అందరికి నమస్కారము. ఈ వేదిక ద్వారా నేను, తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం అనే శీర్షిక పేరుతో మూడు వ్యాసాలు మీకు అందించ దలచుకున్నాను.
ట్రావెలాగ్ అంటే యాత్రావివరణము అని మనము తెనిగీకరించ వచ్చునేమో!. ఓ రచయిత ట్రావెలాగ్ ద్వారా తాను ప్రయాణించిన కొత్త ప్రదేశములు, ఆ ప్రదేశాలలో కొంత కాలము గడపటం వలన ప్రోదిచేసుకున్న అనుభవాలను పాఠకులకు తామే ఆ ప్రదేశాలలో సంచరించినంత అనుభూతిని అందిస్తాడు.
ఓ ట్రావెలాగ్ రాసేటప్పుడు రచయిత మిగిలిన విషయాలతో పాటు, అప్పటి దేశ కాలమాన పరిస్థితులు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కలిసిన వ్యక్తులు, వీటి ద్వారా ఆయన కొత్తగా నేర్చుకున్న విషయాలు కూడా పొందుపరచ గలిగితే అది పాఠకుడికి ఓ గొప్ప అనుభూతిని మిగుల్చుతుంది అనటం లో ఏమాత్రం సందేహం లేదు.
ప్రపంచ సాహిత్యంలో మొదట యీ ట్రావెలాగ్ చేపట్టినది ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తే, నాకు మాత్రం ఆదికవి వాల్మీకి అనే స్ఫురిస్తుంది. ఆయన రచించిన మద్రామాయణం ఆది కావ్యం అంటారు మన పెద్దలు, కానీ నేను మాత్రం అది మన మొదటి ట్రావెలాగ్ కూడా అని అంటాను
రామాయణం అంటే రాముడు నడిచిన ఒక దారి అని అర్థం. నేనయితే రాముడు చేసిన ప్రయాణాన్ని రామాయణం అంటాను.
మనం జాగ్రత్తగా గమనిస్తే బాలకాండలో రాముడు తన తండ్రి ఇవ్వలేక ఇవ్వలేక ఇచ్చిన అనుమతితో విశ్వామిత్రుని వెంట ఆయన ఆశ్రమానికి వెళ్ళటం, అటు పిమ్మట మిథిలకు ప్రయాణించటం, సీతను వివాహమాడి తిరిగి అయోధ్యలో ప్రవేశించటం, మరలా పితృ వాక్య పరిపాలకుడై దండకారణ్యానికి వెళ్లి అక్కడ జీవనం గడపటం, పిమ్మట సీతాపహరణంతో వానరసేన సహాయం తీసుకొని నిర్మించిన వారధిని దాటి లంకకు పయనమవటం, అక్కడ రావణుడిని సంహరించి సీతాదేవి సమేతంగా అయోధ్యలో పునఃప్రవేశం చేయటంతో రామాయణం ముగుస్తుంది. ఇదంతా రాముడి ట్రావెలాగ్ అంటాను నేను.
రామాయణం లో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సుందర కాండ కూడా హనుమంతుని సముద్రోల్లంఘనం, లంకలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, రాముని క్షేమ సమాచారాలు చెప్పి సీతమ్మకి ఆయన చెప్పిన సాంత్వన వచనాలు మరియు రాముని చెంతకు ఆయన తిరుగు ప్రయాణం అంతయు హనుమంతుని ట్రావెలాగ్ అని అనుకోకుండా ఉండగలమా.
ఆ మాటకొస్తే ప్రతీ బయోగ్రఫీ ఒక మనిషి యీ భూమి మీద తాను చేసిన ప్రయాణం తాలూకు ట్రావెలాగ్ అని చెప్పవచ్చు.
మన తెలుగు సాహిత్యం లో ట్రావెలాగ్ అనే అంశం మీద మనం అవలోకనం చేసుకుంటే పంతొమ్మిదవ శతాబ్దం లో శ్రీ ఏనుగుల వీరాస్వామి గారు గ్రంధస్థం చేసిన కాశీయాత్ర చరిత్ర మన మొదట ట్రావెలాగ్ గా చెప్పబడుతుంది. రెండువందల ఏళ్ల క్రితం, కనీస ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజులలో మద్రాసు నుండి కాశీ దాకా వెళ్లి వచ్చిన ఆయన యాత్రానుభవమే యీ కాశీయాత్ర చరిత్ర. ఈ రోజుకు కూడా తెలుగు ట్రావెలాగ్ సాహిత్యంలో కాశీయాత్ర చరిత్ర ఒక నిర్వచనీయము మరియు ప్రామాణికం.
ఇప్పటి ఆధునిక సాహిత్య కాలానికి వస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయపు విశ్రాంత ప్రొఫెసర్ అయిన శ్రీ ఆదినారాయణ గారు రచించిన తెలుగు వారి ప్రయాణాలు నాకు చాలా ఇష్టమైన పుస్తకాలలో ఒకటి. ఆ పుస్తకం గురించి మరిన్ని ఆసక్తికర మాటలు వచ్చే భాగం లో పొందుపరుస్తాను.
-- మీ సుందరబాబు
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy