1976 వ సంవత్సరం - చిన్నా :
" అమ్మా ! నేనొచ్చేసా " అంటూ పుస్తకాల సంచీని ఒక మూలకి, చేతి లోని క్యారేజీ ని ఇంకో మూలకి విసిరేస్తూ వచ్చి అమ్మకి అతుక్కు పోయాడు చిన్నా. స్కూల్ నుండి వొచ్చేటప్పటికి అమ్మ ఎదురుచూస్తూ కనపడితే వాడి ఆనందం పట్టనలివి కాదెవ్వరికీ.
" అబ్బో! మా చిన్న ఐదు ఊర్లు ఏలేసి వచ్చాడమ్మా" అంటూ ఒక ముద్దు పెట్టుకుంది చిన్నాని, అమ్మ.
"అమ్మా ! ఈ రోజు స్కూల్ నుంచి వస్తుంటే ఏం జరిగిందో తెలుసా. ఊర్లోకి రెండు కార్లు వస్తూ కనపడ్డాయమ్మా. ఎవరింటికో తెలుసా నీకు"
" రాఘవన్న వొచ్చాడ్రా అమెరికా నించి, శంకరవ్వ కోసం ." అంటూ చిన్నా కోసం రెండు మనుగుబూవులు ఒక చిన్న గిన్నె లో పెట్టి ఇస్తూ, "నువ్వు తింటూ ఉండరా తండ్రీ, నీ ప్రశ్నలతో చంపకుండా, నాకు చాలా పనుంది, నీకు రేపు టిఫిన్ కోసం బియ్యం నానెయ్యాలి " అంటూ చిన్న వాళ్ళ అమ్మ వసారాలోకెళ్లింది.
"అమ్మా! రాఘవన్న ఇంక మన ఊర్లోనే ఉంటాడా?, నేను వాళ్ళింటికెళ్తే మాట్లాడతాడా?" అంటూ అమ్మ వెనకాలే వెళ్ళాడు చిన్నా.
" ఇక్కడ ఓ నెల ఉండి పెళ్లి చేసుకొని పోతాడటరా . నీతో ఎందుకు మాట్లాడ్డు ? చిన్నప్పుడు నిన్ను తెగ ఆడిచ్చే వాడు కదా! "
" ఇప్పుడు నువ్వు గూడ తోడు రామ్మా! శంకరవ్వ వాళ్ళింటికి. నాకు వాళ్ళ వాకిట్లోనే వుండే ఆ నల్ల కుక్క అంటే భయం."
"నీకు, ఆ మురళీ గాడికి సవాలక్ష సార్లు చెప్పానురా, దాని మీద రాళ్లు విసరొద్దని. వింటారా మీరు" అంటూ విసుక్కుంది అమ్మ.
అమ్మ వచ్చేటట్టు లేదు గాని, మనమే శంకరవ్వ ఇంటి ముందు నాలుగు రౌండులు కొడదాము, ఎవరన్నా లోపలి కెళ్తుంటే వాళ్ళ వెంట పడి పోవొచ్చు అనుకుంటూ బయటకెళ్ళాడు చిన్నా.
కుక్క భయమో, లేక రాఘవన్నని ఎలా పలకరించాలి అనే బెరుకో లేక సిగ్గో కానీ, శంకరవ్వ వాళ్ళ ఇంటి ముందు తచ్చాడడం మొదలు పెట్టాడు చిన్నా.
ఇంతలో రాఘవ అన్నే శంకరవ్వని చిన్నగా నడిపించుకుని ఇంట్లోంచి బయటకి వచ్చాడు.
చిన్నాకి ఏనుగెక్కినంత సంబరం వేసింది.
ఇంక వీధిలో అందరూ రాఘవన్నని కుశల ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. "రాఘవయ్య, ఎప్పుడొచ్చావు?, వుంటావా నాలుగు రోజులు?, పెళ్లి ఎప్పుడయ్యా?, అమ్మనేమన్న అమెరికాకి తీసుకెళ్తావా?" అంటూ.
వాళ్లందరికీ ఓపిగ్గా సమాధానాలిస్తూ వెళ్తున్నాడు రాఘవన్న,
చక్కని పలువరుసతో, తెల్లని మేనిచ్ఛాయతో అచ్చు సినిమాలో జగ్గయ్యలాగ కనపడతా వుండాడు, చిన్నాకి రాఘవన్న.
అప్పటికే అమ్మలక్కలు, "మన రాఘవయ్యకు చూడు వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమో!, అమెరికా నించొచ్చి వవాళ్ళ అమ్మని ఎంత జాగర్తగా దేవళం తీసుకెళ్తున్నాడు" అంటూ గుసగుసలు మొదలెట్టేశారు.
చిన్నా వాళ్ళ వెనకే నడుస్తూ, రాఘవన్న కళ్ళల్లో పడ్డానికి , రయ్ రయ్ అని శబ్దం చేస్తూ, రాఘవన్న పక్కనుంచే పరిగెత్తాడు.
"ఎవర్రా! అలా పరిగెత్తేది" అంటూ శంకరవ్వ కేక పెట్టింది.
చిన్నా ఆగిపోయాడు. రాఘవన్న వేపే చూస్తున్నాడు, శంకరవ్వను పట్టించుకోకుండా.
చిన్నా ఇంట్రడక్షన్ ఇవ్వడం మొదలు పెట్టింది శంకరవ్వ తన కొడుక్కి, " ఒరే రాఘవా ! వీడు మీ సుజాతక్క కొడుకు, భలే తెలివి గలోడు . వీడి బుర్ర నిండా ఎప్పుడూ ప్రశ్నలే! మనింటికొస్తే అదేంది, ఇదేందీ అంటూ చంపుతాడు, ఒక్క నిమిషం కుదురుగా ఉండడు " అనుకుంటూ.
ఈలోపల దేవళం రావటం, శంకరవ్వ లోపలి వెళ్ళటం, రాఘవన్న దేవళానికి ముందున్న అరుగు మీద కూర్చోడం జరిగిపోయాయి.
చిన్నా కూడా వెనక్కి ఓ పదడుగులు వేసి, ఒక్క లగు లగెత్తి, ఎగిరి రాఘవన్న పక్కన కూర్చున్నాడు అరుగు మీద.
"ఏమి చదువుతున్నావు" అడిగాడు రాఘవన్న చిన్నా భుజం మీద చెయ్యేసి.
"ఆరో క్లాస్, జెడ్.పీ ఉన్నత పాఠశాల, రామలింగాపురం అఫ్ పెదపుత్తేడు"
"అబ్బో! నేను కూడా అక్కడే చదివేను తెలుసా!. మా హెడ్ మాస్టర్ మీరా రెడ్డి గారు, బహుశా ఇప్పుడు వేరే ఆయనేమో? ”
"రాఘవన్నా! ఎక్కడైనా హెడ్ మాస్టర్లు మార్తారేంటి, మాక్కూడా ఆయనే"
"సైన్స్ కి ఎవరు మీకు, ప్రఫుల్ల దేవి గారేనా"
"మాకా పుల్లా దేవి కాదన్నా! కే .ఎస్ అయ్యోరు సైన్స్ కి, లెక్కల కి" అంటూ పళ్ళు ఇకిలిచ్చాడు చిన్న.
ఓ చిన్న నవ్వు నవ్వేసి , రాఘవన్న వాళ్ళు చదువుకొనే టప్పుడు పని చేసిన టీచర్స్ ఎవరన్నా ఉన్నారా అంటూ ఒక్కోరి పేర్లు అడుగుతూ మొదలుపెట్టి , ఒక్కొక్క అయ్యవారు ఎట్టా పాఠాలు చెప్పే వారో, అప్పుడు బడి ఎట్టా ఉండేదో, వాళ్ళు ఎట్టా చదివే వారో, ఎట్టా ఆడేవారో, చెబుతూంటే చిన్నా కళ్ళార్పకుండా వినడం మొదలుపెట్టాడు.
రాఘవన్న ఆపకుండా చెప్పుకుంటూనే పోతావున్నాడు ఊరిగురించి , తన చిన్నతనం రోజుల్లోకి పూర్తిగా వెళ్ళిపొయ్యి -
అప్పటి ఊరి గురించి , యానాదిరెడ్డి బాయిలో వాళ్ళ ఈతలగురించి , దేవళంలో సందడిగురించి, వూరెన్కాలుండే వాగు గురించి , వాగొడ్డున పరిగెడుతూంటే కాళ్ళ కింద తగిలే ఇసక మెత్తదనం గురించి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో -
ఇలా చెప్తున్నవాడు ఒక్కసారిగా ఆగిపొయ్యి ఎటోచూస్తూ నిట్టూర్చాడు.
"వూరు ఒకప్పటిలా లేదురా చిన్నా! నేను అమెరికాకి వెళ్లి పోయాక ఈ ఊరి కళే పోయిందిరా " అన్నాడు.
ఆయన చెప్పిన కబుర్లన్నీ బాగున్నాయి, చిన్నోడికి, కానీ రాఘవన్న అమెరికాకి వెళ్ళిపోయాక వూరు కళ తప్పటం అన్న మాట తప్ప.
వాడికి ఇప్పటి స్కూల్ బాగుంది, అయ్యోర్లు బాగున్నారు, చదువులు బాగున్నాయి, వూరినిండా సావాస గాళ్ళున్నారు, చెరువు అలాగే వుంది, నీళ్లు తగ్గినప్పుడు పెరిగే తుంగ అలాగే పెరుగుతుంది, రాములోరి గుడి అలాగే వుంది, తిరునాళ్ళు అలాగే జరుగుతున్నాయి సందడి గా, దేవళం ముందర వాడి సావాసం గాళ్ళు అలాగే ఆడుకుంటున్నారు, తాటి చెట్లు ఈత చెట్లు సీమ చింత చెట్లు కాయలు కాస్తూనే వున్నాయి, నేరేడు చెట్లకి ఎంట్లు వేసి పిల్లకాయలు అలాగే ఊయళ్ళు వూగుతున్నారు, ఊరి వాగులో దొరికే చంద మామ బేడీసి చేపలు ఊరి జనాలు ఎప్పటిలాగే చప్పరిస్తున్నారు, పిల్లకాయలు పాటికి పిల్లకాయలు ఆటలు ఆడేసుకుంటుంటే అవ్వలు వాళ్ళ కోసం ఎప్పటిలాగే వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు. వాగొడ్డున పరిగెడుతూంటే ఇసక అమ్మ ఒళ్ళంత మృదువుగా అలానే వుంది.
అయినా ఈ రాఘవన్న బాదేంటి, వూరు కళ తప్పటమేంటి ఈయన అమెరికాకి వెళ్ళాక. వాడికేమీ అర్థం కాలా.
2005 వ సంవత్సరం - నేను:
" మన ఊరి దాకా వెళ్ళొద్దామురా! నువ్వు నెల్లూరు వస్తేనే మమ్మల్ని తిప్పేది, లేక పోతే లేవటం, వండి పెట్టటం, తినటం, పడుకోవటం, ఇంతే జీవితం. నువ్వు తీసుకెళ్తానంటే చెప్పు, బేబీ అక్కని, సునీతక్కని కూడా రమ్మంటాను" అంది సుజనక్క - నేను హైద్రాబాదు నించిపొద్దున్నే, నెల్లూళ్ళో దిగంగానే -
"సరే అక్కా ! వెళదాం. మనం వూరికెళ్లే, దశాబ్దాలు అవుతుంది, సుప్రియాకు గూడ చూపించినట్టుంది " అన్నా నేను.
ఏడవతరగతి వరకే మా వూర్లో వున్నా నేను . తరవాత నెల్లూరుకు వచ్చేసాం మేమంతా .
దాంతర్వాత చదువులు, ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళకి వున్న పొలాలు అమ్మటాలు, చివరగా వూర్లో వుండే పెద్దమ్మ పెదనాన్నలు కూడా, వున్నది అమ్మేసి హైదరాబాద్ లో వుండే కొడుకు దగ్గర కు వెళ్ళిపోవటం తో, దాదాపుగా మాకు మా ఊరితో వున్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఎలా వుందో వూరు, వూళ్ళో ఒకరన్న మనల్ని గుర్తు పడుతారా లేదా అంటూ బయల్దేరాం, మా అక్కలు , సుప్రియ , నేను , ఐదేళ్ల నా పెద్దకూతురు అమృత ను గూడా తీస్కొని. .
వూరు దగ్గర అయ్యేకొద్దీ ఎదో తెలియని ఉద్విగ్నత.
ఊరి మొదల్లో ఊట నీటితో - గల గల పారే కల్జు పగిలిపోయి, చాలా నిశ్శబ్దం గా వుంది.
ఊరి మొదలు నుండి మూల కడ వరకు దారి పొడవునా నీళ్ల తో నిండుగా వుండే చెరువు, నీరే కనపడనంతగా తుంగతో పెరిగిపోయి ఎదో అపశకునంగా తోస్తుంది. ఎన్నో ఊర్లలో కాన వచ్చే సిమెంట్ రోడ్ లు మచ్చుకు కూడా లేవు. చిన్నగా మూల కడ దగ్గర రైట్ టర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్లి దేవళం దగ్గర కారాపాను నేను .
అప్పటికే బిక్క మొహాలేసేసి వున్నారు మా అక్కలంతా.
"దేవళం, వరండా ఏమిటి నేలలోకి ఇంత కుంగిపోయింది" అంటూ మొదలు పెట్టింది ఒక అక్క.
"ఈ వీధులేమిటి ఇంత ఇరుకు అయిపోయాయి" అంటూ బోరుమంది ఇంకో అక్క.
"గుడికి ఎదురుగా వుండే ఈ బడికి రంగులు వేసి ఎంత కాలమయ్యిందో" అని నసుగుతుంది మూడో అక్క.
"సరే మేముమా దోస్తులు ప్రసూనని, అన్న పూర్ణని కలిసొస్తామని" తుర్ మన్నారు అక్క చెల్లెల్లు.
వెళ్లినంత సేపు పట్టలా, మొహం వేలాడేసుకొని రావడానికి, "ప్రసన్న ఎప్పుడో ఊరొదిలి వెళ్లిపోయిందట, అన్నపూర్ణ కూతురు దగ్గరకి వెళ్లిందట" అంటూ.
"సరే అలా పొలాల వెంట అన్నా వెళదాము" అన్నారు వాళ్ళు.
" నార్లు వేసి పచ్చా పచ్చగుండాలి పొలాలు. ఇలా బీళ్ల లాగా వున్నాయేమిటి' ?అంటూ దబాయించారు ఆ దారిన వెళ్తున్న నారాయణ ని గుర్తు పట్టి.
మా వాళ్ళ ఉధృతి ,చూసి బిక్క మొహం వేసాడాయన.
"సుప్రియా! మా వూరు చాలా బాగుండేది, ఇలా ఉండేది కాదు అస్సలికే" అంటూ మా ఆవిణ్ణి నమ్మించడానికి విశ్వప్రయత్నాలు మొదలు పెట్టేసారు, మా అక్కలు.
ఎక్కడ సుప్రియా, ఈ అనాగరిక వూర్లోనా మా ఆయన మరియు మా ఆయన ఘనత వహించిన అక్కలు పుట్టి పెరిగింది అనుకుంటుందేమో అనే భయం తో.
చెప్పడం మొదలుపెట్టారు, వాళ్ళ మాటల్లోనే చిన్నప్పుడు వూరు ఎలా ఉండేదో,, , రాములోరి గుడి ఎలా ఉండేదో , తతిరునాళ్ళు ఎలా జరిగేవో, నేరేడు చెట్లకి ఎంట్లు వేసి పిల్లకాయలు ఎలా ఊయాళ్ళు ఊగే వారో, పిల్లకాయలు పాటికి పిల్లకాయలు ఆటలు ఆడేసుకుంటుంటే అవ్వలు వాళ్ళ కోసం ఎలా వెతుక్కుంటూ వచ్చేసేవారో, వూరెనక వాగు ఎంత అందం గా ఉండేదో, వాగొడ్డున పరిగెడుతూంటే కళ్లకింద ఇసక ఎంత మెత్తగా తగిలేదో గట్రా, గట్రా..
చివరకి, "సుప్రియా! మేము ఈ వూరు వదిలి వెళ్ళాము ఈ వూరు కళే బోయిందబ్బా" అని తీర్మానించేసారు.
"మీరు మాట్లాడుకుంటూ వుండండి, లేకపోతే ఇంకా ఎవరన్నా మీ ముఖాలను గుర్తు పడతారేమో పరీక్షించుకుంటూ వుండండి నేను ఇప్పుడే వస్తాను" అంటూ నేను ఊరి గట్టుకేసి నడిచాను.
చెరువు గట్టు మీద నిల్చోనున్నాయి, రావి చెట్టు, వేప చెట్టు అలానే ఒకదానితో ఒకటి కల్సిపొయ్యి .
వాటికిందనే మేము చిన్నప్పుడు ఆడుకుంటూవుండే అరుగు. ఆరుగ్గూడా అలానే వుంది.
ఆ అరుగు మీద వెల్లికిలా పడుకొని, ఆ రావి చెట్టు గల గల వింటూ నిద్రలోకి జారుకున్నా
ఆ మగత నిద్రలో, మా వూరమ్మ, కనిపించింది. "ఏరా ! చిన్నా ఎందుకంత కలతగా వున్నావు" అంటూ.
"ఏంది వూరమ్మ ఇంత మారిపోయావు" అంటూ బావురుమన్న నేను.
"మారడం అంటే ఏమిటో చెప్పు ముందు అంటూ నిలదీసింది" వూరమ్మ.
"నేను పచ్చటి పొలాలు చూడాలని వచ్చాను, అవి కనపడటం లేదు"
"నువ్వొచ్చినప్పుడే పొలాలు పచ్చగా ఉండాలి అనుకోవటం నీ తప్పు, కోతల కాలం లో రావటం నీ తప్పుకాని, దానికి వూరు మారిందని బావురు మానటం ఎంత వరకు సబబు" అడిగింది ఆవిడ.
"నా చిన్నప్పుడు వీధులు ఎంతో విశాలం గా ఉండేవి, గుడి వరండా ఎక్కాలంటే పరిగెత్తు కొచ్చి ఒక్క ఎగురు ఎగరాల్సి వచ్చేది, ఇప్పుడేమో వీధులు ఇరుకిరుకుగా, గుడి వరండా నేలకు అంటుకు పోయి వుంది"
"పిచ్చి నాగన్నా నువ్వు సిటీ లో రోడ్ లకు అలవాటు పడ్డావు కాబట్టి ఇవి ఇరుకుగా వున్నాయి. అదీ కాక అప్పుడు నువ్వెంతరా నాయనా ఎత్తు, మహా అయితే మూడున్నర అడుగో లేక నాలుగు అడుగులో, అప్పుడు ఆ ఆకారం తో చూస్తే నీకు అన్నీ పెద్దవిగా, ఇప్పుడు రేవులో తాటి చెట్టులా ఎదిగిన ఆకారం తో చూస్తే అన్నీ చిన్నవిగా కనపడతాయి"
ఇంకా చాలా చెప్పింది వూరమ్మ.
"మీ అవసరాలు పెరిగి, మీరు ఒక్కొక్కరే ఎగిరి పోయారు వూరు విడిచి. మారింది నేను కాదురా అబ్బాయీ, మీరు మీ అవసరాలు. నాకు మట్టుకు నేను ఇక్కడ వుండే వాళ్ళ చిన్న చిన్న అవసరాలు తీరుస్తూనే వున్నా ఒక అమ్మలా. నేను ఇచ్చేది చాలదు అనుకున్న వారంతా ఎగిరి పోతూనే వున్నారు. ఎప్పుడో దశాబ్దానికోసారి, వచ్చి ఇట్టా బాధపడ్తున్నారు . ఇంకా నాకు నవ్వు వచ్చేది ఏమిటంటే, ప్రతీ వాడు వాడు వెళ్లి పోయాక నేను కళ తప్పాను అనటం. బాగుందిరా అబ్బాయీ" అంటూ నవ్వటం మొదలెట్టింది.
నవ్వీ! నవ్వీ! చెప్పింది, " నేను కాదు కానీ నీ ఈ సందేహం ముందు ముందు నీ సంతానము తీర్చు గాక !" అంది వూరమ్మ మాయమవుతూ తన వామ హస్తం పైకెత్తి నన్ను ఆశీర్వదిస్తూ. .
ఈలోపల, " చిన్నా ! ఇక్కడున్నావా! ఊరంతా వెతుకున్నాము" ఆంటూ లేపేసేరు నన్ను అక్కలు.
ఏడేళ్ల నా కూతురు అమృతా వాగుని చూసి ఉత్సాహంతో ఒడ్డునుండే, ఇసుకలో అటూ ఇటూ పరిగెత్తడం మొదలు పెట్టింది.
ఒక పదినిముషాలు పరిగెట్టింతర్వాత , అలసి పొయ్యి , నా దగ్గరకొచ్చి, ఆయాసపడ్తూ చెప్పింది , “ డాడీ , ఇక్కడ ఇసుకెంత బావుందో, నానమ్మ ఒళ్ళంత , మెత్తగా !
నేను తన కళ్ళల్లోకి చూసాను.
అమృతా కళ్ళు, ఎదురుగా వుండే వాగు నీళ్లలాగా స్వచ్ఛం గా, మెరిసిపోతున్నాయి.
నా చూపులు ఊరివైపు తిరిగాయి.
నాలో తెరుచుకొన్న, చిన్నా కళ్ళ తో, ఊరంతా నాకు చాలా అందం గా కన్పించటం మొదలు పెట్టింది.