Artwork for podcast Harshaneeyam
'నాన్నతో ఒక్క రోజు' - తమిళ మూలం - సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు
Episode 125th September 2022 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:25:39

Share Episode

Shownotes

‘నాన్న తో ఒక్క రోజు’ 

తమిళ మూలం: సుప్రసిద్ధ కథా రచయిత  సుందర రామస్వామి గారు 

నాన్నతో ఒక్కరోజు అనే కథకు తమిళ మూలం సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు. కథను మీ కందించడానికి అనుమతినిచ్చిన కణ్ణన్ గారికి, సహకరించిన గీతారామస్వామి గారికి కృతజ్ఞతలు. 

నాన్నకున్న ఒకే ఒక దాయాది రాజు పెదనాన్న. పేరుకు దాయాదులన్న  మాటే గానీ ,  ఇద్దరూ, ఒకే కడుపున, పుట్టిన వాళ్ళ కంటే కూడా, ప్రేమగా సఖ్యంగా వుంటారు. 

నాన్న అమ్మలకు పెళ్ళైన కొన్నాళ్ళకే , ఆస్తులన్నీ కరిగిపోయాయి. బతకడానికి ఏ ఆధారమూ లేక, నిస్సహాయంగా మా కుటుంబం నిలబడుంటే, రాజు పెద్ద నాన్నే  చెయ్యందించాడు. తనకు బాగా డబ్బులు తెచ్చిపెడుతున్న ఒక వ్యాపారాన్ని, నాన్నకిచ్చేసాడు, రాజు పెదనాన్న. 

‘అప్పట్నుంచే, డబ్బు సంపాదన అంటూ, ఒకటి మొదలై,  నలుగురిలో తలెత్తుకు తిరిగే స్థితికి చేరుకోగలిగాను. ఏమిచ్చినా ఆ ఋణం తీర్చుకునేది కాదు’ అంటారు నాన్న . అమ్మగూడా అదే అంటుంది. ఎప్పుడు రాజు పెదనాన్న   గురించి మాట్లాడుకున్నా, ఇద్దరికీ కళ్ళు తడవుతాయి.  నాతో, రమణి అక్కతో అమ్మ రాజు పెదనాన్న గురించి ఎంతలా చెప్పిందంటే, మేమిద్దరం ఆయన  ‘దేవుడి’ అంశ  అనుకోడం మొదలెట్టాం. 

సంవత్సరానికి ఒక సారి, పెదనాన్న, మా ఇంటికి వచ్చేవాడు. ఆయన వస్తున్నట్టు ఉత్తరం అందగానే, ఇల్లంతా సందడి మొదలయ్యేది. పెదనాన్నకి,  నులక మంచం మీద పడుకోడం అంటే ఇష్టం. మొదట, ఆ మంచాన్ని పెరట్లోకి తీసుకెళ్ళి, మరిగే నీళ్ళు పోసి, నల్లులు లేకుండా, శుభ్రంగా, కడిగే కార్యక్రమం ప్రారంభం అయ్యేది. అమ్మ, ఆయన కిష్టమైన పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు తయారు చెయ్యడం మొదలెట్టేది. నాన్న బంగారు అంచుతో వుండే కొత్త విసనకర్రలు కొనుక్కొచ్చేవాడు. మధ్యాహ్నం పూట, భోజనం ఐన  తర్వాత, పెదనాన్న పడుకునుంటే, చెరో వైపు నిలబడి, విసరడం  రమణీ కి, నాకూ అలవాటు.  రమణి ఎప్పుడూ నన్ను ఆయన కాళ్ళ వైపు  నిలబడి విసరమనేది. ‘పెదనాన్న తల వైపు నిలబడి, ఆయన మొహానికి తగలకుండా, విసరడం నీకు చేతకాదు’ అని చెప్పేది. ఎప్పుడైనా అమ్మ పిలిస్తే,  రమణి అక్కడినించి వెళ్ళిపోయినప్పుడు, నేను పెదనాన్న మీదకి, బాగా  ముందుకు  వంగి, విపరీతంగా విసిరేవాణ్ణి.  అప్పుడు, రాజు పెదనాన్న, నీ సంగతి నాకు తెలిసిపోయిందన్నట్టుగా, మూసిన కళ్ళు తెరవకుండానే, నవ్వేవాడు.  ఆ నవ్వులో, తమలపాకులతో పండిన అందమైన ఎరుపు, లీలగా  మెరిసేది. వడసేరి తనుమాలయన్ నేసిన పంచెలు మాత్రమే, తన ఒడ్డూ పొడుగుకి  సరిపోతాయనే వాడు, రాజు పెదనాన్న.   ఆయన కోసమని, ప్రత్యేకంగా, నాణ్యమైన నూరో నంబరు నూలు పంచెలు కావాలని, దుకాణానికి కబురు పంపించేవాడు నాన్న.  అమ్మ, ఆనందత్త కల్సి పెరట్లోకి వెళ్ళి, ఏ అరటిచెట్టు నించి, ఏ ఏ  ఆకులు  కోసి, భోజనాలకు వాడాలో, నిర్ణయించే వాళ్ళు. ఎందుకోగానీ, ఎప్పుడూ రాజు పెదనాన్న రావడం, మా ఆవు ఈనడం ఒకే సారి జరిగేవి. ‘ఇలాటి  జున్ను తినాలంటే, రాజు లాగా పెట్టి పుట్టాలి,’ అనేవాడు గర్వంగా నాన్న. 

