వాళ్లలో ఎక్కువమంది నెల్లూరు జిల్లా లో పని చేసిన , చేస్తున్న ఉపాధ్యాయులు.
హాల్లో అంతా పండగ వాతావరణం.
ఇంతమంది ఉపాధ్యాయులు ఒక ప్రజా నాయకుడి సన్మానానికి రావడం బహుశా జిల్లా చరిత్ర లోనే మొదటి సారి అయివుండవచ్చు.
ఆ రోజు, మేమంతా 'మా రెడ్డి గారు' అని, ప్రేమగా పిల్చుకునే భక్త వత్సల రెడ్డి గారి షష్టి పూర్తి మహోత్సవం.
ఇంకా సమావేశం ప్రారంభం కావడానికి ఇరవై నిముషాలుంది. నేను స్టేజి కిందనే నిల్చుని వున్నాను.
ఈ లోపల మా రాజయ్య హడావుడి గా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి, సారూ! , సారూ! అంటూ వచ్చాడు.
రాజయ్య వెనక ఒక ముప్ఫయి ఏళ్ల వ్యక్తి నిలబడి వున్నాడు. ఎక్కడో చూసిన మొహమే, కానీ ఎవరో జ్ఞాపకం రాలేదు .
ఈయనా, అన్నాను ప్రశ్నార్థకంగా!
మా రాజయ్య అందుకోని, గుర్తుకు రాలేదా మీకింకా ! ఈ అబ్బాయి మన రాతల అయ్యోరి కొడుకు. నిన్న మా వాళ్ళ పెళ్ళిలో కనపడి, మీరెక్కడున్నారని అడుగుతుంటే చెప్పాను, ఇక్కడొచ్చి కలవొచ్చని అని.
అతన్ని కొంచెం పరిశీలనగా చూస్తే , అనిపించింది నిజమే ఇరవై ఏళ్ల క్రితం చివరి సారి చూసాను అతన్ని.
చాలా మారిపోయావు. అమ్మ ఎలావుందీ ! అడిగాన్నేను.
నాకు చేతులు జోడించి చెప్పాడతను, హైదరాబాద్ - DRDO లో పని చేస్తున్నానండి.
ఇన్ని రోజులూ మిమ్మల్ని కలవడం కుదర్లేదు. రాజయ్య సారు చెప్తే, ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని కలిసి పోదామని.అమ్మ కూడా అక్కడే, నా దగ్గర వుంది.
కంటిన్యూ చేస్తూ చెప్పాడు, మీరు అప్పట్లో మమ్మల్ని ఆదుకున్నది, నేను జీవితంలో మర్చిపోలేను అని.
ముందు వరసలో కూర్చుని వున్న మా రెడ్డి గారి వైపు చూస్తూ అనుకున్నా, గుర్తు పెట్టుకోవలసింది నన్ను కాదు అని.
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం విషయం, నేను చింతారెడ్డి పాలెం స్కూల్ హెడ్ మాస్టర్ గా చేరి అప్పటికి ఓ రెండేళ్లు అయ్యుంటుందేమో.
ఒక రోజు, మా జీతాల చెక్ తీసుకుందామని, మా పంచాయతీ సమితి ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ పెద్ద గుమస్తా వచ్చి చెప్పాడు ప్రెసిడెంటు గారు మిమ్మల్ని కలవాలంటున్నారని చెప్పి.
ప్రెసిడెంటు గారు అంటే మా భక్తవత్సల రెడ్డి గారు. ఇందుకూరి పేట పంచాయతి సమితి ప్రెసిడెంటు. మా స్కూల్ , ఆ పంచాయతీ సమితి కింద వచ్చే ముప్ఫయి స్కూళ్లలో ఒకటి.
మేము ఏదన్నా పనులు ఉంటే ఆయన్ని కలవడమే కానీ. మమ్మల్ని ఆయన రూమ్ లోకి రమ్మని పిలిపించడం చాలా అరుదు.
ఎవయ్యుంటుందా అని ఆలోచిస్తూనే లోపలి వెళ్ళాను.
ఏం అయ్యోరా ! ఎట్టుంది మన స్కూలు ? అడిగారాయన.
అంతా బానే వుంది, సార్ చెప్పాన్నేను.
నువ్వు వున్నావ్ గా ఆడ! అంతా బానే ఉంటది లే, అడగబల్లే అన్నారాయన.
విషయానికి వస్తూ, చెప్పారు.
రేపు మన బడికి ఓ కొత్త అయ్యోరు వస్తాడు . నువ్వు జాగర్త గా చూస్కోవాలి. నేనే ఆలోచించి నీ దగ్గర అయితే బావుంటాడని ఆర్డర్ ఇప్పిచ్చా మా అయ్యోరికి, అన్నారాయన.
ఆయన రూమ్ లోకి తనే పిలవడం ఓ వింత అయితే , ఇట్టా టీచర్ల గురించి జాగర్తలు చెప్పడం ఇంకో వింత.
టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యిపొయ్యి కొత్త టీచర్లు జాయిన్ కావడమనేది చాలా సాధారణ విషయం.
నేను హెడ్ మాస్టర్ గా వచ్చిన ఆ రెండేళ్లలో, మా స్టాఫ్ గురించి ఆయన కలగజేసుకోడం ఇదే మొదటి సారి.
ఆ ఆశ్చర్యాన్ని పైకి ప్రకటించకుండా తలూపాను, అట్టానే సార్ అంటూ.
చెప్పారు మా రెడ్డి గారు ,
ఏదన్నా ఆయన గురించి ఇబ్బంది వొస్తే నాతో చెప్పు.
పరిషత్తు ఆఫీస్ లో మీటింగ్ కి పోవాలా అంటూ కుర్చీ లోంచి లేస్తూ.
పక్కరోజు పొద్దున్న ఆఫీస్ రూంలో కూర్చుని కిటికీ లోంచి బయటకి చూస్తుంటే,ఓ పన్నెండు పదమూడేళ్ళు వుంటాయేమో. ఒక పిల్లవాడు, ఓ యాభై ఏళ్ల మనిషిని, సైకిల్ వెనకాల కూర్చో పెట్టుకుని తోసుకుంటూ , మా స్కూల్ ఆవరణ లోకి ప్రవేశించాడు.
నేను రూమ్ నించి బయటకొచ్చాను. ఆ పెద్దాయన చిన్నగా సైకిల్ దిగి , ఆ పిల్లవాడి దగ్గరున్న చేతి కర్ర, తన చేతిలోకి తీస్కొని, నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు.
నా దగ్గరకొచ్చి ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కానీ, మాట స్పష్టం గా రావట్లేదు.
ఆయన నోరు ఒక పక్కకి తిరిగి పొయ్యి వుంది. ఎడమ చెయ్యి, ఎడం కాలు కూడా, పూర్తిగా స్వాధీనం లో ఉన్నట్టు లేదు.
This podcast uses the following third-party services for analysis: