ప్రసాదం - ఈ కథకు మూలం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు.
కథలోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న గమనిక - హర్షణీయం స్పాటిఫై ఆప్ ద్వారా వినే శ్రోతలు ఇప్పుడు కథపై తమ అభిప్రాయాన్ని తెలియచేసే అవకాశం వుంది. మీ అభిప్రాయాలు వెంటనే ఆప్ ద్వారా ప్రచురితం అవుతాయి.
స్పాటిఫై ద్వారా హర్షణీయం ను వినడానికి, కొత్తగా వచ్చే ఎపిసోడ్స్ ని వెంటనే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ ఇచ్చిన లింక్ ని వాడి , ఆప్ లోని ఫాలో బటన్ ని నొక్కండి.
https://bit.ly/harshspot
**************
ప్రసాదం (1958): తమిళ మూలం - సుందర రామస్వామి గారు
‘సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ ’, డ్యూటీ ఎక్కినప్పట్నుంచీ, ఒక్క రోడ్డూ వదిలిపెట్టకుండా, బీటు కొడుతూనే వున్నాడు. ఎలాగైనాసరే డ్యూటీ అయిపోయే లోగా ఐదు రూపాయలు సంపాయించాలి. అప్పుడే తలెత్తుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అది జరిగితేనే పొన్నమ్మ మొహంలో మొహం పెట్టి చూడగలడు. ఆ మొహంలో నవ్వు చూడగలడు. అన్నిటికీ మించి, పిల్ల పుట్టినరోజు, ఏ ఇబ్బందీ లేకుండా జరిగిపోతుంది.
అతను తిరిగి తిరిగి,మళ్ళీ నాలుగు రోడ్ల కూడలి దగ్గరి కొచ్చాడు.
గత పది నిమిషాల నుంచీ, ఓ జంట మెయిన్ రోడ్డు అంచున నిలబడి, అటూ ఇటూ చూస్తూ, రోడ్డు దాటడానికి కాచుకొని వున్నారు. అమ్మాయి చంకలో ఓ చిన్న పాప వుంది. వాళ్ళు గుడికెళ్ళి వస్తున్నారని అర్థమైపోతోంది.
‘ఇలానే రేపు గుడికి, నాతో కల్సి వెడదామని పొన్నమ్మ గూడా ఎదురు చూస్తూ ఉంటుంది’ అనుకున్నాడతను. ‘పిల్ల పుట్టినరోజు సంబరం గురించి ఎంత గొప్పగా, వూహించుకుంటోంది?’ ఆ సాయంత్రం ఆమె చెప్పిందంతా, పొల్లు పోకుండా గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆమె కోరిక కొంచెం విచిత్రంగా వుంది. పిల్లనెత్తుకుని, వీధిలో, ఏ విధంగా నడవాలనేది, ఆమె వర్ణించి వివరించింది.
‘నేను రేపు తెల్లవారుఝామున లేచి చంటిదానికి వేణ్ణీళ్ళ స్నానం చేయిస్తాను. పట్టు పావడా వేసి, జడకుచ్చులు పెడతాను. ఒక్క గులాబీ పువ్వు.. జళ్ళో ఒకటే గులాబీ పువ్వు పెడితే, ఎంత బావుంటుంది? మనం చంటి దాన్ని తీసుకుని, పొద్దున్నే వీధిలో గుడికి నడిచెడుతూంటే, అందరూ మనల్నే చూడాలి… ఇంటిముందు కళ్ళాపి చల్లే వాళ్ళు, ముగ్గులు పెట్టే వాళ్ళు…. ఒకరి తర్వాత ఒకరు, అందరూ తలెత్తి మనల్నే చూడాలి. అలా అందరూ తలెత్తి మనవైపు చూడడాన్ని, నేను చూసి, నీ వైపు తిరిగి నేను నిన్ను చూడాలి. నువ్వు గూడా, వాళ్ళు తలెత్తి మనల్ని చూడ్డం చూసి, నా వైపుకు తిరిగి నన్ను చూడాలి.’‘సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్’, తానెక్కడున్నాడో మర్చిపోయి, ఒక్కసారి గట్టిగా బయటకి పగలబడి నవ్వాడు. తరువాత వెంటనే నోరు మూసేసాడు.
ఆ జంట రోడ్డు దాటారు.
పొన్నమ్మ అనుకున్నదంతా సరిగ్గా జరగాలంటే, కావల్సింది కేవలం, ఇంకో ఐదు రూపాయలు. మొత్తం పుట్టినరోజు ఖర్చు యాభై రూపాయలైనా, పొన్నమ్మ అతడినడిగింది మాత్రం ఐదు రూపాయలు. బట్టలు తానే వెళ్ళి అరువులో తెచ్చింది. రాత్రే కుట్టడానికి ఇచ్చేసింది. చీటీ పాడి, ఒక ముత్యాల హారం కొనింది. పాలమ్మి ఆ అప్పు తనే తీర్చేస్తుంది. ఆమె అడిగిన డబ్బులు, పుట్టినరోజు నాటికి కావాల్సిన, పై ఖర్చుల గురించి మాత్రమే. అది గూడా కేవలం ఐదు రూపాయలు.
ఇంట్లో ఒక్క పైసా లేదు. ఒక్క నయా పైసా గూడా! అప్పటికే ఇరవై ఐదో తారీకు వచ్చేసింది.
‘సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ ’, లాఠీతో తన బూట్లని తాటించాడు. చూడ్డానికి ఒక దిష్టిబొమ్మలాగా వుంటాడతను. ఒక సారి చూస్తే, తొందరగా మరిచిపోయే మొహం కాదు అతనిది. మొహం నిండా అమ్మవారి మచ్చలు,మందంగా వున్న కనుబొమ్మలు. రెండు కనుబొమ్మలూ కలసిపోయి వున్నాయి. చెవుల్లోంచి వెంట్రుకలు పెరిగి బయటకొచ్చాయి. ముక్కు కింద, ఈగల గుంపు తిష్ట వేసినట్టుగా ఉన్న, పొట్టి మీసం.
అతని కళ్ళు, ఆ వైపూ, ఈ వైపూ, కిందుగా ఎగురుతున్న గెద్ద నీడలా, చుట్టూ తిరుగుతూ ఆ ప్రదేశం అంతా, కలయచూసాయి.
వలలో చిక్కేందుకు ఒక్క చేపా కనపడలేదు.
మెడంతా చెమట పట్టి ధారలు ధారలుగా కారుతోంది. తల వేలాడేసుకుని వున్నాడు. శరీరంలోని ఆణువణువూ అలిసిపోయినట్టనిపించింది.
ఇన్నేళ్ళ పోలీసు జీవితంలో, ఇంత అధ్వాన్నంగా ఏ రోజూ గడవలేదు. పొద్దున్నే లేచి ఎవడి మొహం చూసానా? అని గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించాడు. లేచి,కళ్ళు తెరవంగానే, అద్దంలో తన మొహం తానే చూసుకున్నాడనే విషయం గుర్తుకొచ్చింది. నవ్వుకున్నాడు.
మాట్నీ ఆట వదిలిపెట్టినట్టున్నారు, ఊళ్ళో జనాలందరూ ఉప్పెనలా వచ్చిపడ్డారా! అన్నట్టు, ఒక్కసారిగా వీధుల్ని కమ్ముకున్నారు. హడావుడి తగ్గేదాకా పక్కన నిలబడి, తర్వాత నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. ఈ ‘నిరవధిక కాళ్ళీడ్పుడు’ కార్యక్రమం , సాయంత్రం నాలుగుగంటలకు మొదలైంది. ఇప్పుడు ఏడు అయ్యింది. కొంతసేపైతే, ఎనిమిది కూడా దాటుతుంది.
సమయం గడిచిపోతోంది. ఒక్క చేపా, చేతికి చిక్కకుండా, ఉన్న సమయం అంతా గడిచిపోతోంది.
విచిత్రంగా, ఈ రోజు, లైటు లేకుండా సైకిల్ తొక్కే, ఒక్క పురుగూ తన కంటపడట్లేదు. ఎవడైనా గోడలు ఖరాబు చేస్తూ, దొరుకుతాడేమోనని, అందుకు ప్రసిద్ధి చెందిన, సందులూ, గొందులూ తెగ తిరిగాడు. ఓ మూల దాక్కుని, ఎవడైనా పోస్తూ చిక్కుతాడని, గంటలు గంటలు వేచి చూసాడు. కాళ్ళు పీకడం తప్ప ఒరిగిందేమీ లేదు. ఆఖరికి, ఒక్క పిల్లవాడు కూడా, గోడ మీద మూత్రిస్తూ కనపళ్ళేదు.
‘ఇప్పటిదాకా మామూలుగా వుండిన ఆడ, మగ అందరూ, ఇప్పుడు కట్టకలిసి, ఒక్కసారిగా బాధ్యత గల్గిన పౌరులై పోయారు. వాళ్ళందరూ వర్థిల్లాలి!’
సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ దవడ కండరాలు బిగుసుకున్నాయి. కూడలి నించి మొదలెట్టి , ఈసారి ఉత్తరం వైపు నడవడం మొదలుపెట్టాడు.
అక్కడక్కడా మధ్యలో ఆగి, మళ్ళీ నడవడం మొదలెడుతున్నాడు. నాలుగడుగులు ముందుకేయడం, ఆగడం. ఇంకొంచెం దూరం, ముందుకెళ్ళి ఆగిపోయాడు.
ఆందోళన తారాస్థాయి కి చేరుకుంది.
వచ్చే పొయ్యే ప్రతి టాక్సీ వైపు చెయ్యి ఝుళిపించి, ఆపుతున్నాడు. కానీ ప్రతి డ్రైవరూ లైసెన్స్ తోనే బండి నడుపుతున్నాడు. రూలు ప్రకారం ఐదుగురిని మాత్రమే ఎక్కించుక తిరగవల్సి ఉంటే, ఏ టాక్సీ లో కూడా ముగ్గురి కంటే ఎక్కువమంది కనపడ్డం లేదు. నలుగురితో తిరగగలిగిన ఆటోలో డ్రైవర్ తప్ప ఎవరూ ఉండట్లేదు.
‘శభాష్! ఈ దేశంలో ఇంక పోలీసుల అవసరం లేదు!’.
ఎవరైనా కూలీని ఆపి బెదిరిద్దామంటే, ఎక్కడా ఒక్క కూలీ కూడా కనపడ్డం లేడు . ఈరోజే కొత్త సినిమా విడుదల . అందరు కూలీలు సినిమా హాల్లో దూరినట్టున్నారు. ఈ రోజుల్లో ప్రతి అడ్డగాడిదకీ ఈ సినిమాల పిచ్చి ఒకటి.
చీకటి పడంగానే కూల్ డ్రింక్ షాపులో, మందు అమ్మకం మొదలౌతుంది. రూలు ప్రకారం ఇక్కడ మద్య నిషేధం పూర్తి అమలులో ఉండాలి. వెళ్ళి షాపు ముందర నిలబడితే సరిపోతుంది, మామూలు చేతిలో పెడతారు. చాలు. పుట్టిన్రోజు బ్రహ్మాండంగా జరిగిపోతుంది.
కానీ షాపు మూసుంది. దేనికి మూసాడు? వీడి బామ్మ గానీ ప్రసవించిందా? వ్యాపారం చేసుకునేవాడికి ఇంత అలక్ష్యమా?
మెయిన్ రోడ్డునించీ ఒక జట్కా , సందులోకి వచ్చింది. బండి తోలుతోంది, ఒక పిల్లవాడు. మీసాలు కూడా మొలవలేదింకా. ఆఖరికి వాడు కూడా, బండిలో, దీపం పెట్టుకునే తోలుతున్నాడు.
బండి తన వైపే వస్తోంది.
‘ఏయ్! బండాపు!” కళ్ళెం లాగి పట్టుకుని ఆపాడు ఆ అబ్బాయి.
“మీ నాన్నెక్కడ?”
“ఈ రోజు డ్యూటీ ఎక్కలేదు”
“ఏం?”
“వొంట్లో బాలేదు”
“ఏం బాలేదు?”
“ కడుపు నొప్పి”
“ఓ ఎనిమిదణాలు బయటకు తీ”
“ఏంటి?”
“ఎనిమిదణాల్రా”
“ ఒట్టు సార్. అస్సలు ఒక్క పైసా లేదు నా దగ్గర”
“ రేయ్ మాట్లాడకుండా డబ్బులు తీ”
“ కావాలంటే చూడు సార్” బండిమీదే నిల్చుకుని, కట్టుకున్న లుంగీ విప్పి, విదిలించి మళ్ళీ కట్టుకున్నాడు వాడు. “ఎదవా! ఫో ఇక్కణ్ణించీ, దీన్నసలు జట్కా అంటార్రా, అసలు మనిషెవడైనా ఎక్కుతాడ్రా దీన్లో?”.
బండి ముందుకెళ్ళి పోయింది.
సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ పోస్ట్ ఆఫీసు వైపు నడిచాడు. కిళ్ళీ బంకు దగ్గర వేసిన బెంచీ మీద కూర్చున్నాడు. టోపీ తీసి వొళ్ళో పెట్టుకున్నాడు. జుట్టులోకి వేళ్ళు, అట్నించీ ఇటు పోనిచ్చాడు. బయటకొచ్చిన చెయ్యి పూర్తిగా తడిసిపోయుంది. పట్టలేనంత చిరాకొచ్చింది. తొడలు నొప్పిపెట్టేదాకా, చేతుల్ని నిక్కరు మీద విపరీతంగా రుద్దాడు. తూర్పు కీ పడమరకీ అటూ ఇటూ చూసాడు.
ఒక భారీ ఆకారం పోస్ట్ ఆఫీసు వైపే వస్తోంది. మొహం ఎక్కడో చూసినట్టుంది. కృష్ణుడి గుళ్ళో పూజారి కదూ? ఆయన పోస్ట్ ఆఫీస్ దాకా వచ్చాడు. సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ అతన్నే కన్నార్పకుండా చూస్తున్నాడు. చేతుల్లో ఒక పొడవైన కవర్ వుంది.
సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ లేచి ఆయన వెనకాలే వెళ్ళాడు. ఆ మనిషి పోస్ట్ బాక్స్ తగిలించి వున్న స్థంభం దాకా వచ్చాడు.
“ఎవరదీ?” పిలిచాడు డెబ్బై మూడు నలభై ఏడు.
ఉన్నపాటున వెనక్కి తిరిగి చూసాడు పూజారి.
“ఇక్కడికోసారి రండి”
“ఇదిగో వస్తున్నా! దీన్ని డబ్బాలో వేసి ”
“ఇక్కడికి రండి ముందర. దాన్ని లోపల వెయ్యొద్దు”
ఆయనక్కడే నిలబడిపోయాడు భయంతో.
“రండిక్కడికి” పిలుపు అరుపుగా మారింది ఈ సారి.
సందేహిస్తూ రెండడుగులు వేసాడు ఆయన.
భారీ ఆకారం. బొద్దుగా వున్న శరీరం. ఒళ్ళంతా నూనె పూసుకున్నట్టు, చర్మం మెరుస్తోంది. సీమంతానికి తయారుగా వున్న ఎనిమిదోనెలంత పొట్ట. నెమ్మదిగా ముందరకొచ్చి నిలబడ్డాడు.
“ ఆ చేతిలో ఏవుంది?”
“కవరు”
“ఎలాంటి కవరు?”
“మామూలు కవరే! డబ్బాలో వేద్దామని తీసుకొచ్చాను.”
“ఓ సారివ్వండి. చూడాలి”
చేతిలోంచి లాక్కుని చూసాడు. ఆ కవరుతో పాటూ, పోస్ట్ కార్డు కూడా ఒకటుంది. కార్డు ఎవరో, ఎవరికో రాసింది. పొడుగు కవరు మీద మటుకు, డీ ఎస్ పీ ఆఫీస్ చిరునామా కనపడుతోంది.
సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ పూజారి వైపే తీక్షణంగా చూసాడు.
ఆయన మొహం ఎర్రబడింది. కన్నార్పకుండా, సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ ఆయన వైపే చూస్తున్నాడు. గుడి పూజారి మొహం ముదురు ఎరుపులోకి మారింది. సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ కి తీవ్రమైన అనుమానం కలిగింది. అలానే విపరీతమైన సంతోషం కూడా.
తన కూతురు అదృష్టవంతురాలు, నిజంగానే…
“ఈ కవరెక్కడిది?” ఇప్పుడు గొంతులో అధికారపు దర్పం తెలుస్తోంది.
పూజారి అలానే నిలబడ్డాడు, పెదాలు బిగించుకుని. తల వంచేసుకున్నాడు.
“ఎందుకు ఏవీ మాట్లాడట్లేదు? నోట్లో కజ్జికాయ కానీ పెట్టుకున్నావా?”
అదే పరిస్థితి. ఏ సమాధానం బయటకు రాలేదు.
“మామూలుగా మాట వినేట్టులేవు. పద స్టేషన్ కు పోదాం”
“పోలీస్ స్టేషనా?” చెవుల్లో ఆ మాట పడంగానే, గుడి పూజారి ఒంట్లో సన్నటి వణుకు మొదలైంది.
సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్, పూజారిని ఓ చిన్నతోపు తోసాడు.
తడబడుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు పూజారి.
“దయుంచి నేను చెప్పేది వినండి. ఏ దుర్ముహూర్తాన బయలుదేరానో! లేకపోతే…”
“సొల్లాపి విషయానికిరా! ముందు.”
“నిజంగా ఎంత దుర్దశ పట్టకపోతే, ఈ సమయంలో, వీధి మధ్యన, ఒక బజారు రౌడీ లాగో, జేబుదొంగలాగో నిలబడిపోతాను?”
“ ఛస్. అడిగిందానికి సమాధానం చెప్పు, వింటూంటే ఏదో ఒకటి చెప్తా పోతూనే వున్నావ్ !”
“దేవళం పక్కన చిన్న పోస్ట్ డబ్బా వుంది. అందులో ఈ కార్డు ముక్క పడేద్దామని వెళ్ళాను.”
‘అక్కడ ఈ కవరు రోడ్డు మీద పడుంది. పూజారి గారూ! పూజారి గారూ! కొంచెం నన్నెత్తుకోరూ? అనడుగుతూ… ఇంకా! ఇంకేవన్నా ఉందా?’
“దయుంచి, కొంచెం నేను చెప్పేది వినండి. ఈ కార్డు ముక్క, ఆ పోస్ట్ డబ్బా లో పడేద్దామని వెళ్తే, సాధ్యం కాలేదు.”
“ నీ ముంజేయి బెణికింది కదూ!”
“లేదు. ఈ పొడుగాటి కవరు అడ్డం పడుతోంది.”
“బావుంది. కథ చాలా బావుంది”
“కథ కాదు. జరిగింది జరిగినట్టుగా చెప్తున్నాను. ఇంకేవీ, లోపల వెయ్యడానికి లేకుండా ఈ కవరు వంగిపోయి, అడ్డం పడుతోంది.”
“అరెరే, ఎంత ఘోరం?”
“ నేను చెయ్యగలిగిందంతా చేసాను. గట్టిగా తోసి తోసి చూసాను. అసలు లోపలికెళ్లదే?”
“ఇదేగా, ఇప్పటిదాకా చెప్పింది?”
“అప్పుడు రెండు వేళ్ళు, పోస్ట్ డబ్బాలోకి పోనిచ్చి ఈ కవర్ని బైటికి లాగాను”
“ ఆహా, ఎంత గొప్ప ఆలోచన!”
“ దయచేసి పూర్తిగా వినండి. నేనే తప్పూ చెయ్యలేదు. అసలు అనవసర వ్యవహారాల్లో తల దూర్చే మనిషిని కాదు నేను.నా పనేదో! నేనేదో! అంతే. కావాలంటే వూళ్ళో ఎవరినైనా అడిగి చూడండి. చెప్తారు. నాలుగు తరాలుగా, నాడీ కృష్ణుడి గుళ్ళో అర్చకత్వం మాదే! ఈ రోజు దాకా….!”
“చెప్పేదేదో నాలుగు ముక్కల్లో ముగించొచ్చుగా. గానుగెద్దు తిరిగినట్టు, అదే అదే చెప్పుకుంటూ పోతున్నావ్?”
‘ నా రెండు వేళ్ళు లోపలి పోనిచ్చి, కవరు బైటికి తీసాను. కార్డునీ కవర్నీ కలిపి, లోపలి తొయ్యడానికి ప్రయత్నించాను. కుదర్లేదు”
“అవును ఎలా కుదురుతుంది?”
“తోస్తూంటే, ఈ కవరు వంగిపోయి, లోపలికి వెళ్ళట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అంతా అయోమయం. పోస్ట్ డబ్బా వైపే చూస్తూ ఉండిపోయాను. పైకీ కిందికీ చూసాను. భయం మొదలైంది. ఇప్పుడేం చెయ్యాలి? చివరికి, ఆ నాడీ కృష్ణుడే దారి చూపెడతాడు అనుకుని, ఈ పెద్ద పోస్ట్ ఆఫీసులో, పోస్ట్ చేయడానికని వచ్చాను.”
“మొదట్నుంచీ చివరిదాకా నువ్వు చెప్పేది అబద్ధం. పచ్చి అబద్ధం.” అన్నాడు సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్.
“ అలా నన్ను కొట్టి పారెయ్యకండి. . నే చెప్పిందంతా నిజం. ఎక్కువ తక్కువలు చేసి చెప్పడం నాకు చేతకాదు. నిజం ఒక్కటే నేను చెప్పగలిగింది. ఈ నాలుకకు పొద్దున్న లేస్తే, మంత్రాలు ఉచ్ఛరించడమే తెలుసు. అబద్ధాలు చెప్పడం దానికి తెలీదు.”
“వినిపించింది చాలు. ఇక స్టేషన్కి పద.’
పూజారి, సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ చేతులు పట్టుకుని బతిమాలాడాడు. మాటల్లోని గాభరా స్పష్టంగా తెలుస్తోంది, పట్టుకున్న చేతుల్లో కూడా. మొహంలోకి శవ కళ వచ్చింది.
“నేను అబద్ధం చెప్పడం లేదు. ఏ తప్పూ చెయ్యలేదు. నే చెప్పేది నిజం. ఆ నాడీ కృష్ణుడి దేవళంలోని మూల విరాట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను అబద్ధం గనక చెప్పుంటే, ఆ దేవుడు నన్నొదిలిపెట్టడు. నా కళ్ళు పెకలించుకు పోతాయి. చేతులు, కాళ్ళు పడిపోతాయి.”
“నీ గోలాపి స్టేషన్కి పద!” అంటూ పూజారి చెయ్యి లాగి పట్టుకుని, నడవడం మొదలు పెట్టాడు. నెమ్మదిగా తన చెయ్యి విడిపించుకుని, పూజారి అతన్ని అనుసరించాడు. శరీరం మొత్తం కంపిస్తోంది. అవమానంతో, సిగ్గుతో, లోలోపల కుంగిపోతూ, నడుస్తున్నాడు. అతనికి తెల్సిన వారందరూ, వేల సంఖ్యలో, చుట్టూ గుమికూడి, నోటి మీద వేలేసుకుని, ఈ చోద్యం అంతా, చూస్తున్నట్టు అనిపిస్తోంది.
పోలీసు స్టేషన్ కు వెళ్ళాలంటే బజారు మీదుగా నడవాలి. అక్కడుండే వ్యాపారస్తులందరూ అతనికి తెల్సినవాళ్ళే. ప్రతి ఒక్కరి పుట్టిన రోజున, పూజ చేసి, ప్రసాదం తీసుకెళ్ళిస్తాడు. అందరికీ ఈయనంటే గౌరవం. ఇప్పుడు వాళ్ళందరి మధ్యలోంచి నడవాలి. వాళ్ళందరూ తమ అంగళ్ళ ముందు నిలబడి ఈయన్ని చూస్తారు.
పూజారి జైలు గదిలో కటకటాలను పట్టుకుని నిలబడ్డట్టుగా ఊహించుకున్నాడు. అతని భార్య ,పిల్లలు, గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ, ఎదురుగా నిలబడున్నారు. ఒక పోలీసు లాఠీ తో వాళ్ళను అక్కడ నించి వెళ్ళగొడుతున్నాడు.
“ఇతడి కాళ్ళమీద పడితే వదిలేస్తాడా? కేకలు పెడితే జనం పోగవుతారు. ఓ వంద మందన్నా రారా? వందమందిలో తనను తెల్సిన వాడు, ఎవడో ఒకడు ముందుకొచ్చి, ఏవిటీ ఘోరం? అని నిలదీయడా?” అనుకున్నాడు.
కానీ నోరు విప్పితే , వీపు మీద లాఠీ దెబ్బలు, ఖాయం అనుకుని, గట్టిగా కుట్టేసుకున్నాడు. అదీగాక గొంతుకేదో అడ్డం పడుతోంది. నిమిష నిమిషానికీ, కడుపులోంచి ఏదో తన్నుకొచ్చి, గుండెలో మంట పుడుతోంది. తన ఇబ్బంది బయటపడకుండా ఉండడానికి, అంతా గట్టిగా దిగమింగుతున్నాడు. వీధి మధ్యలో నిలబడి ఏడుపు మొదలెడతానేమోనని భయం పట్టుకుంది. ఇంకా మెయిన్ రోడ్డుకి చేరుకోలేదు. రోడ్డుకి రెండుపక్కలా వున్న వేపచెట్లు చీకటి దెయ్యాల్లా కనపడుతున్నాయి. అంగ వస్త్రంతో మొహానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు.
వాళ్ళిద్దరూ కొంతదూరం నడిచినతర్వాత, పూజారి ఆగిపోయాడు. వీధి దీపం వెలుగు ఆయన మీద పడుతోంది. డెబ్భై మూడు, నలభై ఏడు, గుడి పూజారి వంకే చూస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రగా వున్నాయి. అంగవస్త్రంతో ముక్కును తుడుచుకుంటూ, “ నేనే తప్పూ చెయ్యలేదు. లేదు, ఏ తప్పూ చెయ్యలేదు,” అని మాట్లాడుతూ మాట్లాడుతూ, వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు.
“నేనేం చేసేదయ్యా, ముక్కుసూటిగా డ్యూటీ చేసుకునే మనిషి నేను.’
“నేను చెప్పేదానిమీద నమ్మకం కలగడం లేదా?”
“నమ్మడం నమ్మక పోవడం కాదు. స్టేషన్లకొచ్చి, ఇనస్పెక్టర్ కి ఏం జరిగిందో చెప్పు. ఆయన వదిలేయమంటే, నాకేం అభ్యంతరం లేదు.”
“ఇనస్పెక్టర్ వదిలేస్తాడా”
“నాకేమన్నా చిలకజోస్యం తెలుసా”
‘అయన నన్నేం చెయ్యడు కదా?”
“అంటే?”
“ ...కొట్టడం… లాంటివి” మాట్లాడ్డానికే ఇబ్బందిపడుతున్నాడు.
‘ఓహ్… ఇంత భారీ శరీరంలోనూ, ఓ పెద్ద పిరికి రాక్షసుడు కూర్చొని వున్నాడన్నమాట.’
సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ లోలోన నవ్వుకున్నాడు.
“ఏదైనా కేసు తీవ్రతను బట్టి ఉంటుంది.” అన్నాడతను. “కొట్టగూడదు అని ఎక్కడా రాసి లేదు. అనుమానం వస్తే, విరగదీసేస్తారు. ఈ కొత్తగా వచ్చిన ఇనస్పెక్టర్ అంటే, అందరూ ఉచ్ఛ పోసుకుంటున్నారు.ఎవడైనా దొరికితే చాలు,బాది అవతలేస్తున్నాడు”
‘అయ్యో!ఇప్పుడు నేనేం చేసేది? బయటపడే మార్గం కనపడట్లేదు” బాధపడ్డాడు పూజారి.
‘నిన్నిలా చూస్తూంటే జాలేస్తోంది.”
“అయితే దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మీమీద దేవదేవుడి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది”
“అది కుదరదు. ఇదేవన్నా బొమ్మలాట అనుకున్నావా? ఒకసారి కేసులో దొరికిన తర్వాత, వదిలెయ్యడం, అయ్యే పని కాదు. అటూ ఇటూ ఐతే, నా వుద్యోగం ఊడుతుంది”
పూజారి స్థాణువై నిలబడిపోయాడు.
మళ్ళీ సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ మాట్లాడ్డం మొదలు పెట్టాడు “ కానీ, నిన్నిలా చూస్తూంటే జాలేస్తోంది. బయట పడ్డానికి ఒకలా ప్రయత్నించొచ్చు.”
“ఎలా? .. ఎలా?”
“మా హెచ్ సీ కి చెప్పి కేసు మూయించొచ్చు.”
“ హెచ్ సీ అంటే?”
“హెడ్ కానిస్టేబుల్”
“అయితే ఎలాగోలా ఆయన్ని ఒప్పించండి. ఆ నాడీ కృష్ణుడి దయ మీ మీద ఎప్పటికీ వుండు గాక.”
“అయితే అదంత తేలిక కాదు. దీని కోసమని హెచ్ సీ ముందరకెళ్ళి నిలబడి, నేను పళ్ళికిలిస్తూ ఓ వెధవ నవ్వు నవ్వాలి. వాడో దరిద్రుడు. చూడంగానే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు.”
“ కొంచెం ఓర్చుకుని, నా కోసం మీరు ఆ పని చేసిపెట్టండి. దయచేసి ఆయన్ను ఒప్పించండి. లేకపోతే ఈ అవమాన భారం నన్ను నాశనం చేసేస్తుంది. నేను చేసే పని.. డబ్బులు, సంపద ఇలాటి వాటితో సంబంధం లేనిది. వొచ్చే జీతమే నాకు ఆధారం. పోలీస్ కేసులో ఇరుక్కుంటే ముందు నా వుద్యోగం పోతుంది. మా కుటుంబమంతా అనాధలై, ప్రతి పూటా భోజనానికి వెతుక్కోవాల్సి వస్తుంది. ఎవరి మొహం చూడలేని పరిస్థితి వొస్తుంది. ఒక్క మాట ఆయనతో చెప్పండి. జీవితాంతం మీ మేలు నేను మర్చిపోను.”
“నిజమే. నీ కడుపుకి మట్టికొట్టాలనే ఉద్దేశ్యం నాకూ లేదు. కానీ మా హెచ్ సీ ఉన్నాడే వాడో వింత పక్షి. దయా దాక్షిణ్యం ఇలాటివి ఏవీ వుండవు. అదిగాక విపరీతమైన డబ్బు పిచ్చి.”
“అంటే”
“చేతిలో పైసా పడందే, కన్నెత్తి కూడా చూడడు. అందుకే ఏ కేసు ఆయన దగ్గరికి పట్టుకెళ్ళను”
“ ఎంత ఇవ్వాలంటారు?’
“ఐదో? పదో?”
“ఐదా? పదా?”
“కనీసం పదైనా చేతిలో పడకుండా, కేసు మూసిన దాఖలాల్లేవు”
“పది రూపాయలా?”
“అవును. ఏం?”
“పది రూపాయలు నేనెక్కడ్నించీ తెచ్చేది?”
“అది నువ్వే చూస్కోవాలి. లేకపోతే ఏవైనా జరగొచ్చు”
మౌనంగా ముందుకు నడుస్తున్నాడు పూజారి. ఏ సమాధానం లేదు.
మళ్ళీ సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెనే కదిలించాడు.
‘అయితే ఇప్పుడు ఏమంటావ్?’
“నేనేం చెయ్యలేను. పది రూపాయలు నేనెక్కడ్నించీ తెచ్చేది?” నిశ్చలంగా వుంది స్వరం.
సెవెంటీ త్రీ ఫార్టీ సెవెన్ కి ఆవేశం కట్టలు తెంచుకుంది. పూజారి ఇంకేదో చెప్పబోతూంటే,
‘నిన్నెవడు దేబిరిస్తున్నాడు? నేను ఏదో లంచం అడిగినట్టు, పోసు కొడ్తున్నావ్! ఇంక తొందరగా నడు. ఇనస్పెక్టర్ ఇంటికి బయల్దేరే లోపల మనం స్టేషన్లో ఉండాలి. ఆయన చేతిలో ఒక డోసు పడితేగానీ, నీకు రోగం కుదరదు.” అన్నాడు.
“మాట్లాడుతూంటే ఎందుకు మధ్యలో కత్తిరించడం ?”
“కత్తులూ లేవు కటార్లూ లేవు. నోరు మూసుకుని, నడు”
కొంచెం దూరం నడవంగానే, మళ్ళీ సెవెంటీ త్రీ ఫార్టీ సెవెన్ మొదలుపెట్టాడు.
“ఇప్పుడే గుర్తుకొచ్చింది. మొన్న డీఎస్పీ ఆఫీస్ నించి ఒక సర్కులర్ వచ్చింది. ఆఫీస్ లోంచి కాయితాలు మాయవౌతున్నాయట. స్టేషన్లో అందరూ జాగర్తగా వుండాలని, ఏదన్నా తప్పు జరిగిందంటే, శాల్తీలు లేచిపోతాయని. ఇప్పుడు అర్థం అవుతోంది.”
“ఏంది మీరనేది”
“టాట్. నోరు మూసుకుని నడవమన్నానా . ఇంకోక్కసారి తెరిచావంటే, మెడలు విరిచేస్తాను. అసలు స్టేషన్లోకి వెళ్ళనీ, నీ సంగతి చూస్తాను.”
“ఓ భగవంతుడా , నన్ను ఒడ్డున పడేసే భారం నీదే”
పోలీస్ స్టేషన్ దగ్గర పడింది. మళ్ళీ సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ అందుకున్నాడు.
“ఇవి మంచోళ్ళకు రోజులు కావు. మోసగాళ్ళు, దొంగల రాజ్యం నడుస్తోంది. ఎవ్వడిమీదా జాలి దయ చూపించకూడదు.”
“ఏం?”
“ఇప్పుడు నీ పరిస్థితే చూడు. ఇంత పెద్ద నేరం చేసి , నా ఎదుట నిల్చున్నావు. నువ్వు అల్లే కథలేవీ, ఒక్కడు నమ్మబోడు. కానీ నేను మాత్రం, సరేలే, గుళ్ళో పూజారి కదా పాపం! ఏదో చేసి ఇరుక్కున్నాడు. నిస్సహాయంగా, అయోమయంగా నిలబడున్నాడు. తన్నులు తిని అవమానం పాలవబోతున్నాడు. సహాయం చేద్దామనుకున్నాను. అలోచించి, అలోచించి, ఒక మంచి ఉపాయం చెప్పాను. కానీ నేనేది చెప్పినా నీ చెవులకెక్కట్లేదు. నీలాంటి...