హర్షణీయంలో ఇప్పుడు మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’. ఇది వారి ‘గుడి’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది.
తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు.
ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది.
తమ రచనను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ ‘హర్షణీయం’ ద్వారా మీకందించబడుతుంది.
‘గుడి’ కథాసంపుటి ని కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీలో ఇవ్వబడ్డాయి.
‘సిలారు సాయబు’:
నాగడు సిలారు సాయిబును కొట్టాడు. సిలారు నవ్వాడు. నాగడికి ఏడుపు వచ్చింది. మళ్ళీ కొట్టాడు. సిలారు ఇంకా నవ్వాడు.
వాడు కొట్టా . వీడు నవ్వా. ఇదే తంతు. వాడు బలవంతుడు. వీడు బల హీనుడు.
వాడున్నవాడు. వీడు లేనివాడు. వాడు సంసారి. వీడు బికారి.
నాగడికి తిక్క ముదిరింది. కర్రతో బాదాడు.
'నన్ను తిట్టరా' అన్నాడు. సిలారు తిట్టలేదు. 'నన్నుకొట్టరా' అన్నాడు. సిలారు కొట్టలేదు. 'నన్ను వాటేసుకోరా' అన్నాడు. సిలారు వాటేసుకోలేదు.
సిలారుసాయిబు తనను తిట్టాలని, కొట్టాలని, వాటేసుకోవాలని నాగడికి ఆశ, ఇష్టం, ఉబలాటం, ఆరాటం. అందుకే ఈ చావు.
నాగడు తనకు వచ్చిన బూతులన్నీ తిట్టాడు. సిలారు నవ్వుతాడు కానీ తిట్టడు.
సిలారుకు ఒక ప్రఖ్యాతి ఉంది. వీడు తిట్టినా కొట్టినా తాకినా మేలు జరుగు తుందని.
అతడి ఊరూ పేరూ ఎవరికీ తెలియదు. ఎప్పుడో ఎవరితోనో సిలారుసాయిబు అని తన పేరు చెప్పాడని అందరూ అనుకొంటారు. అలా అతడికి ఆ పేరు స్థిర పడింది. ఆ పేరుతో పిలిస్తే తిరిగి చూస్తాడు కానీ 'ఏమీ?' అని అడగడు.
మర్రిచెట్టు కింద పడుకొంటాడు. దేవుళ్ళ చెరువులో బుద్ది పుట్టినంత సేపుమునుగుతూ తేలుతూ ఉంటాడు. బర్రెలు, దున్నలు, పెయ్యలు, దూడలు నీళ్ళలో మునిగినట్లే సిలారు సాయిబూ మునుగుతూ తేలుతూ ఉంటాడు. బరి గొడ్డు గట్టెక్కగానే తానూ ఒడ్డు కెక్కి వేప చెట్టు కింద కూర్చుంటాడు.
బట్టలు ఒంటి మీదే ఆరి పోతాయి. ఎవర్నీ ఏమీ పెట్టమని అడగడు. ఏం పెట్టినా తీసుకోడు. ఇష్టమైంది ఎక్కడున్నా తీసుకుంటాడు.
చలిలేదు, వానలేదు, ఎండలేదు. మర్రి చెట్టు కిందే మకాం. పగల్లేదు, రాత్రిలేదు, ఎప్పుడయినా నిద్రపోతాడు, నిద్రపో యినప్పుడు తప్ప చెట్టు కింద ఉండడు. ఎవరైనా చిరుగులబొంత ఇచ్చినా కప్పు కోడు. పక్కనేసుకోడు. బుద్ధి పుడితే దాని మీద పడుకొంటాడు. లేకపోతే అది అక్కడ ఉండగానే గడ్డి మీద పడి నిద్రపోతాడు. వాడికి దినచర్య లేదు. ఇప్పుడు నిద్రపోవాలని గానీ ఇప్పుడు నిద్ర లేవాలనిగాని నియమమేమీ లేదు.
సిలారు సాయిబుకు ఏం తొందరో అంగలు పంగలు వేసుకుంటూ వస్తాడు. గబగబా పోతాడు. పరుగూ కాదు. నడకా కాదు. అడ్డదిడ్డంగా పడుతూ లేస్తూ వస్తూ పోతూ ఉంటాడు. మాదిగ పల్లెను వదిలి ఎక్కడికీ పోడు.
పల్లె పెద్ద ఎక్క డిదో పాత నిక్కరుంటే సిలారు సాయిబును పట్టుకొని తొడిగాడు. అది జారి పోకుండా మోకులాంటి మొలతాడు కట్టాడు. మొలతాడు అదుపాజ్ఞల్లో నిక్కరు ఖైదు అయింది.
నెలకో ఆర్నెల్లకో పల్లె పెద్దకు బుద్ధిపుడితే పై బట్టలు పీకేసి ఉతికి నవేవో తొడుగుతాడు. పల్లెమొత్తం మీద పెద్ద మాదిగకు మాత్రమే సిలారు సాయిబు దొరికేవాడు. ఏ బట్ట పీకి పారేసినా ఓర్చుకునేవాడు. ఏ ఉతికిన బట్టలు వేసినా ఒప్పుకొనేవాడు. ఇక పల్లెలో ఎవరి చేతికి దొరకడు. ఏం పనీ ఉండదు. పల్లె వీధు లన్నీ మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటాడు. ఎవురైనా ఎదురైతే అల్లంత దూరంగా తప్పు కొని తప్పించుకొని పోతాడు.
ఎవరైనా వీధిలో కూర్చుని అన్నం తింటుంటే తినే గిన్నెలో నుంచి గుప్పెడు మెతుకులు లాక్కొని తింటాడు. అంతా నోట్లోకి పోని వ్వడు. రెండు మెతుకులటు రెండిటు పడేసుకుంటూ బొక్కుతాడు.
చెరువులో నీళ్ళయినా తాగుతాడు. కుడితి తొట్లెలో నీళ్ళయినా తాగుతాడు. చెంబట్టుకు పోయేవాళ్ళ చెంబు తీసుకోనైనా తాగుతాడు. బావి దగ్గరకు పోడు. నీళ్ళు దోసిట్లో పోయించుకోడు.
ముంత లేదు. మూకుడు లేదు. కుండలేదు. సట్టిలేదు. వాడికి కూడు వండుకునే పనిలేదు. పొలాలో అడ్డం పడిపోతుంటాడు. చేతికందినవి తింటాడు. అవి కాకరకాయ లైనా చింతలేదు. చింతకాయలైనా తొందరలేదు. దోసకాయలైనా ఇబ్బందిలేదు. రాంములక్కాయలైనా ఫరవాలేదు. పొలంలో పండే ఏ కూరగాయనూ ఆకు కూర నూ వద్దనకుండా తింటాడు. పచ్చిగడ్డి కూడా పరమాన్నంలా భుజిస్తాడు...
సిలారు సాయిబు మాదిగపల్లెలో వింతజీవి. అతడు తుమ్మినట్లు కానీ, దగ్గి నట్లు కానీ, జ్వరం వచ్చిందని కానీ, లేవలేకుండా ఉన్నాడని కానీ ఎవరూ ఎప్పుడూ చెప్పుకోలేదు.
'నా చిన్నతనం నుంచి సిలారు సాయిబు ఇట్లానే ఉన్నాడ'ని ముసలివాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు.
అతను ఏం తిన్నా ఎవరూ ఏమీ అనరు. ఏం తాగినా తాగిస్తారు. వాడు తాము భరించవలసిన ఒక ప్రాణి అని మానవమాత్రుడని పల్లెవాళ్ళు గుర్తించారు.
ఏ నియమం, ఏ హద్దు, ఏ అడ్డు, ఏ ప్రతిబంధకం లేకుండా సిలారు సాయిబు మాదిగపల్లెలో స్వేచ్ఛాజీవిగా ఉన్నాడు.
ఏ పంట బాగా పండినా సిలారు సాయిబే కారణమనుకోసాగారు. ఒకరింట్లో చొరబడి గుప్పెడు కందులు తీసుకొని తింటూ వెళ్ళిపోయాడని, ఆ సంవత్సరం ఆ ఇంటికి కందిపంట ఇబ్బడి ముబ్బడిగా వచ్చిందని వాళ్ళ ఆనందం.
ఆ సంతో షంతో వాళ్ళు కందిపప్పు వండి, ముద్దపప్పు మధ్య గుంట చేసి గుంట నిండా నేయి పోసి, తీసుకొనిపోయి ఇస్తే ముఖంలోకి చూచి ఇకిలించి, చేత్తో విస్తరిని విసిరి కొట్టాడని చెప్పుకుంటుంటారు.
ముద్దపప్పు నేల పాలయినందుకు తెచ్చిన మనిషే చింతపడలేదు. సిలారు సాయిబు ఇకిలించటం మానలేదు.
రామికి పెళ్లి కాలేదు. పిల్ల ముదిరిపోయిందని తల్లి, తండ్రీ, పల్లె గగ్గోలు పెడుతుంటే కుమిలిపోతూ ఏడుస్తూ ఇంటి మట్టి గోడకానుకొని, చూరుకింద కూర్చుని, బియ్యంలో మట్టిబెడ్డలు ఏరి తింటూ కనిపించేది.
పిల్ల తల్లిదండ్రులు పెద్ద ఆస్తిపరులేం కాదుగాని తినడానికి ఉన్నవాళ్ళే. పిల్ల కురూపా అంటే అదేం కాదు. చూడముచ్చటగానే ఉంటుంది. పన్నెండు ఏళ్ళ వయస్సు రాగానే పెద్ద పిల్లయి కూర్చుంది.
తండ్రి పెండ్లి సంబంధాల కోసం తిరిగిన ఊరు తిరగకుండా పదూళ్ళు తిరి గాడు. రెండు జతల చెప్పులు మార్చాడు. పెళ్ళి కుదరలేదు.
పిల్ల ముదిరిపోతూ ఉందని అందరూ గోల చేస్తున్నారు. ఈ ఊర్లో రెండో పెళ్ళివాడో, పోనీ పెళ్ళామున్నవాడో నేనున్నానంటూ పిల్ల కన్నెచెర తొలగిస్తానంటూ ముందుకు రాలేదు.
పిల్ల పెళ్ళి అవసరం కంటే పల్లెకు ఆ పిల్లను వదిలించుకోవలసిన అవసరం ఎక్కువైనట్లుగా వుంది.
గోలంతా చూస్తే ప్రతి భార్యా, భర్తను కట్టుబాట్ల మధ్య కట్టేసుకోలేక నానా తిప్పలు పడుతూ ఉందనిపిస్తుంది.
ఈ ఆడవాళ్ళ సూటిపోటి మాటలతో పిల్ల మరింత ముడుసుకుపోతూ ఉంది. కుమిలి పోతూ ఉంది. కుంగిపోతూ ఉంది. బావిలో నీళ్ళన్నీ కళ్ళలో ఉన్నట్లే కన్నీరు కారుస్తూ ఉంది.
ఒకరోజు అటుపోతున్న సిలారు సాయిబు పిల్ల భుజం మీద ఉన్న ఓణీ లాక్కొని, తెలి మీద మొట్టికాయ కొట్టి, ఓణీని జెండాలా ఎగరేస్తూ పోతూ ఉండటం పల్లెంతా చూచింది.
ఎదురొమ్ములకు చాట అడ్డం పెట్టుకొని పిల్ల ఇంట్లోకి దూరింది. సిలారు సాయిబు పిల్ల ఓణీ జెండా చేసుకున్నాడన్న వార్త గాలికంటే వేగంగా ప్రయాణం చేసింది.
వారం రోజుల్లో రెండు సంబంధాలు వచ్చాయి. అమ్మాయి ఆనందానికి తిరుగు లేదు.
ఎవరైనా సరే' అంది. అంతే. పదిరోజుల్లో పెళ్ళయింది. ఏడాదికి కొడుకునె త్తుకుంది. సిలారు సాయిబుకు చూపిస్తే వాడేలోకాన వాడున్నాడు. చూళ్ళేదు. తిట్ట లేదు. కొట్టలేదు. 'సిలారు సాయిబు సలవ' అన్నారు ఆడవాళ్ళు. 'దేవుడి దయ' అన్నారు మగవాళ్ళు. 'ఈడేరిన పిల్ల. పెళ్ళయింది. పెళ్ళయితే పిల్లలు పుట్టరా. పుట్టేరు. అంతే. కిందోడి సలవా లేదు, పైవాడి దయా లేదు' అన్నారు పంతులుగారు.
పంతులుగారు అంటే బాపనాయన కాదు. మాదిగాయనే. పల్లె బళ్ళో పంతులు. పంతులు చెప్పే అఆఇఈలు ఎవరైనా వింటారు. ఒప్పుకొంటారు.
పిల్లలు చదువుకొంటారు. కానీ సిలారు సాయిబు చలవ లేదన్నా, దేవుడి దయ కాదన్నా పల్లెవాళ్ళు ఒప్పుకోరు.
కారణం లేనిదే కార్యం జరగదంటాడు పంతులు.
మాదిగపల్లెలో కార్యం అంటే పెళ్ళయిన ఆడపిల్లని, మగపిల్లాణ్ణి ఒక మంచం మీద పడుకోబెట్టి తలుపేయటం.
'పెళ్ళి చేయటం కారణం. ఈ కారణం లేనిదే ఆ కార్యం లేదు' అంటాడు పంతులు.
పెడసరపువాడు ఒకడు 'పెళ్ళే ఒక కార్యం ' అంటే
పంతులు నవ్వి 'ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల పుట్టి ఉండడం కారణం' అన్నాడు.
''వాళ్ళు పుట్టడమే ఒక కార్యం' అన్నాడు పెడసరపువాడు.
'వాళ్ళ అమ్మా నాన్నలకు పెళ్ళి కావడమే కారణం' అన్నాడు పంతులు. 'ఒక కారణం లేందే ఒక కార్యం జరగదు' అన్నాడు.
ఒప్పుకొన్నారు కానీ కొన్ని సార్లు ఒకటే కార్యమూ, కారణమూ కావటం విచిత్రంగా ఉంది. ఏమైనా జరగవని సిందేదో జరుగుతుంది అనుకొన్నారు మెట్ట వేదాంతవేత్తలు. -
సుబ్బడు మూడేళ్ళుగా ఎస్సెస్సెల్సీ తప్పుతున్నాడు. నాలుగో ఏడు కూడా తప్పితే ఇక వాడికి ఎస్సెస్సెల్సీ పాసయ్యే యోగ్యత ఉండదు. కాలేజీలో చేరే రాత ఉండదు.
'ఎందువల్ల?
'ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కలేదు'
'ఐదోసారి ఉట్టిమీదికి ఎందుకు ఎక్కనీయకూడదు'
'ఉట్టి తెగుద్ది'
పంతులుగారితో పెడసరపోడు మాట్లాడుతున్నపుడు సుబ్బడు సజ్జబువ్వలో పెరుగు కలుపుకొని మల్ల వళ్ళో పెట్టుకొని, నడిమంచం మీద కూర్చున్నాడు.
మంచం నులక వదులై ముడ్డి నేల కానింది. సుబ్బడు వంచిన తల ఎత్తకుండా జుర్రుకొంటున్నాడు.
అందుకు కారణాలు రెండు. ఒకటి రైలుకి సిగ్నలు ఇచ్చారు. రెండు రైలెక్కి గుంటూరు పోయి ఎస్ఎల్సీ నాలుగోసారి పరీక్ష రాయాలి. ఈసారయినా పాసు కావాలి అని పట్టుదలతో, పట్టు బట్టి పెరుగు సజ్జబువ్వ జమాయించి లాగుతున్నాడు వాడు. తింటూ సుర్రుసుర్రు మంటూ బువ్వకు నాలుకకూ మధ్య శబ్ద బ్రహ్మను సృష్టిస్తున్నాడు సుబ్బడు.
అప్పుడు వచ్చాడు సిలారు సాయిబు. ఏడ నుంచి వచ్చాడో తెలియదు. ఎందుకు వచ్చాడో తెలియదు. అంగలు పంగలు వేసుకుంటూ సరాసరి సుబ్బడు కూర్చుని ఉన్న మంచం కాడికి చేరాడు. మల్ల లాక్కోలేదు. పెరుగుబువ్వ పీక్కోలేదు. అటు తిరిగి తల వంచుకొని మల్లకు మూతికి చేయి తిప్పి మధ్యలో ఖాళీ లేకుండా రవం దాడిగా జుర్రుకొంటున్న సుబ్బణ్ణి చూశాడు.
అప్పుడు సిలారు సాయిబు చేయి లేచింది. టపీమని సుబ్బడి నెత్తి మీద ఒక చరుపు చరిచాడు. అక్కణుంచి సిలారుసాయిబు ఆగకుండా వెళ్ళిపోయాడు.
దెబ్బ తిన్న సుబ్బడి మూతి మల్లలో ఇరుక్కుపోయింది. మల్ల పగిలింది. పెరుగుబువ్వ మంచం మీద పడింది. నులక సందిచ్చేసరికి నేలపాలయింది. మల్ల రెండు ముక్కలు ఎడం చేస్తే సుబ్బడి ముఖం కనిపించింది.
నోరు బదులు ముక్కు, కళ్ళు, నొసలు, చెంపలు , చెవులు సజ్జ పెరుగన్నం నున్నగా తిన్నాయి.
సుబ్బడి తల్లి తతంగమంతా చూచింది. సిలారు సాయిబును ఏమీ అనలేదు. దండం పెట్టింది. కొడుకు మూతి తుడిచింది. ముక్కు పిండింది. ముఖం కడిగింది . ఉతికిన చొక్కా నిక్కరు మార్చింది.
ముద్దుల మీద ముద్దులు పెట్టింది. 'కొడకా ! ఈ ఏడు నువ్వు పరీక్ష పాసవుతావు పోరా' అంది.
సుబ్బడు అయోమయంగా చూశాడు. రైలు కూత వినిపించింది. పరీక్ష అట్టా, పెన్నూ పెన్సిలు తీసుకొని లగెత్తుకెల్లి రైలెక్కాడు.
పంతులూ, పెడసరపోడు జరిగిందంతా చూశారు.
'సుబ్బడు పాసవుతాడా?' పెడసరిపోడు అడిగాడు.
'బాగా చదివి వుంటే పాసవుతాడు. లేకుంటే ఫెయిల్ అవుతాడు'
'ఫెయిల్ కాడు. పాస్ అవుతాడు. ఏమనుకొంటున్నావు పంతులూ! అది సిలారు సాయిబు దెబ్బ' అన్నాడు పెడసరపోడు.
సుబ్బడు ఆ సంవత్సరం ఎస్సెస్సెల్సీ పాసయ్యాడు.
'ఇప్పుడేమంటావు?' అన్నాడు పెడసరపోడు.
'బాగా చదివుంటాడు. పాసయ్యాడు' అన్నాడు పంతులు.
'కాదు. అది సిలారు సాయిబు సలవ' తేల్చాడు పెడసరపోడు.
పంతులు ఏమీ మాట్లాడలేదు.
సిలారు సాయిబుకు కృతజ్ఞత తెలుపుకోవాలని సుబ్బడి తల్లికి యమ ఆరాటంగా ఉంది.
డబ్బిస్తే చెల్లపెంకుల్లా పారేస్తాడు. అన్నంపెడితే తినడు. కుక్కలకేస్తాడు.
ఆమె ఒక పన్నాగం పన్నింది. నేతిగారెలు వండింది. గారెలన్ని దండగుచ్చింది. దండమె శ్ళోవేసి మెడకు కట్టింది. గారెలు నోటికి అందుతాయి.
పీకి పారేస్తే తాడుకొస గొంతు పిసుకుతుంది. ఏ ఎదాన ఉన్నాడో ఒక్కొక్కటి పీకి పీకి తిని పురికోస కంటె లాగా పెట్టుకొని తిరగసాగాడు.
ఒకసారి లేగదూడ అడ్డంపడి ఈనలేక అవు గింజుకులాడింది. ఆవు దుఃఖం తమ దుఃఖంగా అల్లాడుతున్నారు జనం.
సిలారుసాయిబు ఏమనుకొన్నాడో అందర్నీ తోసుకొని ముందుకుపోయి ఆవు ముడ్డిమీద సుతారంగా చేతో రాశాడు. అంత సుతారంగా సున్నితంగా సుకుమారంగా కోమలంగా వాడి చేయి ఉంటుందని పల్లెకు తెలియదు. ప్రపంచానికి తెలియదు. వాడికి తెలియదు.
మరుక్షణం దూడ తలకాయ పట్టుకొని, వాముల్లోంచి చొప్పకట్ట లాగినట్లు లాగి, దూడను తల్లి మూతి కాడ పెట్టి అదే పోవడం. అంగలుపంగలు వేసుకొంటూ ఆగకుండా లగెత్తినట్టు వెళ్ళిపోయాడు.
'సిలారుసాయిబు హస్తవాసి మంచిది' అన్నాడు పెడసరపోడు.
'ఆవు ముక్కితే దూడ పడేదే' అన్నాడు పంతులు.
'ఆవెందుకు ముక్కలేదు. దూడెందుకు పళ్ళేదు' అడిగాడు పెడసరపోడు.
“పోరాడి పోరాడి దానికి ఓపిక తగ్గింది' అన్నాడు పంతులు.
ఎందుకు తగ్గింది. ఎంత చెట్టుకంత గాలికదా. సిలారు సాయిబు రాకపోతే ఆవు సచ్చేది. ఆవుతో పాటు దూడ సచ్చేది. రెండు జీవాలకు ప్రాణం పోసేడు సిలారు సాయిబు'
'అందుకే ఈనబోయే ముందు పశువుల్ని ఆస్పత్రికి తోలాలి.”
'అక్కడేం చేస్తారు....?"
'స్త్రీల కాన్పుకు మంత్రసానులున్నట్లే ఆవు ఈనటానికి డాక్టర్లు సహాయం చేస్తారు
'ఈనబోయే ఆవును గుంటూరు తోలుకు పోవటం ఎట్టా'
పెడసరపోడు అడ్డదిడ్డపోడు, ముదనష్టపోడు, తిక్కలోడు అంటారు కానీ పంతులు వాడి అడ్డగోలు ప్రశ్నలకు ఓపిగ్గా బదులు చెబుతుంటాడు. అప్పుడెం దుకో మౌనంగా ఉన్నాడు.
ఇటువంటి చాలా సందర్భాల్లో సిలారుసాయిబు మీద పల్లెకు గురి కుదిరింది. సిలారు సాయిబు తిట్టినా, కొట్టినా, ముట్టినా మేలనే ఖ్యాతి స్థిరపడింది.
అతడి ప్రఖ్యాతి అతడికి తెలుసునో తెలియదో పల్లెకు తెలియదు. పల్లెవాళ్ళుమాత్రం సిలారు సాయిబు కొట్టాలని, తిట్టాలని ప్రతిక్షణం ఎదురుచూస్తుంటారు.
సిలారు సాయిబు ఎప్పుడూ గొణుగుతూ తిరుగుతుంటాడు. ఏం గొణుగుతాడో తెలియదు. అదేం భాషో అర్ధం కాదు.
రోజుకు అయిదుసార్లు కూర్చునే దండం పెడుతూ గొణుగుతాడు. నుదురు నేలకానించి, మళ్ళీ లేచి, ఏదో మంత్రం చదివి నట్లు గొణుగుతాడు.
ఇలా చేయటం చూచిన ఊళ్ళోని సాయిబులు నమాజు చేస్తు న్నాడని, పీర్లుండే సావిడి వద్ద పడుకోమని చెబితే వినలేదు. బలవంతంగా లాక్కు పోతే పోయినట్లే పోయి తిరిగి మాదిగ పల్లెకి వచ్చి మర్రిచెట్టు కింద పడుకొన్నాడు.
ఎవరో సిలారు సాయిబును మాదిగోళ్ళ దేవుడు అని కూడా అన్నారు. దేవుడు స్వర్గంలో ఉంటాడని నమ్మే జనం బతుకున్న మనిషిని, పల్లెలో ఉన్న మనిషిని, దేవుడనుకొన్నా పూజించలేదు. మొక్కులను, కానుకలివ్వలేదు.
సిలారు సాయిబు కూడా ఏమీ కోరడు, అడగడు. ఎప్పుడూ అల్లల్లల్లా అంటాడు. దేవుణ్ణి తలచు కొంటున్నాడని సాయిబులు, కుక్కల్ని పిలుస్తున్నాడని మాదిగలు భావిస్తుంటారు.
ఒకరోజు కానుపు కష్టమయితే పేగడ్డం పడిందని మంత్రసాని చేతులెత్తేసింది. గుంటూరు పోయే రైలు వస్తే పెద్దాసుపత్రికి తీసుకుపోవాలని చూస్తున్నారు. అంత దాకా ఆగలేమని తల్లీబిడ్డల ప్రాణానికి ముప్పని అందరూ ఆరాటపడుతున్నారు.
ఎందుకొచ్చాడో సిలారు సాయిబు ఇంట్లో చొరబడ్డాడు. లబలబలాడుతున్న అటు ఆడోళ్ళనటు, ఇటు ఆడోళ్ళనిటు తోసేసి, నేల మీద అరుస్తూ పడి ఉన్న నిండు చూలాలు పొట్ట మీద చీర తీసి పొట్టంతా నిమిరాడు.
అంత బాధలోనూ సిలారు సాయిబు మగవాడని, తాను ఆడమనిషి అని గుర్తించిన గర్భవతి చీరె సర్దుకుంది.
సిలారు సాయిబు చేయి పూర్తిగా చాచి చెళ్ళున ఆమె చెంప మీద కొట్టాడు. బళ్ళున పొట్ట పగిలింది. కెవ్వుమని అరిచింది ఆ చూలాలు. కెవ్వుమన్నాడు పుట్టి నోడు.
మంత్రసానితో సహా అందరూ ఆడికాళ్ళ మీద పడ్డారు. ఆడక్కడలేడు. ఎగిరి పోయాడో ఎక్కడ అంగలు పంగల నడకలు నడుస్తున్నాడో.
అంతవరకు దేవుడిలాంటోడు అనుకొనే వాళ్ళు ఆ రోజు నుంచి దేవుడనుకో సాగారు.
పూజలొక్కటి తక్కువ గాని, ఆడవాళ్ళందరూ దండం పెట్టసాగారు. వాళ్ళ మొగుళ్ళు మొక్కుకోసాగారు. వాళ్ళను చూచి పిల్లలు దండం పెడుతున్నారు.
సిలారు సాయిబుకు తన తిరుగుడు తనదే. తన నిద్ర తనదే. తన నమాజు తనదే. తనకింకేం తెలియదు.
చెరువుగట్టుకు పోయి వస్తూ “దీనికే వంటా?” అన్నాడు పెడసరపోడు.
'గర్భవతి కావటం కారణం, కొడుకు పుట్టడం కార్యం' అన్నాడు పంతులు.
'కాదు సిలారు సాయిబు కొట్టడం కారణం, కొడుకు పుట్టడం కార్యం' అన్నాడు పెడసరపోడు.
'తాటిపండు మగ్గింది. అది కింద పడాలి. అప్పుడు కాకి వాలింది. కాయ పడింది. కాకి వాలకపోయినా కాయ పడేది.
ఆమెకు నెలలు నిండాయి. కొడుకు పుట్టేవాడే. సిలారు సాయిబు కొట్టాడు. వీడు కొట్టకపోయినా వాడు పుట్టేవాడే'
'మంత్రసాని తనవల్ల కాదంది కదా
'లేడీ డాక్టరయితే అనదు'
వీళ్ళ కారణ కార్య సంబంధం ఎలా ఉన్నా పల్లెజనం అంతా సిలారు సాయిబును దేవుడనసాగారు.
ఇలా ఉన్నప్పుడు నాగడి పెళ్ళాం పుట్టింటికి పోయింది. ఆమె రాలేదు. వీడు పోయి పిలిస్తే వస్తాను పొమ్మంది కానీ రాలేదు.
తేపతేపకు వాడు పోతుంటే 'మళ్ళీ మళ్ళీ రావద్దు. నేను మీ ఊరు రాను' అంది.
బ్రతిమాలాడు. బామాడాడు.
ఛీకొట్టింది. చీదరించుకొంది.
'దొంగ తిళ్ళు మరిగిన గొడ్డును ఎవరు మల్లేయగలరు' అన్నారు పల్లెలోని మగాళ్ళలో కొందరు.
'మగతనం లేని నాగడితో ఏ ఆడది కాపరం చేసుద్ది' అన్నారు ఆడవాళ్ళు.
తాను మగతనం లేనివాణ్ని కానని, భార్య మంచిదే అని నాగడి నమ్మకం.
ఏం జరిగిందో ఏమో కాపరం చెడింది.
అది రాదు. ఈడుదాన్ని వదలడు. దానికి వీడు అక్కరలేదు. వీడికి అదే దిక్కు.
"ఏందీ చిక్కు' అన్నాడు పెడసరపోడు పంతులుతో
'ఈడు మొగాడే. అది ఆడదే. కానీ ఈడికి తేలుమంత్రం తెలిసినట్టు లేదు' అన్నాడు పంతులు. '
"తేలుమంత్రం అంటే"
"నీకు పెళ్ళయ్యాక తెలుసుద్ది."
తన పెళ్ళాం తన దగ్గరకు రావాలంటే సిలారు సాయిబే గతి అని నాగడు భావించాడు. కొట్టటమో, తిట్టటమో కావాలి. నాగడికి ప్రసాదించాలి. ఆ దెబ్బకు తన భార్య కాపరానికి రావాలని సిలారు సాయిబును దూషించాడు. వాడు విన లేదు. వీడు నెట్టాడు. తిరిగి వాడు నెట్టలేదు. వీడు తిట్టాడు. మళ్ళీ వాడు తిట్ట లేదు. నాగడు కొట్టాడు. సిలారు సాయిబు నవ్వాడు.
చూస్తూ ఉన్న పల్లెవాళ్ళు 'నాగడికి ఏదో మూడింది' అనుకొన్నారు.
పెద్ద మాదిగ నాగజ్జి మందలించాడు. 'తప్పు' అని పంపించాడు.
సిలారు సాయిబు చాలాసేపు నవ్వాడు. వాడంతగా నవ్వటం ఎవరూ చూడలేదు. 'వాడి నవ్వు వీడికి కీడు' అనుకొన్నారు.
నాగడి పెళ్ళాం తెగతెంపులు చేసుకుంది. 'నీతో నాకు చెల్లు. ఇక ఏ సంబంధం లేదు' అని పదిమంది పెద్దల ముందు వాగ్దానాలు చేశారు. పెళ్ళి రద్దయింది. ఉన్నూరు పిల్లోడితోనే ఆమెకు పెళ్ళయింది.
నాగడు భార్య కోసం కొంతకాలం ఏడ్చి గంజి కాచే మనిషి లేక మళ్ళీ పెళ్ళికుందామనుకున్నాడు.
తనకు ఈడైన వరసైన పిల్లలు ఊళ్ళలేరు. పొరుగూ లో సంబంధాలు కుదరలేదు. ఊళ్ళోనే ఉన్న మొగుడు సచ్చిన విధవరాలిని పెళ్ళి చేసుకుందామని చూస్తే 'గట్టిదనం లేనోణ్ణి నేనేం చేసుకొంటా'నంది.
రెండేళ్ళకు రైలు కిందపడి నాగడు చనిపోయాడు. అప్పటి నుంచి సిలారు సాయిబును స్త్రీలు పురుషులు పిల్లా పీచూ మొక్క సాగారు. మొక్కులు వీడికి...