రాజు పెదనాన్న కుటుంబం చాలా పెద్దది. ‘మా ఇంట్లో పన్నెండున్నర మందిమి మేము!’   అనేవారు పెదనాన, తమాషాగా. అది కొంచెం అతిశయోక్తి.  నిజానికి ఆయనకు పద్నాలుగు మంది పిల్లలు.  దాదాపు, ముప్పయి మంది మనవళ్ళు, మనవరాళ్ళూ. ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి వంటిల్లు . 

కొన్నిరోజులైనా సరే, ఆ సందడంతా వదిలేసి వచ్చి, మా ఇంట్లో ఉండడం పెదనాన్నకి ఎంత కష్టమో, మా అమ్మానాన్నలకి  తెలుసు. ఆయనకు ఇంటికి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చినట్టు గమనించగానే,  ’ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి తొందరేముంది?’ అని అంటూ, ఇంకొన్ని రోజులు, ఉండమని బలవంతం చేసేవారు నాన్న. ఇద్దరూ కూచుని, వాళ్ళ చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుంటూ, ‘ఇంతకు ముందు రోజులా ఇవి ? అన్నీ నాశనం అయిపోతున్నాయి’ అని ముక్తాయించే వాళ్ళు. రాత్రంతా మేలుకుని  అలా మాట్లాడుకుంటూనే వుండే వాళ్ళు. అయినా, మరుసటి రోజు పొద్దున్న లేచింతర్వాత గూడా, మాట్లాడుకోడానికి, వాళ్ళకు మాటలు ఇంకా మిగిలుండేవి. ప్రతిరోజూ పొద్దున్న, షాపు తెరవడానికి  వెడుతూ , ‘నాలుగు గింజలకోసం, పెదనాన్న తో సమయం గడపకుండా, వెళ్ళాల్సివస్తోందే’, అన్న  బాధ కనపరుస్తూ, నెమ్మదిగా బయలుదేరేవాడు నాన్న. 

ఆ రోజుల్లో ఇంట్లో ఫోన్ ఉండడం అనేది చాలా అరుదు. ఓ రోజు తెల్లవారు ఝామున, ఫోన్ ఆఫీసునించి ఒకతను హడావుడిగా వచ్చాడు. నాన్నకు, కొచ్చిన్ నించీ ఏదో  ఫోన్ వచ్చిందనుకుంటా. విషయం విని అమ్మా నాన్నలకు నోట్లో మాట రాలేదు. కొచ్చిన్ లో ఉండేది రాజు పెదనాన్న.  నాన్న మొహాన్ని గమనిస్తూ , విషయం ఏమిటో  తెలుసుకోవాలని  ఆతృత  పడ్డాను. మామూలుగానే, నేనెళ్ళి  ఆయనకెదురుగా నిలబడే  ప్రశ్నే లేదు. ఇపుడేమో, నాలుకలు తెరుచుకుని ఇంటి కప్పు నంటే, మంటలా కనిపిస్తున్నారు  నాన్న.  ఇలాటప్పుడు ,  నేనెప్పుడూ వేసే ఎత్తు ఒకటే.  మా ఇంటికో పక్కన, గోడనానుకుని  వున్న,  వేపచెట్టుకొమ్మ మీద కెక్కి కూచున్నాను. 

గాలి వీచి, కిటికీని మూసిన తెరలు, పైకి తెరుచుకున్నప్పుడల్లా, ముందువసారాలో, పడక్కుర్చీలో కూచుని వున్న, నాన్న ఎర్రబడిన మొహం నాకు కనపడుతోంది. ఇలా  నాన్న వైపు అపుడపుడూ చూస్తూ, ఏవనుకుంటున్నారో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే రమణికి ఈ ఇబ్బంది లేదు. నేరుగా తాను వరండాలోకి వెళ్ళగలదు. కావాలంటే, భయమనేదే లేకుండా  నడుచుకెళ్ళి,   నాన్న పక్కనే, నిలబడగలదు కూడా. ఒక్కోసారి, ఆయన చుట్టూచూసి,  ఎవరూ లేరు, అని నిర్ధారించుకుని, రమణిని దగ్గరకు తీసుకుని ప్రేమగా  తల నిమిరే వారు. వేపచెట్టుమీద కూచునప్పుడు, ఎన్నోసార్లు ఈ దృశ్యాన్ని నేను చూసాను. నేనెక్కడ ఉన్నానో, రమణికి తెల్సు కాబట్టి, నా వైపు తల తిప్పి , ‘ఇదంతా చూస్తున్నావా?’ అన్నట్టుగా మొహం పెట్టేది. నాన్నకు, తనంటే ఎంత ఇష్టమో, నాకు చూపించడం కోసం తహతహలాడేది. నన్ను ఏడిపించడం తన ఉద్దేశ్యం. నేను మటుకు, అందుకు బదులుగా,  నా మొహాన్ని చిత్రవిచిత్రంగా మారుస్తూ తనని వెక్కిరించేవాణ్ణి. గాలి సరిగా లేక కిటికీ తెరలు తగినంతగా  తెరుచుకోవడంలేదు  అనిపిస్తే,  రమణి చూసిందని తేల్చుకునేదాకా, పది పన్నెండు సార్లయినా సరే, ఈ ప్రదర్శనను  కొనసాగించే వాణ్ణి నేను. 

అదేపనిగా, నాన్న మొహాన్ని తదేకంగా చూస్తున్నాను. బాగా ఎరుపెక్కి వుంది. చాలా బాధతో  వున్నపుడు, ఏదైనా తీవ్ర సమస్యల్లో ఉన్నప్పుడు, ఎడమ చేతి వేళ్ళు  గడ్డం కింద, ఆనించి, బుగ్గలు పైకి వెళ్ళిపోయేలా,  నొక్కి పెడతారు నాన్న. చూపు ఒకే చోట నిమగ్నమై,  కదలకుండా నిలబడిపోతుంది. ఒక్కోసారి, కళ్ళు రెండూ మూసి, దీర్ఘంగా నిట్టూరుస్తారు. బాధనంతా, శ్వాస ద్వారా బయటికి విడిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది. మునుపెన్నడూ, ఆయన మొహంలో ఇంత బాధని నేను  చూడలేదు. లోపలుండే తీవ్రమైన నొప్పిని, అతికష్టం మీద,నిశ్శబ్దంగా, భరిస్తున్నట్టుగా వుంది ఆయన వాలకం. 

చెట్టు దిగి,  ముందు  వరండాలోకి పరిగెత్తాను. మెట్లెక్కి వెళ్ళి, ఒక స్తంభానికి ఆనుకున్నాను. ఆయన నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  ఎప్పటిలా, ‘ఈయన నన్ను చూడగానే చిరాకు పడేట్టు లేరు’,  అన్న విషయం, నాకు అకస్మాత్తుగా స్ఫురించింది. 

“ఇప్పుడు వెళ్ళి, ఆయన పక్కన కూడా నిలబడొచ్చు! కావాలంటే.”

కానీ, అలా ఏవీ జరగలేదు. ‘మీ అమ్మని పిలు’ అన్నారాయన. అంత మృదువుగా ఆయన నాతో ఇంతకు ముందెప్పుడూ మాట్లాడలేదు. మళ్ళీ మెట్లు దిగెళ్ళి,నేల మీద పరిచివున్న పట్టా తోటి,  కాళ్ళు శుభ్రం చేసుకున్నాను. “నాన్న ‘వీడు చాలా తెలివైనవాడు’ అని నా గురించి  అనుకోవాలి. అసలు తెలివితేటలు చూపించే అవకాశం అంటూ ఒకటి, నాకు  ఇవ్వకపోతే, ఈ విషయం ఎవరికైనా  ఎలా తెలుస్తుంది? తెలివితేటలు అనేవి, ఒక్క రమణి సొంతమే కాదు. నా బుర్ర కూడా బాగా చురుకైనదే. కానీ, అది నిరూపించే అవకాశమే ఎప్పుడూ రాలేదు. అంతే.” 

ఇంట్లోకి పరిగెత్తాను. 

అమ్మ కిటికీ పక్కకొచ్చి నిలబడి గొంతు సవరించుకుంది.ఆ కిటికీ లోంచి వరండా అంతా కనిపిస్తుంది. మొదటగా , గొంతు సవరించుకోవడం అనేది, ఆమె రాకకు సూచన.  దాని తర్వాత నాన్న వీధి లోకి చూస్తూ, మొక్కలగురించి, తీగల గురించి, కొబ్బరి చెట్ల గురించి, ఎగిరే పక్షుల గురించి అనేకానేక ప్రశ్నలు సంధిస్తారు. 

అమ్మ తన సమాధానాలన్నీ నాన్న వీపుకి చెప్తుంది.  ఏవైనా, అర్థంలేని, అర్థం కానీ ప్రశ్నలడిగినప్పుడు, ఆయనకు మటుకు,  ఓర్పుతో సమాధానాలు చెప్తూ, తన ముఖం చిట్లించడాలూ, తల కొట్టుకోవడాలూ లాంటివి, మా వినోదానికి వదిలేస్తుంది.  

నాన్న కొంచెం గొంతు పెద్దది చేసి, అరిచారు. ‘ఒక్కడూ కనపడ్డం లేదు. నేనే  స్వయంగా అన్నీ చూసుకోవాలి’. 

రమణి, నేను, చప్పుడు చేయకుండా, అమ్మ దగ్గరికి జరిగాం. కిటికీ తెరకున్న సందులోనించీ, నాన్న వీపు మీదున్న, పుట్టుమచ్చలు, లెక్కపెట్టగలిగినంత, స్పష్టంగా, నాకంతా కనపడుతోంది. ఒకరకంగా ఆయన ఆవేశపడటం సహజమే.  బయటకెళ్ళి పనులు చేసుకోవడం,  నాన్నకు అసలు అలవాటులేదు. నాన్నకు గానీ, ఇంట్లో కానీ,  బయటినించీ ఏదన్నా కావాల్సి వస్తే,  శీను మామో, నటరాజ్ మామో, చూసుకుంటారు. ఆనందత్త కూడా ఒక్కోసారి, అవసరం వచ్చినప్పుడు. వంట సగంలో వదిలేసయినా సరే , బయటకెళ్ళి,  నాన్న పనులు చేసుకవస్తుంది. పోస్ట్ ఆఫీసుకి , కరెంటు ఆఫీసుకి , పచారీ దుకాణానికి, కనీసం పిల్లల విషయంలో స్కూలుకి , ఆసుపత్రికి కూడా, ఆయన వెళ్ళడం అనేది  ఎప్పుడూ జరగలేదు. అంతెందుకు, తమలపాకులమ్మే దుకాణానికి కూడా ఆయన వెళ్ళిన దాఖలాలు లేవు. 

“కొంచెం సేపు ఆగుదాం. ఎవరైనా వస్తారేమో చూద్దాం!” అంది అమ్మ. 

“అసలు నాకు అత్యవసరంగా ఏదైనా  కావాల్సి వచ్చినప్పుడు, ఎవడైనా వచ్చి  తగలడ్డం చూసావా? ప్రతి చిన్న విషయం నేనే చూసుకోవాలి” అన్నారు నాన్న. 

అలాంటి సందర్భంలో కూడా, నవ్వు ఆపుకోలేక పోయింది అమ్మ. అమ్మ చేతిని నోటికడ్డం పెట్టుకుంటే, వెంటనే రమణి కూడా అలానే చేసింది. నేను, వాళ్ళిద్దరి కంటే కూడా, నవ్వు ఆపుకోడం నాకే  ఎక్కువ  కష్టంగా ఉన్నట్టు, నోటికి,  ‘రెండు’ చేతులు అడ్డం పెట్టుకున్నాను. నాన్న మాటల్లోని హాస్యం, నాకు అర్థం కాలేదని, రమణి అనుకోవడం నా కిష్టం లేదు. అలా జరిగితే, జీవితాంతం అది పట్టుకు వేలాడి, నన్ను ఏడిపించేస్తుంది. నేనెక్కడ దొరుకుతానా? అని రమణి, ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది కదా!

అమ్మ మూడోసారి అడిగింది, “ ఫోన్ ఎక్కడనించీ వచ్చిందన్నారు?”. ప్రశ్నకు సమాధానం తనకు బాగా తెలిసినా, నాన్న ఆందోళనను కొంత తగ్గించేందుకు ,అమ్మ చేస్తున్న ప్రయత్నం అది. నాన్న సమాధానం ఇవ్వలేదు. ఆయన మౌనానికి అర్థం, “బుర్ర లేని వాళ్ళతో నేను మాట్లాడను” అని. 

ఉన్నట్టుండి, ఏదో పూనకం వచ్చినవాడిలా, నాన్న చెప్పులేసుకుని, ముందు మెట్లు దిగారు. అమ్మ ఖంగు తింది. తర్వాత వెంటనే  సర్దుకుని, నా వైపు చూసి  “నువ్వెళ్ళరా! నాన్న తోటి” అంది.  అమ్మ నాన్నతో నన్ను వెళ్ళమనడం, నన్ను విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేసింది. ‘నేను పైసాకి గూడా పనికి రాను” అనే నాన్న అభిప్రాయానికి,  అమ్మ వంత పాడటం అనేది, ఎప్పుడూ జరిగేదే  మా ఇంట్లో. 

ఈ లోపల, నాన్న ముందు గేటు దాకా వెళ్ళి, వెనక్కి తిరిగి, “వీడేందుకు నా తోటి?” అని కేక పెట్టాడు. 

“మీ గొడుగు పట్టుకొస్తాడు” అంది  అమ్మ. విపత్కర పరిస్థితుల్లో, మా అమ్మ బుర్ర ఆలోంచించినంత వేగంగా ఎవరి బుర్రా ఆలోచించలేదు. ‘అసలు ఏదో చిన్న, అల్పమైన అవసరానికి, పనికొస్తే తప్ప, నాన్న నన్ను వెంట రానివ్వడు,!’  అనే విషయం  అమ్మకు అంత బాగా ఎలా తెల్సు? ఒక్క ఉదుటున నేను నాన్న గదిలోకి పరిగెడుతూ వెళ్ళి, ఆయన గొడుగును తీసి నా గుండెలకదుముకున్నాను. ఆ క్షణం దాకా, ఆ గొడుగును వేరే వాళ్ళు, తాకడం అనేదే జరగలేదు. 

నాన్న చాలా దూరం వెళ్ళారు. నేను, తన వేగాన్ని అందుకోడం, తన కిష్టం లేదన్నట్టుగా, నాన్న వడి వడిగా అడుగులేస్తున్నారు. నేను ఊరుకుంటానా? గాల్లో తేలుతూ  పరిగెత్తాను. నాన్న ఇంకా హై స్కూల్ గ్రౌండ్స్ దాకా కూడా వెళ్ళలేదు. ఈ లోపలే వేగంగా  పరిగెడుతూ , నాన్న మీద పడకుండా, అతికష్టం మీద, నన్ను నేను, సంబాళించుకున్నట్టుగా,   కొంచెం తూలి, ఆయన ముందుకెళ్ళి  ఆగాను. నన్ను చూడంగానే అడిగాడాయన. “వెర్రి వెధవా   ! చొక్కా వేసుకోకుండా బయటకెందుకొచ్చావ్?” అని. మామూలుగా ఆయన నన్ను  ‘వెర్రి వెధవా ’ అనే తిట్టే విధానానికి, దీనికీ చాలా   తేడా కనిపిస్తోంది. ఎంతో వాత్సల్యం రంగరించి వుంది ఇప్పటి పిలుపులో. 

“ఇప్పుడే వేసుకొస్తాను” అంటూ నేను వెనక్కి తిరిగి గాల్లోకి ఎగరబోతూంటే, “పర్లేదులే, చిన్న వాడివి కదా నువ్వు!” అన్నాడాయన. ఆయన మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. నా శరీరంలో అప్పటిదాకా  మండుతున్న జ్వాల ఏదో, అకస్మాత్తుగా ఒక చల్లని మంచు గడ్డ కింద మారిపోయి, నన్ను ప్రేమగా స్పర్శించినట్టనిపించింది.  ఊహేమో! అనుకున్నాను. కాదు.  నిజంగానే నాన్న నా చేతిని, తన చేతిలోకి తీసుకున్నారు. పట్టరాని ఆనందం! ఎంత హాయిగా వుంది? ఒళ్ళంతా మత్తెక్కినట్టయి, పులకించి పోయింది. కొంచెం కూడా వెనక పడిపోకూడదని, నాన్న తోటే, ఆయన  పక్కనే నడిచాను. గొడుగును గట్టిగా పట్టుకున్నాను. 

స్కూల్ దాటగానే టెలిఫోన్ ఆఫీసు. ముఖద్వారానికి ముందే, ఒక పెద్ద వరండా ఉండి, కుడివైపు, పొడుగాటి బెంచీ వేసి వుంది. ఎడమవైపు, అద్దాల బూతులోంచి, టెలిఫోన్ కనపడుతోంది. నాన్న బూతు లోపలికెళ్ళి, ఫోన్ తీసుకుని, మాట్లాడాలి. 

నాన్న నా గురించి తర్వాత అమ్మతో చెప్పేటప్పుడు, నేను చేసిందంతా గర్వంగా చెప్పాలనే అతృతతో, చుట్టూ వున్న ప్రతి విషయాన్నీ చాలా జాగ్రత్తగా గమనించడం ప్రారంభించాను.. 

ఆయన బెంచీ మీద కూర్చుని వున్నాడు.  పూర్తిగా అలసిపోయినట్టు కనపడుతున్నాడు.  ఆయన మొహం ఇంతకుముందుకన్నా, వాడిపోయి వుంది. మెడ మీదినుంచి, చెమటలు కారిపోతున్నాయి. నడిచొస్తున్నప్పుడు, ఎండలో ఆయనకు గొడుగు పట్టనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.  నిజంగా, నేను వెర్రి వెధవనే  అనిపించింది. ఇలాంటి సమయాల్లో, నాన్నను ఊరడించడానికి అమ్మ ఏమంటుందో, ఊహించడానికి ప్రయత్నించాను. కొచ్చిన్ నించీ వచ్చిన ఫోన్, నాన్నకి కాకపోతే ఎంత బావుంటుంది? అని ఆలోచించాను. 

టెలిఫోన్ ఆఫీస్ లోకి తొంగి చూసాను. అక్కడ రెండు జడలు వేసుకున్న ఒక అమ్మాయి, డెస్క్ లో కూర్చుని వుంది. అమ్మ ఎవరిని అక్కా అనాలో? ఎవరిని అత్తా అనాలో? చాలా ఓపిగ్గా జాగ్రత్తగా నాకు నేర్పించింది. అమ్మ చెప్పిన పాఠం ప్రకారం గమనిస్తే , ఇక్కడున్న అమ్మాయి అక్కకు ఎక్కువగా, అత్తకు తక్కువగా కనపడుతోంది. విమానం పైలట్లలా చెవులకు ఏదో పరికరాన్ని తగిలించుకుని, ముందున్న బోర్డు మీది గుబ్బలను అటూ ఇటూ మారుస్తోంది. ‘అక్కా!’ అంటూ ఆమెని పిలిచి నాన్న పేరు చెప్పాను. తన నోరు తెరవకుండా, ‘మీరు  కొంచెం సేపు వేచి చూడాలి!’ అని సైగ చేసిందామె. వెళ్ళి నాన్న పక్కన కూర్చున్నాను. క్షణాలు గంటల్లాగా గడిచాయి. కొంత సేపటి తర్వాత  ఆ అమ్మాయి, నాన్న ని పిలిచి, ‘మీరిప్పుడు మాట్లాడొచ్చు’ అని చెప్పింది.  నాన్న ఒక్క ఉదుటున,  ఆదరా బాదరాగా పరిగెడుతూ, బూతు కున్న గ్లాస్ డోర్ ని, తోసుకుంటూ లోపలికెళ్ళి, రిసీవర్ ని చేతిలోకి తీసుకుని చెవికి ఆనించుకుని, ‘నేను! నేను! ‘ అని గట్టిగా అరవడం మొదలెట్టాడు. ‘ సార్ మీరు దయచేసి అరవొద్దు. ఒక్క క్షణం ఆగండి. నేనింకా లైన్ కలపలేదు” అంది ఆమె. నేను నా తల లోపలపెట్టడానికి తలుపు తీసి పట్టుకోడంతో, అందరికీ, నాన్న మాటలు వినపడ్డాయి. వరండాలోవున్న కొంతమంది, నవ్వుకుంటున్నారు అని అర్థమైంది. స్తంభానికి ఆనుకొని, సిగరెట్ తాగుతూ నిల్చుని ఉన్న ఒకతను, పక్కనున్న స్నేహితుడితో అంటున్నాడు, “నేను, నేను అని అరిచి ఏం లాభం? పేరు చెప్పాలిగదా?” 

నాకు విషయం అర్థమైంది. “నాన్నా! మీ పేరు చెప్పండి”. వెంటనే నాన్న “నేను శంకరన్! శంకరన్” అంటూ ఏడెనిమిది సార్లు అరిచాడు. తర్వాత  నా వైపు చూస్తూ  “బాలూ ! ఒక్క ముక్క కూడా  వినపడలేదు రా “ అని నిష్టూరంగా, నిరాశతో చెప్పాడు. ఆయన ఇబ్బందులను, నాతో పంచుకోవడంతో నా ఆనందానికి అవధుల్లేవు. 

“నేను మాట్లాడేదా? నాన్నా !” అని అడిగాను. 

ఎంత అమర్యాద? 

కానీ విచిత్రంగా, ఏదో పసిపిల్లాడిలా, రిసీవర్ నా చేతికిచ్చి, “మాట్లాడు” అన్నాడాయన. “హలో, హలొ “ అన్నాను. నాన్న ఆ పదం వాడకపోయినా, నేను ఒకేసారిగా ఆ పదం వాడేసాను!  అని ఎందుకో అనిపించింది. 

“నాన్నా నాకు స్పష్టంగా వినపడుతోంది. శీను మాట్లాడుతున్నాడు.” అన్నాను. 

నెమ్మదిగా తన కుడిచెయ్యి నా భుజం మీద వేసి, “ మాట్లాడు! మాట్లాడు!” అని ప్రోత్సహించాడు నాన్న.

 “ పెదనాన్న చనిపోయాడట. శీను ఏడుస్తున్నాడు”. 

తట్టుకోలేక, మా నాన్న రిసీవర్ నా చేతిలోంచి తీసుకుని, “ అయితే రాజూ ఇక లేడా?” అంటూ గట్టిగా అరిచాడు. ఇంతలో  ఆ అమ్మాయి స్వరం ఆఫీసులోంచి వినపడింది. “ మీ మూడు నిమిషాలు అయిపోయాయి సార్ “ అని. 

హై స్కూల్ దాటగానే, నాన్న ఉన్న పళంగా,  అక్కడున్న వరండాలో కూర్చుండిపోయాడు, పూర్తిగా అలసిపోయి. ముందుకు నడవలేక పోయాడు. కళ్ళు నిండుకుని, బుగ్గలు తడిసిపోయాయి. కంటి అద్దాలు తీసి, మడిచి, జేబులో పెట్టుకుని, రుమాలుతో మొహాన్ని కప్పుకున్నాడు. ఒక చేత్తో నన్ను దగ్గరికి లాక్కున్నాడు. ఆయన్ని చూస్తే, విపరీతంగా జాలి వేసింది. ఆయన మీద ప్రేమ, ఆయన లోని విషాదం, ఒక్కసారిగా నన్ను కమ్మేశాయి. సుచీద్రం గుడి హనుమంతుడి అంత, పెద్దగా అయిపోయి, నాన్నను భుజం మీద ఎక్కించుకుని, గాల్లోకి ఎగిరిపోయి, ఒక్కసారిగా మా ఇంటి డాబా మీద వాలాలనే కోరిక పుట్టింది. నాన్న చెయ్యి పట్టుకు లాగాను. మంత్రముగ్దుడిలా, లేచి నడవడం మొదలెట్టాడు. 

మా నాన్న, ఇంటిలోకి నేరుగా  వెళ్ళకుండా , ప్రహరీ గోడ పక్కగా  నడుచుకుంటూ,  వెనకున్న బావి దగ్గరకెళ్ళి, నీళ్లు తోడి, నెత్తిన పోసుకున్నాడు. అనాలోచితంగా నా మీద కూడా కొన్ని నీళ్ళు పోసేసాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. రమణి పెరట్లోకివచ్చి మమ్మల్నిద్దరినీ చూస్తోంది. తన్ను తాను పూర్తిగా మరిచిపోయి, ఏదో సమాధి స్థితిలో ఉన్నట్టుగా, అలా తన మీద నీళ్ళు పోసుకుంటూనే వున్నాడు. అమ్మ ఎంత బతిమాలినా, ఏవీ తినకుండా, వెళ్ళి పడుకున్నాడు. ‘ వూరికే పదే పదే  కడుపు నింపుకోవడం వల్ల ఏం ప్రయోజనం?’ అన్నాడు. మామూలుగా కాకుండా కింద నేల మీద ఒక చాప వేసుకుని దాని మీద పడుకున్నాడు. విసనకర్ర తీసుకుని మెల్లగా,  విసరడం మొదలుపెట్టాను. రమణి నావైపే గుచ్చి గుచ్చి చూస్తోందని పసిగట్టాను. నేనేవీ తనను పట్టించుకోలేదు. ఇంక ఆ అవసరమే లేదు. ఆయన రమణి కి ఎంతో, నాకూ అంతే. 

ఆయన లేచిన తర్వాత, అమ్మ ‘మీరు భోజనం చేస్తారా’ అని అడగలేదు. అరటి ఆకు వేసి, వడ్డించడం మొదలు పెట్టింది. ఆమె అన్నం వడ్డించే సమయానికి వచ్చి కూర్చున్నారు నాన్న. ఒక్క మాట మాట్లాడకుండా భోజనం పూర్తిచేసి, వెళ్ళి, ముందు వరండాలో కూర్చున్నారు. అమ్మ వచ్చి, కిటికీ పక్కన నిలబడింది. ‘టెలిఫోన్ ఆఫీసు, హైస్కూల్  పక్కనేగా?”అని అడిగిందమ్మ. దానసలు అర్థం, ‘మొదటినించీ చివరిదాకా, వివరంగా చెప్పమని.’ పెద్దగా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టారు నాన్న. నేను వరండాలోంచి ముందు వసారాలోకి జారుకుని, ఆయన నన్ను చూడకుండా, ఇంటివెనక నించి, లోపలికొచ్చి, అమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నాను. నా సాహసాలన్నీ, అమ్మకు  చెబుతూంటే, ఆయన గొంతులో  అవన్నీ వినాలనుకున్నాను. కానీ ఆయన మాట్లాడుతోంటే, అంతా ఒక్కసారిగా తలకిందులైనట్టు అనిపించింది. నేను ఫోన్ తీసుకుని మాట్లాడిన విషయం చెప్పక పోవడమే కాకుండా, అంతా తన సామర్థ్యంతో తానే పని పూర్తి చేసినట్టుగా, చెప్పాడు. నా మటుకు నేను, చేసిందంతా అప్పటికే రమణికీ, అమ్మకీ  చెప్పేసాను. అమ్మ కాలుని గట్టిగా గిచ్చాను. అమ్మ అడిగింది, “బాలు మీ గొడుగు పట్టుకున్నాడా?”

“అసలు వాణ్ణి ఎందుకు పంపించావు? నా గొడుగు నేను పట్టుకెళ్ళలేనా? వాడికి  ఏవి తెలుసనీ. పిల్లవాడు కదా? వాడెప్పుడైనా టెలిఫోన్ చూసాడా? ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసులో అడుగుపెట్టాడా? పాపం నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాడు”

ఆ రోజు సాయంత్రం శీను మామ, నటరాజ్ మామ మమ్మల్ని కలవడానికి వొచ్చారు. మా నాన్న పూసగుచ్చినట్టు, రాజు పెదనాన్న చనిపోయిన వార్త మా కెలా తెలిసిందో వాళ్ళకు వివరించాడు. “చావు మనందరికీ వస్తుంది.తప్పదు. దాని గురించి ఎక్కువ విచారించడం అనవసరం” అన్నారు నాన్న. 

నేను వరండాలో నిల్చోని  ఉండడం చూసి  ఆయనకు బాగా కోపం వచ్చింది. నా వైపు చూసి అరిచాడు, “లోపలికెళ్ళరా! పుస్తకాలు తీసుకుని చదువుకో ఫో!”. 

అదే పాత నాన్న, అదే పాత అరుపు. 

పెరటిలోనించి, వెళ్ళి వేప చెట్టు పైకి ఎక్కాను. రమణి వచ్చింది. ఎప్పటిలాగానే,  పైనున్న కొమ్మలు పట్టుకున్నాను. రమణి వైపు, నా కాలొకటి, కింది దాకా వేలాడేసాను. పట్టుకుని పైకెక్కింది ఆమె. 

గౌను సర్దుకుని, “అన్నీ  అబద్ధాలే చెప్పడం మొదలు పెడితే,   ఒక్కటీ నిలబడదు” అంది. 

నేనరిచాను. “ఆ హనుమంతుడి  మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఫోన్  నేనే పట్టుకుని  మాట్లాడాను. నాన్న నన్ను పట్టుకుని వున్నారు.  అంతే.”

“నువ్వు గొప్పలు, గప్పాలు  చెప్పుకునేటప్పుడు, హనుమంతుడి పేరు తీసుకోకపోతే బావుంటుంది.” అని మూతి తిప్పుతూ చెప్పింది రమణి. 

నేను కొంతసేపు ఏవీ మాట్లాడలేదు. లోపల వుడికిపోతున్నాను. 

“రమణీ! అప్పుడప్పుడూ మనింటికి వచ్చే ఆ మామ వున్నారు కదా! ఆయన రాజు పెదనాన్న కంటే పెద్ద వాడా? చిన్న వాడా?”

“ఓ, చాలా పెద్ద!’

“చూస్తూ వుండు. ఆయన చచ్చిపోయినప్పుడు మళ్ళీ  ఫోన్ వస్తుంది. నేనే  నాన్నతో పాటూ  వెళ్ళి ఆ ఫోన్ మాట్లాడతాను. అప్పుడు నువ్వు కూడా వచ్చి చూడు. నీకు బాగా తెలుస్తుంది.”

“ “పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. వెర్రి వెధవా!” అంది రమణి. 

-------------------------------------------



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube