Artwork for podcast Harshaneeyam
'బ్లూ అంబ్రెల్లా'
Episode 19529th May 2021 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:11:48

Share Episode

Shownotes

పిల్లల సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఇరవై ఐదు , ఎంపిక చేసి , వాటి కథలను పరిచయం చేస్తూ ' పిల్లల సినిమా కథలు ' అనే ఒక పుస్తకం రాసి ప్రచురించారు రచయిత అనిల్ బత్తుల.

ఈ పుస్తకంనించి, 'బ్లూ అంబ్రెల్లా' అనే సినిమా కథా పరిచయాన్ని మీరు ఈ ఎపిసోడ్లో వింటారు.

'Blue Umbrella' కథకు రచయిత శ్రీ రస్కిన్ బాండ్.

అనిల్ గారు రాసిన పిల్లల సినిమా పుస్తకం కొనాలంటే ఈ లింక్ ని ఉపయోగించండి. :

http://bit.ly/anilbattulapillalacinemakathalu

భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోని ఒక గ్రామంలో 9 యేళ్ల బినియా అనే అమ్మాయి, వస్తాదు ఐన తన అన్నయ్య, వాళ్ల అమ్మతో కలిసి నివసించేది. వాళ్ల గ్రామం కొండప్రాంతంలో వుండేది. బినియా వాళ్లకి గోరీ, నీలూ అనే రెండు ఆవులు వుండేవి. పాప ఆ ఆవుల్ని కొండ వాలులోని పచ్చ గడ్డితో మేపేది. పాడి వాళ్ల జీవనాధారం. బినియాకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అదే గ్రామంలో నంద కిషోర్ అనే 50 యేళ్ల వ్యాపారి, రహదారి పక్కన 'ఖాత్రి టీ దుకాణం నడిపేవాడు. ఇతను పరమ లోభి. బడికెళ్లే పిల్లలకు చాక్లెట్లు, బిస్కట్లు ఆశ చూపి అప్పు ఇచ్చేవాడు. నెల అవ్వగానే పిల్లలకు తప్పు లెక్కలు చెప్పి వాళ్ల దగ్గర ఏదో ఒక వస్తువు (ఉదాహరణకు బైనాక్యులర్స్  లాంటివి) లాక్కునేవాడు. ఇతని దగ్గర రాంగోపాల్ అనే దొంగ పిల్లవాడు పనిచేసేవాడు.

ఒక రోజు బినియా ఆవుల్ని మేపటానికి కొండపైకి వెళ్తుంది.. అక్కడ తనకి ఒక అందమైన పెద్ద నీలంరంగు జపనీస్ గొడుగు దొరుకుతుంది. అది ఒక జపనీస్ టూరిస్ట్ బృందం వాళ్లది. వాళ్లు పాప మెడలోని ఎలుగుబంటి గోరుతో చేసిన దండని తీసుకుని దానికి బదులుగా ఈ అందమైన నీలంరంగు జపనీస్ గొడుగును ఇస్తారు. ఎలుగుబంటి గోరుతో చేసిన దండని అదృష్టచిహ్నంగా భావిస్తారు. అది దుష్ట శక్తులను పారద్రోలుతుందని ప్రజల నమ్మకం. గొడుగు కోసం దండను ఇచ్చినందుకు అమ్మ పాపను మందలిస్తుంది. ఆ నీలంరంగు గొడుగు రాగానే బినియా ఆ వూర్లో ఒక సెలబ్రిటీ అవుతుంది.. ఎందుకంటే ఆ వూర్లో వున్నవన్నీ నల్లని సాధారణ గొడుగులే. ఇంత అందమైన నీలంరంగు జపనీస్ గొడుగుని గ్రామ ప్రజలెప్పుడూ చూడలేదు. ఎండలో, వానలో, మంచులో ఎళ్లవేళలా పాప గొడుగుతోనే వుండేది. నీలంగొడుగు లేని బినియాను మనం వూహించలేము. ఊరివాళ్లు పాప గొడుగుని ఎంతో మెచ్చుకునేవాళ్లు. వ్యాపారి నందూ కన్ను, నీలంరంగు గొడుగుపై పడుతుంది. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. బినియాకు చాక్లెట్లు, బిస్కెట్లు, డబ్బు ఇలా రకరకాల ఆశలు చూపుతాడు. గొడుగు తనకు అమ్మమంటాడు. పాప అస్సలు ఒప్పుకోదు. వ్యాపారి నందూ ఈర్ష్య పడతాడు. వ్యాపారి నందూ సిటిలో ఒక గొడుగుల దుకాణానికి వెళ్లి రంగుల జపనీస్ గొడుగు గురించి వాకబు చేస్తాడు. దాని వెల 2500 రూపాయలని డబ్బు మొత్తం ముందే కడితే ఒక పది రోజుల్లో ఢిల్లీ నుండి తెప్పిస్తారు అని తెలుస్తుంది. లోభి, పిసినారి ఐన నందూకి అంత డబ్బు పెట్టి గొడుగు కొనడం ఇష్టం లేదు.

నందూ నిరాశగా బలో తిరిగి వస్తుంటే, గ్రామసమీపంలో వున్న జలపాతం కింద నీలం గొడుగుతో నిలబడివున్న బినియా కనిపిస్తుంది. నందూ బస్ ని ఆపి అక్కడే దిగి పాప వద్దకు పరిగెత్తుకుని వెళ్తాడు. 'బెలూన్ల గుత్తి 50 రూపాయలు ఇస్తాను, నీ గొడుగు నాకు అమ్మేయి' అంటాడు. పాప అందుకు ఒప్పుకోక, అక్కడి నుండి వెళ్లిపోతుంది. కోపంతో నందూ బెలూన్ల గుత్తిని గాలిలో ఒదిలేస్తాడు. తరువాతి రోజు పాప నీలం గొడుగుతో ఒక పాముతో పోరాడి వాళ్ల అన్నయ్యను కాపాడుతుంది.. ఈ విషయం గురించి గ్రామంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇలావుండగా ఒక రోజు పాప కొండపై ఆవులు కాస్తున్నప్పుడు నందూ దుకాణంలో పనిచేసే రాంగోపాల్ అనే పిల్లవాడు నీలం గొడుగుని దొంగిలిస్తాడు. ఈ పని తను యజమాని జీతం పెంచుతానన్నాడని చేస్తాడు. ఈ దొంగతనం గురించి పాపకు కానీ ఊరి ప్రజలకు కానీ తెలియదు. పాప భోరున ఏడుస్తుంది. అన్నం తినదు.

ఊర్లో వాళ్లంతా బతిమిలాడతారు. పాపకు నందూ మీద అనుమానం. పోలీస్ అంకుల్ని తీసుకెళ్లి నందూ దుకాణం అంతా వెతుకుతారు కానీ నీలం గొడుగు దొరకదు. తన పరువుని పాప బజారుకీడ్చిందని నందూ కోప్పడతాడు. తను కొత్త రంగుల జపనీస్ గొడుగు కొన్నదాకా పచ్చడి ముట్టనని గ్రామ ప్రజల ముందు శపథం చేస్తాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఊరి పోస్ట్మ న్ నందూకి ఒక పెద్ద అట్ట పెట్టెను తెచ్చిస్తాడు. నందూ గ్రామ ప్రజల మధ్య ఆ అట్టపెట్టెను తెరుస్తాడు.. మిలమిలా మెరిసిపోయే ఎర్రటి జాపనీస్ గొడుగు. నందూ ఆనందం వర్ణనాతీతం. నందూ అందరి ముందూ గర్వంగా పచ్చడి తింటాడు. ఆ ఎర్రటి గొడుగు వేసుకుని వూరంతా తిరుగుతాడు. పాపను వూరిస్తాడు. పాప ఏడుపు మొహంతో వుంటుంది. నందూ పట్నం వెళ్లటానికి బస్ ఎక్కుతుంటే, ఎర్ర గొడుగు బస్ ద్వారం దగ్గర ఇరుక్కుపోతుంది. అందరూ కలిసి అతి కష్టం మీద దాన్ని బయటకు లాగుతారు. నందూ గొడుగుని మూయటానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి చేతకాదు. బినియా సాయం చేస్తుంది. ఈలోగా గ్రామంలో కుస్తీ పోటీలు జరుపుదామని దానికి ముఖ్య అతిథిగా వుండాలని గ్రామ పెద్ద నందూని ఆహ్వానిస్తాడు. కుస్తీ పోటీలో పాల్గొనే వారికి భోజనం సగం ధరకే సరఫరా చేస్తానని నందూ ప్రకటిస్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. బినియా పోస్ట్మన్ వద్దకు వెళ్లి నందూకి పార్సల్ ఎక్కడి నుండి వచ్చిందని వాకబు చేస్తుంది. ఆ పార్సల్ ఢిల్లీ నుండి రాలేదని ఆ గ్రామానికి దగ్గరలోనే వున్న బనికేట్ అనే గ్రామంలోని రంగులేసే దుకాణం నుండి వచ్చిందని తెలుస్తుంది.

పాప పోలీస్ అంకుల్ని వెంట పెట్టుకుని వెళ్లి ఆ రంగుల వ్యాపారిని వీళ్ల వూరికి పట్టుకొస్తుంది. ఈ లోగా కుస్తీ పోటీలు జరుగుతాయి. విజేతలను ప్రకటిస్తూ నందూ ఉపన్యసిస్తుంటాడు. వర్షం కురుస్తుంది.. గొడుగు రంగు వెలిసి ఎర్రరంగు కారిపోయి లోపల వున్న నీలం రంగు బయటపడుతుంది. నందూ 'గొడుగు దొంగ' అని ఊరంతా తెలుస్తుంది. అందరూ నందూని తిడతారు. గొడుగుని బినియాకు తిరిగి ఇస్తారు. నందూ దుకాణంలో ఏదీ కొనకూడదని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు. రాంగోపాల్ నందూ దగ్గర పని మానేసి వెళ్లిపోతాడు. నందూని అందరూ వెలివేయడంతో ఒంటరి వాడవుతాడు. ఒక రోజు రాత్రి నందూ దుకాణం పైకప్పుపై ఎలుగుబంటి దాడి చేస్తుంది. తరువాతి రోజు ఉదయం నందూ పైకప్పు బాగు చేసుకుంటుంటే ఎలుగుబంటి గోరు దొరుకుతుంది. దాంతో నందూ ఒక దండ తయారుచేయిస్తాడు.

పిల్లలు నందూని దొంగ, దొంగ అని ఏడిపిస్తుంటారు. ఇదంతా బినియా నిశబ్దంగా గమనిస్తూ వుంటుంది. నందూని బాధ పెట్టడం ఇష్టం లేక పాప దుకాణం ముందు నీలంగొడుగు మూసేసి నడిచి వెళ్తుంటుంది. గ్రామపెద్ద కొడుకు వివాహ ఊరేగింపు జరుగుతుంటుంది. నందూ వెళ్లి పెళ్లికొడుక్కి ఎలుగుబంటి గోరు దండ బహుమతిగా ఇవ్వబోతాడు. పెళ్లికొడుకు తీసుకోడు. నందూని దొంగ అని అందరూ అవమానిస్తారు. ఇది చూసి బినియా చాలా బాధ పడుతుంది. తరువాతి రోజు బినియా నందూ దుకాణం కెళ్లి బిస్కెట్లు కొనుక్కుంటుంది. నీలం గొడుగుని అంగడి వద్ద వదిలేస్తుంది. నందూ పరిగెత్తుకుంటూ వచ్చి 'పాపా.. నువ్వు గొడుగు మర్చిపోయావ్' అని తిరిగివ్వబోతాడు. పాప తీసుకోదు.. 'అది ఇక నుండి మీదే అంకుల్' అంటుంది. 'జీవితంలో గొడుగే కాకుండా చాలా వున్నాయి' అని వెళ్లిపోతుంది. 

ఈ విషయం తెలిసి గ్రామస్తులు నందూని క్షమిస్తారు. అతని దుకాణంలోజనాలు నందూని పొగుడుతారు. నందూ గొడుగుని చూపించి ఇదివరకటిలాగనే కొంటుంటారు. నందూ ఆ నీలం గొడుగుని దుకాణం మీద నిలబెట్టి గట్టిగా కడతాడు. దుకాణం పేరు 'గొడుగు టీ అంగడి' అని మారుస్తాడు. నందూ మంచివాడిగా మారి అందరితో బాగుంటాడు.

బినియాగా శ్రేయశర్మ, నందూగా పంకజ్ కపూర్ చాలా బాగా నటించారు. ఈ సినిమాను రస్కిన్ బాండ్ రాసిన 'ద బ్లూ అంబిల్లా' అనే కథ ఆధారంగా విశాల్ భరధ్వాజ్ దర్శకత్వం వహించాడు. ద బ్లూ అంజిల్లా కథను 'నీలం రంగు గొడుగు' పేరుతో సురేష్ కొసరాజు తెలుగులో అనువదించారు. ఈ సినిమా 2007 లో ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డ్ గెలుచుకుంది. సినిమాలో భాష హిందీ కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా వున్నాయి.


'బ్లూ అంబ్రెల్లా' నెట్ ఫ్లిక్ లో చూడొచ్చు - https://www.netflix.com/title/70075775

మరిన్ని వివరాలు అనిల్ బత్తుల గారితో హర్షణీయం చేసిన ఇంటర్వ్యూ లో మీరు వినవచ్చు.


https://gaana.com/song/part-1-


‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

(Harshaneeyam on Gaana app)


స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam

(Harshaneeyam on Spotify)


ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5

(Harshaneeyam on Apple. Podcast)



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube