Artwork for podcast Harshaneeyam
మన జీవితాల నాయకా నాయకులు! ఒకటవ భాగం
26th April 2020 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:09:57

Share Episode

Shownotes

నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితం లో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాల వల్లనే మనం పెద్దవారి మయ్యామన్న స్పృహ కలుగుతుంది.

ఈ మధ్య మా అమ్మతో మాట్లాడుతుంటే, తన చిన్ననాటి స్నేహితురాలైన ఈదల పద్దమ్మ గారి గురుంచి చెప్తూ, తన చిన్నతనంలో తనంతటి వయస్సు వుండే ఆవిడ చాలా పెద్దదైన వాళ్ళ పెరడు అంతా ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, ఆ తర్వాత అంట్లు అన్నీ తోమేస్తే మా అమ్మ తనకి సహాయం చేసేది అంట్లు కడగటంలో. మా అమ్మనడిగా నేను, మరి మీ ఇంట్లో ఈ పనంతా ఎవరు చేసేవారు అని. మా చిన్నక్క ఐన సరోజినక్క అని చెప్పింది. చెప్తూ మన పనంతా గోసంగిలా ఊరంతా స్నేహితురాళ్ళతో తిరగటమే, అంత మా అక్కే చూసుకొనేది అని సెలవిచ్చింది. ఈ ఒక్క వాక్యం చాలు మా చిన్న పెద్దమ్మ ఎంత కష్ట జీవో, మరియు తన చెల్లెలైన మా అమ్మ కూడా పని చేయాలి కదా అని వంతుల కోసం ఎదురు చూడకుండా తన పని తాను ఎలా చేసుకొని పోయేదో చెప్పడానికి.

మా సరోజన పెద్దమ్మ మరియు మా శేష పెదనాన్నలకి నలుగురు సంతానం. ముగ్గురాడపిల్లలు మరియు ఒక మగ నలుసు. మా పెదనాన్నకి అందర్నీ ప్రేమించటం, వ్యవసాయప్పనులు చూసుకోవటం తప్ప ఏమీ తెలియదు మా పెద్దమ్మే అన్నీ చక్కబెట్టుకోవాలి. వాళ్లిద్దరు వాళ్ళ నలుగురు పిల్లలతో పాటు మాకు, అంటే మా అన్నకి, అక్కకి మరియు నాకు, సమానంగా ప్రేమని పంచారు, ఇంకా ఒక పాళ్ళు ఎక్కువే, మేము చిన్న పిల్లలమవటంతో. మా పెదనాన్న వాళ్ళ నాన్నగారు మా అమ్మమ్మ వాళ్లకి బంధువులు మరియు వాళ్ళకి మొదటినుండి ఉప్పలపాటిలో పొలాలు ఉండటం తో మా పెద్దనాన్న ఉప్పలపాటికే వచ్చేశారు. అలా మా సొంత అక్క ఉప్పలపాటిలో మా పెద్దమ్మ పెద్ద నాన్నల దగ్గరే పెరిగేసింది. మా నాన్నమ్మ వాళ్ళ వూరైన ఉలవపాళ్లలో మా నాన్నకసలు ముగ్గురు పిల్లలని తెలీనే తెలియదు. మా అక్క మా ఉలవపాళ్ళకి అప్పుడప్పుడు వచ్చి పోయే ఇందిరమ్మ. ఎందుకో తెలియదు మా ఉలవపాళ్ళ జనాలు మా అక్క పేరు సుమతి అయినా, ఇందిరమ్మ, లేక ఇందిరా గాంధీ అనే పిలిచే వాళ్ళు.

అలాగే నేను ఉప్పలపాటి వచ్చి ఎక్కడికైనా వెళ్లాలంటే మా పెదనాన్న భుజాలమీద ఎక్కి వెళ్లాల్సిందే, నాకు బాగా లేనప్పుడు ఎత్తుకెళ్ళి చీటీలు కట్టించటం, లేక కామెర్లకి పక్కూరికి తీసుకెళ్లి మందు పెట్టించటం, అంత ఎందుకు మా ఊరి పొలాల వెనక పారే వాగులో దొరికే అతి రుచికరమైన అర్జులు అనబడే చేపలు తెచ్చుకోవాలన్న నేను మా పెదనాన్న భుజం ఎక్కాల్సిందే. ఆయనకి ప్రేమ ఎక్కువైతే నా బుగ్గలు కొరికేసేవారు. అదొక్కటే నేను ఆయన మీద చేయగలిగిన ఫిర్యాదు. ఆఖరకు మేము ట్యూషన్లో లేట్ అయినా లాంటర్న్ ఎత్తుకొని వచ్చేవాడు మా పెదనాన్న నన్ను మా అక్కనీ ఇంటికి తీసుకెళ్లడానికి. నాకు తెలీదు అంత ప్రేమ ఆయన ఎలా పంచగలిగాడో అని.

మా పెద్దమ్మైతే పొలం పనుల అజమాయిషీలో పడి అలిసి సొలిసి వచ్చినా దాలి గుంత వేసి కాగు నిండా నీళ్లు కాచి ఆ వేడినీళ్ళతో మాకు స్నానాలు చేయించేది. నేను పెద్ద వాడినయ్యా నేనే చేస్తా అని హఠం వేసే వాడిని అప్పుడప్పుడు. ఆమె ఎప్పుడన్నా నెల్లూరు వెళ్తుంటే పనుల మీద కాళ్లకడ్డం పడి ఆమె వెంట వెళ్లే వాడిని. నెల్లూరులో ఆమె ఎన్ని పనులున్నా ఓపికగా నడిచే వెళ్లే వారు, నేను కొంచెం నడిచి రిక్షా ఎక్కుదామని మారాం చేసే వాడిని. ఎన్నిటికని ఎక్కగలం, ఆమె అలాగే నన్ను బతిమాలుతూ నడిపిస్తూ, నడిస్తే షోడాకొని పెడతానని చెబుతూ, తనకి ఓపిక వున్న వరకూ నన్ను మోస్తూ పనులు చక్క బెట్టుకొనేది.

ఇక మా పెద్దక్క సి. గాన పెసూనాంబ అయితే మా పిల్లకాయల్ని మాయ చేసి అన్నాలు పెట్టటంలో మహా నేర్పరి. అప్పట్లో మాకు ఇన్ని రకాల కూరగాయలు లభ్యం అయ్యేవి కావు. మహా అయితే పల్లెల్లోనే పండిన సొరకాయో, పొట్లకాయో, పందిరి చిక్కుడ్లో, లేక పోతే తంబకాయలో దొరికేవి. ఇప్పటిలా క్యారట్లు, బీట్ రూట్లు, క్యాబేజీలు లాటివి మేమెరుగం. బంగాళా దుంపలు కూడా ఎప్పుడో పండగలకు పబ్బాలకు కుర్మా రూపంలో. చేపలు మాత్రం చాలా విరివిగా దొరికేవి. కానీ సాయంకాల పూట, సూర్యాస్తమయ్యాక, ఆరుబయట, మినవల పచ్చడి, పొట్టు పెసలతో చేసిన పప్పు, నెయ్యి కలిపి మా అక్క భీముడి కథలు చెప్తూ నా సామిరంగా అన్నం పెడుతుంటే, ఇంకా పెట్టు, ఇంకా

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube