Artwork for podcast Harshaneeyam
'రెండురెళ్ళు నాలుగు' - చిలుకూరి దేవపుత్ర గారు.
Episode 1984th June 2021 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:24:04

Share Episode

Shownotes

'రెండు రెళ్ళ నాలుగు' చిలుకూరి దేవపుత్ర గారి రచన. అనంతపురం జిల్లాకి చెందిన ఆయన తన జీవిత కాలంలో , నాలుగు నవలలు, ఐదు కథాసంపుటాలను రచించారు. ఆయన నవల 'పంచమం' శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఎం.ఏ పాఠ్యాంశం గా చేర్చారు. దేవపుత్ర గారు అందుకున్న అనేక పురస్కారాలలో , చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం , విశాలాంధ్ర వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం వున్నాయి.

'రెండు రెళ్ళ నాలుగు', ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ.

దేవపుత్ర గారి కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన , అన్వేష్ గారికి , దీవెన గారికి కృతజ్ఞతలు.

దేవపుత్ర గారి కథల పుస్తకాలు కొనేందుకు - https://bit.ly/3uOdH7B


బస్సు వేగం పుంజుకుంది. వాచీ చూసుకున్నాను. ఒంటి గంట అవుతోంది. ఎండాకాలం అయినందువల్ల సూర్యుడు తన తాపాన్నంతా భూమి మీదే చూపిం చేస్తున్నాడు. షి సాగర్ చేరుకునేటప్పటికి ఎన్ని గంట లవుతుందో? మళ్లీ అక్కణ్ణించి గౌహతికి సాయంత్రం లోగా చేరుకోగలనా? నేను అస్సాం వచ్చాక గౌహతికీ చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు మాత్రమే క్యాంపులు వెళ్ళాను. దాదాపు రెండు వందల కిలో మీటర్ల దూరం ఉన్న షబ్నగర్ కి క్యాంపు వెళ్ళటం ఇదే మొదటిసారి.

కిటికీ పక్కనే కూచుని ఉన్నందువల్ల అందాన్నంతా హాయిగా గమనిస్తున్నాను. ఒకవైపు లోయలూ, మరో వైపు కొండలూ చూస్తుంటే 'బస్సు నిలిపేసి ఇక్కడే ఉండిపోతే ఏం' అనిపిస్తోంది. ఇది దురాశేనని తెలుసు. గౌహతిలో నళిని రాత్రికల్లా వచ్చేస్తానని ఎదురుచూస్తూ ఉంటుంది.

నా సీటు వెనకాల నుంచి గలగలమంటూ అమ్మాయి నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. నేను తిరిగి చూడలేదు..

“ఇక జోకులు వెయ్యకు బాబూ, నా చేత కాదు. నవ్వలేక చస్తున్నా” నవ్వు నాపుకుంటూ అమ్మాయి గొంతు.

“అప్పుడే ఏమయింది.. ఇంకా ఎన్ని జోకులున్నా యని" మగ గొంతు.

“ఇక్కడ వీళ్ళంతా ఏమనుకుంటారు?" ఆడ గొంతు.

“వీళ్ళ మొహం... తెలుగు అర్థమయి ఛస్తేగా వీళ్ళకి” అంటోంది గర్వంగా మగగొంతు.

నేను వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేక పోయాను.

అమ్మాయి నల్లగా ఉన్నా - అందంగా ఉన్న మొహం, తళతళలాడే పలు వరుస, వెన్నెల చిందే కళ్ళూ ఉన్నాయి. అబ్బాయి మాత్రం వంకీల జుత్తుతో, లావాటి మీసకట్టుతో, ఎర్రగా బుర్రగా ఉన్నాడు చూడగానే కొంటె కుర్రాడు అనిపించేలా ఉన్నాడు.

“మన ముందు సీటులో మనిషి చూడూ... వెనక్కి తిరిగి మనల్ని..” అంది అర్దోక్తిగా ఆమె. "

“కోతిమొహం కొండముచ్చు వెధవ... ఎలా ఉన్నాడో చూడు" అంటూ నా భుజం తట్టి అస్సామీ భాషలో ఏదో మాట్లాడాడు. నాకా భాష అర్థమయి ఛస్తేగా, పళ్ళికిలించి వెర్రినవ్వు నవ్వాను. ఒకవేళ నేను తెలుగులోనే మాట్లాడేశాననుకోండి, వాడు ఇందాక తిట్టాడే 'కోతి మొహం' అన్న తిట్టు నాకు వర్తించినట్టు వాళ్ళెక్కడ అనుకుంటారోనని నా భయం. ఆ "నేను చెప్పలా ఇక్కడ ఎవ్వరికీ తెలుగురాదని... మనకిష్టమొచ్చినంత సేపు తిట్టినా ఏం ఫర్వాలేదు. “ఒరే! ముందుసీటు ముసంగి వెధవా! మేమిద్దరం ఆలు మగలంరా! ప్రేయసీ ప్రియులు అనుకు న్నావా! అంత అనుమానంగా చూస్తున్నావు” అతడు ఆ పద్ధతిలో వెటకరింపుగా మాట్లాడుతోంటే, ఆ అమ్మాయి పకపక పగలబడి నవ్వుతోంది.

వాళ్ళు సరదాగా, హాయిగా ఉండడం బాగానే ఉంది కానీ... వాళ్ళ సరదాకు నన్నే ఉపయో గించుకోవటం నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది.

నా భుజం మీద మళ్ళీ చేయి పడితే తిరిగి చూశాను. “భోజనం అయ్యిందా?” అన్నట్టు చేత్తో సైగచేస్తూ 'తన్నులు కావాలా?" అని తెలుగులో అడుగుతున్నాడు. ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతోంది.

అంటే, అతను ఆమెను నవ్వించటానికి నన్ను తమాషా పట్టించే ప్రయత్నంలో చాలా ఫార్వర్డ్ అయిపోతూ ఉన్నాడన్నమాట. నేను గమ్మున చూస్తూ 'ఆఁ' అన్నాను. 2. "కమలా! చూడు వీణ్ణి ఇంకా ఎలా ఆడించేస్తానో!” అంటూనే అతను 'నీళ్ళు కావాలా?! అన్నట్టు సంజ్ఞ చేస్తూ - "కీళ్ళు విరిచేస్తా. ఏమిటలా చూస్తావు గుడ్లగూబలా... బుద్దుందా? పెళ్ళి చేసుకున్నావా? వెధవ నాయాలా... కాలేదూ... పోనీ ఉంచుకున్నావా ఎవర్నయినా?” అని అతడు వాగుతూ ఉంటే, 'ఆఁ ఆఁ జీహాఁ' అన్నాను - వెర్రినవ్వు ఒలక బోస్తూ తల తిప్పేసుకున్నాను. ఆ అమ్మాయి పడీ పడీ నవ్వుతోంది.

బస్సులో అందరూ తలలు తిప్పి ఆమె వైపు ఆసక్తిగా చూస్తున్నారు. - "ఏంట్రా కూస్తున్నావ్?" అని నేను తెలుగులో అడిగితే అతని పరిస్థితీ, ఆ అమ్మాయి పరిస్థితీ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాను.

"నువ్వేమో అతని మీద ఇన్ని జోకులు వేస్తున్నావు. నేను నవ్వుతున్నాను. కొంపదీసి అతను 'ఉల్ఫా' తీవ్రవాది కాదు కదా!" అంది నవ్వు తగ్గించి ఆ అమ్మాయి.

. “నీ మొహం. ఉల్పాలు ఎలా ఉంటారో తెలీదా నాకు. వీడి మొహం, వీడు మాత్రం ఉల్ఫా కాదు - అల్ఫా కాదు” అన్నాడతను.

ఉల్పా టాపిక్ అతను జోకులు వేయడం కూడా మరచిపోయినట్లున్నాడనిపించింది. అతని కంఠంలో గంభీరత ధ్వనిస్తోంది.

“ఉల్పా వాళ్ళంటే మెడలో 'ఉల్ఫా' అని బోర్డు ఏమైనా వేలాడేసుకుని ఉంటారా? అతనే ఎందుకు కాకూడదూ... ప్లీజ్! ఇంక

జోకులు వేయకు అతని మీద" ఆ అమ్మాయి అతన్ని మందలింపు ధోరణిలో అంటోంది. నాకు మాత్రం నవ్వొస్తోంది.

“ఏమో కమలా. నీ అంచనా కరెక్ట్ కావచ్చు" అంటున్నాడు. రాముడు మంచి బాలుడు' అన్నంతగా ఉన్నాయి అతని మాటలు. ఇలా మాట్లాడే వాడేనా నా మీద ఇందాక జోకులు వేసింది! నిజంగా నాకు వాళ్ళమీద అపారమైన

జాలి పుట్టుకొచ్చింది. పైగా, వాళ్లు నన్ను ఉల్ఫా అనుకుంటూంటే నా మనసు విలవిలలాడింది. అంతకంటే ఇందాక నాపైన వేసిన

జోకులే నయమనిపిస్తోంది. అందుకే వాళ్ళ వేపొకసారి తిరిగి చూసి నవ్వుతూ “ఇదో చూడండి... నేను ఉల్ఫాని అల్ఫానీ కాదు” అన్నాను అచ్చ తెలుగులో.

ఆ మాట వింటూనే ఇద్దరూ పక్కలో బాంబు పేలినట్టు అదిరిపడ్డారు. అతనైతే మరీ తత్తరపాటుతో - "సా సా సా... సారీ సర్! క్ష... మీరు నన్ను క్షమించాలి.. ఏ ఏ ఏ... ఏదో కాలక్షేపం చేయాలని... అనవసరంగా మిమ్మల్ని అనరాని మాటలు... నన్ను క్షమించాలి సార్" అంటున్నాడు దొరికిపోయిన దొంగలా మొహంపెట్టి.

ఆ అమ్మాయి మొహం కందిపోయింది. మౌనంగా నా వేపు క్షమాపణలు అడుగుతున్నట్టు చూస్తోంది. - “ఫర్వాలేదులేండి... మీరు సరదాని అనుభవిస్తుంటే అభ్యంతర పెట్టలేక పోయాను" అంటూ నవ్వేశాను. ఆ

“అలాగా" అంటూ ఇద్దరూ మనసు తేలికపడ్డట్టు నవ్వేశారు. “మీరు ఎక్కడి వారు... అంటే మన ఆంధ్రదేశంలో.." అడిగాను.

“మాది బెజవాడ సార్... షిల్లాంగ్ స్టేట్ బ్యాంకులో ఆఫీసరుగా ఉన్నాను. మరి మీరు?" అడిగాడు అతను. నా గురించి చెప్పాను. - “మరి మీరు గౌహతికి వచ్చారేం సార్?" అడిగాను.

"గౌహతిలో రైల్వేలో మా కజిన్ టీసీగా ఉన్నాడు సార్! అందుకని ఇద్దరం వెళ్ళాం, ఇలాగే టీన్ సుక్యాలో నా ఫ్రెండు ఒకడున్నాడు. వాడిని చూడాలని వెళ్తున్నాం” అన్నాడతను.

“సార్! ఇక్కడేనా ఉల్పాలు ఉండేది... ఏఏ ప్రాంతాలలో ఉంటారు సార్?" అడిగిందామె. ఆమె మనసు ఉల్పాల నుంచి పక్కకు వెళ్ళినట్టు లేదు.

"నాకు అంత వివరంగా తెలీదు కానండీ, దిగువ అస్సాంలో - అంటే కామరూప్, కోకరాజ్ లోనూ, ఎగువ అస్సాంలో షిబ్ సాగర్, దిబ్రూఘర్, టిన్ సుక్యాలలోనూ ఉంటున్నారని వినికిడి" అన్నాను.

ఆమె ఆలోచనల్లో పడిపోయినట్లు మౌనంగా ఉండిపోయింది. బస్సు చిన్నచిన్న కుదుపులతో వెళుతోంది. దూరంగా బ్రహ్మపుత్ర నది విశాలంగా, నింపాదిగా పారుతూ కనిపిస్తోంది. జీవనదులంటే ఏమో తెలియని అనంతపురం జిల్లా వాడిని. అందుకేనేమో బ్రహ్మపుత్ర నదిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది నాకు. అంతెందుకూ, బెంగుళూరు నుంచి గౌహతికి బదిలీ అయిన కొత్తలో మా హెడ్ ఆఫీసు వాళ్ళని ఎంత తిట్టుకున్నానో... గౌహతి నగరం మధ్యలో పారే బ్రహ్మపుత్ర నది నన్ను కొంత ఓదార్చినట్టు

అనిపించింది. సాయంత్రాలన్నీ దాదాపు బ్రహ్మపుత్ర ఒడ్డునే గడపటం, జీవితంలో గొప్ప వరంగా అనిపించేది నాకు.

బస్సు ఒక్క కుదుపుతో హఠాత్తుగా ఆగింది. కిటికీ లోంచి తొంగి చూశాను. సాయుధులయిన దాదాపు పదిమంది మిలటరీ వాళ్ళు బస్సులోకి ఎక్కుతున్నారు. ఒక్కో ప్రయాణీకుణ్ణి సామానులతో సహా చెక్ చేస్తున్నారు. ఇది కొత్త వాళ్ళకైతే ఆశ్చర్యమేమో కానీ, నాకయితే మామూలు విషయమే. --

“ఎందుకూ చెక్ చేయటం?" అంటోంది నా వెనకాల అమ్మాయి. -

"అంతేనండి ... ఉల్ఫాలుంటారని... ఈ ప్రాంతాలన్నీ అంతే. దాదాపు ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తుంటారు. మీరు 'టిన్ సుక్యా' వెళ్ళేలోగా కనీసం రెండు మూడు చోట్లయినా బస్సు నిలబెట్టేసి చెక్ చేస్తారు" అన్నాను.

ప్రతి ఒక్క ప్రయాణికుణ్ణి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వచ్చిన ప్రతి సైనికుడూ ప్రతి ఒక్కర్నీ 'చెక్ చేస్తున్నారు. అంటే, ఒక ప్రయాణికుడిని పది మంది సైనికులు ఒకరి తర్వాత ఒకరు చెక్ చేస్తున్నారన్నమాట.

“ఎంత భయంకరమో చూడండి. ఇటు సైనికులకూ, అటు తీవ్రవాదులకూ మధ్య నలుగుతున్నాడు సామాన్యుడు. ఇరువర్గాల వాళ్ళూ కసి తీర్చుకునే వస్తువు సామాన్యుడు" అంటున్నాడు నా వెనకతను.

నా ముందు సీట్ల వాళ్లని చెక్ చేయటం అయిపోగానే నా వైపు వచ్చాడు ఓ సైనికుడు. నాకు భయమంటూ ఏమీ లేకున్నా అదోలా ఉంది. తాము ఎంత నిరపరాధులమని ధీమా ఉన్నా చెకింగ్, ఇన్స్పెక్షన్, తనిఖీ - ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏదో భయం లాంటిది తొంగి చూడని మనిషంటూ ఎవరూ ఉండరేమో.

ఆ సైనికుడు నా జేబులు చెక్ చేశాడు. నా కాళ్ళ దగ్గరే పెట్టుకున్న సూట్ కేసుని బయటకు తీయమన్నాడు. నేను నెమ్మదిగానే సూట్ కేసుని చేతిలోకి తీసుకున్నాను. అయినా, సూట్ కేసులోని వస్తువులు దొర్లినట్టు దడదడమంటూ శబ్దం చేశాయి. ఈ

అంతే - వెంటనే అతను సూట్ కేసుని చేతిలోకి తీసుకుని అల్లాడించాడు. మరికాస్త ఎక్కువ దడదడ శబ్దం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాడు హిందీలో గావుకేక పెట్టాడు. “వీరిని నేను అనుమానిస్తున్నాను. వెంటనే బయటికి తీసుకెళ్లాం పదండీ” అంటూ. -

నా గుండెలు దడదడ లాడాయి. “ఏమిటి మీరు అంటున్నది?' అన్నాను హిందీలో, అతడు నా మాటకి జవాబు ఇవ్వకుండా సూట్ కేసుని ఓ చేత్తో నన్ను మరో చేత్తో లాక్కుంటూ గబగబా నడిపించి బస్సు దించేశాడు.

బస్సులోంచి కొందరు ప్రయాణికులు నా వైపు అనుమానంగా చూస్తున్నారు. ఇద్దరు సైనికులు బస్సు దిగి వచ్చి నా జబ్బలు పట్టుకున్నారు. మొదటివాడు నా సూట్ కేసుని భద్రంగా పట్టుకుని నన్ను అనుమానంగా శత్రువుని చూసినట్టు చూస్తున్నాడు.

చుట్టూ చూశాను. అడవిలా ఉంది ఆ ప్రదేశమంతా. బస్సు నిలబడ్డ చోటుకి పదిహేను గజాల దూరంలో చిన్నకొట్టం హోటలుంది. దూరంగా కనుచూపు మేరలో పల్లె ఉన్నట్టు తెల్లటి మిద్దెలూ, గుంపులు గుంపులుగా చెట్లూ అవుపిస్తున్నాయి.

బస్సు కిటికీలోంచి దిగులుగా చూస్తున్నారు బెజవాడ దంపతులు.

'ఫర్వాలేదండి' అన్నట్టు కళ్ళతోనే వాళ్ళిద్దరికీ సైగ చేశాను. ఏమిటో, ఎదుటి మనుషుల ముందు ఎందుకీ మేకపోతు గాంభీర్యం? ఈ సైనికులు నన్ను ఏం చేస్తే ఏమిటి దిక్కు?

పావుగంటలో సైనికులంతా బస్సు దిగేశారు. బస్సు కదులుతోంటే ప్రయాణికులంతా నన్ను ఉల్పావాడిని చూస్తున్నట్టే అదో రకంగా చూస్తున్నారు. బెజవాడ దంపతుల దిగులు చూపులు అలానే ఉన్నాయి.

బస్సు వెళ్లిపోయింది. ఇద్దరు సైనికులు నన్ను లాక్కుపోతూ ఉంటే తక్కిన సైనికులు నావైపు తుపాకులు గురి పెట్టి నడుస్తున్నారు. అంతటి భయంలోనూ నవ్వు వచ్చింది నాకు.

కొట్టం హోటలుకి నన్ను తీసుకెళ్ళారు. పదిమంది సైనికుల్లోనూ నలుగురూ నాలుగు టేబుళ్ళను ఆక్రమించేశారు. తక్కిన ఆరుగురూ నా చుట్టూ నిలబడి ఉన్నారు. -

_ "ఎవరునువ్వు? మీ ఉల్ఫా వాళ్లు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? మర్యాదగా చెప్పావా సరేసరి - లేదంటే నీ ప్రాణం గాల్లో..." హిందీలో అంటూ భయంకరంగా నవ్వాడు లావు మీసాలవాడు.

“సార్! నేను ఫ్రిజ్ కంపెనీ ఉద్యోగిని. షిబ్ సాగర్ లో మా కంపెనీ ఫ్రిజ్ లకి కంప్లయింట్స్ వచ్చినందు వల్ల వాటిని రిపేర్ చేసేందుకు వెళుతున్నాను” అన్నాను హిందీలోనే! నా మూతి మీద టపీమని కొట్టాడు గంటు ముక్కువాడు - 'అబద్ధం' అని అరుస్తూ..

“రాస్కెల్. మాతో అబద్దాలు కూస్తావా? మిల్టరీ వాళ్ళంటే ఏమనుకున్నావు? నిన్ను ఇక్కడికిక్కడే తుపాకీతో కాల్చి పారేసి, ముక్కలు ముక్కలుగా కోసి కాకులకీ, గద్దలకీ వేసేసినా మమ్మల్ని ఎవరూ అడగరు. తెల్సిందా?" అన్నాడు నల్లటివాడు.

ఆ మాటలు జోకులు అయినట్టు అందరూ గట్టిగా నవ్వేస్తున్నారు. హోటలు వాడు అందర్నీ ఆశ్చర్యంతో చూస్తున్నాడు. వాళ్ళ తీరు చూస్తుంటే నా గుండె దడ మరింత పెరిగిపోయింది. ఒళ్ళంతా ఒకటే చెమటలు పట్టేస్తున్నాయి. చేతుల్లోనూ, కాళ్ళలోనూ వణుకు ప్రారంభమయింది. .

“ఒరేయ్ ఉల్ఫా! మా గవర్నమెంటునే ధిక్కరిస్తార్రా మీరు... మిమ్మల్ని కరకర నమిలి మింగేస్తా రోయ్!" అంటున్నాడు ఎర్రటివాడు.

లావాటి మీసాలవాడూ నా జేబుల్ని వెతికాడు.

రెండు కవర్లు దొరికాయి. వాటిని టేబులు మీద ఉంచారు. అందులో ఒకటి గులాబీ రంగు కవరు. దాన్ని చూస్తూనే నాకు ప్రాణం లేచి వచ్చింది. అమ్మయ్య మంచి సమయంలోనే దొరికింది. ఇక వీళ్ళు ఆ కవర్లోని ఉత్తరం చూసి నన్ను వదిలేయాల్సిందే. అందులో మా మేనేజరు నన్ను ఫ్రిజ్ రిపేరు పనిమీద పంపిస్తున్నట్లు ఆర్డరు వేసి ఉంది. "సార్, ఆ లెటరు చదవండి" అన్నాను. ఆత్రంగా లావు మీసాలవాడు ఓ నిమిషం సేపు ఆ ఉత్తరాన్ని చదివినట్టు తల ఆడిస్తూ "మీ ఉల్పా వాళ్ళు ఇలాంటివి ఎన్నయినా తయారుచేయగలరు" అన్నాడు. దాంతో ఉన్న ఒక్క ఆశ కూడా ఆరిపోయింది.

"సార్... సార్ నా మాట కొంచెం వినండి.... నిజంగా ఫ్రిజ్ మెకానిక్ ని... కావలసిస్తే మా డోల్విన్ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కోండి సార్" బతిమాలుతూ అడిగాను.

“దిక్కుమాలిన ఉల్ఫావాళ్ళు చెప్పిన మాటలు వినడానికి కాదు, మేము ఉంటోంది. మేము అంటున్నాము - నువ్వు ఉల్ఫా వాడివేనని. ఇద్దీ హోటల్ వాలా! మాకు పది టీలు ఇవ్వు" అంటున్నా లావు మీసాల వాడు.

ఆ మాటలు వింటూ ఉంటే, నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. వాళ్ళంతా సైనికులా అనిపించడం లేదు. యమకింకరుల్లా కనిపిస్తున్నారు. అందర్లోకి ఆ ఎర్రటివాడిని చూస్తూ ఉంటే మహాక్రూరంగా కనిపిస్తున్నాడు.

“ఒరే ఉల్ఫా! నీ సూట్ కేసు తెరు” అన్నాడు ఎర్రటివాడు, నా కణతల మీద తుపాకీ గురిపెట్టి,

“అవును.... ఎంత మూర్ఖులం రా మనం! అసలయింది సూట్ కేసే కదా!" అంటూ లావు మీసాలవాడు నల్లటివాడికి సూట్ కేసుని అందిస్తూ, మళ్ళీ తనే అన్నాడు. “ఒరే, జాగ్రత్త! అందులో బాంబులు ఉంటాయి. నిజానికి ఆ పెట్టెలో ఏవో ఉన్నట్టు అనుమానించే కదా, వీడిని బస్సు దించేసింది. సూట్ కేసుని గాలికి వదిలేసి వీడిని సతాయిస్తున్నాం".

"అవునవును.... పగల కొట్టేస్తా సూట్ కేసును” అంటున్నాడు గంటు ముక్కువాడు, తుపాకి మడమ ఎత్తుతూ.

- “ఒరే పిచ్చోడా. నిన్ను అందుకేరా 'పూల్ అని హవల్దారు తిట్టేది. ఆ తుపాకీ మడమతో సూటికేసు పగల గొడితే అందులో ఉండే బాంబులు పగిలిపోవా?” అన్నాడు నల్లటి వాడు.

" "కరెక్టేరోయ్. బాగా చెప్పావ్, రేయ్, ఉల్ఫా, నీ తాళం చెవితో తియ్యి" అన్నాడు గంటుముక్కు వాడు నన్నుద్దేశించి.

మెల్లగా వణుకుతున్న చేత్తో సూట్ కేసు తాళం తీశాను. అందరూ ఒక్కసారిగా తొంగి చూశారు.

“ఒరేయ్! టైం బాంబులు రోయ్ అన్నీ... వాట్ని తాకకండి - వీడు నిజంగా ఉల్పానే” అన్నాడు నల్లటి వాడు.

"సా సా సార్! ఇవి కావు.... ఇందులో ఉన్నవి బాంబులు కావు సార్. ఇవి ఫ్రిజ్ రిపేరు సంబంధించిన థర్మోస్టాట్, రిలే, స్మాల్ గ్యాస్ సిలిండర్ - తక్కినవి స్పానర్లు, స్క్రూడ్రైవరు, కటింగ్ ప్లేయర్ సార్' అన్నాను.

“ఒరేయ్, ఉల్ఫా! దాన్ని తీసుకో” అన్నాడు లావు మీసాలవాడు. నా, కణతల మీద తుపాకీ ఒత్తిడి మరింత పెరిగింది. వాడు తీసుకోమంటోంది థర్మోస్టాట్ ను. అది పసుపు రంగులో చదరంగా రెండు సెంటిమీటర్ల మందంతో ఉంటుంది. అందువల్ల దాన్ని టైమ్ బాంబు అనుకున్నారేమో ననుకుని చేతిలోకి తీసుకున్నాను. దాన్నించి వచ్చిన సిల్వర్ వైర్ ని భయం భయంగా చూస్తున్నారు. ఆ

నల్లటివాడు స్మాల్ గ్యాస్ సిలిండర్ని, ఎర్రటివాడు నల్లగా ఉన్న 'రిలే' పరికరాల్ని పట్టుకున్నారు. “వీటన్నిటిలోకి పవర్ ఫుల్ బాంబు ఏదిరా?" ప్రశ్నించాడు లావు మీసాల వాడు. “సార్! మీరు అనవసరంగా భయపడి పోతున్నారు. ఈ పరికరాల్లో ఏ ఒక్కటీ బాంబు కాదు."

“స్స్స్స్స్స ' మంటూ శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డారు అందరూ, అది గ్యాస్ సిలిండర్ లోంచి వచ్చింది.

"ఇది గ్యాస్ బాంబు కాదేమిట్రా" అంటూ నల్లటివాడు తుపాకీ మడమతో నా డొక్కలోకి పొడిచాడు. భరించలేని బాధతో కింద పడిపోయి 'అబ్బా' అన్నాను. రెండు నిమిషాల సేపు కోలుకోలేక పోయాను.

నా చొక్కా పట్టి లేపుతూ “మరేమిటిది?” అన్నాడు నల్లటివాడు.

“సార్! మీరు అనుమానంగా చూస్తే అన్నీ బాంబుల్లాగే కనిపిస్తాయి. నిజానికి అది ఫ్రిజ్ లో చల్లదనం ఉండేలా చూసే 'ప్రియల్-12' అన్న గ్యాస్ అందులో ఉంది" వణుకుతున్న గొంతుతో చెప్పాను.

అయినా, ఎవరూ నా మాటలు నమ్మటం లేదు. అనుమానంగా దానివైపే చూస్తున్నారు.

“సార్. నా మాటల మీద మీకు నమ్మకం లేదు. పోనీ ఒక పని చేయండి. వీటన్నిటిని మీరే ఎవరయినా బద్దలు కొట్టండి. వీటిలో ఏ ఒక్కటి పేలినా నన్ను నిర్దాక్షిణ్యంగా చంపి పారేయండి" అన్నాను దీనాతి దీనంగా మొహం పెట్టి..

వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలీదు. నన్ను పక్కనే ఉన్న కుర్చీలో కూచోమన్నారు. నిస్సత్తువగా కూచుండిపోయాను.

వాళ్ళు టీలు తాగుతూ నా సూట్ కేసునే చుట్టూ చూస్తూ ఉండిపోయారు. నల్లటివాడు నా పక్కనే కూచుని టీ తాగుతూ ఉన్నాడు.

"ఏం చేసేదిరా భగవంతుడా. నువ్వే దిక్కు!" అంటూ గట్టిగానే గొణుక్కున్నాను. “నీవు తెలుగువాడివా?" నల్లటివాడు అడిగాడు. అవునన్నాను, వాడి అరవయాస తెలుగుతో బిత్తరపోతూ, “మాది మదరాసు యా! మీ ఊరూ?" అడిగాడు.

నా ప్రాణం లేచి వచ్చింది..... ఆశలు చిగురించాయి. “నేను ఆంధ్రప్రదేశ్ వాడిని.... మా ఊరు అనంతపురం సార్" అన్నాను. "

“నాకు కొంజెం కొంజెం తెలుగు వచ్చు యా! మా బంధువులు శానామంది చిత్తూరులో ఉండారు యా!"

“అట్లానా - చూడండీ! మీ వాళ్ళు ఆంధ్ర వాడ్ని నన్ను ఉల్ఫావాడిని అని అంటున్నారు". “మరి ఇక్కడేం చేస్తున్నారు?” అడిగాడు నవ్వు మొహంతో.

నా ఉద్యోగాన్ని వివరించాను. 'నీకు కర్మ బట్టింది... మా కంటే ఈ ఆర్మీలో ఈ తిప్పలు తప్పవు. నీకేం యా? ఇంత దూరం వచ్చినావు" అంటూ సానుభూతి ప్రకటించాడు. “సార్, దేవుడిలా దొరికారు. ఎలాగైనా నన్ను రక్షించండి సార్" అన్నాను వణుకుతున్న గొంతుతో.

మేమిద్దరం ఇందాక వాళ్ళకు తెలియని మరో భాషలో మాట్లాడుకోవడాన్ని ఆశ్చర్యంగా గమనిస్తు న్నారు.

నల్లటివాడు వెంటనే లేచి లావు మీసాలవాడిని నాకు దూరంగా తీసుకుని పోయి ఏదో మాట్లాడాడు. పావు గంట గడిచాక నా దగ్గరికి వచ్చారు.

“నీవు వెళ్ళిపోయా" అన్నాడు నల్లటివాడు. దాదాపు పొద్దుగూకుతూ ఉంది. అందరికీ థ్యాంక్ చెప్పి 'బతుకుజీవుడా' అని రోడ్డుమీదకి వచ్చాను. అదృష్టం కొద్దీ వెంటనే గౌహతికి వెళ్ళే బస్సు వచ్చింది. గౌహతి చేరుకున్నా నాలో అదురూ, ఒళ్ళంతా వణుకూ పూర్తిగా మాయమవలేదు.

ఇంటికి వెళ్ళాక నళినితో జరిగినదంతా చెప్పాక గానీ మనసు కుదుట పడలేదు. నళిని కళ్ళలో నీళ్ళు పెట్టుకుంది.

“ఇంక ఆంధ్రకు వెళ్ళిపోదాం పదండి. ఊపిరుంటే ఉప్పు అమ్ముకోవచ్చు" అంటూ ఏడ్చేసింది. మౌనంగా సిగరెట్ కాలుస్తూ కూచున్నాను. -

“ఏమండీ, ఈయన మన ఇంటికి ఒకసారి వచ్చినాడు కదా - బెంగుళూరు అతను అని పరిచయం చేసినారు. వచ్చీరాని తెలుగు మాట్లాడా.....” అంటూ ఇంగ్లీషు డైలీ పేపర్ తెచ్చి చూపించింది.

"అవును, శివశంకర్... ఎందుకు వేసినారే ఇతని ఫొటోని" అంటూ పేపర్ని చేతిలోకి తీసుకున్నాను. అందులో ఫొటో కింద వార్త ఇలా ఉంది.

"ఉల్ఫా తీవ్రవాది మృతి... నిన్న జరిగిన పోలీసుల ఎదురుదాడుల్లో నవగాంగ్ జిల్లాకు చెందిన ఈ ఫొటోలోని వ్యక్తి చనిపోయాడు..”

అది చదివి నిలువెల్లా వణికిపోయాను.

తొలి ముద్రణ: ఇండియా టుడే 6-20-1992




This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube