నాకు రామ్ అని ఒక సహోద్యోగి ఉండేవారు చెన్నైలో. ఆయన సందర్భోచితంగా వేసే పంచ్ లు అంటే నాకు చాలా సరదా, కానీ ఎప్పుడు నా మీద ప్రయోగిస్తారేమో అని జాగ్రత్తతో ఉంటా. వాళ్ళ టీంలో ఒక నిష్ టెక్నాలజీల నైపుణ్యముండే పిల్లకాయలున్నారు. అదే నిపుణత వేరే కస్టమర్కి కూడా అవసరమయ్యింది. బయట ఎక్కడా దొరకటంలా. కావాల్సిన కస్టమర్ ఏమో ఎక్కేస్తున్నాడు. అలా రోజూ ఎక్కిచ్చుకోలేక ఆ కస్టమర్ కి పని చేసే ఇంకో మా మేనేజర్ నా దగ్గర కొచ్చి, హర్ష, ఆ రామ్ తో మాటలాడి కొంచెం ఆ పిల్లకాయలు హెల్ప్ తీసుకుందాము అన్నాడు. నేను సరే అని, ముందే రామ్ కి యీ విషయం చెప్పి, పంచ్ లు వెయ్యొద్దని బతిమాలి మరీ ఫోన్ లో కలిపాను యిద్దరినీ. రామ్ ఫోన్ లో రావటమే తరువాయి మొదలెట్టాడు, 'రవీ! నాకు తెలుసు నువ్వు బట్టల్లేకుండా రోడ్ మీద నిలబడున్నావని, హర్ష చెప్పాడు. కానీ నన్నివ్వమంటే ఒక సారి షర్ట్ ఇవ్వగలను, పోనీ లే అనుకుంటే ఇంకో సారి ప్యాంటు కూడా ఇస్తాను, అలా ఇస్తున్నాను కదా అని నువ్వు అండర్ వేర్ కూడా ఇస్తానని ఆశించమాకు' అంటూ మొదలెట్టాడు. నాకైతే అవతల రవీ, మొహం ఎలా ఉందొ ఉహించు కోడానికి భయం వేసింది. ఆయన అసలే సింహం లాటోడు.
అలాగే ఒక రోజు మా చెన్నైకి వేరే వూరు నుండి ఒక విభాగాధిపతి , రివ్యూ చేయడానికి వస్తున్నాడు, రామ్ ప్రాజెక్ట్స్ లను. ఆ వచ్చే మనిషి చాలా నసగాడు, రామ్ కి చెప్పా! చాలా జాగ్రత్తగా వుండు, తనసలే తేడా అని. రామ్ తన ట్రేడ్ మార్క్ నవ్వుతో, హర్షా!, మనింట్లో కుక్క పిల్ల భౌభౌ అందనుకో ఏమి చేస్తాం, ముద్దు చేస్తాం, అదే దార్లో కుక్క పిల్ల భౌభౌ అంటే మూతి మీద కొడతాం. అతను విభాగాధిపతి అయితే పక్క ఊర్లో కదా మనకి కాదు కదా అంటూ ముక్తాయించాడు. ఆ తర్వాత రివ్యూ ఎలా జరిగిందో అడగడానికి నాకు ప్యాంటు తడిచింది.
అలాగే మాకు ఒక హారిజాంటల్ గ్రూప్ వుంది. హారిజాంటల్ అంటే వాళ్ళు మా వర్టికల్ కి మాత్రమే కాక అన్నీ వెర్టికల్స్ కి సపోర్ట్ చేస్తారు. మీకర్థం కాక పోతే మీరు మా ఐ.టి వాళ్ళు కాదని అర్థం. వాళ్ళు అసలే పేరు తగ్గ అడ్డంగాళ్ళు. అన్నిటికి మా హారిజాంటల్లో ఇంతే అంటూ చావ కొడతారు. మేము ఆకాశంలో నుంచి ఊడి పడ్డాం అంటారు. ఈ రామ్ వీళ్ళని ఎలా డీల్ చేస్తాడబ్బా అని చూడాలని వెళ్ళా ఒక రోజు. సరే, అందరం కలుద్దామని ఫ్లోర్ వాక్ కి పిలిచాడు, ఆ హారిజాంటల్ వాళ్ళని కూడా ఆహ్వానించాడు. వాళ్ళు రాగానే మొదలెట్టాడు, మీరు అన్నీ అకౌంట్లలో వున్నారు, అన్ని దగ్గర్లా కావు కావే, మీరు అన్నీ దగ్గర్లా ఎగరరండి బాగా, కావు కావు అని కూడా ఆనండి, కానీ ఇక్కడికొచ్చి రెట్ట మాత్రం వేయకండి అంటూ. నేను అయితే ఆయన మాటలకి ఫ్రీజ్ అయ్యా.
ఆయన వాళ్ళ ప్రాజెక్ట్స్ ని ఒక హెడ్ మాస్టర్ స్కూల్ ని ఎలా నడుపుతాడో అలా, ఒక పక్క బెత్తం, ఒక పక్క పంచ్ లతో నడుపుతాడు. ఒకసారి ఈ పంచ్ లు తట్టు కోలేక ఆయన టీమ్ వాళ్లంతా ఆయన్ని ఆయన ఆఫీస్ లో కలిశారు. ఏంటీ ట్రాన్సిషన్ మేనేజర్, అప్లికేషన్ మేనేజర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ అందరూ కట్టకట్టుకొచ్చారు, అబ్బబ్బ ఆల్సేషన్ , డాల్మేషన్ , డాబర్ మాన్ అని ఎన్ని పేర్లున్న కుక్క పిల్లలు కుక్క పిల్లలేనబ్బా, మీకు ఎన్ని డిసిగ్నషన్స్ వున్నా మీరు నాకు పనిచేసి పెట్టేవాళ్ళేనబ్బా అంటూ మొదలెట్టాడట, ఇక వాళ్ళు ఈయన పంచ్ లకు అలవాటు పడటమే బెటర్ అని డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్లకూ నాకు రామ్ పంచ్ లు వినకపోతే వెల్తి.
అలాగే అందరూ సరిగా కలిసి తనకి ప్రాజెక్ట్ డెలివరీ చేయక పోతే, అల్లం ముక్క , మామిడి ముక్క వెల్లుల్లి పాయ తెచ్చి నేను ఎందుక్కలుపు కోవాలి అబ్బాయిలు, దాని బదులు రెడీ మేడ్ గా నేను ప్రియా పికిల్ కొనుక్కుంటా అని బెదిరిస్తాడు. ఇలా వుంటాయి ఆయన పంచ్ లు. మీకూ ఇలాటి ఫలక్ నామ తో పరిచయం ఉంటే మీరు కూడా రాయండి. నేను చాలా తక్కువ రాశా.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp