Artwork for podcast Harshaneeyam
పార్ట్ 1 - 'చిట్టి తల్లి' - పాలగుమ్మి పద్మరాజు గారి రచన
Episode 1759th April 2021 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:37:41

Share Episode

Shownotes

న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘చిట్టి తల్లి’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . 

పుస్తకం కొనడానికి కావాల్సిన web link

Palagummi Padmaraju Rachanalu -Vol1

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. కథను రెండు భాగాలుగా ఆడియో చెయ్యడం జరిగింది, నిడివి ఎక్కువ కావడం వల్ల .

ఎపిసోడ్లో ముందుగా వారి తండ్రి గారి గురించీ , కథ గురించీ పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.

చిట్టి తల్లి:

దక్షిణామూర్తి గాలి పీల్చుకోడానికి నిడదవోలు ప్లాట్ఫారం మీదికి దిగాడు. కుపే ఒక రకంగా సుఖంగానే ఉంటుందిగాని, మిగతా పెట్టెలాగ రైలు కదులుతున్నా గాలి రాదు. అయితే – కుపేలోకి బొగ్గు నెరుసులు, అనవసరమైన ప్రయాణీకులు అట్టే రారు. లాభనష్టాలు ప్రతిదానికీ ఉంటాయనుకుని తృప్తి పడ్డాడు దక్షిణామూర్తి…

ప్లాట్ఫారం మహా రద్దీగా ఉంది. ఈ పెట్టెలో కాళీ లేదంటే, ప్రయాణీకులు మరో పెట్టి దగ్గరకు పరుగెత్తుతున్నారు. వాళ్ళ ఆత్రంలో జంతు సహజమైనదేదో ఉంది. అసలు దక్షిణామూర్తి ఎన్నికలో సామాన్య ప్రజలు జంతువులే, అయితే అప్పడప్పుడు ఆ జంతువులతో రాసుకు తిరగడం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటప్పుడు, బొత్తిగా ఒంటరిగా కొన్ని గంటల సేపు కుపేలో ప్రయాణం చేశాక, జీవ చైతన్యం ఉన్న వస్తువులతో తాత్కాలిక సంపర్కం కాస్త అవసరం. అయితే ఆ సంపర్కం అతనికి విసుగు పుట్టిస్తే, మళ్ళీ తన ఏకాంతంలోకి తను పోవడానికి అవకాశముండాలి. ఆ కుపేలోకి పోతే, ఈ జనం తన్ను తాకలేదన్న ధీమాతోనే, దక్షిణామూర్తి జనసముద్రంలోకి అడుగుపెట్టాడు. సోడాలూ, తినుబండారాలూ, పుస్తకాలూ అమ్మేవాళ్ళు పెట్టెలను తోసుకుంటూ, అతన్ని రాసుకుంటూ పోతున్నారు. పక్కపెట్టెలో మనిషి అరిటిపండు తినేసి విసిరిన తొక్క అతన్ని తలవెంట్రుక వాసిలో దూసుకుపోయింది. జనప్రవాహాన్నించి కొంచెం దూరం తొలిగి నిలబడ్డాడు దక్షిణామూర్తి. ప్లాట్ ఫారం మీదికి దిగడంలోనూ లాభనష్టాలున్నాయి.

“ఏండోయి దక్షిణామూర్తిగారూ? హ! హ!హ!” అంటూ ఒక విగ్రహం అతని రెండుచేతులూ పట్టుకుని ఊపింది.

“ఏమిటి విశేషాలు? పట్నమేనా? ఏవండీ! అక్కడెక్కడో అచ్చు ఇటికల ఫాక్టరీ పెడుతున్నారంట, కాస్త వివరాలు మాక్కూడా ఇవ్వండి.

దానమ్మా మోసిరి ఉన్న లాభాలన్నీ మీరే ఏసుకోవాలేంటండీ? అవునుగాని, కలప మా దగ్గిర కొనడం బొత్తిగా మానేశారేంటి?”

దక్షిణామూర్తికి వ్యాపారమంటే పిచ్చి మోజు. లాభ నష్టాల మాట అటుంచి, అసలు వ్యాపారంలో ఏదో ఒక విధంగా తనది పైచెయ్యి అనిపించుకోవాలి. అయితే ఒక్కొక్కప్పుడు – ముఖ్యంగా ఇలాగ విశ్రాంతి కోసం ప్రయాణాలు చేస్తున్నప్పుడు – వ్యాపార వాతావరణం నించి దూరంగా ఉండాలనిపిస్తుంది. కాని పెద్ద వ్యాపారస్థుడుగా పేరు ప్రఖ్యాతులు గడించాక, ప్రతి ఊళ్ళోనూ పదిమందితో వ్యాపార రీత్యా పరిచయం ఏర్పడ్డాక, అలా దూరంగా తొలిగిపోయి ఉండడం అసాధ్యమని అతనికి అనుభవంవల్ల తెలుసు. అదీగాక తనకు లోపల ఎంత చిరాకుగా ఉన్నా వాళ్ళతో ఆప్యాయంగా, చిరునవ్వు చెదరకుండా మాట్టాడ్డం వ్యాపారానికి ముఖ్యావసరం – 

ఒక్కరికి మనస్సు నొచ్చుకునీ మాట అతడు మాట్లాడాడా, అతను ఇన్నాళ్ళూ నిర్మించుకుంటూ వచ్చిన పలుకుబడి, ఔన్నత్యం పేకమేడలాగ కూలిపోతుందని అతనికి తెలుసు. 

పలకరించడం కోసమే దగ్గరగా వచ్చారు. మరికొందరు అతని సహాయం అర్థించడానికొచ్చారు. 

. అతడు అందరిని సమంగా మాటలతో గౌరవించి, రైలు కదలబోతుండగా తన కుపే ఎక్కేశాడు. ఎక్కుతూ రైలులో ప్రయాణం చేస్తున్న ఉద్యోగిని సంజ్ఞచేశాడు

“చూడప్పలసామీ, ఆ పెద్దమనుషులంతా ఈ కుపేలో పై బర్తుకోసం నిన్ను వేధించుకు కతింటారు. నా స్నేహితులెవరో బెజవాడలో ఎక్కుతారు, అంచేత రెండూ నేనే రిజర్వు చేయించానని చెప్పు.”

“నాకు మీరు చెప్పక్కర్లేదు సార్. అప్పుడే కొందరు నన్నడగడం, నేను కాళీ లేదని చెప్పడం అయింది.”

ఉద్యోగి కదులుతున్న రైలు కమ్మీ పట్టుకుని పక్క కంపార్టుమెంటులోకి వెళ్ళిపోయాడు. దక్షిణామూర్తి తన కుపే తలుపులు గట్టిగా మూసుకున్నాడు. ఇంక పట్నం వెళ్ళేవరకూ వాటిని తెరవకూడదనుకున్నాడు. పాపం రైల్వే ఉద్యోగులు అతనెంత చెపితే అంత. అతను కావాలంటే రైలంతా కాళీ చేయించి అతనికిస్తారు.

కొంచెం బొగ్గురజను పడిందేమోనన్న అనుమానం కొద్దీ పక్క బాగా దులిపి మళ్లీ వేశాడు. దక్షిణామూర్తి. తలగడకింద లోపలికున్న పిస్తోలు తీసి చేతితో ఒక్కసారి దాని బరువు చూసి, పక్కని పెట్టుకున్నాడు. ఆ పిస్తోలు దగ్గరుంటే తనకింక ఏ అపాయం రాదని అతని నమ్మకం. 

అప్పుడే కనుచీకటి పడుతోంది. బర్తుమీద మూలగా ఉన్న దీపం వెలిగించాడు. పైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ విప్పి చదవడం మొదలు పెట్టాడు.

బ్రతుకొక బజారు. అందులో ప్రతివ్యక్తి విలువను పెంచుకోడానికి ప్రయత్నిస్తాడు. నిత్యం పైకో కిందకో పోతుంటాడు. ధర పెరిగినప్పుడు ధనంగా మార్చుకో గలవాడు సమర్థుడు. ఇంకా పెరుగుతుందన్న ఆశకొద్దీ బిగుసుక్కూచున్నవాడు ఆఖరికి పడిపోక తప్పదు. ధర తగ్గుతున్నప్పుడు ఆదుర్దాగా అమ్మడానికి ప్రయత్నిస్తే, ధర మరీ పడిపోతుంది. ప్రతిదినం ఈ పత్రికలో ఇదే కథ తను చదువుతున్నాడు. ఈవేళ కూడా ఎందుకీ తాపత్రయం ! ఈవేళ హాయిగా అన్నీ మరిచిపోవాలి! రేపెలాగా తప్పదు.

మూసిన గాజు కిటికీ అవతల అస్పష్టంగా కదిలిపోతోంది. ప్రకృతి – చెట్లు, చేమలు, ఇల్లు, దీపాలు, దగ్గర స్తంభాలు, దూరపు కొండలు. కాని ద్విజ మండల రేఖ మాత్రం అతనితో సాగుతూ వస్తుంది. మధ్య మాయమైనా, మళ్ళీ వస్తోంది. పరధ్యానంగా చూస్తున్నాడు దాని వేపే. ఆ రేఖమీద – అవతరించింది అనసూయ ముఖం. అందంగా, తీక్షణంగా, ఆడతనం, అహంకారం అన్నీ కలుసుకున్నాయి ఆ ముఖంలో. అనసూయా షుగర్ మిల్స్ తనతో అరణంగా తెస్తుంది. ముప్పయి లక్షలు విలువగల ఫ్యాక్టరీకి ఆమె ఏకైక వారసురాలు. ఇంకా పెళ్ళికాకముందే అతని ఇంటికి యజమానురాలులా ప్రవర్తిస్తోంది. ఇంటికే కాదు అతనికిన్ని – తాంబూలాలు పుచ్చుకుని రెండేళ్ళయింది. ఎప్పటికైనా పెళ్ళిచేసుకోక తప్పదు. అయితే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న స్వేచ్చను వీలయినంతకాలం పొడిగిస్తున్నాడు దక్షిణామూర్తి.

అనసూయ అందమైనదీ, హోదాగలదీ. అతనికి చాలా ఇష్టం. పక్కని కూచుంది ఆమె చెయ్యి పట్టుకుని నలపకండా ఉండలేడు. పళ్లుబిగించి, తీవ్రంగా, ఏకాంతంగా, ఆమెతో ఏకమైపోతున్న దృశ్యాలు ఊహించుకోకుండా ఉండలేడు. ఆమె విలువ ముప్ఫయి లక్షలు – ఈ రోజుని. అయినా అతను పెళ్ళి వాయిదా వేస్తున్నాడు.

అప్పుడప్పుడు తన బ్రహ్మచారి స్నేహితులు అతన్ని పార్టీలకి పిలుస్తుంటారు. అప్పుడప్పుడు పార్టీలు అతని ఇంట్లోనే జరుగుతుంటాయి. ఎప్పుడో రాత్రి తొమ్మిది గంటలకి ప్రారంభమౌతాయి. అప్పుడప్పుడు తెల్లవారిపోయేదాకా సాగుతుంటాయి. మర్నాడెంత నీరసపెట్టినా, వాటి సరదా వాటిదే. 

తన టైపిస్టు సులోచన – ఎప్పుడన్నా – ఇంకెవరూ దొరక్కపోతే వస్తుంటుంది. అనసూయకన్నా సులోచన ఎక్కువని కాదు. సులోచనలు వందలకొద్దీ ఉన్నారు. అనసూయ ఒక్కత్తే ఉంది. అయితే అప్పుడప్పుడు ఏ సులోచనతోనన్నా ఒక్క రాత్రి సరదాగా గడపడానికీ, అన్నీ మరిచిపోడానికి అవకాశం ఇస్తుంది బ్రహ్మచర్యం. గృహస్థు అయిన మరుక్షణంనించీ ఈ అవకాశం పోతుంది. 

ఈ రెండు ఆశ్రమాలకీ, వాటికి తగిన విలువలు నిర్ణయించి, తన వయస్సుకి ఒక ధర ఇచ్చుకుని, పెళ్ళయ్యాక వచ్చీ లాభాలు బేరీజు వేసుకుని, పోయే స్వాతంత్ర్యానికి నష్టపరిహారం కట్టుకుని, లాభనష్టాల పట్టీ ఒకటి మనస్సులో తయారు చేసుకుంటున్నాడు దక్షిణామూర్తి.

అప్పుడతని కంటబడింది – కదులుతున్న చిడత. ఆ చిడత పాకీ దొడ్డి తలుపుది. ఒక్కసారి పైకి లేచి మళ్లీ కిందపడిపోయింది, చిరు చప్పుడు చేస్తూ..

దక్షిణామూర్తికి ముచ్చెమటలు పోశాయి. పాకీదొడ్డిలో ఎవడో దొంగ ఉన్నాడు. ఈ కుపేల్లో రెండూ మూడూ కూనీలూ, దొంగతనాలూ జరిగినట్టు పత్రికల్లో చదివాడు. 

ఈ దొంగలకి దయాదాక్షిణ్యాలుండవు. లేవబోయాడు. లేచి గొలుసు లాగాలని అతని అభిప్రాయం. కూర్చుని కాళ్లు క్రింద పెట్టాడు. టప్పుని చిడత చప్పుడు చేస్తూ రెండో పక్కకి తిరిగి పోయింది. తను లేచి గొలుసు లాగే లోగా దొంగ తనమీదపడి ఏమన్నా చెయ్యగలడు.

 అతని కాళ్ళు జావలా మెత్తబడిపోయాయి. తన దగ్గర దొంగతనంగాని, కూనీగాని చెయ్యవలసినంత డబ్బులేదని చెపితే ఆ దొంగ నమ్ముతాడా? చటుక్కుని పిస్టలు గుర్తుకొచ్చింది. గభాల్న దాన్ని తీసి పాకి దొడ్డి తలుపువేపు గురిపెట్టి అరిచాడు.

“రా! ఇవతలికి రా?”

తనగొంతు ఎవరి గొంతులాగో ధ్వనించింది, అవసరమైనంత గట్టిగా, తలుపు మెల్లగా తెరచుకుంటోంది. ఆ చిడతకి ఒక అడుగు పై దృష్టికి కేంద్రీకరించి పిస్టలు గురిపెటాడు. దొంగ గుండెకాయ ఆ ప్రాంతంలో ఉంటుందని అతని అంచనా. తలుపుకీ, గుమ్మానికీ మధ్య చీలిక పెద్దదయింది. తలుపు వెనకాల, అతను చూస్తున్న చోట అంతా కాళీ. దొంగ తలుపు చాటుని దాక్కుని తీస్తున్నట్టున్నాడు.

 “దాక్కుని లాభంలేదు. నా చేతిలో పిస్టలుంది” అని ధీమాగా అన్నా డీసారి

ఎందుకో ఇంక దొంగ తనకి లొంగిపోయినట్టనిపించింది.

తలుపు తెరుచుకుంది. అతని చూపులు కేంద్రీకరించని క్రిందభాగంలో ఏదో కదిలింది. 

కిందికి చూశాడు. చేతులో పిస్టలు అనుకోకుండా జారిపోయింది. నరాలన్నీ సర్దుకుని పట్టు వదిలేశాయి. అతనికి చటుక్కున పక్కలు పగిలేటంత నవొచ్చింది. 

ఏనుగంత దొంగ ఇవతలి కొస్తాడని అతను అన్నిటికీ సిద్ధపడి ఎదురు చూస్తుంటే అందులోంచి ఇవతలి కొచ్చింది – ఒక ఎలక పిల్లలాంటి చిన్న ఆడపిల్ల.

నాలుగైదేళ్ళుంటాయి. చింకి పరికిణీ, చింపిరి జుట్టూ, కళ్లు అమాయకంగా చురుగ్గా మెరుస్తున్నాయి. దక్షిణామూర్తికి ఆ పిల్లమీద కోపం మట్టుకు రాలేదు. తన ఆందోళననీ, దయాన్నీ పోగొట్టినందుకు, నిజంగా దొంగ కాకుండా నిరపాయకరమైన చిన్నపిల్లగా మారిపోయినందుకు ఒక రకమైన కృతజ్ఞత కూడా అతనికి కలగక పోలేదు. అందుచేత సౌమ్యంగా అడిగాడు.

“పాకీ దొడ్లో ఎందుకు దూరావు?”:

 “నువ్వు పెట్లో కెక్కుతుంటే, నేను దొడ్లోకెల్లా” అంది పిల్ల, 

“అసలీ పెట్లో కెందు కెక్కావు? ”

 “ఈ రైలు పట్నం పోద్దంటగా.”

 “చూడు పిల్లా. ఇది పరుపుల పెట్టి. వొచ్చి స్టేషనులో దిగిపోయి మరో పెట్లో ఎక్కు”

“ఏం?”

 “ఇది పరుపుల పెట్టెని చెప్పడంలా? మూడో క్లాసు పెట్లో ఎక్కాలి. నీ టిక్కట్టేది?”

 “అదేంటది?” 

“టిక్కట్టు కొనలేదా?”

ఆమె లేదన్నట్టు తలూపింది. 

ఇంకామెను ఏ ప్రశ్న లడిగినా ఏం లాభం లేదనుకున్నాడు. బెజవాడలో రైలాగ్గానే రైల్వే ఉద్యోగికి అప్పగించెయ్యొచ్చు ననుకున్నాడు.

“ఆ మూల కూర్చో.” 

ఆ పిల్ల కూర్చుంది. 

దక్షిణామూర్తి వెల్లగిల పడుకుని పత్రిక తిరగవెయ్యడం ఆరంభించాడు. అది మూసేసి మరో పత్రిక తెరిచాడు. కళ్ళు అక్షరాలని గుర్తు పట్టినా, అవి మనస్సుకి ఎక్కడం లేదు. ఏం చెయ్యడానికి తోచక ఆఖరుకి భోజనం చేసేద్దామని నిర్ణయించుకున్నాడు. బెర్తుమీద పత్రిక పరచి, సీటుమీద నున్న కారియర్ తీసాడు. గిన్నెలన్నీ విడదీశాడు. అబ్బో! పదిమందికి సరిపడా పెడుతుంది వెంకాయమ్మెప్పుడూ.

వెంకాయమ్మ క్షత్రియ వితంతువు. నిడదవోలు స్టేషన్ కి దగ్గరగా దక్షిణామూర్తికి పిత్రార్జితం ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో పూటకూటిల్లు నడుపుతోంది వెంకాయమ్మ. అతనెప్పుడు నిడదవోలు మీదుగా ప్రయాణం చేసినా, వెంకాయమ్మ కారియర్ లో భోజనం పంపుతుంటుంది. వంట మహా పసందుగా చేస్తుంది. అందులో ఈ వేళ కోడిపలావ్ కూడాను. బాగా ఉడికిన కోడి కండలు చూస్తూంటే నిగనిగ పొటమరించిన వెంకాయమ్మ వీపు మీది కండలు గుర్తుకొచ్చాయి అతనికి. వెంకాయమ్మ రవిక తొడుక్కోదు. వితంతువు. 

ఆ వీపు, పక్కలూ ఎంత నున్నగా ఉంటాయో అతని వేళ్ళకి తెలుసు. 

ఆ స్థలం తాలూకు అద్దె మరోరకంగా వసూలు చేసిన ఘట్టాలు అతనికి గుర్తు కొచ్చాయి. అతనికి నవ్వొచ్చింది. తింటూ తింటూ నవ్విన మూలంగా అతను ముఖం పైకెత్తవలిసొచ్చింది – నోట్లో ముద్ద జారిపోకండా. మూల నున్న అమాయకపుకళ్ళకు అపచారం చేసి నట్టనిపించింది.

“ఆక లేస్తోందా.”

ఔనన్నట్టు ఆమె తలూపింది. ఒక గిన్నెలో కొంత పలావూ కూరా పెట్టి ఇచ్చాడు.. ఆమె ఆకలిగా తింది. ఆ దృశ్యం చూస్తూంటే దక్షిణామూర్తి మనసు ఎందుకో చివుక్కుమంది. మామూలుగా రైళ్ళలో ముషెత్తుకోడానికి అలవాటు పడ్డ రకం కాదని అతనికి అర్థమైంది. అన్నం తినేసి ఆమె అసహాయంగా నిలబడి ఉంటే, అతనన్నాడు.

“ఆ గదిలో కుళాయుంది. చెయ్యి కడుక్కురా.”

ఆమె తన చెయ్యి, తిన్న గిన్నే కడుక్కొచ్చింది. అతడు కూడా భోజనం పూరి చేశాక కారియరు సర్ది చెయ్యి కడుక్కొచ్చాడు. సిగరెట్టు ముట్టించాడు. చేతి సంచీ లోంచి పేక తీసి ఒక్కడూ ఆడుకోడం మొదలు పెట్టాడు. పేకాటలో మునిగిపోయాడు.

“అది ఇస్పేటు రాణీకదూ?” అంది ఆమె.

 “నీకు పేకముక్కలు తెలుసా?”

“ఓ. మా నాన్న రోజూ ఆడతాడు. సత్తెన్న మామ, పెద్దగాడు, రత్తయ్య అంతా వొచ్చి కూర్చుని ఆడతారు.”

“నాతో ఆడతావా?”

 “ఛా! పేక తాకితే పాపం.” 

దక్షిణామూర్తి తలెత్తి ఆ పిల్లవంక చూశాడు. ఎదురుగా ఉన్న బల్ల చెక్కని ఆనుకుని నిలబడి రైలు ఊపుకి అసహాయంగా ఊగుతోంది ఆ అమ్మాయి.

“ఎవరు చెప్పారు?” 

“మా యమ్మ.” 

“మరి మీ నాన్న ఆడతాడుగా?”

 “అందుకే మా అమ్మని కొడతాడు. ఓతూరి కాలిరిగిపోయింది మా యమ్మకి.”

దక్షిణామూర్తికి తనెన్నడూ చూడదలుచుకోని ఒకానొక దృశ్యం ముందు తొలిగిపోయింది. పేకాట ఆపి ఒక క్షణం ఆలోచించాడు.

“మీ నాన్న కేం పని?”

“తాగుడు, పేకాట. అందుకే అతన్నెవరూ పనికి పిలవరంట – మాయమ్మంది. ఓతూరేమో పెద కామందింట్లో బియ్యం దంపి మాయమ్మ నాలుగు రూపాయలు తెచ్చింది. అదేమో తనకిమ్మని తన్నాడు. అమ్మేమో నామీదికి గిరాటేత్తే, ఆ డబ్బుచ్చుకొని నేను లగెత్తా. నా ఎంట బడ్డాడు. పేటంతా తిప్పినా. రంగడడ్డాచ్చాడు గాని, లేకపోతే దొరకను. నా తల సెట్టునేసి కొట్టాడు. ఇందుగో దెబ్బ.”

ఎడం చెవి మీది జుట్టు తొలగించి చూపిందా పిల్ల. రెండంగుళాల మేర మానిన గాయం చూశాడు దక్షిణామూర్తి.

“నువ్వీ రైలెందు కెక్కావు?” 

“మా యమ్మ పట్టంలో వుందిగా మరి.” 

“పట్నం ఎందుకు వెళ్ళింది?”

“మాయయ్య మోటకత్తుచ్చుకొని తెగేశాడుగా మా యమ్మని. పట్టంలో ఆసుపత్రికి తీసుకుపోయారు.”

“మీ అయ్య?”

 “పోలీసోళ్ళు తీసుకుపోయారు బేడీలేసి. “

ఆ పిల్ల చెప్పిన కథ కాదు – దక్షిణామూర్తికి వింతగా తోస్తా – ఆమె ధోరణి. – కళ్ళయినా చెమ్మగిల్లలేదు. ఇంత దారుణం జరిగినా, దాని ఘాతుకత్వం ఆమె గహించినట్టు లేదు. దక్షిణామూర్తి పేక తీసేశాడు. పెట్టెలో పెట్టేశాడు. విజయవాడ వచ్చింది. 

కాని ఆ పిల్లని దిగిపొమ్మని అనలేదు. రైలు మళ్లీ కదిలాక బొమ్మల పత్రిక తీసి నడుం వాల్చాడు. ఆ పిల్ల అలాగే నిలబడి వుంది. .

“ఆ మూల పడుకో.” 

“నిద్దర్రాదు.” 

“ఏం?” 

“మా యమ్మ పాట పాడాలి.” 

“ఏం పాట?”

“వా సిట్టి తల్లీ, నిదరపోవమ్మా, 

రాసోరి పాపాయి రంగైనవోడు

సింతల్లో సెంద్రుడూ తొంగిసూసేడు

పుంతల్లో ఎలుతురూ పిండారబోసె 

పాకలో పాడావు పాలు సేపింది –

పండుకో నా చిట్టి పండుకోవమ్మా…… నాకంతే వచ్చు.”

 “పా టింకా ఉందా?”

“నాకు నిద్దరొచ్చినా మా యమ్మ పాడతానే ఉంటదిగా, అదేంటది? బొమ్మల పుత్తకమా?”

“ఇలా కూచుని చూడు.”

అతడు కొంచెం జరిగాడు. అయితే ఆ పిల్ల కిందే కూచుని పత్రికలో బొమ్మలు చూసింది.

“నీ పేరేమిటి?” అన్నాడు పేజీలు తిరగవేస్తూ,

 “సిట్టితల్లి!” 

“మంచిపేరు.”

“ఈ బొమ్మేంటి?” అని అడిగింది. చిత్రంగా ముఖం పెట్టి.

 ఆ ముహూర్తంలో దక్షిణామూర్తికి ఆ పిల్లంత అందమైనది సృష్టిలో మరొకటి లేదనిపించింది. ఒక్కసారి ఆ పిల్ల తలమీద చెయ్యేసి నిమరాలనిపించింది. కాని అంత సబబు కాదని తోచింది. మర్నాడు ఉదయం ఆ పిల్ల దారి ఆ పిల్లది, తన దారి తనది. ఆ రాత్రికి మట్టుకు తను ఆ పిల్లను ఆదుకున్నాడు, ఆకలి తీర్చాడు. టిక్కట్టు లేకండా పట్నం చేరుకోటానికి సహాయపడుతున్నాడు. ఆ అనుబంధం అంతవరకే పెట్టుకోవాలి. 

ఈ సంగతి అనసూయకి చెపితే ఏమంటుంది? అనసూయ కిది అర్ధంకాదు. చెయ్యకూడని పని చేశాననుకుంటుంది. పోనీ పదిమంది చూస్తుండగా పేదలకు సహాయం చెయ్యడమా కాదిది. అల్లాంటి సేవ ఉబుసుపోకకి అనసూయ చేస్తుంటుంది. కూలిపేటల్లోకి వెళ్ళి వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు నేర్పుతుంది. వాళ్ళ చంటిపాపలికి నీళ్ళుపోసి పాలు పట్టిస్తుంది. అయితే, కూడా పత్రికలు తాలూకు ఫోటోగ్రాఫరుంటాడు. ఆమె ఆ పనులు చేస్తుండగా రకరకాల కోణాలు ఛాయాచిత్రాలు తీసి పత్రికల్లో వేయిస్తాడు. ఆ మురికి కంపు భరించినందుకు ప్రతిఫలంగా ఆమె కీర్తి ప్రచారమౌతుంది. 

ఏకాంతంగా ఒక రైలు పెట్టెలో ఒక అనాధకి చేసిన మేలు ఎందుకూ పనికి రానిది. బూడిదలో పోసిన పన్నీరు. 

ఈ చిట్టితల్లి వల్ల తను పొందిన సంతృప్తి కూడా ఒకటుంది. ఈ ఒంటరి ప్రయాణంలో తోడు కావడం ఒకటే కాదు; చిన్న అమాయక ప్రశ్నలద్వార నవ్వొచ్చే కొన్ని నిర్వచనాల ద్వారా, కటిక వ్యాపారస్తుడైన తనవంటి వాడికి ఓ కొత్త అనుభవం కలిగించింది. లాభనష్టాలతో నిమిత్తంలేని అనుభవం అది. దానికి విలువ లేదని దక్షిణామూర్తికి తెలుసు. 

అతని మనస్సు వర్తక వాణిజ్యాలకు బందీకాదు, వాటికి యజమాని. నయాపైసలూ, రూపాయిల ప్రపంచానికీ బయటుండే విలువలు అతనికి తెలుసు. అంచేతే అతను వ్యాపారస్థులలో అగ్రగణ్యుడు. అంచేతే ఆ విలువలకు రూపాయలు, నయా పైసలలో వెలకట్టగలడు. అనసూయను కూడా అతను వెల కట్టేశాడు.

“ఏమిటి చూస్తున్నావు చిట్టీ.” అన్నాడు దక్షిణామూర్తి. అతను పరధ్యానంగా ఆలోచిస్తున్నప్పుడు చిట్టితల్లి అతని చేతిలో బొమ్మల పత్రిక తీసుకుని కాళ్ళమీద పరుచుకుని చూస్తోంది.

“ఈ కుక్క మాటాడగలదా?”

 “ఏం?”

 “దాని నోట్లోంచి ఎవ్వో మాట లొత్తన్నాయిగా?” 

“నిజమే, మాట్టాడుతోంది?

” ఏటంటాది?”

 “ఆ గోడనున్నది తినేదేనా అనుకుంటోంది.” 

“పిచ్చి కుక్క” 

“ఏం?”

 “అది టోపీగా, ఎట్టా తింటాది?” 

“కుక్కగదా, దానికేం తెలుసు?”

 “మరి మా కావేరి కెన్ని తెలుసో తెలుసా?”

 “కావేరెవరు?”

“మా కుక్క మా అయ్య కల్లుముంత దరికేనా పోదు; పక్కింటి పోతురాజు కల్లు మట్టుకు నాకేత్తాది. మా ఎదురింటి ఆడపిల్లని పట్టుకుని ఏడిపిత్తాది. నే నెక్కడి కెల్లినా కూడా వొత్తాది, టేసనుకి కూడా వొచ్చింది. పెట్టిలో కెక్కకుండా తలుపు మూసేశా.” |

మా ఇంటి పక్క నుంటాడు. మిల్లు కామందుగారి డైవరు. ఆడికి కారుంది. తాగేసినప్పుడూరికే కామందుగారి పెళ్ళాం ఊసే. పోతుమామకి డబ్బిత్తాదంట. నామీద పడతాది. దూది బత్తా లాగ – డోకంటాడు పోతుమామ. మిల్లు కామందు మడుగులో పడి సచ్చిపోతే పోతుమామని పోలీసోళ్ళట్టుకుపోయారు. పోతుమామ మంచోడు. మాయమ్మని కొడతావుంటే మా అయ్యని సందేటేసి పట్టుకుని వాడు, కదలకుండా.

పెదమణిసి. రంగత్త దూళ్ళసాల కూలిపోయింది గాలోనకి. లేగదూడుంది పాపం. పోతుమామ ఒంటి సేత్తో కూలిపోయిన పాక నెత్తిపట్టుకున్నాడు. ఆవునీ దూడనీ ఇంట్లో కటేసిందా రేత్రి. పోతుమామ శానా మంచోడు. వొద్దన్నా సరే మా యమకి పావలా అర్థా ఇచ్చి వోడు. ఒకో రోజు బియ్యానికి లేకపోతే..” –

దక్షిణామూర్తి రెండు చేతులూ తలకింద పెట్టుకుని చిట్టితల్లి ఇల్లూ పరిసరాలూ ఊహించుకోవడం మొదలు పెట్టాడు.

ఆ పిల్ల చెప్పుకుంటూ పోతోంది. చటుక్కున ఆమెకేసంగతి జ్ఞాపకం వొస్తే అందులోకి దాటేస్తుంది. మొదలు పెట్టిన ఘట్టం పూర్తి చెయ్యకుండానే మరో ఘట్టంలోకి పోతుంది. రకరకాల పేర్లు. ఆడ, మగ వచ్చిపోతున్నాయి. వాళ్లెవరో ఆమె వివరించి చెప్పదు. అయినా ఆమె వివరిస్తున్న కథలో ఒక పరిపూర్ణతుంది. 

అతని మనస్సులో అతిస్పష్టమైన చిత్రంగా అది క్రమంగా రూపుదాల్చింది. అటువంటి గుడిసెలు, అటువంటి వ్యక్తులు, తనబోటి వాళ్లు ఎన్నోసార్లు చూసి ఉండవచ్చు. వాళ్ల కథలు రకరకాలుగా విని ఉండవచ్చు. కాని నాలుగయిదేళ్ల ఆ పసిపాప వివరించినంత స్పష్టంగా ఆ కథను ఎన్నడూ వినలేదు, ఇక ముందు వినబోడు. ఆమె చిన్ని మాటలలో తను ఎరగని వింత ప్రపంచకం పరుచుకుంది. ఆ వ్యక్తుల్ని ఆ వాతావరణాన్ని మననం చేసుకుంటుండగా అతనికి నిద్రపట్టింది. అతి ప్రశాంతమైన నిద్ర; ప్రగాఢమైన నిద్ర.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube