ఒరే హర్షాగా! "మీ అమ్మకి నేను ఇక ఏమీ చెప్పానురా", అంటూ కణ కణ లాడి పోయాడు మా నారాయణ రెడ్డి వాళ్ళ షడ్డకుడి కొడుకు రిసెప్షన్ అయ్యాక. ఎదో అయ్యింది ఆ రిసెప్షన్ కి మా అమ్మ అటెండ్ అయ్యాక అని నవ్వుకున్నా. మంచి నీళ్ల గ్లాస్ ఇచ్చి, "చెప్పరా ఏమయ్యిందో అన్నా", వినటానికి సిద్దపడుతూ. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ అమ్మ అడిగార్రా, అమ్మాయి ఏమి చదివింది, ఎలా ఉంటుంది అని. "పర్వాలేదమ్మా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం బొద్దుగా ఉంటుంది, అని చెప్పా!. నిన్న రిసెప్షన్ లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నల ముందు, అదేమిటి మా నారాయణ అల్లా చెప్పాడు , అమ్మాయి ఇంత బాగుంటే అని చెప్పేసింది మీ అమ్మ", అంటూ లబ లబ లాడాడు వాడు.
మొన్నటికి మొన్న మా ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చింది ఇక మననింటికి ఎవరినన్నా భోజనానికి పిలిచావో చంపేస్తా నిన్ను అని. "ఏమి జరిగిందో చెప్పు", అంటూ మా ఆవిడ వలిచే చిక్కుడు కాయలు వలవటం లో సహాయం చేసే వంకతో అడిగా, ఎదో అయ్యింది అనుకుంటూ. "మీ మేనత్త కొడుకు గోపాలన్న వాళ్ళ కుటుంబాన్ని భోజనానికి పిలిచాము కదా. ఆయన భోజనాల దగ్గర నన్ను పొగుడుతూ నీకు చాలా ఓపికమ్మా ఇన్ని రకాలు ఎలా చేసావు, అన్నీ చాలా బాగున్నాయి అనగానే, మీ మమ్మీ (కోపమొచ్చినప్పుడు మా మమ్మీ లేక పోతే వాళ్ళ అత్త) గోపాలయ్యా! ఆ చికెన్ బిర్యానీ, జింజర్ చికెన్ ఇప్పుడే అంగార హోటల్ నుండి, ఈ కొబ్బరి పచ్చడి, ఆ టమేటా చిక్కుడు కూర నిన్నటివి, ఇప్పుడు వేడి చేసినవి అంటూ, మా ఆవిడ మొహంలో కోపం చూసి, ఏంటే ఆ కోపం వీళ్ళెవరూ! మన వాళ్ళే కదా", అంటూ ఒక నవ్వు నవ్విందట.
"నాన్న! నాన్నమ్మతో ఇక మా గురుంచి ఏమీ చెప్పకు", అంటూ ఒకరోజు నా కూతుర్లు నా మీద యుద్ధానికి వచ్చారు. ఏంటమ్మా అంటే అత్తమ్మోళ్లతో మాట్లాడుతూ, ఆ చిన్నది ఎప్పుడూ బలహీనమే ఎప్పుడూ దానికి ఆయాసమే అని చెప్తుంది. అదేమిటి నాన్నమ్మ, అంటే వాళ్ళు మీ అత్తలే మీరంటే వాటికి ప్రాణమే అంటుంది అని కంప్లైంట్.. మొన్నటికి మొన్న మీ నాన్న అమెరికా నుండి జాబ్ పోతే వచ్చేసాడా, నాకోసమే వచ్చేసాడా అని అడిగింది నువ్వు ఆమె కోసమే కదా పరిగెత్తావ్ అంటూ కయ్ మన్నారు.
కానీ పిల్ల కాకులకేమి తెలుసు మా అమ్మకి అందరూ తన వాళ్ళే, స్వపర బేధం లేదు తెలియదు అని. వాళ్లకేం తెలుసు నేను తన కోసమే వచ్చేసాను అని పదే పదే తెలుసుకొని ఆమె పడే సంతోషం. నేనూ డిసైడ్ అయిపోయా మా అమ్మగురుంచి నాకు తెలుసు, ఆమె మనసు ఎంత మంచో, మాట దాయలేనంత మంచి. కాబట్టి ఆవేశపడే వాళ్ళకి మంచి నీళ్లు ఇచ్చి, ఇక చెప్పండ్రా మీరు అంటూ హాయిగా నవ్వటమే. ఏమంటారు. ఈ వయస్సులో చిన్నపిల్లలు అయిపోయి అందరూ మన వాళ్ళే, వాళ్ళతో మనకు రహస్యాలు ఏమిటి అనుకొని అప్పుడపుడు మనకు షాక్ లు ఇచ్చే అమ్మలందరికి, నా నమస్సులు.
కొసమెరుపేటంటే ఈ కథ చదివి మా మేనకోడలు మామయ్య నువ్వు ఇంకోటి మరిచిపోయావు అన్నది. అది కూడా యాడ్ చేస్తున్న. సుప్రియ కస్టర్డ్ లోకి అరటిపళ్ళు లేవు అని హైరానా పడుతుంటే, ఆ గోపాలయ్య వాళ్ళు భోజనాలకి వస్తూ ఎలానూ తెస్తార్లేవే అని. వాళ్ళు తెచ్చారు చూడు అని వాళ్ళ ముందరే ప్రకటించేసింది మా అమ్మ. మా ఆవిడ పళ్ళు పట పట ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp