రోహిణి’ పతంజలి శాస్త్రి గారి ‘రామేశ్వరం కాకులు’ అనే కథాసంకలనం లోనిది.
• ఈ కథపై చక్కని సూచనలిచ్చి, ఆడియోని మీకందించడానికి సహకరించిన మిత్రులు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు.
**’రామేశ్వరం కాకులు పుస్తకం’ అమెజాన్ లో దొరుకుతోంది. – http://amzn.to/3bFv5W2.
కథనం:
చరిత్ర లోని ఒక కథను Allegorical గా తీసుకొని, సమకాలీన సమస్యను ఎత్తిచూపుతూ, ఒక పరిష్కార మార్గాన్ని సూచనగా చెప్పడం, ఈ కథలో ముఖ్య ప్రక్రియ. ఈ ప్రక్రియ తో తెలుగు లో వచ్చిన మరో రెండు కథలు – చలం గారి ‘ ఓ పువ్వు పూసింది’ రావూరి భరద్వాజ గారి ‘ పాటకు తగిన రోలు’.
కథలో ముఖ్యాంశం నదీజలాల వివాదం. రోహిణి నదీజలాల పై శాక్య , కోలీయుల వివాదం గురించి రెండు కథనాలు ప్రచారంలో వున్నాయి.
తాను చూసిన కొన్ని సంఘటనల వల్ల సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడుగా మారిన తర్వాత,జలాల గురించి ఇరువర్గాలూ యుద్దానికి సిద్ధమైతే, గౌతముడు యుద్ధభూమికి వెళ్లినట్టుగా, ఆయన సమక్షంలో ఇరు వర్గాలూ తమ ఆయుధాలు విసర్జించి యుద్ధాన్ని మానివేశాయి అని ఒక కథనం చెప్తే… ( http://bit.ly/warsankyans)
శాక్య వంశానికి చెందిన సిద్ధార్థుడు, జలాల వివాదం మీద జరిగిన శాక్యుల సమావేశంలో , తాను యుద్ధం యొక్క ఫలితాలను, అనర్థాలను ఎత్తిచూపినప్పుడు, వర్ణాశ్రమ ధర్మం గురించి చర్చ జరగడం, యుద్ధానికే, ఎక్కువమంది మొగ్గు చూపడంతో , వ్యతిరేకిస్తూ , సిద్ధార్థుడు సన్యసించడం , ఆ తరువాత కొంత కాలానికి ఇరువర్గాలూ యుద్ధాన్ని విరమించడం రెండో కథనం. (http://bit.ly/ambedkars (24-29, 56-57))
పతంజలి శాస్త్రి గారు రాసిన ఈ కథలోని విశేషం, ఈ రెండు కథనాలనూ సమన్వయం చేయడం.ఇలా ఒకే చారిత్రిక ఇతివృత్తం పై వున్న రెండు వేరు వేరు కథనాలలోని ముఖ్య అంశాలను స్పృశిస్తూ, ఒక సమకాలీన సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించారు ఈ కథ ద్వారా రచయిత.
కథలోని సమస్య గురించే గాక , నేటి సమాజంలో ఉండే ఎన్నో ప్రధాన సమస్యలపై , పరిష్కారం దిశగా, గౌతముని వాక్యాలను ఎన్నుకుని కథలో భాగంగా మనకందించడం శాస్త్రి గారి రచనా ప్రతిభకు ఒక నిదర్శనం.ఏ సమస్య పరిష్కారానికైనా , సరైన దృక్పధం, సమస్య పరిమితులు అర్థం చేసుకోవడం ముఖ్యమన్న విషయం కథ మనకు తెలియజెప్తుంది.కథలో భాగంగానే, ఈనాటి సామాజిక వర్గీకరణను సూచిస్త, వ్యాపార, శ్రామిక వర్గాలకు ఉండవలసిన సరైన దృక్పధం గురించి , వారికి సమాజం పట్ల ఉండవలసిన బాధ్యత గురించి కూడా చర్చించడం జరుగుతుంది.
కథ చివరి అంకం అంతా గౌతమ బుద్ధుడి ఆశ్రమంలో జరగడం, చర్చలకు కావలసిన వాతావరణం ప్రాధాన్యత ను గురించి రచయిత చెప్పినట్టుగా ఉంటుంది. అదే విధంగా రోహిణి నదిని వర్ణించేటప్పుడు , కథలో రాబోయే సందర్భం గురించి సూచిస్తున్నట్టుగా ఉంటుంది.కథలో ముఖ్యంగా గమనించవలసింది గౌతమబుద్ధుడు (శాస్త) పలికిన వాక్యాలు, ఇంకా ఆయన సమక్షం లో శ్రోతలు పొందే అనుభూతిని గురించి రచయిత వర్ణన.కథలోని ముఖ్య సన్నివేశాలలో తటస్థపడే నెమలి, బౌద్ధమతస్థుల నమ్మక ప్రకారం, విశాలహృదయానికీ, అంగీకారానికీ, చిహ్నం. ( http://bit.ly/buddhismpeacock )
అలాగే, రోహిణి నది వివాదం, మన దేశంలో కావేరీ జలాల సమస్య, పాలస్తీనా ప్రాంత వ్యవహారాలూ, అక్కడి జోర్డాన్ నది వినాశనం మనకు గుర్తుకుతెస్తుంది. (http://bit.ly/jordanpollution)
ఈ కథ ఆడియో రూపం లో , సుప్రసిద్ధ రేడియో ఆర్టిస్ట్ శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి గళాన మీరు వినవచ్చు.
కథ:
రోహిణీ నది, సంధ్యాసమయంలో శాన్త భుజం మీది నుంచి జారిన కాషాయాంబరంలా వుంది. ఇప్పటి పరిస్థితి విషమిస్తే ఇరుపక్షాల రక్తంతో రోహిణికి రక్తపుజీర పడుతుందనుకున్నాడు ఉపాలి. ఉపాలి భిక్షు అంతకుముందే నదిలో స్నానించి, బట్టలు పిండుకుని, ఒడ్డుకు చేరి మంద్రంగా ప్రవహిస్తున్న నదిని చూస్తూ అట్లా అనుకున్నాడు.
ఎగువ నుంచి ఒడ్డుకు సమీపంగా పొడవాటి గెడ సాయంతో వంపు తిరుగుతోంది పడవ. అట్లాగే చూస్తూండిపోయాడు ఉపాలి. మనోహరమైన సంధ్యగాలి అలలు ఉపాలి శరీరాన్ని మనసునీ మృదువుగా తాకి వెళ్లిపోతున్నాయి.
ఈవలివైపు ఆమ్ర వన విహారం చేరిన కొద్ది దినాల నుంచి నదిని చూసినప్పుడల్లా, కంఠం వరకూ మునిగినప్పుడల్లా తన నుంచి తాను వేరుపడి ఆవల బాల్యం గడిపిన అస్పష్టమైన శాక్యసీమను చూశాడతను. అక్కడే ఒక రాకుమారుడు ఉదయకాంతిలోకి గుర్రం మీద వెళ్లిపోవడం కూడా జ్ఞాపకం వస్తుంది.
ఈ నది వేరు, ఆ నది వేరు. అతని పెదాల్ని దాటి చిరునవ్వు వెలువ డింది. జేవురించిన సూర్యుడు, ఎర్రబారిన నది- అనేక దినాలుగా నది కావల, ఈవల రాజుకున్న ఆగ్రహావేశాల్ని తలపిస్తున్నాయి.
ఉపాలితో పాటు స్నానం చేసిన భిక్షువులు అప్పటికే విహారం వేపు నడిచి వెళ్లిపోయారు. సంధ్యా సమయంలో నీడల్లా దూరంగా కనిపిస్తున్నారు. ఉపాలి భిక్షు మనసులో చిన్న కలవరం కూడా లేకపోలేదు.
ఆ దినం ఉదయమే ఆనందుణ్ని అడిగాడు. “భన్తే, ఆవలితీరం భగవానుడి పుట్టుక వల్ల పునీతమైంది. ఈవల వారి నివాసం వల్ల పవిత్రమైంది. మరి ఈ కోలీయులు, శాక్యులు రక్తం చిందించడానికి ఎందుకు ఆయత్తమవుతున్నారు?”
దీర్ఘంగా ఉపాలివేపు చూస్తూ అన్నాడు ఆనందుడు. “అవిద్య అత్యంత కఠినమైన స్థితి. అగ్నికి గాలివలె కాపీర్ణం, ఆగ్రహం, మనుషుల బుద్ధిని బూడిద చేస్తాయి. వర్షాన్ని కలుపుకుంటేనే నది అవుతుంది. శాస్త్ర ధర్మోపదేశం వినడం వేరు. శ్రోతాపత్తి ఫలాన్ని పొందడం వేరని నీకు తెలిసినదే.”
“తలలు పగలగొట్టుకోవాలనే వారి ఉత్సాహం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది.”
“పొగరుబోతు ఏనుగు తథాగతుని ముందు మోకరిల్లింది.”
“సుద్ధోదన మహారాజు మౌనసందేశాలు మాత్రమే పంపుతున్నాడను కుంటాను.”
నవ్వి ఆనందుడు అన్నాడు. “కానీ శాక్య ఉపాసకులు ఇక్కడకు వస్తూనే వున్నారు. శాస్తకు ఎవరి సందేశాలు, ఆహ్వానాలు అవసరం లేదుగదా?”
ఆలోచనలో పడి ఉపాలి నదిమీద పల్చటి చీకటి పొర పరచుకోవడం గమ నించలేదు. పడవవాడు పడవని ఒడ్డుకు లాగి తాడు కడుతున్నాడు. పడవవాణ్ని చూడగానే అనుకున్నాడు. ఈ వ్యక్తికీ, ఈ నదికీ, ఈ పడవకీ, పడవెక్కి తీరం చేరే యాత్రికులకీ ఏమిటి సంబంధం? నవ్వుకుంటూ ఉపాలి వెనక్కి తిరిగి విహారం వేపు నడిచాడు.
తీసి ఉన్న వెదురుతలుపు పక్కకి నెడుతూ శ్రేష్టి కుటుంబం, విహారంలోకి అడుగు పెట్టకముందే ఎదురు వచ్చింది. ఉపాలి ఎదురవగానే వారంతా ఆగి అభివాదం చేసి అతను లోపలికి వెళ్లేవరకూ ఆగి మరీ బయలుదేరారు.
ఆమ్ర విహారం అంత పెద్దది కాదు. అనుకోకుండా శాస్త రాక గురించి తెలియడంతో విడిది ఏర్పాటు చేశారు. భిక్షకోసం జనపదంలో సంచరిస్తున్న భిక్షువుల్ని గృహపతులు ఆదరంగా ఆహ్వానిస్తున్నారు.
తథాగతుడు రావడంతో నదిలోకి కొత్త నీరు ప్రవేశించినట్టయింది. సమీప జనపదాల నుంచి బళ్లు, నడక, కొంతమంది పడవల్లో జనం వచ్చి శాస్త దర్శనం చేసి ధర్మోపదేశం విని వెడుతున్నారు. శ్రేష్ఠి. ఇతర పెద్దలు కొద్దిమంది, రెండు పూటలా విహారానికి భిక్షుక సంఘాన్ని కలిసి పరామర్శించి వస్తుంటారు. మొత్తానికందరికీ తథాగతుడి రాకతో ప్రశాంతంగా, వేసవిలో చిరువర్షం, చల్లగాలిలాగా వుంది.
విహారంలో కాగడాలు వెలిగించారు. కుటీరాల్లో దీపాలు వెలుగుతున్నాయి. తథాగతుడి ప్రధాన అంతేవాసులు ఆనందుడు, ఉపాలి మరో నలుగురు వృద్ధ స్థవిరులు ఆనందుడి కుటీరంలో కూచుని వున్నారు. వేడిపాలు సేవించారందరూ. ఆనందుడు ఉత్తరీయం తీసి ఒళ్ళో వేసుకుని రెండు చేతులు వెనక్కి నేలమీద ఆనించి నిట్రాటకు అనుకుని అందరివేపూ చూశాడు. మట్టి దీపాల వెలుగు ఆయన శరీరం మీద కదులుతూఉత్తరీయం కప్పుతున్నట్టుంది. ఉపాలిని చూస్తూ చటుక్కున అన్నాడు ఆనందుడు.
“త్వరలో శాక్యులు పెద్దమనుషుల్ని పంపుతారని వినికిడి.”
“అనగా రాజకుటుంబం, అధికారులు…”
“కాదు… వారి అనుమతితోనే శాస్తను సంప్రదించడానికి వస్తున్నారు,” ఒక వృద్ధ స్థవిరుడన్నాడు.
“స్వయంగా శాస్త శాక్యసీమ వస్తాడని నమ్మకం సడలి వుంటుంది. సుద్దోధనుడి ఆంతర్యం అదే అయి వుంటుంది.”
మరో స్థవిరుడన్నాడు. “ఇది శుభసూచకం. ఇక్కడ శాస్త వుండగా ఇరుపక్షాలూ యుద్ధానికి దిగడం మంచిదికాదు. అప్పుడే ఆయుధాలు సమకూర్చుకుంటున్నారని వింటున్నాం. పెద్ద కర్రలు, విల్లమ్ములు, రాళ్లు రేవు దగ్గరికి చేర్చడానికి సిద్ధంగా వున్నారు. మహిళలు కూడా వెదురుశూలాల్ని సూదిగా చెక్కి సిద్ధం చేస్తున్నారు.” .
ఆనందుడు తల వూపుతూ అన్నాడు. “సాగునీటిని నిరోధించడం, చెరువుల్ని కలుషితం చెయ్యడం పాపకర్మలు. వర్షం అందరికోసం పడుతుంది. నదికి నీరిస్తుంది. ఏ ఒకరికోసమో దాచి ఇవ్వదు. నదీధర్మాన్ని అర్థం చేసుకోవాలి. నదిని అడ్డగించి సాగునీటి కోసం ఒకరినొకరు చంపు కోవడం పాపకర్మకు పరాకాష్ఠ. పొగరుబోతు ఎడ్లలా ఒకరినొకరు పొడుచుకోవడానికి సిద్ధపడుతున్నారు.”
“అవును. అయినా రాజధర్మం విస్మరించిన తరువాత ప్రజలు మూర్ఖులవడం ఆశ్చర్యం లేదు.” అన్నాడు ఉపాలి. మళ్లీ అతనే స్థవిర మిత్రుల్ని చూస్తూ అన్నాడు. “యుద్ధం వరకూ వెళుతుందని నేను అనుకోవడం లేదు.”
స్థవిరులు తలలూపేరు. చాలా సేపటి వరకూ ఎవరి ఆలోచనల్లో వారుండి పోయారు. విహారంలో ఏదో పక్షికూత దూరంగా వినిపించింది. అందరూ కుటీరంలో మేల్కొన్నారు. ఉపాలి మనసు శాంతించింది.
ఆనందుడు అన్నాడు. “ఇక్కడ సమస్య ప్రధానం కాదు. సమస్యను అర్థం చేసుకునే దృష్టి ముఖ్యం. దానివల్ల సమస్య పరిమితులు అర్థం అవుతాయి. అది వారికి తెలియవలసిన విషయం.”
ఎక్కడో శుభ్రంగా స్నానించి సూర్యుడు రోహిణి నదిలో లేత బంగారం కలుపుతున్నాడు. ఆమ్ర విహారంలో పక్షులు లేత సూర్యకాంతిని తింటూ నదివేపు ఎగిరి పోయాయి. స్థవిరులు , కొద్దిమంది ఉపాసకులు వెంటరాగా పెద్ద బంగారు గొలుసులా మెరుస్తున్న రోహిణిలో శాస్త స్నానానికి దిగాడు.
చల్లటి ఉదయపు గాలివల్ల నదీ తరంగాలు శాస్త దేహాన్ని స్పృశించడానికి వేగిరపడుతున్నాయి. వ్యక్తమౌతున్న వెలుగు ముడతలు పడి కదులుతున్న నది, మునిగి తేలుతున్న శాస్త శరీరం అవిభాజ్యంగా కనిపించాయి. మనోహరమైన ఈ దృశ్యం ప్రతిదినమూ అంతేవాసులందరూ చూస్తూనే ఉన్నా, ఎప్పటికప్పుడు, ప్రతి ఉదయం ఒక నూతన శుభ్రధావళ్యాన్ని సంతరించు కుంటున్నట్టు అనిపిస్తోంది. తథాగతుడి దేహం ఉదయకాంతిని పీల్చుకోగానే ఆయన తిరిగి విహారానికి బయలుదేరాడు.
విహారంలో ఎక్కడివారక్కడ చెట్లకింద, దారి కటూ ఇటూ నిశ్శబ్దంగా నుంచుని శాస్త అభివాదం చేశారు. ఎక్కడో చెట్టుకింద నుంచుని గొప్ప ఆశతో నెమలి కూసింది. నిశ్శబ్దాన్ని పూరించింది మయూర ఓంకారం. మరికాసేపటికి ఎప్పటిలాగే పెద్ద మామిడి చెట్టు కింద తాటి ఆకుల చాప వేసి దానిమీద గుడ్డ వేసి రెండు దిండు ఏర్పాటుచేశారు. భిక్షువులు, ఉపాసకులు, కొద్దిమంది జానపదులు, శాస్త ఆసీనుడైన తరువాత కూచున్నారు. చెట్లు ఆకులు తొడిగినట్టు వారి శరీరాలకు మొత్తం చెవులు మొలిచాయి.
తథాగతుడు సంపద మీద, సంపద పంచుకోవడం గురించి, వితరణ. క్లుప్తమైన ధార్మికజీవనం గురించి, సమ్యక్ దృష్టి గురించి ఉపదేశం ప్రారంభించాడు. “పండ్ల చెట్టు విడిచిన పండ్లని ఏరుకుని తినడం వేరు. చెట్టుని కుదిపి కుదిపి కాసిని పళ్లు తీసుకుని ఎక్కువ పళ్లను వదిలివెయ్యడం అపరాధం,” అన్నాడు శాస్త. మళ్లీ ఎక్కడ్నుంచో అర్థమైందన్నట్టుగా నెమలి కూసింది. “ఒక నియతి ఉంటుంది. ఆయుష్మంతులారా, ఈ నియతిని అర్థం చేసుకోవడం మన ధర్మం,” అన్నాడాయన. శాస్త్ర మాట్లాడుతున్నంత సేపూ ఒక మంగళకరమైన శాంతి ఏదో అందర్నీ మృదువుగా ఆవరిం చింది.
రోహిణి నది ఎండకి వేడెక్కుతూ నిర్లిప్తంగా నీరసించి సాగుతోంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి నది నీరసించడం వల్లనే రోహిణి బిడ్డలిద్దరూ పరస్పరం చంపుకోడానికి సిద్ధపడ్డారు. పాలు పల్చనైపోయిన తల్లి రొమ్ములు కొరుక్కు తినే బిడ్డల్లా తయారైనారు. రోహిణి శాక్య కోలీయుల రాజ్యాన్ని విడదీస్తూ వెళుతుంది. లేదా ఇరువురికీ మధ్యగా వెడుతోంది. ఇరువేపుల కర్మకారులూ నదికి అడ్డంగా గట్టు వేసుకుని నీటిని మళ్లించుకుంటూ వ్యవసాయం చేస్తూ వచ్చారు. అప్పుడప్పుడు చిన్న పాటి ఇబ్బందులు వచ్చినా సర్దుకుపోయేవారు. వరి, అనప, దోస, గుమ్మడి వంటి పంటలు వేసుకుని బళ్ల మీద వెళ్లి వర్తకం చేస్తుంటారు.
ఎక్కువగా వరి మిగులు పంటను అమ్ముకుంటూ శాక్యులు సంపన్నులైన మాట వాస్తవం. పొలాలకు కంచెలు వేసుకుని జింకల బారి నుంచి పంట కాపాడుకోవడం కోసం ఉచ్చులు కూడా పెట్టే వారు. శాక్యపౌరుల సంపద పానశాలల్లోకీ, సౌందర్యవతులైన గణికల ఇళ్లలోకి చేరుతుంటుంది. పంట రాగానే బళ్లమీద వేసుకుని కొండ చీమల బారువలె ధాన్యాన్ని దూరప్రాంతాలకు తోలుకు వెళతారు. రైతుల దగ్గిర వర్తకులు కొంటారు. కోలీయుల సీమలో కక్కర పట్టణం పేరున్న వర్తక కేంద్రం.
కోలీయుల రామ గ్రామం కంటే శాక్యుల కపిలవస్తు అందంగా వుంటుందంటారు.. పంటలని సంపదగా మార్చుకో వడం శాక్యులకు తెలిసినంతగా కోలీయులకు తెలియదని వారి అభిప్రాయం.
“ఎందుచేత?” అని అడిగాడు ఉపాలి.
కొద్దీ దినాల క్రిందట శ్రేష్టి ఇరుప్రాంతాల మధ్య రగులుతున్న గొడవ గురించి, దాని పూర్వాపరాల గురించి ఉపాలికి వివరించాడు. నవ్వి అన్నాడాయన, “మా స్వభావం కావచ్చు. కోలీయులు ప్రాచీనకాలం నుంచి అమాయకులు. శాక్యుల విలాసాలు మాకు తెలియవు. కృషి, న్యాయమైన వర్తకం మాకు తెలుసు.”
శ్రేష్టి కథనం ప్రకారం శాక్యుల సంపదకీ, అహంకారానికీ, విలాసాలకీ, సుఖ లౌల్యానికి కారణం ఎక్కువ వరి పండించడం. వారే కొంత ఔదార్యం చూపించి వుంటే ఇప్పుడీ అనర్థం జరిగేది కాదంటాడాయన.
“భన్తే, జ్యేష్ఠ మాసానికల్లా నదిలో నీరు తక్కువైపోయింది. అలా ఎన్నడూ జరిగినట్లు గుర్తులేదు. ఒక్క తడుపుకు అవకాశం ఇస్తే పంట దక్కించుకుంటామని అడిగారు మా రైతులు.”
“వారేమంటారు?”
“వల్లకాదు. ఒక తడుపుతో మాకు పంట దక్కుతుంది. ఈసారికి మేమే నీళ్లు పట్టుకుంటామని వాదనకి దిగారు. పైగా, మీ ధాన్యాగారాలు నిండడాన్ని చూసి మేం మీ చుట్టూ రత్నాలనీ, సువర్ణముద్రలనీ, నీలమణులనీ, నల్లకార్షాపణాలనీ తట్టలనీ బుట్టలనీ మోసుకుంటూ మేం తిరగలేం అన్నారు. మాటా మాటా పెరిగింది. చేతులకి పని చెప్పారు. తోసుకుని కొట్టుకుని తిట్టుకుని….”
“శ్రేష్టీ!, వారూ వీరూ రైతులే గదా. శాక్యుల అధికారులుగానీ కోలీయుల అధికారులు గానీ కలిగించుకోనప్పుడు సాటి రైతుల కష్టాల్ని అర్థం చేసుకోలేరా? ‘ఇతరులెందుకు? వారే పరిష్కరించుకోవలె గదా? నదికి లేని వివక్ష వీరికెందుకు? రైతులందరూ ఒకటే!”
“భన్తే! , ఆ ఇంగితం ఉంటే ఇంత జరగదు. ఇంక ఇప్పుడు అధికారులు కూడా ‘కలిగించుకోవడం వల రెండు రాజ్యాల మధ్య అహంకారం యుద్ధంగా పరిణమి స్తుంది. ఈ పరిస్థితి రైతులే కల్పించారు. దీనికితోడు జాతిని అవమానించారని శాక్యులంటున్నారు.”
“జాతికేం అవమానం జరిగిందట?”
” శ్రేష్ఠి గాఢంగా నిటూర్చాడు. వెంటనే ఏమీ అనలేక కిటికీలోంచి బయటకు ‘చూశాడాయన. అక్కడ భిక్షువులు నలుగురు బట్టలకి కాషాయం రంగు అద్దుకోవడం కనిపించింది. రంగువేసిన వస్త్రాలు ఆరుతున్నాయి. ఉపాలి ఆయనవేపే చూస్తున్నాడు.
ఆయన బయటికి చూస్తూ అన్నాడు.
“భన్తే! కోపం వచ్చినప్పుడు పాములాంటి నాలిక కాటు వేస్తుంది. భన్తే…. శాక్యులను అక్కచెల్లెళ్లతో సంసారం చేసిన జాతివారని నిందించారు. వారు, కుష్టువాడికి పుట్టిన జాతి అనీ, అనాధలనీ, కొలియచెట్ల మీద పక్షుల్లాటివారనీ తిరిగి అన్నారు. ఇటువేపు యువకులందరూ నెత్తురు చిందించడానికి సిద్ధంగా వున్నారు. తథాగతుడు ఒక్కడే ఈ అనర్ధాన్ని నివారించగలడు.”
ఉపాలి కనుబొమలు ముడివడ్డాయి. శాక్యుల పూర్వజుల గురించి కథలు అతనికి స్ఫురణకు వచ్చాయి. ప్రాచీన శాక్యులు వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం అక్కచెల్లెళ్లతో కాపురాలు చేశారు. కోలీయుల పూర్వజుడు రాముడనే శ్వేతకుష్టు. అతని వారసులు కోలీయులు – కోలిచెట్లతో, తోపులతో నిండిన ప్రాంతాన్ని వాసయోగ్యంగా చేసుకున్నారు.
శాక్య కుటుంబాలలో సగోత్రీకులలో పాణిగ్రహణం చేసుకునే ఆచారం ఉండడంతో నింద మరీ గాయపరిచి వుంటుంది.
మరికాసేపు కూచుని శ్రేష్ఠి ప్రణామం చేసి వెళ్లిపోయాడు. అతను వెళ్లగానే దీర్ఘజానువు తథాగతుణ్ని కలవడం, అతని మాటలూ జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు ఉపాలి భిక్షు. అప్పటికి కొన్ని దినాల క్రితం శాస్త కక్కరపట్టణలో వున్నాడు. అక్కడి శ్రేష్ఠి సంఘం ప్రార్థన మన్నించి భిక్ష స్వీకరించాడు.
ఆయన దర్శనానికి వచ్చిన సందర్శకులు కాసేపు కూచుని శాస్త రూపాన్ని కళ్లలో పెట్టుకుని వెళ్లిపోగానే, దీర్ఘజానువు అనే సంపన్న గృహస్థుడు వేచి వున్నాడని తెలియ వచ్చింది. క్షణం ఆలోచించి రమ్మని తలవూపాడు తథాగతుడు. తన పొడవాటి శరీరాన్ని చర్మంలోకి కుదించుకునే ప్రయత్నం చేస్తూ దీర్ఘజానువు వచ్చి శాస్త్రను కళ్లారా చూసు కుంటూ అభివాదం చేసి కూచున్నాడు.
శాస్త అన్నాడు.“ఆయుష్మాన్, నాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నావు?”
“భన్తే, మా జీవితం గురించి.”
“మీ సంపదకి కలిగిన నష్టం ఏమిటి?”
“భన్తే , లేదు. సంపద వల్లనే నష్టం జరుగుతోంది. మేము సుఖాల్లో మునిగి తేలుతున్నాం. వర్తకం బాగా సాగుతోంది. మా బతుకుల నిండా సుగంధ లేపనాలు, పూలు, స్త్రీలు, మద్యం, కాశీ చీవరాలు. భన్తే మాకు ఊపిరి తీసుకోలేనంత సుఖమదం పట్టుకుంది. మాకు ధర్మాన్ని ఉపదేశించండి.”
“ఆయుష్మాన్, మంచిది. నీవు సుఖంగా వున్నావు. నీ సాటి వర్తకులు సుఖంగా వున్నారు. కానీ అనేకమంది సుఖం ఎరుగనివారున్నారు. సంపద హానికరం కాదు. అధిక సంపద, అధిక వాంఛల్ని పుట్టిస్తుంది. వాటికి అంతు వుండదు. విశృంఖలమైన ఈ లౌల్యం పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని కలిగించదు. దీర్ఘజానూ దీని కారణంగా చిత్త సంస్కారం కలగదు. వ్యక్తికీ, సంఘానికి కూడా అధిక సంపద మంచిది కాదు. అది బహిరంతర ఘర్షణకీ, విచ్ఛిన్నానికి కారణం అవుతుంది. ఎందుచేత? సంపదకి దూరం అయిన పేదలు.
ఆయుష్మాన్, ఇవన్నీ దుఃఖహేతువులు. అందుచేత సంతృప్తికరమైననికీ, సంతోషకరమైన ఆధ్యాత్మిక జీవితానికి నాలుగు ప్రాథమిక సూత్రాలు త్రికరణశుద్ధిగా పాటించాలి.”
“భన్తే!, అవి ఏవి?”
అప్పుడు శాస్త సమ్యక్ జీవనం గురించీ, స్నేహం గురించీ శ్రద్ధ, త్యాగ, శీల, ప్రజ్ఞ వంటి వాటి గురించి ఉపదేశించాడు. వింటున్న దీర్ఘ జానువు కళ్లు చమరించాయి. శ్రద్ధాసక్తులతో అవి మూతబడ్డాయి. తేరుకుని తథాగతుని ముందు మోకరిల్లి ఆయన ఆశీస్సులు పొంది, సుబుద్ధితో జీవిస్తానని మాట ఇచ్చి వెళ్లిపోయాడు.
ఆవలి తీరాన తథాగతుడు వస్తాడనే అందరూ అనుకుంటున్నారు. ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా శాస్త ఆగమనం గురించే మాట్లాడుకుంటున్నారు. వృద్ధుడైన సుద్ధోదనుణ్ణి పలకరించడానికి వస్తాడనే వదంతులు ఈ నమ్మకానికి కారణం. ఎవరి ప్రోద్బలమో తెలియకపోయినా కొద్దిమంది శాక్యముఖ్యులు నది దాటి వెళ్లి ఆమ్ర వనవిహారం చేరుకున్నారు. వారి గురించి తెలుసుకుని భిక్షువులు ఆనందుడికి వివరిం చారు. ఆనందుడు తథాగతుడి కుటీరం చేరుకోగానే బయటికి వస్తున్న ఉపాలి ఎదురయ్యాడు. ఇద్దరూ లోపలికి ప్రవేశించారు.
“భన్తే , శాక్య ముఖ్యులు మీ దర్శనం కోసం వచ్చారు.”
“అలాగే, రమ్మని చెప్పు.”
శాస్త ఉపాలివేపు చూసి చిరునవ్వు నవ్వాడు. కొద్దిక్షణాల తరువాత నలుగురు పెద్దలు లోపలికి వచ్చి తథాగతుడికి ప్రణామం చేశాక అందరూ ఆశీనులైనారు. శాస్త్ర దర్శన ప్రభావం వారి కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఏమీ మాట్లాడలేదు. చివరికి నలుగురిలో ఒక వృద్ధుడన్నాడు.
“భన్తే … విషయం మీకు తెలియనిది కాదు. మేమంతా…”
“ఏ విషయం ?” తటపటాయించి అన్నాడతను.
“శాక్య కర్మకారులూ, కోలియ కర్మకారులూ ఘర్షణకు దిగారు. సంయమనం కోల్పోయి యుద్ధ పరిస్థితులు కల్పించారు!”
“నేనేమి చెయ్యగలను? అది వారి సమస్య. సంయమనం కోల్పోనివారు ఏం చేస్తున్నారు?”
శాక్య పెద్ద గొంతులో చిన్న మామిడి టెంక అడ్డుపడింది.
“భన్తే , పరిస్థితి చేతులు దాటిపోయింది. ఇది మా ప్రార్థన. మీరు వారించ గలరు. వారిని ధర్మమార్గంలో పెట్టమని మా కోరిక.”
శాస్త చిరునవ్వు నవ్వి అన్నారు.
“సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించడానికి, స్థూలదృష్టి, నిరాపేక్ష, ఔదార్యం వుండాలి. పెద్దలారా, ఈ లక్షణాలు రాజ్యాధికారులకు వుండాలి. వారేమి చేస్తున్నారు?”
“భన్తే, అందరూ ఆవేశంతో ఆలోచించడం మానివేశారు. అబద్దాలు ప్రచారం అయి వాస్తవాలుగా మారుతున్నాయి.
“మంచిది. ధర్మానుసరణమే మంచిదని మీ ఏలికకు చెప్పండి.”
ఏలిక అనగానే అతనికి వాగ్బంధం అయిపోయింది. మాట్లాడలేక ఊరుకున్నాడు. వచ్చినవారిలో ఒకడు సాహసించి శాస్తవేపు సూటిగా చూస్తూ అనగలిగాడు.
“భన్తే , మన్నించండి. శాక్యులు మీ స్వజనులు. శాక్యరాజు అన్యుడు కాదు. మీ కన్నతండ్రి. ఘర్షణ వారించడం మీ బాధ్యత అని కూడా మేం భావిస్తున్నాం .”
తథాగతుడతగాడి మాటలు వింటూ కళ్లు మూసుకున్నాడు. క్షణం తరువాత కళ్లు తెరిచి ప్రశాంతంగా అందరివేపూ చూస్తూ అన్నాడాయన.
“మీరు ఎవరి గురించి అంటున్నారు? బంధాలు తెంచుకుని రాజకుటుంబం వీడిన రాకుమారుడు వేరు. అతనిప్పుడు లేడు. అందుచేత సుద్ధోధనుడు అతనికి తండ్రి కాదు. బంధాలు లేనందువల్ల అతనికి స్వజనులు లేరు. నేను వేరు. నేను వేరు కావడం వల్ల నాకు ఎటువంటి బాధ్యతలు వుండవు.”
ఆనందుడు, ఉపాలి ఆగంతుకుల వేపే చూస్తూ మౌనంగా వుండిపోయారు. ఆగంతక బృందానికి నెత్తిమీద గుమ్మడికాయ పడినట్టు జరిగిన పొరపాటు అర్థమైంది. తలలు వంచుకుని కాసేపు మాటల్ని మర్చిపోయి నోట్లో నాలుక ఉందనే స్పృహ పోగొట్టుకున్నారు.
“మీరు వెళ్లిరండి. మీరు చెప్పిన కారణం వల్ల నేను నిర్ణయం తీసుకోలేను. మంచి చెడులు ప్రజలకు చెప్పడం, నిజం చెప్పడం రాజు బాధ్యత. అది రాజు ధర్మం. మధ్యలో ఏరుండగా ఇరువైపుల రైతులూ యుద్ధానికి దిగడం రాజు అసమర్థత, బాధ్యతారాహిత్యం కారణం. రైతుల స్వార్థం కారణం. పెద్దలారా, మీకు శుభం కలుగు గాక.”
శాస్త వాక్కులు పరిమళభరితమైన పూలు వెదజల్లిన చిరుచినుకుల్లా వున్నాయి.
ఆస్వాదించి, కృతజ్ఞతాభావం మెరుస్తుండగా ఆయనకి మోకరిల్లి మాట్లాడకుండా వెళ్లిపోయారు శాక్య పెద్దలు. “ఆనందా, వారితో మాట్లాడిన తరువాత దాహం వేస్తున్నది.”
ఉపాలి నవ్వాడు. ఆనందుడు చిన్న సొరకాయతో నీరందించాడు. గటగట తాగి మూసుకున్నాడు తథాగతుడు. ఉపాలి అర్థవంతంగా తల ఊపాడు. చటుక్కున కళ్లు తెరిచి అన్నాడు శాస్త.
“శ్రేష్టికి చెప్పండి. రేపు కర్మకారుల్ని సమావేశపరచమని చెప్పండి.”
కాసేపటికి భోజనానికి కూచోబోతున్న శ్రేష్ఠికి వర్తమానం వెళ్లింది. భోజనం అవకుండానే అతనికి కడుపు నిండిపోయింది.
“ఇప్పుడు అందరి విస్తళ్లలో అన్నం నిండుగా వుంటుంది,” అనుకున్నాడతను.
మరునాడు విహారంలో చెట్ల చల్లటినీడలో చెట్టెక్కి కూచున్న నెమలి కనుసన్నల్లో అందరూ ఆశీనులైనారు. ఇరుపక్షాల నుంచీ పెద్దలు వచ్చి కూచున్నారు. ఒకరికొకరు దూరంగా కూచున్నారు. వారు ముఖం తిప్పుకుంటున్నారు. చల్లటి మావి నీడలు వారి వైషమ్యాలకి వెచ్చబడుతున్నట్టనిపిస్తోంది. చెట్టు కింద ఉన్నతాసనం పరిచి వుంది. అందరూ నిశ్శబ్దంగా తథాగతుడి రాకకోసం నిరీక్షిస్తున్నారు. ఆనందుడు, ఉపాలి, ఇతర స్థవిరులు వెంట నడుస్తుండగా తథాగతుడు అటు వేగంగానూ, ఇటు మెల్లగానూ కాకుండా ఆయన పాదాలే ఏదో లక్ష్యం వేపు నడిపిస్తున్నట్టుగా కాలిబాటలో ఒంపు తిరుగుతూ కనిపించాడు. ఆయన కనిపించగానే ముందు నెమలి కూసింది. అందరూ లేచి నుంచున్నారు. తథాగతుడు కూచుని తలెత్తి కొమ్మ మీద కూచున్న నెమలిని చూస్తుండిపోయాడు. ఆవల తీరం నుంచి వచ్చిన శాక్యులు తథాగతుణ్ని చూసి ఎరుగరు. ఒకరిద్దరు ఆయన్ని రాకుమారుడిగా చూసినవారున్నారు. అందర్నీ ఒకసారి పరికించి చూశాడు శాస్త. ఆయన చూపు పడినంత మేరా అందరి మనసుల్లో లేత సూర్యకాంతి ఏదో చొరబడిన అనుభూతి కలిగింది. కొంచెం భుజాల దగ్గిర ఒంగి, సన్నగా, చామనచాయలో, దరిదాపు నెరిసిపోయిన గడ్డంతో తథాగతుడు చిరునవ్వు నవ్వాడు. నిజానికి ఆయన దృష్టి ఎవరిమీదా లేదు. అందర్నీ చూపులతో కలియ తిప్పుతున్నా ఎవరినీ చూడ్డం లేదాయన.
ఆనందుడు చెయ్యి ఊపగానే ముందు కోలియశ్రేష్ఠి లేచి నీరులేక ఎండి పోతున్న పంట గురించి, దానివల్ల జరిగే నష్టం గురించి వివరించాడు. శ్రేష్ఠి లోకజ్ఞుడు. ఎక్కువ మాట్లాడకుండా శాక్యులను నిందించకుండా తమ అవసరం గురించి మాత్రమే మాట్లాడాడు. ఆయన కూచోగానే శాక్యుల పక్షాన ఒక వృద్దరైతు లేచి మాట్లాడాడు.
చెట్టుమీది నెమలి మెడ సాచి అందరి మాటలు వింటోంది. మధ్యలో శాస్త తల ఎతి దాన్ని చూస్తూనే వున్నాడు. తరువాత మరో ఇద్దరు మాట్లాడి చిన్న రైతుల కష్టాల్ని వివరించారు. అప్పటికి ఇంక ఎవరికీ...