మనకి రామాయణ మహాభారత కథలు చెబుతూ మన పెద్దలు కొన్ని పిట్ట కథలు చెప్పేవారు. ఈ పిట్ట కథలు చాలా వరకు గ్రంధస్తం అవ్వవు మరియు ఇవి చాలా వరకు ప్రాదేశికాలు (లోకలైజ్డ్ అని నా ఉద్దేశ్యం). మా తెలుగు అయ్యవారు చెప్పిన చాలా పిట్ట కథల్లో నాకు చాలా ఇష్టమైన కథ ఇది.
యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేసి అనంత మైన సంపదను ప్రోగు చేసుకున్న తర్వాత ఆయనకీ ఒక ఆలోచన వచ్చిందట. వెంటనే బావ శ్రీకృష్ణుడు తో పంచుకున్నాడట, 'కృష్ణా !, నేను మరియు నా తమ్ములం సకల రాజులను జయించాము, ఇంత సంపదను పోగేసాం, మేము ఒక సూతుడు మరియు ఒక సామంత రాజు అయిన, ఆ కర్ణుడి పాటి దానధర్మాలు చేయలేమా' అని.
కృష్ణునికి అర్థమయ్యిందట సంపద ధర్మరాజు సహజ గుణాన్ని ఎలా నాశనం చేయబోతుందో అని, దాన్ని మొగ్గలోనే త్రుంచి వెయ్యాలని. "సరే, ధర్మజా!, నువ్వున్నూ మరియు నీ నలువురు తమ్ముళ్ళున్ను తదుపరి రోజు సూర్యోదయమవగానే సముద్రపు ఒడ్డుకు వచ్చేయండి, అక్కడ మీకు ఒక పరీక్ష పెడతాను అని పలికాడు.
తదుపరి రోజున సూర్యోదయం అయిన పిదప ఐదుగురన్నదమ్ములు, కృష్ణుడు చెప్పిన సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీకృష్ణుడు వెంటనే ఆ సముద్రపు ఒడ్డున వున్న ప్రతి ఇసుక రేణువును బంగారపు రేణువుగా మార్చి, పిదప పాండవులను సూర్యాస్తమయము అయ్యేలోపుల ఆ బంగారాన్నంతటిని దానం చేసెయ్యమని కోరాడు.
ఇక ఆ ఐదుగురు అన్నదమ్ములు, తలా ఒక కొలపాత్ర తీసుకొని జనులకు బంగారాన్ని కొలవటం ప్రారంభించారు. కొలుస్తున్నారు, కొలుస్తున్నారు కానీ ఎంతటికీ ఆ బంగారం తరగటం లేదు. సూర్యాస్తమయం కావొస్తుంది. వీళ్ళేమో కొలిచి కొలిచి శోష వచ్చి పడిపోయేలా వున్నారు.
కృష్ణుడు చెప్పాడు, ఇక మీవల్ల కాదు కర్ణుడిని పిలవనా అని. అంతటి నీరసం లో కూడా ఆ ఐదుగురు నవ్వారు, చూద్దాం మేము ఐదుగురం కలిసి చేయలేనిది తాను ఒక్కడే అదీ సూర్యాస్తమయం ఇంకొద్ది సమయములో ముగియనుండగా అని.
శ్రీకృష్ణుడి పిలుపునందుకొని, "ఏమిటి వాసుదేవా నీ ఆజ్ఞ" అంటూ వచ్చాడు కర్ణుడు. కర్ణా !, ఈ బంగారు రేణువులుగా మార్చబడ్డ ఇసుక రేణువులనంతటినీ నువ్వు దానమివ్వగలవా, ఇవ్వగలను అనుకుంటే వెంటనే పని ప్రారంభించమని ఆజ్ఞాపించాడు.
వెంటనే కర్ణుడు అక్కడ గుమిగూడిన జనులను పిలిచి, కను చూపు మేరలో వున్న ప్రదేశాన్నంతా వేరు వేరు భాగాలుగా విభజించి, ఒక్కో భాగాన్ని ఒక్కొక్కడికిచ్చేసాడు. ఇదంతా కళ్ళముందే లిప్తకాలంలో జరిగిపోయింది.
అన్నదమ్ములు కొయ్యబారి పోయారు. అప్పుడు కృష్ణుడు నవ్వి , 'ధర్మజా ! దానం చేయటానికి సంపదకూ సంబంధం లేదు అది ఒక కళ. అది సహజంగా అబ్బినవాడే చేయగలడు' అని సెలవిచ్చాడు.
కానీ వాళ్లెవరి ఊహకందనిది ఏమిటంటే కలియుగంలో, నిజంగా ఇసకే బంగామవుతుందని, దాన్ని ప్రదేశాల వారీగా విభజించి పంచేసుకోవటం ఎలా అని సోదాహరణంగా అక్కడ వున్న జనులకు చూపించామని, అలా చూసిన జనులే కలియుగంలో ఇసుకాసుర అవతారమెత్తారని. ఈ ఇసుకాసురులు గురించి మా అయ్యోరు కూడా చెప్పలా నాకు.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp