Artwork for podcast Harshaneeyam
'ఆర్వీ చారి కరెంటు బిల్లు ' ! - పతంజలి శాస్త్రి గారి కథ
Episode 13320th December 2020 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:31:51

Share Episode

Shownotes

ఆర్వీ చారి కరెంటు బిల్లు అనే ఈ కథ, శాస్త్రి గారి 'నలుపెఱుపు' అనే కథా సంకలనం లోనిది.

కథ చివరన మిత్రులు, నండూరి రాజగోపాల్ గారు , కథపై వారి అభిప్రాయాన్ని తెలియజెయ్యడం జరుగుతుంది.

శాస్త్రి గారి రచనా ప్రక్రియ, రచనా జీవితం గురించి , హర్షణీయంలో ప్రసారమైన ఎపిసోడ్స్ లింకులు ఇదే పేజీ లో కింద ఇవ్వడం జరిగింది.

ఆర్వీచారి కరెంటు బిల్లు:

లిఫ్ట్ మూసుకోబోతూండగా రజనీదేశ్ పాండే ఒక్క గెంతులో లోపలికి దూకింది. చారి నవ్వేడు.

“కనీసం మూడు నిముషాలు ఆదా అయ్యేయి" అందామె.

“లేదా నీ ముక్కు బద్దలయ్యేది. ఏది నయమో నీకే తెలియాలి" అన్నాడతను.

అప్పటికే లిఫ్టు గాజు బుడగలో ఆమె డియో కమ్మగా కమ్ముకుంది.

“వెరీ నైస్. కొన్నావా, బాయ్ ఫ్రెండ్ చేత కొనిపించావా?" అన్నాడు మళ్లీ.

లిఫ్ట్ పదో అంతస్తు దగ్గర మెత్తగా ఆగి తెరుచుకుంది.

బయటికి వెళ్తూ “నెక్స్ట్ టైమ్ యువర్ టర్న్” అంది రజని.

లిఫ్ట్ లోంచి అతనికి వరండాలో అలలా వెళ్తున్న రజనీ వంపు తిరిగి మాయమైంది.

మిగిలిపోయిన డియో పీల్చుకుని ఆర్వీ పధ్నాలుగో అంతస్తులో దిగేడు. పదకొండు దాటిం తరవాత ఎప్పుడో సిస్టం ముందు నుంచి లేచి ఒళ్లు విరుచుకుని కిటికీ దగ్గిరికి కుర్చీ లాక్కుని కిందికి చూశాడతను..

వంద ఎకరాలు మెత్తని పచ్చికలో లేత కనకాంబరం రంగులో ఇరవై అంతస్తుల పాలరాయి చెట్టు.

దాన్లో పదిహేను గూళ్లు తొలిచేరు

ఎరుపు, పసుపు పచ్చ పూలచెట్లు ఎండలో మెరుస్తున్నాయి.

రాత్రి రాల్చిన రంగుపూలన్నీ కొంగుపరుచుకున్నట్టు అలాగే ఉండిపోయాయి.

లోపల చల్లగా, చల్లదనంతో కలిసిన చిన్న పరిమళంతో సహా హాయిగా ఉంది.

బయట ఎంత వెలుతురుందో లోపలా అంతే.

గోడలకి, సీలింగుకీ అతుక్కున్న దీపాలు తెల్లగా మెరుస్తున్నాయి.

బుగ్గల్లాంటి నున్నటి నీలపు ఒట్టి నేల మీద భోజనం చేసినా ఫరవాలేదు.

చారి వారానికి రెండు మూడుసార్లు కిటికీ పక్కన కూచుని ఇదే దృశ్యాన్ని చూస్తూంటాడు.

పధ్నాలుగో అంతస్తులో అతని ఉన్నతీ, చుట్టూరా పరుచుకున్న ఖరీదైన చక్కదనం, లోపల చల్లటి భద్రత చారికి సంతృప్తికరంగా వుంటుంది.

ఆర్వీ చారి ఈ ఏడాది రెండోసారి కాలిఫోర్నియా వెళ్లాచ్చి పది రోజులు కూడా కాలేదు.

విమానం దిగి ఇంటికి కూడా వెళ్లలేదతను.

లోపలికి రాగానే జీఎం గారు పిలిపించి అతని భుజం పిండి, కంపెనీ ఆనందాన్ని అతనితో పంచుకున్నాడు.

చారి వెంట ఆయన గదిలోకి ఒక డాలర్ ప్రవాహం రావడం చూశాడాయన.

ఇద్దరి మొఖాలూ ఇంకా ఎవరూ ముట్టుకోని కొత్త వందడాలర్ల నోటులా మెరిసిపోయాయి.

గంట తరవాత కంపెనీ కార్లో ఇంటికి చేరేడతను.

లోపలికెళ్లి కూచోగానే జ్యోతి ఫోన్ చేసింది.

ఫ్రిజ్లో అన్నీ ఉన్నాయి.

సాయంకాలం వరకూ రాలేనంది.

"ఓకే. లవ్". అన్నాడు చారి.

సాయంకాలం ఆరు దాటింతరవాత జ్యోతి కాలింగ్ బెల్ నొక్కే వరకూ నిద్రపోయాడు చారి.

నీలపు డబ్బాలోంచి చల్లటి బీరు గుటక వేస్తూ ప్రాజెక్టు గురించి చెప్పేడతను.

సంతోషం వెచ్చటి వెలుతురు వలయంలా వాళ్లిద్దరి చుట్టూ పరుచుకుంది.

*************

ఫోన్ మోగింది. సున్నితంగా స్పష్టమైన గలగల.

ఫోను మాట్లాడి కూచోగానే ఆలీ లోపలి కొచ్చేడు.

“ఏరా?"

జేబులో చెయి పట్టి కరెంటు బిల్లు రసీదూ, మిగిలిన రెండు వందల ఎనభై రూపాయలూ టేబిలు మీద పెట్టేడు ఆలీ.

రసీదు చూశాడు చారి.

“ఓ. కరెంటు బిల్లా? థేంక్స్. ఇదో.” ఏభై రూపాయల నోటు తీసి ఇచ్చేడతను.

“ఈ సేవలో కట్నా సార్.”

“ఓకే. థేంక్స్."

ఆలీ సందేహిస్తూ నిలబడి పోయాడు.

ఫైల్లోంచి అతని వేపు చూసి అన్నాడు చారి

“ఏమనుకోకండి సార్. బిల్లు చూసిన్రాసార్ మీరు?”

"ఆ. చూడకుండా పైసలెలా ఇస్తాను?”

“అవుసార్. గిట్లనే బిల్లు నాలుగు దఫాలు ఇచ్చినారు సార్. మీరు చూస్తలేరు సార్. ఆడిస్తనే ఉన్నాడు. మీరు జమజేస్తనే ఉన్నారు సార్. చానా ఎక్కువ సార్." |

కొన్ని క్షణాల వరకూ ఆలీ ఏవంటున్నాడో అర్థం కాలేదు చారికి.

చివరికి లోపలికి దిగిం తరవాత అన్నాడు. “అదా? ఇంట్లో ఉండం గదా. అంతకు ముందు నెలదే వేస్తున్నాడేమో."

"అట్లయిత లేదుసార్. చానా ఎక్కువ బిల్లు సార్. మీరు అడగండ్రి సారూ, ఎన్ని పైసలిస్తరు సార్."

అప్పుడతని వేపు చూశాడు చారి.

ఆలీ పెదాలు వంపు తిరిగున్నాయి.

అతని కళ్లలో నల్లటి నింద అతనికి తెలీకుండానే కళ్ల నిండా పరుచుకుని ఉంది. అతని కళ్లలోకి చూడ్డం ఇబ్బందిగా ఉంది.

ఆలీ చూపులు వీపు మీద సూదుల్లా గుచ్చుకున్నాయి.

చారి మనసులో ఉక్కపోసినట్టుయింది.

ఫైలు చూస్తూ "ఓకే" అన్నాడతను.

ఆలీ వెళ్లబోతూ చిన్న నవ్వుతో అన్నాడు. “అయన్ని నాకు మూడు నెల్ల జీతం లెక్క సౌర్."

తల అడ్డంగా ఊపుతూ ఆలీ వెళ్లిపోయాడు.

సూది బాగా లోపలికి దిగిపోయింది. చిల్లర నోట్లు పర్సులో పెట్టుకుంటూ బిల్లుల వేపు చూసాడతను.

దానికీ, మీటరుకీ, డబ్బుకీ సంబంధం అతనెప్పుడూ ఆలోచించలేదు.

ఎంతయిందో చూసి ఆలీకి డబ్బులిచ్చి మర్చిపోవడం చారికి అలవాటుగా వస్తోంది. ఇప్పుడు బిల్లు చూస్తుంటే అతనికి ఆశ్చర్యంగానే ఉంది. కాసేపు దానివేపే చూస్తూండిపోయాడు.

మనసులో ఉక్క ఎక్కువగానే ఉంది. మళ్లీ ఫోను మోగింది. ఈసారి ఫోను చెవిలో గలగల మన్నట్టుంది.

సాయంకాలం వరకూ చారికి జారిపడ్డానిక్కూడా తీరిక దొరకలేదు.

సాయంత్రం తన లేత అరిటాకు పచ్చ కారెక్కుతూండగా పక్కనుంచి వెళ్తూ అలీ సలాం కొట్టేడు.

ఇంటి కెళ్తూ, కారాపినప్పుడల్లా జేబులో చెయ్యి పెట్టి బిల్లు తడుముకున్నాడు చారి.

కడుపులో ఏవీ బాగా లేనట్టనిపించింది.

"టీ ఇవ్వనా?" అంది జ్యోతి.

తల ఊపేడతను.

పేంటులోంచి చొక్కా బయటికి లాగి, విప్పి పక్కన పడేశాడు.

టీ తెచ్చి ఇచ్చిందామె.

ఓ గుక్క మింగి కప్పు టీపాయ్ గ్లాసు మీద పెట్టి చొక్కా జేబులోంచి బిల్లు తీసి ఆమెకిచ్చేడతను.

"ఏంటిది? ఓ. కరెంటు బిల్లు. కట్టేడా ఆలీ?”

“కట్టేడు. జ్యోతి బిల్లు చూశావా?"

“బిల్లే వుంది సార్ చూడ్డానికి?"

బిల్లు తన చేతిలోకి తీసుకుని చూస్తూ అన్నాడు చారి.

“మనిద్దరం చూడ్డం లేదు. మూడు నాలుగు నెలల్నించి చాలా ఎక్కవ బిల్లు పడుతోంది. మనకి అందులో సగం కూడా అవదు."

అతని కనుబొమ్మల మధ్య చిరాకు మడతపడ్డం చూసిందామె. అతని వేపే చూస్తూ ఏవీ అనలేదామె.

"వాడు గమనించి చెప్పేడు. ఇటీజ్ ఎ లాటాఫ్ మనీ, నేనూ చూడలేదు.”

"అవును.

అంటే, మామూలుగా చూడంకదండీ.

ఏ బిల్లు వచ్చినా మనీ ఎంతో చూసి మీరో నేనే ఇస్తాంగదా. బహుశా ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. పోనీ ఓసారి కంప్లయింటు చేసి చూడండి.”

తల ఊపేడతను. కానీ లోపలి ఉక్క , ఫేను గాలికి శాంతించడం లేదు.

“ఒకే. పాత బిల్సున్నాయేమో చూడోసారి." 

అతనివేపోసారి చూసి లేచి వెళ్లిందామె. టేబిలు సొరుగులో ఏవీ లేవు. కానీ సీడీల పెట్టె కింద నాలుగు విడి వందరూపాయలు దొరికేయి.

"లేవు. డబ్బులు దొరికేయి." అందామె. ఆలీ సూది పొడుగు పెరిగింది మరీ లోపలికి.

"బిల్సు లేవా? మనం ఉంచడం లేదా?" చారి ముఖం కొద్దిగా ఎర్రబారడం గమనించిందామె.

"ఎక్కడో పెట్టినా పట్టించుకోంగదా. పేమెంటు అవగానే పడేస్తూంటాం. పైగా వాటి అవసరం ఎప్పుడూ రాలేదు. ఒక్క టాక్సు కాయితాల్నే పైల్ చేస్తాను.

ఏంటి అలా ఉన్నారు? ఏవైంది?"

టీ తాగి కప్పు టేబిలు మీద పెట్టేసి దరిదాపు మామూలుగా అన్నాడు చారి. "ఏం లేదు. తెలుసుకోవాలనిపించింది. అంతే."

"వెళ్లి స్నానం చేసి రండి. బాగా అలసిపోయినట్టున్నారు. డోంట్ వర్రీ..."

చారి స్నానం చేసి వచ్చి ఉదయం వదిలేసిన పేపరు వార్తలు చూస్తున్నాడు. పేపర్నిండా దుర్భిక్షం పరుచుకుని ఉంది. నీటి మేఘాలన్నీ చుట్టచుట్టుకుని హిమాలయ సానువులకి వెళ్లిపోయాయి. ఆకాశం భగ్గున మండుతోంది. వేసవి డేగ మళ్లీ రెక్కలు పరుచుకుంటోంది.

రెండోది ఆర్థికమాంద్యం. మెన్నటి ఉల్లి దోశలాగ.

ఆర్థికమంత్రి చక్కటి చిరునవ్వు కలిపిన ఇంగ్లీషులో సొరంగం చివర సూర్యుడు కూచున్నాడనీ, భయం లేదని చెప్తున్నాడు.

కథకి అవసరం అనుకుంటే తప్పకుండా బికినీ వేసుకుంటానంటోంది. పెద్ద తార. పేపర పక్కన పడేసి టీ.వీ. తెరిచాడు చారి.

పంజాబీ డ్రెస్ వేసుకుని పక్కనే వచ్చి కూచుంది జ్యోతి. డ్రెస్ వేపు చూస్తూ ఏవి టన్నట్టు చూశాడతను.

“చెప్తాగా" అంది జ్యోతి.

న్యూస్ రీడర్ ఎర్రటి చక్కటి పెదాలు రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాల్ని చుక్క వర్షం పడని తెలంగాణా ప్రాంతాల్నీ చప్పరిస్తున్నాయి. తెరమీద పొలాలు విచ్చిపోయాయి.

లావుపాటి ఎమ్మెల్యే మరో అయిదు మండలాల్ని కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తించాలంటున్నాడు.

హైద్రాబాద్లో రిలయన్స్ మాల్. వెలుగు దీవి.

చేతుల్లో ప్లాస్టిక్ సంచులతో, పక్కనే పిల్లలతో మెరుస్తూ బయటికి వస్తున్నారు. లోపల చక్రాల బళ్లలో చిన్న పిల్లల్ని సరుకుల్నీ హాల్లో వరసల మధ్య తిప్పుతున్నారు.

పెద్ద పెద్ద ఏనుగులు, ఎలుగులూ, జీరాఫీలూ వాటి కళేబరాల్లా ప్లాస్టిక్ సంచుల్లో నిలబడి చూస్తున్నాయి.

కూరల దగ్గిర హడావుడిగా ఉంది. తెలుపు నీలం ప్లాస్టిక్ కవర్లలో అల్లాగే ఉన్న అమ్మాయి నాలుగు చేతులతో కూరగాయలందిస్తోంది.

చటుక్కున కెమేరా ఎక్కడో కూరలబళ్ల దగ్గరికి వెళ్లింది.

ప్లాస్టికబుట్టల్లో కూరగాయల్ని చుట్టుముట్టి ఉన్నారు. మహిళలు. బళ్లకింద కేబేజీ చర్మాలు, వంకాయలు, చితికిన టమాటోలు పడి ఉన్నాయి. బెండకాయలు చివరిభాగం విరస్తుంటే ఒప్పుకోడం లేదు. కూరలవాడు.

చేతిలో కూరల సంచీతో ఒకామె కెమేరాలోకి వచ్చింది.

వరసకీ ఆమె కూరగాయల ధరలు ఏకరువు పెట్టింది.ధరలు ఇలాగే ఉంటే సామాన్యలందరూ గడ్డి కొనుక్కొని వండుకోక తప్పదంటోంది. రెండో పూట తినే అవకాశం లేదనీ పిల్లలకి పెట్టి మంచినీళ్లు తాగి పడుకునే రోజు వస్తుందని చెప్పి వెళ్లిపోయిందామె. రెండుచేతులతో , వీలయితే నాలుగు చేతుల్తో లంచాలు తింటే తప్ప బతకలేని పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారన్నాడు ఒక ఉద్యోగి.

సూది తీవ్రంగా పనిచేస్తోంది.

**************

నాన్న కడుపు అలారంలా పనిచేసేది. ఓ కంట్లో భూతద్దం పెట్టుకుని బంగారప్పని చేస్తున్నా పదకొండు అయేసరికి ఓ గావుకేక పెట్టేవాడు సుబ్బాచారి.

అన్నం కూరా అన్నీ వేడిగా ఉంటేనే తినేవాడతను.

మొత్తానికి వారానికి మూడు రోజులైనా పెరట్లో కూరలూ ఆకు కూరలు తెంపి వండేది అమ్మ.

సుబ్బాచారికి రాబడి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంచి పేరుండేది. ("పోయి చదూకో ఎధవా. దీని జోలికి రామాక.")

కంచుగ్లాసు నిండా అపుపడప్పుడు సగ్గు బియ్యపు పరమాన్నం పెట్టేది అమ్మ,

చారి నోరు తియ్యబడింది. తను ఇంజనీరవడం చూళ్లేదామె. ఓసారి శలవలకి ఒచ్చినప్పుడు అమ్మకేవీ బాగాలేదని చెప్పేడు నాన్న.

ఓరాత్రి తన పాయసం తాగే గ్లాసు లోంచి ఏదో గుటక వేస్తూ చటుక్కున అన్నాడాయన.

“బాగా బలంగా ఉండే ఆహారం రెండుపూట్లా పెడితే లేచి బాగా తిరుగుద్దంట."

అమె లేచి తిరగలేదు.

*************

"మీరు న్యూస్ చూస్తున్నారా?" అంది జ్యోతి.

ఉలిక్కిపడ్డా డతను.

"ఏం చేశావీపూట?"

"అదే చెప్తానన్నాను. ఏం చెయ్యలే. బయటికి పోదాం. ఆకలిగా ఉందా?"

"లేదు. కాసేపాగి వెళ్లాం. ఎక్కడికిట?”

“ఊ. చైనీస్".

'రైట్. ఎటొచ్చీ దూరం.”

"నే డ్రైవ్ చేస్తాలే."

"న్యూస్ చూశారా?"

ఇబ్బందిగా నవ్వేడు చారి. కూరలధరలు అమ్మని గుర్తు చేశాయి. ఆవిడెవరో అన్నట్టు అమ్మ గడ్డి కూర చేసినా అమృతంలా ఉంటుంది.

“పదండి."

"ఏం?"

"మీరేదో ఆలోచిస్తున్నారు. డ్రైవింగులో మర్చిపోతారు. చల్."

బట్టలు మార్చుకుని పర్సు జేబులో పడేసుకుని ఇద్దరూ బయటపడ్డారు.

కార్ల,ఆటోల ఎదురు ప్రవాహాన్ని చీల్చుకుంటూ చైనీస్ రెస్టారెంట్ చేరడానికి నలభై అయిదు నిముషాలు పట్టింది.

లోపల చల్లగా ఉన్నా ఇద్దరూ చల్లబడ్డానికి పది నిముషాలు పట్టింది.

తన కిష్టమైనవి వెంటనే ఆర్డర్ చేసింది జ్యోతి. చారి మెన్యూ కార్డు తెరిచాడు. సూపు దగిర్నించీ అనుకోకుండా ఎదురుగుండా ఎర్రటి అంకెల్లో మెరుస్తున్న ధరలు చూస్తున్నాడతను. ఎప్పుడూ ధరలు చూడ్డం అలవాటు లేదతనికి.

"ఏదో ఒకటి చెప్పండి."

ముందు సూప్ చెప్పి మళ్లీ ఆలీలా ధరల పట్టా వేపు కళ్లు పెద్దవి చేసి చూస్తూండి పోయాడు.

ఆమె ఆర్డర్ చేసిన పదార్థాల వేపు చూశాడతను. అంకెలు ఎర్రగా తళుక్కుమన్నాయి.

అలాగే మెన్యూ తిరగేస్తూ వెనక్కి వాలేడు చారి. ఆలీ సూది కలుక్కుమంది.

“మెన్యూ బట్టీపడుతున్నారా?"

"లేదు. ఇక్కడ ముగ్గురున్న ఫేమిలీ భోజనం చేస్తే ఎంతవుతుంది?' అతనివేపు చిత్రంగా చూసిందామె.

అతనే అన్నాడు. "ఒక పూట భోజనం చాలామంది నెల జీతం అంత అవుతుంది".

ఆమె అలాగే అతని వేపు చూసింది.

మళ్లీ కార్డు చూస్తున్నాడతను.

"సరే. ఆర్డర్ కెన్సిల్ చెయ్యండి వెళ్లిపోదాం."

చటుక్కున తలెత్తి చూశాడతను. "సారీ."

ఆమె మెన్యూ తీసుకుని దూరంగా పెడుతూ అంది. "అందరి ఆదాయం ఖర్చూ ఒకలా ఉండవు."

కానీ రాత్రి పడుకోబోతూ అనుకున్నాడు చారి. పెట్రోలు ఖర్చు, భోజనం ఖర్చుతో ఆలి నెల పైగా బతగ్గలడేమో. 

బిల్లు ఆలీకి తెలిస్తేనో? ఆలీ జీతం ఎంత ఉంటుంది? కళ్లు మూసుకున్నాడు చారి.

ఎవరో భుజం తడుతున్నారు. "సార్. సార్." ఆలీ గొంతు.

గుర్తు పట్టగానే చటుక్కున మెళకువ వచ్చింది. చారికి.

చిన్న నీలం బల్పు కాంతి. జ్యోతి అటు తిరిగి నిద్రపోతోంది. పడగ్గది నీలంగా ఖాళీగా ఉంది.

మళ్లీ ఎప్పుడోగాని నిద్రపట్టలేదతనికి. ఏడు దాటిం తరవాత ఏదో మెత్తటి చెయ్యి బుగ్గమీద పడింది. బరువుగా కళ్ల తెరిచాడు చారి.

"ఏడు దాటిపోయింది. సారీ." కాఫీ తాగుతూ గబ గబ పేపరు పేజీలు తిప్పుతూండగా కాలింగ్ బెల్ మోగింది.

లేచి తలుపు తియ్యగానే "నేనే సార్. అంటూ లోపలికి వచ్చేడు కిషన్.

వంటింట్లోంచి వచ్చింది జ్యోతి.

"నేనమ్మా. ఏం గావాల?" ఫ్రిజ్ తులుపు తీసి చూసి నాలుగు కూరలు చదివిందామె.

ఆమె అందించిన బుట్ట తీసుకుని వెళ్లిపోయాడు కిషన్.

చారి కాఫీ తాగి పేపరు తిరగేసే లోపల కూరలతో వచ్చాడు. కిషన్.

వంటింట్లో బుట్ట పెట్టి వచ్చి గుమ్మం ఇవతలే చిరునవ్వుతో నిలబడ్డాడతను.

చారికి అర్థం అయింది. "నెలయిందా అప్పుడే?" అన్నాడతను.

“మీరు లేరు గద సార్. అమ్మగార్ని అడగలేదండి. నెలదాటిపోయింది." అంటూ జేబులోంచి చిన్న పుస్తకం తీసి ఎంతయిందో చెప్పాడు.

డబ్బులిచ్చి పంపేసి సోఫాలో కూలబడిపోయాడు చారి.

"లేవండి. అలా కూచుండిపోయారేం?"

"చాలా అయినట్టుంది జ్యోతి"

"కూరలా? అలాగే ఉన్నాయి" అని వెళ్లిపోయిందామె.

చారికి పచ్చి కాకరకాయ నములున్నట్టుంది.

లేచి లోపలి కెళ్లి బుట్టలో కూరగాయలు చూస్తూ, "ఈ చిక్కుడ కాయలెంత?"

"ఏమో. వాడు ఎక్కువ చెప్పడండి."

"తూకం సరిగ్గా ఉంటుందా?" గుప్పిటనిండా చిక్కుళ్లు తీసుకున్నాడతను.

"ఆ. ఎన్నాళ్లనుంచో ఇస్తున్నాడు, గదండి. మీరు స్నానం చేసి రండి." కేబేజీ ముక్క చేతిలోకి తీసుకుని చూసాడు చారి. పేపరు వెయిటంత ఉంది.

కారు పార్కు చేసి మెట్లెక్కబోతూండగా “గుడ్ మానింగ్ సార్' అన్నాడు అలీ.

వెనక్కి తిరిగి చూశాడు చారి.

చేతిలో పనుప్పచ్చ గుడ్డతో నవ్వుతూ నుంచున్నాడు ఆలీ.

క్షణం అతన్ని చూసి తల ఊపి వెళ్లిపోయాడు చారి.

ఆలీ సూది అలాగే ఉండిపోయింది.

అప్రయత్నంగా అతని కనుబొమలు ముడిపడ్డాయి.

తరవాత చాలా గంటలు వాచీలో సెకన్ల ముల్లు మింగినట్టు పనిచేశాడతను.

'సాయంత్రం ఇంటికి వెళ్తూండగా జ్ఞాపకం వచ్చిందతనికి.

ఎడంచేతి వైపు తిరిగి వెనక్కి వెళ్లి గల్లీలో పళ్లడుకాణం ఇవతలగా కారు దిగేడు.

ఏపిలు పళ్లు, పీచెస్, విచ్చుకున్న ఎర్రదానిమ్మల, గుత్తులుగా పచ్చలతో చెక్కినట్టున్న ద్రాక్ష గుత్తులు, వేలాడుతూ అరటి పళ్లూ,

"బోలియేసార్" అన్నాడు కొట్టువాడు.

ఇద్దరు ముగ్గురి బేరం అయిం తరవాత "చార్ ఏపిల్స్." అన్నాడు చారి.

ఏపిలుపళ్లు చెక్క పెట్టెలో మెరుస్తున్నాయి.

పళ్లు తీసుకుంటూ "ఎంత' అన్నాడతను.

“దేదో సొబ్. మీకు తెల్వదా?"

"అయినా నువ్వు చెప్పాలి" పక్కనే వచ్చి నుంచుని ఏపిల్ చేతిలోకి తీసుకుంటూ అన్నాడు ఒకాయన.

చారి నవ్వేడు.

డబ్బులిచ్చి మెల్లిగా కారు దగ్గిరికెళ్లి తులుపు తీస్తుండగా పక్కనే వచ్చి "ఎంతిచ్చేరు మీరు?" అన్నాడు అపరిచితుడు.

చారి చెప్పి 'ఇక్కడే కొంటూంటాను" అన్నాడు.

అతను నవ్వి "కారులోంచి దిగి అడిగితే అలాగే చెప్తారు సార్. అలవాటయి మాలాంటివాళ్లకి కూడా మొట్టికాయలు పడతా"యన్నాడు. అపరిచితుడు.

"ఎంత కిచ్చేడు మీకు?"

అపరిచితుడు చెప్పి వెళ్లిపోయాడు.

చారి పళ్ల సంచితో అలాగే నిలబడిపోయి కొట్టువాడివేపు చూశాడు. గుడ్డతో ఏపిలుపళ్లకి నగిషి పెడుతున్నాడు.

రాత్రి భోజనం చేసి టీవీ చూస్తూండగా పక్కనే ప్లేట్లో ఏపిలుముక్కలు పెట్టింది. జ్యోతి.

ఓ ముక్క చేత్తో తీసుకుని “వీళ్లందరూ మన్ని మోసం చేస్తున్నారు జ్యోతి" అన్నాడు చారి.

“ఎవరు, ఎవర్ని?" అతనేం మాట్లాడలేదు.

“తినరేం?" అందామె.

మర్నాడు మధ్యాహ్నం లంచ్ అయిం తరవాత హాల్లోకి వచ్చేడు చారి.

కిటికీ దగరికి వెళ్లి నీలపు అద్దంలోంచి బయటికి చూశాడు. ఎండ తెల్లగా సంతోషంగా చలిస్తోంది. కనిపించిన కాస్త ఆకాశం నీలంగా ఉంది. కర్టెన్ వేసి వెనక్కి తిరిగేడతను.

ఒక లేత పల్చటి నీలం కలిసిన తెల్లటి వెలుతురు చిమ్ముతున్నాయి దీపాలు.

తన గదిలోకి వెళ్తూ, "రెడ్డి, సగం లైట్లు తీసేయ్యొచ్చనుకుంటాను" అన్నాడు చారి.

తరువాతి అయిదారు రోజులు, అంతకుముందు అయిదారు రోజుల్లా మెరక మీంచి రంగు గోళీ కాయల్లాగ జారిపోయాయి.

ప్రతిరోజూ మెట్లెక్కబోతూ ఆలీ కోసం చూడ్డం అలవాటయిపోయింది.

ఆలీ సూది లోపల పెరుగుతోంది.

వాడు కనిపించగానే అతని కళ్లలోకి నిశితంగా చూస్తాడు చారి. ఒక్కోసారి నవ్వుతున్నట్టు ఒక్కోసారి నల్ల గానూ నిర్లిప్తంగానూ కనిపించే యతనికి.

ఆలీ కళ్లలో తనేం వెదుకుతున్నాడో తెలీడం లేదతనికి. ఆలీతో మధ్యలో మాట్లాడుతూంటాడు.

ఓ రోజు "సార్. ఆ బిల్లు కత ఏమైంది?" అన్నాడు ఆలీ.

గతుక్కుమని రెండు గుటకలు వేసి చలవకళ్లద్దాలు మళ్లీ పెట్టుకుని " నువ్వన్నదే రైటు" అని వెళ్లిపోయాడు చారి.

ఆలీ కనిపించని రోజు చిత్రమైన కలవరం కలిగేది. నిజానికి వాడు కనిపించడం కాకతాళీయం.

కనిపించి మాట్లాడితే మరో రకమైన ఆందోళన శ్వాస కోశంలో చొరబడేది.

ఒక అయిదురోజుల్లో ఆర్వీ చారి జీవనం అసంకల్పితంగా ఆలీ కేంద్రంగా తిరుగుతోంది. గ్రామఫోను రికార్డూ, సూదిలాగ.

ఒక నిశ్శబ్దం ఆలీ సూదివల్ల ధ్వని వలయాలుగా అతన్ని కలవరపెడుతోంది.

గతంలో కంటే పేపరు ఎక్కువ శ్రద్ధతో చదువుతూ కరువు, ఆర్ధిక మాంద్యం, ధరలపెరుగుదల గురించి ఆసక్తిగా ఆందోళనతో చూస్తున్నాడు.

చూసింది నచ్చడం లేదు. ధరలు ఎవరు పెంచుతారు?

ఆర్వీచారి జీవితం తలకిందులవలేదు.

సుతారంగా మెత్తగా గోల్పుకోర్సు బండిలా నడుస్తోన్న దైనందిన జీవనం గతుకులో పడి తేరుకుంది.

కుదుపు తాలూకు అసౌకర్యం వెన్నుపూసకి అతుక్కుపోయింది..

శనివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో చారి పేపరు చదువుతుండగా కాలింగ్ బెల్ మోగింది.

"అక్కడే ఉన్నారా?" అంది వంటింట్లోంచి జ్యోతి. లేచి తలుపు తీశాడతను.

రెండు బుట్టలు నెత్తిమీంచి దింపుతూ ఒకడు దించుతూ మరొకతను.

నెలకోసారి చౌరాస్తాలో ఉన్న డిపార్ట్ మెంట్ స్టోర్నించి సరుకులు లిస్టు, రసీదు ఇచ్చి వెళ్తూంటారు. ఇద్దరూ.

లోపలికి తీసుకొచ్చి సోఫా పక్కన పెట్టేరు.

జ్యోతి రుమాలో చెయ్యి తుడుచుకుంటూ వచ్చి "అన్నీ తెచ్చేవా?” అంది.

ఇద్దర్లో పెద్దవాడు పొడవాటి సరుకుల లిస్టు ఇస్తూ “చెక్ చేస్తరా మేడం?" అన్నాడు.

“తరవాత చూసి ఫోన్ చేస్తాగానీ, సారు పైసలిస్తారు తీసుకెళ్లు."

"సరే అమ్మా."

ఆమె లోపలికి వెళ్లి పోయింది.

లిస్టు తీసుకుని సరుకుల బుట్టల్ని దగ్గరికి లాక్కున్నాడు చారి.

"చూస్తారా సార్. తీయమంట్రా అన్నీ".

చారి లిస్టు చివర అంకెల్ని చూస్తున్నాడు.

"ఈనెల ఎక్కువైనట్టుందే." అన్నా డతను.

"తక్కవ అయింది., సారూ మీ బిల్లు."

క్రితం నెల బిల్లు తను చూడ లేదు. లిస్టు ఆలీ సూదికి గుచ్చుకుంది.

చారి లోపలికి వెళ్లి డబ్బు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టేడు. జేబులో కుక్కుకుని చిల్లర చూసుకుని “సార్. నమస్తే సార్" అంటూ వెళ్లిపోయారిద్దరూ.

కొన్ని వస్తువులు బయటికి తీసి చూశాడు చారి. జీడిపప్పు, కిస్మిస్, అగరొత్తుల డబ్బాలు, కందిపప్పు....బుట్ట పక్కకి పెట్టేశాడతను. లిస్టు అంత పొడవాటి నిట్టూర్పు విడిచి

టీ.వీ తెరిచాడు చారి. తెర వెలిగింది.

పెంకుటింటి ముందు రెండు చాపలమీద రెండు మృతదేహాలు చుట్టూరా జీవుల వలయం. ఏడుపులతో టీ.వీ. బద్ధలైనంత పనెంది.

అప్పులు తీర్చే అవకాశం లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ జీవితంతో రుణం అర్చిసుకున్నారు. నాలుగైదుసార్లు నాలుగైదు కోణాల్నించి మృతదేహాల్ని చూపించారు.

ఛానల్ మార్చి సోఫాలో వెనక్కి వాలేడు చారి.

మెత్తగా నిశ్శబ్దంగా వేగంగా తిరిగే ఫేను హఠాత్తుగా చిన్న శబ్దం చెయ్యడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చారి పరిస్థితి అలాగే ఉంది.

తుడిచినా, కడిగినా, తలకిందులు చేసినా శబ్దం ఎందుకు ఎక్కణ్నించి వస్తుందో తెలీదు. చెవులు బద్దలయ్యి గుండె లయ తప్పే శబ్దం కాదు. కానీ రాకూడని శబ్దం. అసలంటూ రొద రావడం. ఉపేక్షించి ఊరుకోలేని శబ్దం.

గడిచిన అయిదారేళ్లకంటే ఎక్కువగా అమ్మ గుర్తిస్తోంది. చారికి. సుబ్బాచారిలా గాజులు జిల్లాలో ఎవరూ చెయ్యలేరని పేరుం డేది. పేరున్న ఊరు చిన్నది.

సన్నగా కొబ్బరాకులా, పెద్ద కళ్లతో, పెద్ద బొట్టుతో తెల్లగా ఉండేది అమ్మ. సుబ్బాచారి అరుపులతో ఇంటి తాటాకులు లేచి పోయినా ఆమె మామూలుగా ఉండేది.

రాత్రిళు అమ్మతో కలిసి తినేవాడు చారి. క్రమం తప్పకుండా వెన్నెలొచ్చినట్టు ఎప్పుడు తలుచుకున్నా సంతోషంతో నిండిపోయేవాడు.

బోలెడు బొచ్చెడు సంతోషం. ఆమె మంచం పట్టేవరకూ.

ఇంజనీరైన తరవాత సుబ్బాచార్ని బలవంతంగా అయినా ఒకసారి అమెరికా తీసుకెళ్లాలని ఉండేది చారికి.

మరో నాలుగు నెలల్లో అమెరికా అవకాశం ఉండగా హైదరాబాదు ఆస్పత్రిలో సుబ్బాచారి ప్రాణాలు వదిలేశాడు. (“ఒరే చంటి మీ యమ్మ పిలుస్తా ఉందిరా.")

****************

ఓరోజు మధ్యాహ్నం టీ తాగి పేపరూ పెన్సిలూ తీసుకుని లెక్కలు వేశాడు చారి. ఎడం చేతి పిడికిలి మీద బుగ్గ ఆనించి తీక్షణంగా జీవితాన్ని పది భాగాలుగా విడదీసి లెక్కలు వెయ్యడం మొదలు పెట్టేడతను.

తీసేసి కొట్టేసి కలిపేసి మళ్లీ తీసేసి చాలా ముక్కలైన జీవితాన్ని మొత్తానికి ఎనిమిది ముఖ్యభాగాలు చేసి ఒక్కోదాని ఎదురుగా వాటి ధరలు రాశాడు.

పెదాలు బిగించి ఇండిగో ఇన్ఫోటెక్ వారి భవనంలో జీవితం మొత్తానికి ఒక సమగ్రత తెచ్చి తేల్చి, కొన్ని అంకెల్లో కుదించిన తరవాత, రెండు విషయాలు చారికి అర్థమైనాయి.

మొదటిది తనకి పరిచమైన అంకెలకీ వీటికీ సంబంధం లేదు.

రెండోది, మొత్తం, విడిగా, ఇతర లెక్కలతో సంబంధం లేకుండా ఉండడం లేదు. నీరసం ఆవహించి దతన్ని.

“సార్, నమస్తే." సన్నగా తెల్లగా సూదిలా ఎదురుగా ఆలీ నుంచుని నవ్వుతున్నాడు. ఆశ్చర్యంతో చూశాడతన్ని,

"రెడ్డి సారు పిల్సిండు సార్. పోతా..."

వాడు ఆలీయే గదా.

ఓకే. అన్నాడు చారి.

ఆలీ వెళ్లిపోయాడు.

కాయితం మడిచి సొరుగులో పెట్టేడతను.

అయిదుగంటల వరకూ మళ్లీ చారికి జీవితాన్ని అంకెలకి సరిపోల్చడం కుదరలేదు సరిగదా, పనిచెయ్యడం ఇబ్బంది అయిపోయింది.

అతని కాయితంలో జీవితం, కొన్ని అంకెలకి ఒకలాగా కొన్ని అంకెలకి మరొకలాగా కనిపించింది.

సాయంత్రం గేటు దగ్గరికి వస్తూండగా కారు కుడిపక్క , పచ్చికలో గుచ్చిన సూదిలా, కుళాయి పక్కన నుంచుని ఉన్నాడు అలీ.

తన కారు చూడలేదు వాడు.

కారు మామూలుగా చల్లగా ఉంది. లోపలి ఉక్కపోత ఇబ్బందిగా ఉంది. టై లాగి పక్క సీట్లో పడేశాడు చారి.

చీకటి పడింది. నెక్లెస్ రోడ్డులో పక్కగా కారాపి పల్లీలు కొనుక్కుని బెంచీ మీద కూచున్నాడు చారి. ఒక్కో పల్లీ నోట్లో వేసుకుంటూ చాలా సేపు కూచుండిపోయాడతను.

చీకట్లో హుసేన్ సాగర్ చుట్టూ వెలుగు.

నీళ్ల నలుపులోనే దీపాలతో కెఫెటీరియా తిరుగుతోంది.

గాలికి హుస్సేన్ సాగర్ దుర్గంధంలో వాళ్లకి సంతోషంగా ఎలా ఉంటుంది?

వాళ్లెవరూ కనిపించడం లేదు. పల్లీలు అయిపోయాయి. చారి గమనించలేదు. పల్లీలవాడు వెళ్లిపోయాడు.

పల్లీలు కొరికి చాలా రోజులైంది. కారంకారంగా బాగున్నాయి. ఓ

Chapters

Video

More from YouTube