Artwork for podcast Harshaneeyam
లీలా కాలనీ
26th July 2020 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:14:05

Share Episode

Shownotes

తలుపులు దబదబా బాదుతున్న శబ్దం .

గడియారం చూస్కుంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది..

డోర్ ఓపెన్ చేస్తే, బయట నిలబడున్నాడు నీటు గా డ్రెస్సు అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు - బ్లాక్ జీన్సు, బ్లాక్ టీషర్ట్ లో రామకృష్ణ.

"మంచి నిద్ర పాడుచేశావ్ ! కొంపలేంమునిగాయనీ" ?

"బైకు తాళాలిస్తావా, ఇప్పటికే లేట్ అయిపోయింది." ?

తాళాలు ఇస్తూ చెప్పాను , " పొద్దున్నే ఫ్యాక్టరీ నించి వస్తూంటే రిజర్వు లోకి వచ్చింది , పెట్రోల్ చూసుకో" అని.

సమాధానం గూడ చెప్పకుండా తాళాలు తీస్కొని పరిగెత్తాడు రావకృష్ణ.

వెనకనించి అరిచాను , "జాగర్త బండి మనది కూడా కాదు" .

ఆకాశం చూస్తే నల్ల మబ్బులతో ముసురుకోని వుంది.

రామకృష్ణ తొందర చూస్తుంటే, మనిషికో, బండికో షేపులు మారడం ఖాయం అనిపిస్తోంది ఈ రోజు.



తలుపేసి వొచ్చి మళ్ళీ తల వాల్చా.

నేను రామకృష్ణా, ఎచ్ ఎం టీ హైదరాబాద్ లో జాయిన్ అయ్యాం తొమ్మిది నెల్ల క్రితం.

ఒక మెషీన్ కమిషనింగ్ కి అని చెప్పి , మేము వైజాగ్ కి వచ్చి నెల అయ్యింది.

మా బస ఊరవతల, వర్క్ సైట్ కి దగ్గర్లో. ఫ్యాక్టరీ గెస్టుహౌస్ అనబడే రెండంతస్తుల ఇంట్లో.

రోజూ, మమ్మల్ని ఫ్యాక్టరీ కి తీసుకెళ్లే కార్ డ్రైవర్ నరసింహం దగ్గర్లోనే ఉండేవాడు.

తను చెప్పాడు, " సాయంత్రం ఆరు దాటితే , సిటీ బస్సు గూడా దొరకదు సిటీ నుంచి రావడానికి" , అని చెప్పి.

ఇంటికంతా మేమిద్దరమే, ఫస్ట్ ఫ్లోర్ లో వుండే పక్క పక్క రూముల్లో . ఇంకెవరూ లేరు.

వున్న వంటతను గూడా ఎదో ఒంట్లో బాగాలేదని వూరెళ్ళిపొయ్యాడు, మేమొచ్చిన రెండు రోజుల్లోనే.

కాఫీ తాగాలన్నా రెండు కిలోమీటర్లు పోవాల్సిందే గెస్ట్ హౌస్ నించి.

నేను రామకృష్ణ నాలుగేళ్లు ఒకే కాలేజీలో చదూకున్నాం హైద్రాబాద్లో. అప్పటికే సకల కళాపోషకుడు. నాకు తెల్సి గ్రాడ్యుయేషన్ అయ్యేలోపల మా కాలేజీలో, రామకృష్ణని ఆరుగురు గాళ్ ఫ్రెండ్స్ మార్చేసుకున్నారు. అప్పట్లో అతనితో పెద్ద పరిచయం లేదు నాకు. అతనికంత టైమూ వుండేది కాదు. ఈ వూర్లో గూడా, రామకృష్ణ ఉధృతి తగ్గట్లేదు.

ఫ్యాక్టరీ నించి రాంగానే, బండేసుకొని వెళ్లపోతాడు , సాయంకాలం ఈ టైం కి . మళ్ళీ వచ్చేది రాత్రి బాగా పొద్దు పోయింతర్వాత. అతని ఎనెర్జీ లెవెల్సు విపరీతం.

ఇంత తొందరగా ఎవరితో పరిచయాలు పెంచుకున్నాడో, ఇక్కడికొచ్చి. ఏవైనా, వూరు గాని వూర్లో రామకృష్ణ తిరుగుళ్ళు రిస్కీ నే.

ఇట్లా ఆలోచిస్తూంటే నిద్ర పట్టేసింది.



గట్టిగా డబ డబా , కిటికీ తలుపులు కొట్టుకుంటున్న శబ్దం వినపడితే లేచాను.

ఒక రెండు అడుగులేసి, బయట బాల్కనీ లోకొచ్చి నిలబడ్డా ఒళ్లు విరుచుకుంటూ.

చీకటి ముసురుకోనుంది.

నెలరోజుల్నించీ నైట్ షిఫ్టు, డే షిఫ్ట్ ఇట్టా మారడం తలనొప్పిగా వుంది. ఇంకా అలవాటు పళ్ళేదు. బాగా నిద్రపొయ్యి , లేచినా మగత గానే ఉంటుంది.

ఇది గాక , నా బద్ధకం వల్ల, బ్రెడ్డు పాలతో అలవాటు లేని భోజనం.ఇంకో నాలుగు రోజులు ఈ నరకం తట్టుకుంటే, మా ప్రాజెక్ట్ కమీషనింగ్ అయిపోతుంది.

కూత వేటు దూరంలో వుంది సముద్రం, మేముండే లీల కాలనీకి. కాలనీ అంతా కల్పి ఒక రెండు మూడు వీధులు అంతే.

అదే కాలనీ ఎంట్రన్స్ లో ఒక అమ్మవారి గుడి. సముద్రం అనుకునే వుండే వీధి లో మా గెస్ట్ హౌస్.

బాగా తూగొస్తోంది. దూరం నుంచి సముద్రం హోరు , విపరీతమైన గాలి. గాలి పెరిగిపోతోంది. పొద్దున్న ఫ్యాక్టరీ లో ఎవరో చెప్పారు, ఈ నెల లో తుఫాను వుంది వైజాగుకి అనిచెప్పి.

చిన్నగా వర్షం మొదలైంది. ఇంతలో ఎదురు ఇంటి మీద ఎవరో కదిలినట్టు అనిపిస్తే అటు చూసాను.

సన్నటి ఆకారం, ఎవరో ఒక ఆడమనిషని అయితే మటుకు తెలుస్తోంది, స్ట్రీట్ లాంప్ వెలుగులో ఓ ఇరవై ఏళ్ళు ఉండొచ్చు. మేడ మీద పిట్టగోడ దగ్గర, చీకట్లో వర్షంలో తడుస్తూ, వీధి వైపే చూస్తూ. అంత చీకట్లోనూ ఆ అమ్మాయి ముక్కుపుడక అనుకుంటా మెరిసిపోతోంది.

నా గొడవలో చుట్టుపక్కల వుండే వాళ్ళని పెద్దగా గమనించింది లేదు. ఎదురు ఇంట్లో ఓ యాభై ఏళ్ల మనిషిని అప్పుడప్పుడు ఆయనతో బైక్ మీద వెళ్లే ఒక ఆవిడ్ని చూసా. డాబా మీద నిలబడుంది, వాళ్ళ అమ్మాయి అయ్యుండొచ్చు.

ఓ రెండు నిమిషాలు చూసి లోపలికొచ్చేసాను. ఆకలి మొదలవ్వడంతో.

రూమ్ లోకి ఎంటర్ అయ్యి, .టైం చూస్కుంటే రాత్రి పదిన్నర దాటింది.

వున్న రెండు బ్రెడ్డు ముక్కలూ పీక్కు తింటూ బాల్కనీ లోకి మళ్ళీ వచ్చా.

ఎదురు ఇంటి డాబా వైపు చూస్తే, ఎవ్వరూ కనపడలేదు.

లోపలికొచ్చి పడుకున్నా.



పొద్దున్న లేచేటప్పటికి, రామకృష్ణ కాఫీ, టిఫిన్ పొట్లాలతో రెడీ గా వున్నాడు.

"ఎన్నింటికొచ్చావు రాత్రి" ?

"రెండయ్యింది. సెకండ్ షోకి వెళ్ళాను" అన్నాడు రామకృష్ణ.

"ఇక్కడ గూడ ఫ్రెండ్సు దొరికారా ఏందీ నీకు"?.

"'ఫ్రెండ్సు ' కాదు, ఫ్రెండుతో వెళ్ళా సెకండ్ షో కి - సింగులర్ "

" ఇంత తొందరగా ఎలా? " అడిగాను నేను ఆశ్చర్యంగా.

నవ్వాడు అతను. " ఈ కాలనీయే ఆ అమ్మాయిది ,యూనివర్సిటీ విమెన్ హాస్టల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళది మన ఎదురిల్లే".

"నిన్న రాత్రి అదే టైం లో ఒక అమ్మాయిని చూసానే ఎదురింటి మీద?"

రామకృష్ణ అయోమయంగా మొహం పెట్టాడు.

"నిన్న సెకండ్ షో తర్వాత, హాస్టల్ వాచ్ మన్ కి టీ డబ్బులు ఇచ్చి మరీ దిగబెట్టొచ్చా ఆ అమ్మాయిని. ఎవర్ని చూసి ఎవరు అనుకున్నావో. ఎప్పుడూ సగం నిద్ర లో వుంటావుగదా!"

" ఇక్కడ ఉండదా ఆ అమ్మాయి ! అయితే"

ఓపిగ్గా చెప్పాడు రామకృష్ణ , "చెప్పా కదా, హాస్టల్ అని, రోజూ సాయంత్రం ఇంత దూరం ట్రావెల్ చెయ్యడం అంత సేఫ్ కాదనో ఏమో, ఆ అమ్మాయిని హాస్టల్ లో పెట్టారు.. క్రితం వారం ఒక సారి ఇంటికొచ్చి వెళ్ళింది - చూసా, కనుక్కున్నా , పరిచయం చేసేసుకున్నా - అని విని విడి విసి స్టయిల్లో " .

"రెండ్రోజుల్లో వూరెళ్ళిపొయ్యేదానికి , ఇట్టాటివి ఎందుకు రామకృష్ణా ? , తెలిస్తే కాలనీ వాళ్ళు నిన్ను , నీతో పాటూ నన్ను ఇద్దర్నీ కట్ట కట్టి సముద్రం లోకి విసిరేస్తారు."

నవ్వాడతను "రెండు రోజుల్లో ఎవరెళ్ళిపోతున్నారు. కమిషనింగ్ అయింతర్వాత , ట్రైనింగ్ అనిచెప్పి, ఒక ఇంజనీర్ ఇంకో నెల ఇక్కడే వుండాలని , అదీ రామకృష్ణ మాత్రమే అయ్యుండాలి అని , నిన్ననే మన బాస్ రత్నం గారికి ఫోన్ వెళ్ళింది ఇక్కణ్ణుంచి."

"నువ్వు కాలాంతకుడివి" అని చెప్పి స్నానానికి పరిగెత్తా నేను, ఫ్యాక్టరీ టైం అవుతుండడంతో,



ఆ పక్కరోజు శనివారం రామకృష్ణ మామూలు కంటే ఉత్సాహం గా కనపడ్డాడు.

"విషయం ఏందీ" అడిగాను

"రేపొద్దున్నే భీమ్లీ కి వెళ్తున్నాం. అక్కడే బీచు పక్కన ఒక చిన్న హోమ్ స్టే లాగ . ఎల్లుండి పొద్దున్న వెనక్కి రావొచ్చు."

"నేను రాలేనోయ్, రేపు గూడా పని చేసి మెషీన్ ఒక ట్రయిల్ తీసుకుంటే, హ్యాండ్ ఓవర్ చేసి హైదరాబాద్ వెళ్లిపోవచ్చు. మన బాస్ కు కూడా చెప్పాను."

నవ్వాడు రామకృష్ణ "నిన్ను అంత కష్ట పెడతానా చెప్పు"

అప్పుడర్థం అయ్యింది నాకు, "ఆ అమ్మాయి ఒప్పుకుందా"

"లేదు. చిన్న డే టైం పిక్నిక్ అనిచెప్పి తీసుకెళ్తా . అక్కడికి వెళ్ళింతర్వాత ఎలాగో ఒకలాగా కన్విన్స్ చేస్తా. ఈ అమ్మాయిని హేండిల్ చెయ్యడం చాలా తేలిక. ఒకరోజు పరిచయం తోనే సినిమా కి తీస్కెళ్ళిపొయ్యా."

" సినిమాలూ , షికార్లూ కొంత దాకా ఓకే , ఇలాంటివి చాలా ప్రమాదకరం , ఆ అమ్మాయి కి నీకూ."

కన్ను కొట్టి చెప్పాడతను , "ప్రమాదం అనే కదా , నిన్ను తీసుకెళ్లట్లేదు. అయినా సాయంత్రం ఫస్ట్ షో కి వెళదాం, బయట మంచి భోజనం పెట్టిస్తా నీకు. వూరికి వెళ్లి పోతున్నావ్ కదా సోమవారం."

నేను ఇంకేం మాట్లాడలేదు. మానవ ప్రయత్నాలు పనికిరావు మా రామ కృష్ణ , రాస కృష్ణ మోడ్ లో ఉన్నప్పుడు.



సాయంత్రం ఫస్ట్ షో సినిమా కి ఎదో కొత్త సినిమా అనిచెప్పి నన్ను తీసుకెళ్లాడు రామకృష్ణ . అప్పటికే రెండు సార్లు చూసాట్ట ఎదో "దేవి" అనిచెప్పి. అంతా గోల గోల, దెయ్యాలూ , దేవుళ్ళూ, మనుషులూ. ఎవరు ఎవరో అర్థం కాలే నాకు.

హీరోయిన్ ముక్కు పుడకను చూస్తే మటుకు , మొన్న రాత్రి చీకట్లో చూసిన అమ్మాయి గుర్తొచ్చింది.

భోజనం చేసిన తర్వాత తీసుకెళ్లి బీచ్ లో కూర్చోపెట్టాడు రామకృష్ణ.

భీమ్లీ లో ఏమి చెయ్యబోతాడు, ఆ మిగతా నెలంతా ఆ అమ్మాయి తో ఎలా ఎంటర్టైన్ అవుతాడు, దీని గురించే అతని వాగుడంతా, పెట్రోలింగ్ జీప్ వచ్చి , మమ్మల్ని బీచినించీ తరిమే దాకా ,

నాకు మామూలు గానే నెల నించీ నిద్ర లేదు. ఇప్పుడింకా నిద్ర వొస్తోంది. టైం చూస్కుంటే వొంటి గంట అవుతోంది. ఎప్పుడెప్పుడు రూమ్ కెళ్ళి మంచం మీదకి దూకుదామా అని చూస్తున్నా.

విపరీతమైన స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నాడు, రోడ్లంతా ఖాళీ గా ఉండడంతో.

బైకు, మా కాలనీ లోకి ఎంటర్ అయ్యి , గుడిని దాటి ముందుకెళ్తోంది. . స్ట్రీట్ లైట్స్ గూడా ఆరిపోయియున్నాయి. చిమ్మ చీకటి.

మా వీధి లోకి ఎంటర్ కాంగానే, చీకట్లోంచి, ఎవరో సడన్ గా ఒక మనిషి ఆకారం అడ్డం వచ్చింది.

సడన్ బ్రేక్ వేసాడు. బండి ఆగలేదు. స్కిడ్ అయిపోతోంది.

ఆ స్పీడ్ లో బైకు తో బాటు జారుతూనో , దొర్లుతూనో వెళ్ళిపోయా. తల కేదో, గట్టి గా తగిలినట్టు అనిపించింది.

నాకు కొంచెం దూరం లో రామకృష్ణ పడున్నాడు, అతని చుట్టూ రక్తం.

దూరంగా నిలబడి మమ్మల్నే చూస్తోంది, ఎదురింటి ముక్కుపుడక అమ్మాయి.

నా తల మీద ఎదో తడి తడి గా .

నాకు స్పృహ తప్పింది.



ఎవరో నా పేరు పెట్టి పిలిచినట్టు అనిపిస్తే కళ్ళు తెరిచా. చేతికి ఒక సెలైన్. పక్కనే హైదరాబాద్ నించి వచ్చిన మా జీ ఎం రత్నం గారు.

"మీరెప్పుడు వచ్చారు సర్"?. అడిగాను నీరసం గా.

"వైజాగ్ లో పనుండి , పొద్దున ఫస్ట్ ఫ్లైట్ కొచ్చానయ్యా. రాగానే ఈ న్యూసు."

"సర్, రామకృష్ణ"?

" కాలికి ఒకటి , చేతి కి ఒకటి రెండు ఫ్రాక్చర్లు. హీల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. నువ్వు అదృష్ట వంతుడివి ఒంటి మీద ఒక చిన్న స్క్రాచ్ గూడ లేదు. షాక్ వల్లా , అనీమిక్ అవడం వల్లా , స్పృహ తప్పింది అని చెప్పారు డాక్టర్లు. మీ నైబర్స్ ఎవరో టైం కి రెస్పాండ్ అయ్యారట."

నా తల తడుముకున్నా . ఒక చిన్న ప్లాస్టర్ గూడా లేదు.

ఎదురింటి అమ్మాయికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా.

ఏదో మాట్లాడే లోపలే, జీ ఎం గారు అన్నారు, " రామకృష్ణ గూడా ట్రావెల్ చెయ్యొచ్చన్నారు. రేపొద్దున ఫ్లైటు కి మన ముగ్గురికి టికెట్స్ బుక్ చేశా. మీ ఇద్దరి రీ ప్లేసెమెంట్లు , ఎల్లుండి పొద్దున కల్లా రిపోర్ట్ చేస్తారు. పొద్దున్న ఎనిమిది కల్లా బయలు దేరదాం. అవుట్ స్టేషన్ డ్యూటీ లో ఆక్సిడెంట్ కదా. లీగల్ కాంప్లికేషన్స్ ఎక్కువ రోజులు ఇక్కడుండే కొద్దీ."

"రేపొద్దున అంటే , లగేజి, అదీ . అది గాక మా తమ్ముడి ఫ్రెండు బైకు ఒకటుందండి. అది గూడా రిపేర్ చేయించి హ్యాండ్ ఓవర్ చెయ్యాలి", అన్నా నేను.

తాపీ గా చెప్పారు మా రత్నం గారు, " నువ్వు నిక్షేపం గా వున్నావు. నీకింకో సెలైన్ పెడ్తావన్నారు, అది అయింతర్వాత భోజనం పెడ్తారు - తిను. , ఫ్యాక్టరీ వాళ్ళ కార్ ఇక్కడే వుంది. దాంట్లో గెస్ట్ హౌస్ కి వెళ్ళు . వున్న ఆ రెండో మూడో సూటు కేసులు తెచ్చెయ్యి . ఆ బైకు గూడ గెస్ట్ హౌస్ దగ్గరే ఉందట . నీతో వచ్చే కార్ డ్రైవర్ కి దాన్ని అప్పజెప్పు . అతను ఇచ్చేస్తాడు రిపేర్ చేయించి ఎవరికివ్వాలో. " అని.

టైం చూస్కుంటే, మధ్యాన్నం రెండు అవుతోంది.

డాక్టరు వచ్చి స్కాను , గీనూ చెక్ చేసి డిశ్చార్జ్ చేసేటప్పటికి, రాత్రి ఎనిమిది అయ్యింది.

బయటికొచ్చి చూస్తే, అదే వాతావరణం. భీభత్సమైన వర్షం పడేటట్టు వుంది.

కార్లో ఎక్కితే , డ్రైవరు మాతో రోజూ తిరిగే నరసింహమే.

కారు ఎక్కంగానే, ఏమయ్యింది , ఎట్లా అయ్యింది అని వివరాలు అడగడం మొదలు పెట్టాడు.

ఏదో నాకు తోచిన సమాధానాలు నేను చెప్తూ వచ్చా.




కారు గెస్టు హౌస్ ముందర ఆగింది. ఇంట్లో కెళ్ళి చూస్కుంటే బైకుఅక్కడ కనపళ్ళేదు.

రోడ్డు మీద కొచ్చి చూస్తే, ఎదురింటి కాంపౌండ్ లో పార్క్ చేసి కనిపించింది.

వాళ్ళింటి లోపలి కెళ్ళాను , గేట్ తీస్కొని,

బైక్ దగ్గరి కెళ్ళి చూస్తే, ఎక్కడో రెండు మూడు పెయింట్ పోయిన గుర్తులు తప్ప, బాగానే వుంది.

గేట్ తీసిన శబ్దం విని అనుకుంటా, ఈలోపల తలుపు తీస్కొని, ఆ ఇంటాయన బయటకొచ్చి, ఇంట్లో కి రమ్మన్నాడు.

లోపలి కెళ్ళి కూర్చున్నాను.

బైకు తాళం చేతిలో పెట్టి చెప్పాడాయన

" ఆరోజు రాత్రి, వీధిలో ఏదో పెద్ద శబ్దం అయినట్టు వినిపిస్తే బయటకొచ్చాను. చూస్తే మీరు ఇద్దరు స్పృహ తప్పి పడిపోయి వున్నారు. లక్కీ గా దగ్గర్లో తెలిసిన ఆయన ఒకాయన అంబులెన్సు సర్వీస్ రన్ చేస్తారు."

నాకు అర్థం కాలేదు. "ఆ రోజు రాత్రి బయటకొచ్చి మమ్మల్ని మొదట చూసింది , మీ అమ్మాయి కాదా" ?

"ఆ అవకాశం లేదండి. మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. సిటీ లో" , అంది అప్పుడే కాఫీ గ్లాసు తో వచ్చిన వాళ్ళావిడ.

కాఫీ గ్లాసు కింద పెట్టి, కుర్చీలోంచి లేస్తూంటే, కనపడింది ఒక అమ్మాయి ఫోటో ముక్కుపుడక తో.

ఈవిడ అన్నాను సందేహం గా.

"మా పెద్దమ్మాయి 'లీల" అండీ , చనిపోయి మూడేళ్లయింది" .

నాకు చెమటలు పట్టడం మొదలయ్యింది.

బైకు తీస్కొని, ఎప్పుడు ఇంట్లోనించి బయటకొచ్చానో నాకే తెలీదు.

గెస్ట్ హౌస్ లోకెళ్ళి, అన్యమనస్కంగా నా సూటుకేసు , రామకృష్ణ సూటుకేసు, సర్దుతున్నా.

నా వెనకాలే సహాయం కోసం నరసింహం వచ్చాడు .

నరసింహం ఇల్లు అక్కడికి దగ్గర్లోనే అని గుర్తుకొచ్చింది.

ఈ ఎదురింటి వాళ్ళ గురించి నీకేమన్నా తెల్సా?

"తెలీకపోవడం ఏంటండీ. పాపం వాళ్ళ అమ్మాయే గదా! మూడు ఏళ్ళక్రితం కనపడకుండా పొయ్యి , రెండు రోజుల తర్వాత సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చింది."

ఇంకా నాకు ఒక్క క్షణం కూడా ఇంకా అక్కడ ఉండాలని అనిపించలేదు.

గబ గబా సూటుకేసులు సర్దుకొని , కిందికి దిగొచ్చా. నాతో పాటూ నరసింహం.

కార్లో ఎక్కి, బైకు తాళం , బైకు ఇవ్వాల్సిన అడ్రస్ నరసింహం చేతిలో పెట్టాను.

కార్ స్టార్ట్ చేసి, అన్నాడు అతను.

" ఒక్క విషయం మటుకు అర్థం కాలేదండి. రామకృష్ణ గారికి అన్ని దెబ్బలు తగిలితే, మీకు గాని , మీ బైకు గాని, చిన్న దెబ్బ గూడా తాకలేదు"

నేనేమీ మాట్లాడలేదు.

కారు కాలనీ బయటకొస్తోంది, హోరున గాలి , వర్షం మొదలయ్యాయి,

కాలనీ ఎంట్రన్స్ లో వుండే అమ్మవారి గుడి దాటుతూంటే -

ఆ చీకట్లో కనపడిందా ఆ అమ్మాయి ముక్కు పుడక తో మెరిసిపోతూ, నా వైపే చూస్తూ , చిన్నగా నవ్వుతూ.




This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube