజ ప్రభువుకి చేరాలనడంతో అందరూ ఏదో ఒకటి తెచ్చిచ్చేవాళ్లు. దాంతో నాన్న మరింత ఉత్సాహంగా పని చేసేవాడు.
“అయితే... తాత ముత్తాతల కాసి నడుస్తున్న సంప్రతీకము ఎలాగ మానెస్తామూ?” అని వెనకడుగేసిన ముసిలోళ్లూ లేకపోలేదు.
వాటన్నిటికీ సమాధానం చెప్పింది సంఘం. -
“ఇన్నాళూ చెట్టుకీ పుట్టకీ మొక్కి మీరేమిటి సాధించేరు? అది మూర్ఖంతోనూ, అనాగరికంతోనూ కూడుకున్నది. ఎంత కాలమని మారకుంట వుంటారు? మనం అభివృద్ధిలోకి మారాలంటే ప్రభువుని నమ్ముకోవాల్సిందే”నని మరొక తీర్మానం కూడ చేసేరారోజు. మతం తీసుకున్నవాళ్లంతా వేరుగా ఒక కొత్త వూరుగా నిర్మించబడతారనిప్రకటించారు
అలా ఏర్పడిందే మా కొత్త వూరు... పాల్ నగర్
అక్కడి నుంచి చూస్తే ఈ వూరు చాలా దూరంలోవుంటుంది. ఎంత దూరమంటే ఒకరితో ఒకరు మాట్లాడితే వినిపించినా వెనుతిరిగి వెళ్లి పోయేంత దూరం.
---------------------------------------
నా వీపు మీద ఒక దెబ్బ పడ్డాక గానీ నాకు ఆ దూరం తెలిసి రాలేదు. తుడుము డప్పుల హెూరు ఆగిపోయింది. ధింసా నృత్యం మౌనం వహించింది. అందరి కళ్లలో ఆశ్చర్యం అలముకుంది.
“ఇక్కడేటి సేస్తున్నావురా? మతం తీసుకున్నోల్లు ఇలగ గెంతకూడదని తెలీదేట్రా?” అని నాన్న నన్ను బలవంతంగా అక్కడి నుండి కొత్త వూరికి ఈడ్చుకు వెళ్లిన దృశ్యం ఇంకా సజీవంగానే వుంది.
నా గుండెల్లో మోగుతున్న డప్పులు మూగబోయాయి. నా కాళ్లకు వేలాడుతున్న గజ్జెలు మోగక సంకెళ్లుగా మారిపోవడం తెలుస్తూనే వుంది.
బయట దూరంగా పాత వూరిలో డప్పుల హోరు, నాలో నిశ్శబ్దం.
మా వూరిప్పుడు కొత్త దేవుని నీడలో వుంది.
ఎవరో విధించిన నిబంధనల్లో బంధీ గా వుంది.
నా గుండెల్ని కదిలించే డప్పు లేదు. ఉరుము మెరుపుల తుడుము దెబ్బా లేదు.
అడవిని ఆడించే కిన్నెర పాటా లేదు.
వెన్నెల రాల్చే పిన్నల కర్రా లేదు. ఆటలేదు. పాట లేదు. థింసా నృత్యపు అడుగుల సందడి అసలే లేదు. -
అంతా నిశ్శబ్దం... నిశి రాతిరి నిశ్శబ్దం. గుండెలోతుల్లోగుచ్చుకుంటూన్న అద్దం పెంకుల శబ్దం....
---------------------------------------
ఓరోజు సాయంత్రం వూరు సమావేశమయంలో “లాజర్ వున్నాడా?” అడిగాడు అతను.
అది నాన్న కొత్త పేరు. అసలు పేరు 'లక్కాయి' అని నాన్న ఎప్పుడో మర్చిపోయివుంటాడు. ప్రచారం కోసం కొండ కొండనీ ఎక్కి దిగేవాడు. ఇంటింటినీ పలకరించేవాడు. చుట్టాలూ, బంధువులూ అందరిళ్లకీ వెళ్లి ప్రార్ధనలు చేసి మతం వైపుకి మళ్లించేవాడు నాన్న.
“లేడు గదా?” అన్నారెవరో.... ప్రచారం కోసం ఎప్పుడూ వూరి బయటే వుంటాడన్న అర్ధంలో.
"లాజర్ ను సంఘం నుండి బహిష్కరిస్తున్నాం” అని అన్నాడు గొంతు సవరించుకొని తెల్లదుస్తుల్లో వున్న వ్యక్తి. ఊరంతా ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. అందరికీ తెలుసు నాన్న ఎలాంటి వాడో.
“ఎందుకో తెలుసా? కొత్త నిబంధనని చేతబట్టి మద్యం సేవించేడు. దేవుని కృపని ధిక్కరించేడు కాబట్టి” అని ముగించేడతడు.
తాగడం తప్పే. కాదనలేదు కానీ కొండోడి బతుకులో సారా తాగడం నేరం కాదు. పొద్దు తూరక ముందె కొండకి చేరి అవిశ్రాంతంగా శ్రమించి పొద్దు ములిగే సమయానికి రెండు జీలుగు చుక్కలు గొంతులో పోసుకొని వూరు చేరి నృత్యం చేయడం ఇక్కడి బతుకులో ఒక భాగం.
పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమేటీ ?
రాత్రి వేళ చలి మంట చుట్టూ చేరిన వూరు... తుడుము డప్పుల చప్పుళ్లలో ... సన్నాయి, గొగోయ్ సంగీతాల నడుమ శ్రమని మర్చి పోవడానికి అందరు కలిసి సారా ని సేవించడం... నృత్యం చేయడం కొత్త కాదు. ఆ రాత్రిళ్లలో సారా ఒక సంప్రదాయం . అందరూ కలిసి తాగడం ఒక ఐక్యతా చిహ్నం. ఇంటికొచ్చిన అతిధికి సారా ఇచ్చి మర్యాద చెయ్యడం ఒక జీవన విధానం.
ఇప్పుడది ఎక్కువై ప్రాణాల మీదికి తెచ్చుకోవడం తప్పే కావచ్చు. కానీ నాన్న అంతలా తాగి వుంటాడా? అలసిన శరీరానికి నిద్ర పుచ్చడానికి రెండు చుక్కల విశ్రాంతినివ్వడం నేరమా? దానికి శిక్ష బహిష్కరణా?
ఇంటికొచ్చిన నాన్నకి విషయం తెలిసింది. మొదట్లో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత రోజుల్లో నాన్నకి అర్ధమైపోయింది. .. బహిష్కరణ ఎంత బలమైనదో!
ఇరుగు పొరుగు మాట్లాడక పోవడం... ప్రార్థన సమయంలో కూడ దూరం చేయడం నాన్న మనో వేదనకు కారణమయ్యింది. ఊరి పెద్దరికం ఎవరి చేతుల్లోకి మారిపోయిందో స్పష్టమైపోయింది. తిండీ తిప్పలు మానేసి కొండల మీదే గడిపే వాడు. ఇంటికి చేరే వాడు కాదు. గుండెల్లో కసి నిండిపోయిందేమో... నిజంగానే తాగడం మొదలు పెట్టేడు. తాగి తాగి ఏ తుప్పల్లోనో, డొంకల్లోనో పడుకుని రోజుల తరబడి కనపడే వాడు కాదు. మనుషులు అడివి పట్టీడం అంటారే... అలాగ.
మమ్మల్నీ, ఇంటినీ వదిలి కేరేజీలో గంజి పట్టుకుని నాన్నని వెదుక్కుంటూ అడివిలంట తిరిగీది అమ్మ. తెల్లవారి బయల్దేరి ఏ రాత్రికో వచ్చేది... కన్నీళ్లని మోసుకుంటూ. “అమ్మా! బువ్వే... ఆకలి” అని చెల్లి తమ్ముడు అమ్మ గుండెలమీదికి ఎగబడే వాళ్లు. పొయ్యి ముట్టించి బువ్వలుడికీ వరకైనా పిల్లలు ఆగాలగదా అని పొరుగింటోల్లకి అంబలో, గెంజో అడిగితే ముఖం చాటేసే వాళ్లు. మతం తీసుకున్న వాళ్లు బహిష్కృతులైతే నరకాన్ని ఇక్కడే ఎదుర్కోవాల్సి వస్తుందని నాకప్పుడే తెలిసింది.
అందుకే నేనెప్పుడూ హాస్టల్ వదిలే వాడిని కాదు. చెల్లీ, తమ్ముడ్నీ కూడా హాస్టల్లో చేర్పించింది అమ్మ.... తిండి దొరుకుతుందనే. హాస్టల్ లో ఏ తగువుల్లోనూ తలదూర్చేవాడిని కాదు. నాకు భయం. మాష్టారు ఏ కారణం చేతైనా ఇంటికి పంపించేస్తే??? తిండి దొరకదని భయం. అమ్మకి కష్టం కలుగుతుందని భయం.
ఆ రోజు బట్టలుతుక్కుని తడి బట్టల్తో హాస్టల్ గదిలో కొచ్చేను. నా పెట్టి మీద కూర్చొని నా కోసం ఎదురు చూస్తున్నాడు మండంగి మామ. అతన్ని చూస్తే అమ్మను చూసినట్టియ్యింది. పరుగు పరుగున అతన్ని చేరుకున్నాను.
“ఇంటికెల్దుమా” అన్నాడు.
“ఎందుకే?” అన్నాను
“ఏమీలేదు... నాన్న...” అని ఆగేడు
“ఇంటికొచ్చేడా?” అన్నాను “ఔ” నన్నట్టు తల వూపేడు.
“ఎన్నాళ్లింది నాన్నను చూసి? అప్పుడెప్పుడో అమ్మనీ, మమ్మల్ని దగ్గర కూర్చో బెట్టుకొని బైబిలు చదవడం నేర్పించేడు. పాటలు పాడి నిదురపుచ్చేవాడు. మేము గుర్తొచ్చి ఇంటికి చేరివుంటాడు. ఇక పై బైబిలు వూసెత్తడేమో?! కథలు చెప్తాడు. ఇంటి పెద్ద కొడుకు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలో చెప్తాడు. చిన్నపుడు తాతకి ఎలాంటి సాయం చేసేవాడో వివరిస్తాడు. అమ్మనెలా చూసుకోవాలో చెపుతాడు.
బస్సు దిగి వూరి వైపు నడుస్తున్నాం. కొండ మలుపు తిరిగితే వూరు కనపడుతుంది. రెండు పొలం గట్లు దాటితే ఊరి పొలిమేరల్లోకి చేరిపోతాం. కానీ మండంగి మామ ఊరి దారి కాకుండా కొండదారి నడిపించేడు. కొండవాలులో కురికిమాని చెట్టుకింద ఊరి జనం గుమిగూడి వున్నారు. నన్ను చూసి ఒక్కొక్కరూ దారిచ్చేరు.
అక్కడ....
చెట్టుకొమ్మకి వేలాడుతూ కనిపించేడు నాన్న.
-----------------------------------------
“రాబర్ట్! రాబర్ట్ విల్సన్?” ఎవరో పిలుస్తున్నారు. మళ్లీ నన్నే. అదే పేరు... నన్ను శూన్యాన్ని చేసిన పేరు. నాలోని 'నన్ను' ని లేకుండా చేసిన పేరు.
పేరంటే... ఒక గుర్తింపు కదా? పేరంటే... ఒక వ్యక్తిత్వం... ఒక అస్థిత్వం . తరతరాలుగా నడిపిస్తున్న ఒక మానవ జీవన సూత్రం. పేరంటే... ఒక జాతి. ఒక సంస్కృతి. నా పేరుతో నాకు సంబంధించినవేవీ లేవు కదా!
రాబర్ట్ విల్సన్!
ఎవరి పేరది? ఏ దేశపు పేరిది? ఈ పేరులో ఎవరి సంస్కృతి దాగి వుంది? ఏ జాతి అనవాళ్లున్నాయి? ఎవరి తరానికి వారసుడను?
“నువ్వు గిరిజనుడివేనా?” డిగ్రీ పూర్తి చేసి టీచర్ గా సీటు కోసం ఇంటర్వ్యూ లో అడిగారు... నా సర్టిఫికేట్లని ఎగాదిగా చూస్తూ.
'ఔ ' నన్నాను.
“ఎలా?” అన్నాడతను .
“ఇలాంటి పేర్లు మీలో లేవే? మీ బంధువుల పేర్లు కొన్ని చెప్పు”
“సన్నాయీ... కడాయీ... అప్పారావూ... అన్నమ్మి.... మిలంతి... సొంబరా... గయామి.... జిల్కి.. సోమేసూ...” గుర్తొచిన పేర్లన్నీ చెప్పేను. నన్ను చూసుకునే పేరు ఎక్కడా లేదు.
“నువ్వు గిరిజనుడిని నీకు రిజర్వేషన్ కల్పించింది. రాజ్యాంగం... నీవది పొందాలంటే నువ్వు గిరిజనుడివని నిరూపించు కోవాలి కదా?” అని టిక్ పెట్టేరతను. "
నిజమే... ఎవరు నిజమైన గిరిజనుడు? అతన్ని ఎలా గుర్తు పట్టాలి? ఎమ్మార్వో ఇచ్చిన కాగితమ్ముక్క సరిపోతుందా?? అదే అయితే... ఆలాంటి కాగితమ్ముక్కలు ఎన్ని లేవు???
ఆ రోజు ఎమ్మార్వో ఆఫీసులో సర్టిఫికెట్లు ఇస్తున్న రోజు... ఏమి జరిగింది?
“ఈ పేరేమిటి ఇలా వుంది? ఎవరితను? రమ్మనూ....” అని ఎమ్మార్వో గారు పిలిచారు. లోపలికి వెళ్లాను.
“ఏ వూరు?” చెప్పేను.
“మీ నాన్న పేరు?”
అదీ చెప్పాను.
“అయితే... కన్వర్టెడ్ అన్నమాట”
మౌనంగా తల దించుకున్నాను. - - “మతం సరే... మరి నువ్వు గిరిజనుడివని ఋజువేమిటి?,
“నీది ఏ వూరు... ఎక్కడ పుట్టేవు? ఎవరికి పుట్టేవు?
నీ ఆచార వ్యవహారాలేమిటీ? నీ పండుగలేమిటి? నీ సంప్రదాయమేమిటీ?? ఇవన్నీ ఎంక్వైరీ చేసి నీకు సర్టిఫికేట్ ఇస్తాం. సరేనా?” అని లేచేరు.
'నాన్నా! ఎంత పని చేసేవు నాన్నా?! ఈ పేరు పెట్టి నన్ను జాతి నుండి వెలివేసినట్టు, నా కంటూ ఒక గుర్తింపు లేకుండా చేసావు కద నాన్నా! అడవి లో పుట్టి... అడవిలో పెరిగి.... పేరు మూలంగానే ఈ క్షోభని ఎందుకనుభవించాలి? చిన్నపుడు ఈ పేరున పిలుస్తుంటే అందరిలోనూ ప్రత్యేకంగానూ, కొత్తగానూ వుండేది. రంగుల చొక్కాలా బాగున్నట్టనిపించేది. మరి ఇప్పుడు??? బరువుగా... మోయలేనంత భారంగా... దానికిందే నలిగిపోతున్నంతగా.”
నాన్న పోయాక అమ్మ మౌనంగా పాత ఇంటికి చేరింది. అమ్మ వెనక మేమూ నడిచేము. అక్కడ ఎప్పటిలాగానే పాత జీవితం గడిపాము. ఆ వూరు మళ్లీ అక్కున చేర్చుకుంది. అప్పుడే తెలిసింది. చినుకు రాలడం పండగని. నేల దున్నడం పండుగనీ. విత్తునాటడం పండుగనీ. మొక్క మొలకెత్తడమే పండుగనీ. పువ్వు పూసి కాయ కోయడమే పండుగనీ. పండుగ ప్రతి కదలిక లోనూ ప్రకృతి తో కలిసి నడుస్తున్నామని అప్పుడే తెలిసొచ్చింది. నేను అడవి మనిషి ననీ... తాతే నా సంస్కృతని అప్పుడే తెలిసింది.
ఇన్నాళ్లూ... నా వాళ్ల అమాయకత్వాన్ని, పేదరికాన్ని అడ్డం పెట్టుకొని మాపై మరకల్ని అంటిస్తున్నదెవరు? నన్ను నా నుంచి ... నా సంస్కృతి నుంచీ దారి మళ్లిస్తున్నదెవరు? నా సంస్కృతికి మూలాధారమైన నా భాషని మతం కోసం హైజాక్ చేస్తున్నదెవరు? అసలు మతమెందుకు? అది మనిషికి అవసరమా??
---------------------------------------------------
'రాబర్ట్.... రాబర్ట్ విల్సన్ ఎవరయ్యా? ఎన్ని సార్లు పిలవాలి నిన్ను? ఎక్కడికి వెళ్లేవు? పేరు మార్చుకోడానికి గెజిట్ అప్లై చేసింది నువ్వేనా?” అని కలెక్టరు గారి దఫేదారు అడుగుతున్నాడు.
“ఔనండీ” అని లోపలికి వెళ్లేను.
ఇప్పుడు చెబుతున్నా.... నా కొండ కొనకు పూచిన సూర్యుణ్ణి డప్పుగ చేసి దరువుల వరుసల్ని మార్చి మార్చి కొట్టి చెపుతున్నా నా పిన్నల కర్ర పాటల్లోంచి... 'టిల్లకాయ' ధ్వనుల్లోంచి.... నా థింసా అడుగుల చప్పుళ్ల లోంచి... గొంతుని 'గొగోయ్' గా మార్చి చెబుతున్నా...
" నేను మానవుణ్ణి
నేను ఆదివాసీని
నాకు మతం లేదూ....
నా పేరు సొంబరా” అని.
(ప్రజా ప్రభాతం -నవంబర్, 2013)
*గ్రీవెన్స్ - ప్రతి సోమవారం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తీర్చడానికి ITDA వారు నిర్వహించే సమావేశం.
*గుర్రం పండేసుకోడం - పిల్లలను భుజాన వేసుకోడం.
*పిన్ల కర్ర - వేణువు
*ఎజ్జోడు - గ్రామపూజారి.
*కానికు పొయ్యడం - మంత్రాలు చదవడం
*జీలుగు - జీలుగు చెట్టు నుంచి తీసే కల్లు.
*బియ్యం నెరపడం - బియ్యాన్ని చేతి వేళ్ళతో చేటంతా విస్తరింపచేయడం.
*వాస - వరుస , వీధి
*కిన్నెర, గొగోయ్ - తీగ వాద్యాలు
*టిల్ల కాయలు - గజ్జెల లాంటి వాయిద్యం.
*తుండు కుండ - చర్మ వాయిద్యం, డప్పుకి తోడు.
*సవర - సవరల భాష.
*** 'గురి' సంకలనం కొనడానికి పల్లవి పబ్లికేషన్స్ - వెంకట నారాయణ గారిని క్రింది అడ్రస్/ఫోన్ ద్వారా సంప్రదించండి.
పల్లవి పబ్లికేషన్స్, సాయి టవర్, మొగల్రాజ పురం, రఘురామ స్ట్రీట్ , విజయవాడ - 10.
వెంకట నారాయణ గారి మొబైల్ : 098661 15655
BGM credits:Kanmani Anbodu Kadhalan Piano Cover - Jingleman Cover #11 (https://www.youtube.com/watch?v=LSolsKyf6Vs)