Artwork for podcast హర్షణీయం
Part - I : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.
Episode 1876th May 2021 • హర్షణీయం • Harshavardhan
00:00:00 00:15:45

Share Episode

Shownotes

‘సంపెంగ పువ్వు’ గోపీచంద్ గారు రాసిన కథ . 1971 వ సంవత్సరం, జనవరి నెల యువ మాస పత్రిక లో ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.

ఈ కథను మీకు అందించదానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.

ముందుగా, రజని గారు గోపీచంద్ గారి గురించి , ఈ కథ గురించీ మాట్లాడతారు.

హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

సంపెంగపువ్వు:

సంపెంగ పువ్వు

“ఆమె ఈ బండికి వస్తోందని నీకెట్లా తెలిసింది?” అని శాస్త్రిని అడిగాను. అప్పుడు ఆరుగంటలవుతుంది. బొంబాయినుంచి రైలువొచ్చే టైం. నేనూ, శాస్త్రి ప్లాటుఫారం మీద నుంచొని మాట్లాడుకుంటున్నాం.

“ఇవ్వాళే వైరిచ్చింది” అన్నాడు శాస్త్రి. ఆమె శాస్త్రి స్నేహితురాలట ఆమె బండికి వస్తోందని చెప్పి నన్ను వెంట పెట్టుకొచ్చాడు శాస్త్రి.

శాస్త్రి ఆమెని గురించి చెప్పిన మాటల్ని బట్టి ఆమె విచిత్ర వ్యక్తి అనిపించింది నాకు

 “బలే మనిషి, బలే మనిషి” అంటాడు శాస్త్రి. ఏమడిగినా “నువ్వే చూస్తావుగా” అంటాడు. “ఏమోనబ్బా, నాకు చెప్పటం చాతగాకుండా ఉంది మన సంఘంలో ఇటువంటి మనిషి ఉండదు. వచ్చే సంఘంలో ఆడవాళ్ళు ఇట్లా వుంటారేమో! ఇప్పుడు రష్యాలో ఏమన్నా ఉన్నారేమో!” అంటాడు.

“అయితే ఆమె భర్త ఏం చేస్తుంటాడు?” అని అడిగాను. ఆమె గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తూ ఉంది నాకు.

“ఏదో చేస్తూనే ఉంటాడు లాగుంది. ఆమె మాట్లాడితే ‘కామేశ్వరుడు అటువంటివాడు, ఇటువంటివాడు, ఎంత చలాకీగా వుంటాడనుకున్నావ్” అని చెపుతూ ఉంటుంది.

“భర్త అంటే చాలా ప్రేమ కాబోలు.”

“ఆమెకు మొత్తం నలుగురు పిల్లలు. ఒక మొగపిల్లవాడూ ముగ్గురు ఆడ పిల్లలూ” అన్నాడు శాస్త్రి కొంటెగా.

నిజంగా ఆమెకు పిల్లలనేటప్పటికి నా మనస్సు కలుక్కుమంది. మిగిలిన ఆడవాళ్ళకు మల్లే ఈ బలే మనిషిక్కూడా పిల్లలా? ఎందుకనోగాని ఈ భావాన్నే నేను భరించలేక పోయాను.

ఇంతలో “అదిగో రైలు వస్తూ ఉంది” అన్నాడు శాస్త్రి. ఆమాటకి నా హృదయం దడదడ కొట్టుకుంది.

అకస్మాత్తుగా ప్లాట్ ఫారానికి చలనం కలిగింది. ఇద్దరు ప్రయాణీకులు ప్లాట్ఫారం అంచునుంచి సామాను సర్దుకొని దూరంగా నుంచున్నారు. ఒక ముసలమ్మ మూటనొక చేత్తో, మనవణి పట్టుకొని నిలబడింది. ఒక రైతు నుంచున్నవాడు నుంచున్నట్టుగానే హడావిడి పడుతున్న కర్ర చుట్టా, చుట్టని కర్రా అనుకున్నాడు.

రైలు ఆగీ ఆగడంతోనే ‘మూడో తరగతి’ అని జ్ఞాపకం చేశాడు లక్ష్మణ శాస్త్రి. ఆమె ఎప్పుడూ మూడో తరగతిలోనే ప్రయాణం చేస్తుందట. అమెకు ఒంటరితనం గిట్టదు. అందుకని జనసమ్మర్థంగా మూడో తరగతి చూచి అందులో ప్రయాణం చేస్తుంది. ఆమెకు ఎంత ఇరుగ్గా ఉంటే అంత సరదాగా ఉంటుందట! నాకు ఆమెను వెతకాలని వుంది కాని కాళ్లాడక అక్కడే దిక్కులు చూస్తూ నుంచున్నాను.

అది చిన్న స్టేషను. ఎక్కువ మంది దిగరు. “అదుగో దిగుతూ ఉంది” అని గార్డు పెట్టె వైపుకి చూపిస్తే చూశాను. కనబడలేదు.

“హలో” ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తితో కరస్పర్శ చేస్తూ అన్నాడు లక్ష్మణశాస్త్రి, ఆ వ్యక్తి ఓవర్ కోటులో ఉంది. చేతిలో తోలుసంచి ఉంది.

“మీరు రారనుకున్నాను” అన్నాడు. “అదేమిటి? ఎందుకు అలా అనుకోవటం?” అంటున్నది.

ఆ ఓవర్ కోటులో ఉన్న వ్యక్తి ఆమె అని అప్పుడు నాకు తెలిసింది. మామూలు స్త్రీ ఆకారం కోసం వెతుకుతున్న నా చూపులు ఓవర్ కోటులో ఉన్న ఆమెను పట్టుకోలేక పోయినయ్. నేను మళయాళంలో ఉన్నప్పుడు ఇటువంటి అవస్థలోనే ఉండేవాణ్ని. గూడకట్టు కట్టుకొని తుండుగుడ్డ భుజాన వేసుకునే ఆ స్త్రీలు నా కంటికి ఎప్పుడూ పొరపాట్నయినా స్త్రీలుగా కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడూ ఆ దుర్గతే పట్టింది.

లక్ష్మణ శాస్త్రి “ఆపేక్ష వున్నచోటే భయంకూడా ఉంటుంది. మీరు రావాలనే ఆ పేక్షతో పాటు, మీరు రారనే భయంకూడా ఎక్కువైంది”.

ఆమె నవ్వి “కామేశ్వరుడు కూడా ఇట్లాగే మాట్లాడుతాడు” అంది.

ఆమె భర్త పేరు ఎత్తేటప్పటికి లక్ష్మణశాస్త్రి కించపడి టాపిక్ మార్చటానికి ప్రయత్నించాడు. నన్ను పరిచయం చేస్తూ, ఇతడు శరచ్చంద్రబాబు. నాకు పరమ స్నేహితుడు. రాస్తూ ఉంటాడు. సినిమాలతో సంబంధం ఉంది.. మంచి….”

ఆమె లక్షణశాస్త్రి చేతిని వదలకుండానే నన్ను ఎగాదిగా చూచి, “మీ కథలు కొన్ని చదివాను. మీ కథలు బాగుంటై” అంది. 

శాస్త్రి యింట్లో దిగింది!

ఆ రాత్రి నిద్రపట్టకపోవటం వల్ల తెల్లవారి కొంచెం ఆలస్యంగా లేచాను. త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆమెను చూట్టానికి లక్ష్మణ శాస్త్రి ఇంటికి వెల్దామా వద్దా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలోకి లక్ష్మణశాస్త్రే వొచ్చాడు. “ఒకసారి మా ఇంటికి రావోయ్. ఆమె పిలుచుకురమ్మన్నది” అన్నాడు.

“ఎందుకు?” అని అడిగాను. లోపల వెళదామని ఉంది. ఆమె ఊరికేనే పిలుస్తూ ఉందని తెలుసు. అయినప్పటికీ అప్రయత్నంగా అలా అడిగేశాను.

లక్ష్మణశాస్త్రి నన్ను విచిత్రంగా చూచి, కాసేపు ఆగి, “సరేలే, రా” అన్నాడు. నేను బయల్దేరాను.

మేము వెళ్లేటప్పటికీ లక్ష్మణశాస్త్రి స్నేహితులూ, ఊళ్ళో కుర్రవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మధ్య కూర్చొని కబుర్లు చెబుతూ ఉంది. నన్ను చూచి, “ఏమండీ, పిలిస్తేగాని రావొద్దను కున్నారా?” అని నవ్వుతూ అడిగింది.

“మా వాడికి ఆడవాళ్లని చూస్తే సిగ్గు” అన్నాడు శాస్త్రి,

అంతా నవ్వారు. ఆమె మాత్రం చిన్నపుచ్చుకుంది. కారణం నాకు బోధపడలేదు గాని, ఎందుకో బాధపడుతున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపించింది. అదైనా కాసేపే! మళ్ళీ యథాప్రకారం అందరితోనూ కులాసాగా కబుర్లు చెప్పటం మొదలు పెట్టింది. తన అనుభవాలు, కథలు కథలుగా వర్ణించి చెప్పింది. చివరికి “మీకు నాకున్న అనుభవంలో పదోవంతు కూడా లేదు” అంది.

నిజమే, అందరూ అంగీకరించారు. “కాబట్టి వయస్సు మాట ఎట్లా వున్నా మీ అందరికీ నేను తల్లిని” అంది.

ఈ మాట మామధ్య పిడుగుపడినట్లు పడింది. కొందరు సిగ్గుపడి తలవొంచుకున్నారు, కొందరు వెకిలినవ్వు నవ్వారు, కొందరు తెల్లబోయారు.

నాకు ఇంకొక లోకంలో ఉన్నట్లు ఉంది. ఆమె మాత్రం వీటిని గమనించనట్లు యథాప్రకారం మాట్లాడుతూనే ఉంది, అందరితో ఒకే మోస్తరుగా. కుర్రవాళ్ళంతా కిక్కురుమనకుండా విన్నారు. అవునూ, కాదూ అంటాన్నిక్కూడా వాళ్ళకు ధైర్యం లేకపోయింది. ఊకొట్టటానికే వాళ్లకు సిగ్గు వేసింది. “నేను స్త్రీని’ అనే భావం ఆమెకు చచ్చినా గుర్తుకు రాలేదు. 

నాకు చాలా సంతోషం వేసింది. కాని “పూర్వం సంతానానికి స్త్రీ పురుష సంపర్కం అవసరం లేనట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అవసరం. కొన్ని సంవత్సరాలకు మళ్లీ అవసరం లేకుండా పోవొచ్చు” అని చెపుతూ ఉంటే నా మనస్సుకూడా చివుక్కు మంది.

కొంచెం సేపు అయింతర్వాత మేము కాఫీ హోటలుకి బయల్దేరాం. ఆమె కూడా కంగారుగా వుంది. కాని ఆమెకు ఏమని చెప్పటం?

మేము దారిన వెళ్తుంటే జనం గుంపులు గుంపులుపడి విచిత్రంగా చూస్తూ హేళన చెయ్యటం నేను గమనించాను. ఆమెను గురించి ఒకటి రెండు మాటలు నా చెవిని పడినై. హోటలనుంచి బయటపడి కొంపకి జేరదామని అంతా త్వరగా కాఫీ ముగించారు. ఆమె మాత్రం తొందరపడనేలేదు.

“ఏదీ ఆ హల్వా ఇట్లా ఉంచండి” అని సుబ్బారావు పేట్లో హల్వాలో సగం తీసుకుంది. “ఈ బూంది కొంచెం తీసుకోండి” అని శాస్త్రి ప్లేటులోకి తన బూందిని చెంచాలో సగం పెట్టింది.

ఇక మిగతా టేబిల్సు చుట్టూ ఉన్న జనం రుసరుసలు చెప్పాలి!

సాయంకాలం పార్కుకి వెళ్ళాం. అక్కడా ఇంతే. అక్కడి వాళ్లంతా మమ్మల్ని మ్యూజియంలో జంతువుల్ని చూచినట్టు చూట్టం మొదలు పెట్టారు. ఏం జరుగుతున్నా ఆమెలో మాత్రం ఏమీ మార్పు కనపట్టంలేదు. కాని నేను కని పెట్టిన వాటిల్లో మరీ విచిత్రం అయిన విషయం ఏమిటంటే ఆడవాళ్ళతో మాట్లాడటానికినికి ఆమె నాకంటే సిగ్గుపడేది. లక్ష్మణశాస్త్రి భార్యతో తలవంచుకొని మాట్లాడేది. ఆమె వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పటానికి అమిత సిగ్గుపడేది.

“మీకు పిల్లలు ఎంతమందండీ?”

“మీరిట్లా తిరుగుతూ ఉంటే మీపిల్లలకు ఆలనా పాలనా ఎట్లా జరుగుతుంది!”

“ఈ చీరె ఎక్కడ కొన్నారు? దీని రంగు నిలవదండి”

“ఈ జాకెట్టుకి కుట్టుకూలి ఏం ఇచ్చారు?”

ఇటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఆమె తబ్బిబ్బు పడేది. మర్యాదగా జవాబులు చెప్పాలని ప్రయత్నించేదిగాని జవాబులు దొరక్కో అలవాటు లేకో ఉక్కిరి బిక్కిరి అయ్యేది.

ఇంతేకాదు, పసిపిల్లల్ని చూసినా, అంతే! మేం అంతా మాట్లాడుకునే సమయంలో శాస్త్రి పిల్లవాడు “అమ్మా” అంటూ అమె ఒళ్ళో దూరితే అమె పడిన భయం నేనెప్పుడూ మరిచి పోలేను. 

ఒళ్ళో తేలుపడ్డట్టు ఉలిక్కి పడ్డది. శాస్త్రీభార్య, “తిరగమోత మాడుతూ ఉంది. కొంచెం పిల్లవాడ్ని చంకవేసుకోండి, చూసి వస్తాను” అని చెప్పి ఆమెకు పిల్లవాణ్ణి అందించినప్పుడు ఆమె పడ్డ యాతన ఆ పరమాత్ముడికే తెలియాలి.

పిల్లవాణ్ని చంకన వేసుకోవటం చాతకాక శాస్త్రి భార్య పొయ్యిమీద చట్టిని పట్టుకున్నట్లు పట్టుకుంది. కాని ఎంత బాధ అయినా ఆమె మరుక్షణమే మర్చిపోయేది. ఇవతలికి వచ్చి ఏమీ జరగనట్టుగానే యథాప్రకారం ఆమె అందరితోనూ కులాసాగా కబుర్లు చెప్పేది, ఆ సంగతే ఎత్తేదికాదు.

భోజనం చేసి ఆమెను గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలో ఆమె కూడా శాస్త్రి ఇంట్లో భోజనం పూర్తిచేసుకుని వచ్చి “సినిమాకి వెళ్లాం రండి” అని అడిగింది.

నేను కొంచెం తటపటాయించి “శాస్త్రి ఏడి?” అన్నాను. 

“శాస్త్రి లేకపోతే మీరు రారా?” 

“ఎందుకు రాను?” 

“ఇంకేం? రండి.” 

“బండి పిలిపిస్తాను.” 

“నడిచిపోదాం .”

ఇద్దరం బయల్దేరాం. రోడ్డు మీద ఎవ్వరూ నడవటం లేదు. మునిపల్ లాంతరు స్థంభాలు మిణుకు మిణుకు మంటూ కాపలా కాస్తున్నై. దూరంగా అప్పుడప్పుడూ గుర్రపు బళ్ళ వోటిమోత వినిపిస్తోంది. మేమిద్దరం పక్క పక్కనే నడుస్తున్నాం. చలికి ఆమె శాలువా కప్పుకుంది. అందుకని నాకు ఆమె స్త్రీగా కనపట్టం మానేసింది.This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy